అతిధి దేముడు
నాలుగు వైపుల నించి కమ్ముకొస్తున్న నల్లని మేఘాలని, ఎనిమిది గంటలు చూపిస్తున్న గడియారాన్ని చూసి, ఇంకా క్లబ్బు నించి ఇంటికి రాణి అయ్యగారిని తలచుకొని గాభరా పడింది సీతమ్మ.
గాలి, మెరుపులు, ఆరంభించాయి. ఇంకా భోజనాలన,లేదు. వెళ్ళిపోతానంటే ........ ఏమంటారో .... ఇంట్లో చిన్న పిల్లలు ఒక్కళ్ళూ. సావిడిలో కూర్చుని ఆరోజే వచ్చిన కొత్త పత్రిక పఠనం లో మిగతా ప్రపంచాన్ని మరిచిపోయిన యజమానురాలిని అడగలేక సావిట్లో తాచ్చాడుతుంది సీతమ్మ.
కళ్ళు మిరుమిట్లు గొలిపిన మెరుపు కాంతికి ఇంటావిడ కళ్ళ జోడు లోంచి కళ్ళెత్తి ఈ లోకాన్ని చూసింది. "సీతమ్మ వర్షం వచ్చేట్టుంది..... గాలి వేస్తుంది ఆ కిటికీ మూసెయ్యి" అంది. ఆవిడా అజ్ఞా అమలు జరిపి ఆవిడ మళ్ళీ పుస్తకంలోకి తలోంచకముందే "అమ్మగారూ!" అంది ఆరాటంగా సీతమ్మ.
"ఊ...." అంటూనే ఆవిడ తల దించేసింది పుస్తకంలోకి.
"వర్షం ముంచుకొస్తుంది.... పిల్లలు ఒకళ్ళూ వున్నారు ఇంట్లో. వెడతానమ్మా..... తడిసిపోతాను ఇంటి కెళ్ళేసరికి."
"అయ్యగారింకా రాందే... భోజనాలు అవందే ...." అందావిడ ముఖం చిట్లించి.
"అన్నీ టేబిల్ మీద సర్దేశాను..... వంటిల్లు అది కడిగేశానమ్మా..... తవరు భోజనం చేసి ఆ కంచాలు అవీ అలా వదిలేయండి, ప్రొద్దుటే వచ్చి తీసేస్తాను."
"ఊ......" మూలిగింది ఆవిడ.... అయిష్టం సూచిస్తూనే. ఇంకా పోకుండా అక్కడే తచ్చాడ్తున్న సీతమ్మని ఏమిటన్నట్టు చూసిందావిడ.
"మధ్యాహ్నం పులుసు కాస్త మిగిలింది తీసికెడతాను, మీరు వేసుకోరుగా ...." సందేహిస్తూనే అడిగింది.
"తీసుకెళ్ళు గానీ, గిన్నె పట్రా.... ఇలా కూరలు పులుసులు తీసికెళ్ళడం ఆ గిన్నె వచ్చిందీ లేదో చూసుకోవడం నాకు చిరాకు .... వెధవ గొడవ .....ఊ .... పట్టుకెళ్లు " అందావిడ కసిరి, ఇంక పోమ్మన్నట్టు పుస్తకంలో మునిగింది.
సీతమ్మ బ్రతుకు జీవుడా అన్నట్టు గిన్నె మీదుగా కొంగు కప్పుకుని గబగబ వీధిలో పడింది. సీతమ్మతో పాటు జల్లు, ఎడాపెడా గాలి , మెరుపులు, ఉరుములు బయలుదేరాయి. రెండు ఫర్లాంగులు నడిచి ఇల్లు చేరే వేళకి మొత్తేసిన వర్ధంతో, సీతమ్మ పూర్తిగా తడిసింది. నీళ్ళోడుతూ తనతో పాటు ఇంత జల్లుని లోపలికి తీసుకొచ్చి తలుపులు మూసింది సీతమ్మ. ఇంట్లో పిల్లలిద్దరూ బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు దీపం ముందు.
"అమ్మా . తడిసిపోయావా.... అబ్బ ఎంతగా లేస్తుందనుకున్నావు .... పెద్ద వర్ధం పడుతుంది గదూ!" తల్లి రావడంతో పిల్లలిద్దరూ లేచి తల్లికి ఎదురెళ్ళి ఆరాటంగా అడిగారు.
గదిలోంచి పంచాలోకి వెళ్ళి తడిసిన చీర మార్చుకుంది సీతమ్మ. తల తుడుచుకుంది.
"అబ్బ, ఏం వర్ధం. తోవ కనిపించలేదు. ఎంత గాలి, అడుగు తీసి అడుగు పెట్టడమే కష్టమైంది. ఎలాగో తడిశాను కదా అని మీ రొంటరిగా వున్నారని అలాగే తడిసి వచ్చేశాను ఎక్కడా ఆగకుండా ..... అన్నం తిన్నారా మీరిద్దరూ.... అయ్యో, మీకిష్టమని తోటకూర పులుసు తెచ్చాను ...... పోన్లెండి నే తిన్నప్పుడు రెండు ముద్దలు పెడతాను" అంది సీతమ్మ.
లాంతరు దీపం పెట్టుకుని, పీట వాల్చుకుని సీతమ్మ అన్నం ముందు కూర్చుంది. పులుసన్నం ఇంత కలిపి పిల్లలిద్దరికి రెండు ముద్దలు పెట్టి, మిగతాది తను తిని, తర్వాత మజ్జిగ వేసేసుకుంది. "అమ్మా పచ్చడి వేసుకోవూ...." అన్నాడు కొడుకు.
"వద్దులేరా..... రేపటికి చద్దన్నంలోకి మీకుంటుంది, పులుసన్నం తిన్నాగా...." అంది సీతమ్మ. సీతమ్మ అన్నం తిని దీపం పట్టుకుని ముందు గదిలోకి వచ్చేసరికి వీధి తలుపు దబదబ చప్పుడయింది. ఈ వర్షంలో తనింటికి యీ వేళప్పుడు వచ్చేవారెవరు!........ మళ్ళీ గట్టిగా చప్పుడయింది.
"ఎవరు !" అంది సీతమ్మ తలుపు గడియ తీసేముందు.
"తలుపు తీయండి, వర్షంలో తడిసిపోతూ వచ్చాను" అన్న మగ గొంతు విన్పించింది. సీతమ్మ ఒక్క క్షణం సందేహించింది. అంతలోనే అవతల మనిషి వర్షంలో తడిసి పోతున్న సంగతి గుర్తు వచ్చి ఇంక సందేహించలేదు.
తలుపు తెరవడంతో వర్షం జల్లుతో పాటు, యింత సెంటు పరిమళం సీతమ్మ మొహాన కొట్టి .... లోపలికి వచ్చాడు ఆగంతకుడు. లోపలికి వస్తూనే అతను తలుపులు బలంగా నొక్కి గడియ పెట్టాడు.
అతను శుభ్రంగా తడిసిపోయి నీళ్ళోదుతున్నాడు. ఖరీదయిన టెర్లిన్ ప్యాంటు, స్లాక్ , బూట్లు అన్నీ అతను ఖరీదయిన మనిషని చెప్పక చెపుతున్నాయి. బాగా పెంచిన జుత్తు, సైడ్ బరన్స్, అతన్ని అదునికుడిగా తెలియచేస్తున్నాయి ..... పాతికేళ్ళ లోపు అతని వయసు. అతను ఏ కాలేజీ కుర్రాడో నని చెపుతుంది.
అతను గదిలోకి వచ్చి ఒక్క క్షణం చుట్టూ చూసి తరువాత సీతమ్మ వంక చూసి "క్షమించండి వర్షంలో తడిసి పోయాను. మీ ఇల్లు తప్ప .....ఈ చుట్టు ప్రక్కల ఎక్కడా అగుదామన్నా ఏం కనపడలేదు..... పోనీ ఎలాగో తడిశాను అలాగే వెళ్ళిపోదామన్నా సరిగా యిక్కడికి వచ్చేసరికి స్కూటర్ లో పెట్రోలు అయిపోయి ఆగిపోయింది" సంజాయిషీ యిచ్చాడు.