Previous Page Next Page 
ఫాలాక్షుడు పేజి 36


    "ఎక్కడనుంచి వస్తున్నావు?" అడిగాడు ఆ గ్రామీణుడు.

 

    "హైద్రాబాద్ నుంచి"

 

    "అంటే... నిజాం... జమానా నుంచా... చాలా దూరం వచ్చావే? శివదేవునిపల్లె ఎందుకు... అక్కడ ప్రస్తుతం రెండొందల గడపలుంటాయి. ఒకప్పుడు వెయ్యి గడపలతో వెలిగిన పెద్ద గ్రామమే. మరాఠా దొంగల భయంవల్ల చాలామంది అక్కడినుంచి ఖాళీ చేసేశారు" చెప్పాడా గ్రామీణుడు.

 

    అలాంటి గ్రామం ధరణికెలా తగిలింది? ధరణి భార్య సుమబాల, పాప ప్రెటీ అక్కడెలా వుండగలుగుతున్నారు?

 

    ఆలోచిస్తున్నాడు ఆదిత్య.

 

    "ఈ ఊళ్ళో రేడియోగానీ, టి.వి.గానీ వుందా? పేపరొస్తుందా?"

 

    "రేడియో... టి.వి.నా... మా సర్పంచ్ దగ్గర ఒక రేడియో వుండేది... పాడయిపోయింది... పేపర్లు మాకు రావు."

 

    ఆ మాటతో గుండెనిండా గాలి పీల్చుకున్నాడు ఆదిత్య. ఈ గ్రామం యిలా వుందంటే...

 

    శివదేవునిపల్లె ఇంకెలా వుంటుందో?

 

    అతని మనసుకెందుకో ప్రశాంతంగా వుంది.

 

    గ్రామీణ వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పి ముందుకు నడవటం ప్రారంభించాడు ఆదిత్య.


                             *    *    *    *    *


    ప్రైమరీ హెల్త్ సెంటర్ ముందు ఆగిన పోలీస్ జీప్ ను చూడగానే పై ప్రాణాలు పైనే పోయాయి నర్స్ శివరాణికి.

 

    అప్పటికే నర్స్ ద్వారా ఆ విషయం తెలుసుకున్న ఏభై ఏళ్ళ డాక్టర్ బాలేశం...

 

    "మనకేమీ తెలీదు. ఇటువైపు ఎవరూరాలేదు. అర్థమైందా?" అని నెమ్మదిగా ఆమెకే విన్పించేటట్లు అన్నాడు.

 

    శివరాణి ఆ మాటల్ని అర్థం చేసుకుంది.

 

    ఠీవిగా జీపుదిగి, పరిసరాల్ని చూస్తూ హుందాగా మెట్లెక్కి డాక్టర్ బాలేశం రూమ్ లోకి ప్రవేశించాడు డేవిడ్.

 

    "ఐ యామ్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ డేవిడ్... కమింగ్ ఫ్రం హైద్రాబాద్... ఐ వాంట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూ" అని తనెందుకొచ్చాడో చెప్పి కుర్చీలో కూర్చున్నాడు డేవిడ్.

 

    "పాత చీఫ్ మినిస్టర్ గారిని చంపిన హంతకుడా? నో సర్! ఏ కొత్త వ్యక్తీ ఇటువైపు రావడం నేను చూడలేదు. రాత్రి వర్షంవల్ల నేను దవాఖానాలోనే వున్నాను... ఎవరూ రాలేదు" ముఖంలో ఏ భావం కనపడనీకుండా సీరియస్ గా చెప్పాడు డాక్టర్ బాలేశం.

 

    "ఈ హాస్పిటల్ లో స్టాఫ్ మీ యిద్దరేనా?"

 

    "నేనూ, నర్సూ, రీసెంట్ ఎపాయింట్ మెంట్."

 

    శివరాణివైపు చూశాడు ఇన్స్ పెక్టర్ డేవిడ్.

 

    ఎక్కడి అవయవం అక్కడ చెక్కుచెదరకుండా... సంపూర్ణ యవ్వనానికి వాత్సాయనుడు మలిచిన ఉద్రేక కావ్యంలా వుంది డేవిడ్ కళ్ళకు శివరాణి.

 

    శివరాణిని చూడగానే గుటకలు మింగాడు డేవిడ్.

 

    అసలే అమ్మాయిలంటే కిందపడి... బోర్లా దొర్లిపడే మనస్తత్వం గల డేవిడ్ కళ్ళనిండా 70 ఎమ్.ఎమ్. కామం గ్లాసులతో చూశాడు శివరాణిని.

 

    ఈ డాక్టర్ అదృష్టవంతుడు. మనసులోనే అసూయగా అనుకున్నాడు డేవిడ్.

 

    "చూడండి డాక్టర్! ఇవాళ కాకపోయినా రేపయినా వాడు ఇటువేపు వచ్చే అవకాశముంది. డోంట్ ఎంకరేజ్ క్రిమినల్స్... ప్లీజ్... కోపరేట్ విత్ అజ్" అంటూ లేచి నిలబడ్డాడు డేవిడ్.

 

    "అయామ్ ఆల్సో గవర్నమెంటు సర్వెంట్... ఏ ఇన్ఫర్మేషన్ దొరికినా మీకు ఇన్ ఫాం చేస్తాను" తనూ లేస్తూ అన్నాడు డాక్టర్ బాలేశం.

 

    "ఓ.కె. సీయూ డాక్టర్" శివరాణి కళ్ళవేపు, గుండెలవేపు తనివితీరా ఒకసారి చూసి వరండాలోకొచ్చిన డేవిడ్ దృష్టి... బెంచీమీద గాలికి రెపరెపలాడుతున్న ఈనాడు న్యూస్ పేపర్ మీద పడింది. అతని పోలీసు కన్ను ఎక్కడ చూడాలో అక్కడే చూసింది.

 

    ఫస్ట్ పేజీలో ఎక్కడయితే ఆదిత్యకు సంబంధించిన వార్తపడిందో ఆ వార్త ప్రదేశంలో ఆ భాగం లేకపోవడంతో అతని పోలీసు మైండ్ రకరకాలుగా ఆలోచించడం ప్రారంభించింది.

 

    నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ మెట్లవరకూ వచ్చాడు. మెట్ల మీద నిలబడి ఊరంతట్నీ ఒకసారి చూసి...

 

    సగంవరకూ కాలిన సిగరెట్ ను పక్కకు విసిరేసి జీపెక్కాడు... డాక్టర్ కు నమస్కారం చేసి.

 

    జీపు ముందుకు కదిలింది.

 

    ముందుకు వెళుతున్న జీపులోని వ్యూ మిర్రర్ లోంచి శివరాణిని చూస్తున్నాడు ఇన్స్ పెక్టర్ డేవిడ్.

 

    ఎవరు కట్ చేశారు పేపర్ లోని ఆ వార్తను? శివరాణీయా?

 

    శివరాణినే ఎందుకు అనుమానిస్తున్నాడు డేవిడ్.

 

    డేవిడ్ ఈనాడు పేపర్ వేపు చూడడం... ఎప్పుడో గమనించింది శివరాణి. అప్పటికే ఆమె గుండెలు బితుకు బితుకు మంటున్నాయి.

 

    ఆ విషయం డేవిడ్ ప్రశ్నించకపోవడంతో రిలీఫ్ ఫీలయ్యింది...

 

    జీపు దూరంగా వెళ్ళిపోవడంతో...

 

    గబుక్కున లోనికి పరుగెత్తి వరండా బెంచీమీదున్న ఈనాడు పేపరుని తీసుకుంది. చుట్టలు చుట్టి హాస్పిటల్ వెనుక ఎడంవేపునున్న చెత్తకుప్పమీద పారేసింది.

 

    అప్పటికిగానీ ఆమె మనసు కుదుటపడలేదు.

 

    జీపు స్పీడందుకుని ముందుకి వెళ్ళిపోగానే శివరాణి లోనికి పరుగెత్తడము డేవిడ్ స్పష్టంగా చూశాడు.

 

    మామూలుగా అంత అర్జెంటుగా లోనికెళ్ళాల్సిన అవసరం ఆమెకి వుండదు.

 

    అన్ లెస్... సమ్ ఈజ్ దేర్.

 

    జీపు ముందుకెళ్ళి రెడ్డిపాలెం బస్టాపు దగ్గర ఆగింది.

 

    చేతి గడియారంవేపు చూశాడు ఇన్స్ పెక్టర్ డేవిడ్.

 

    సాయంత్రం నాలుగున్నర దాటింది.  

 

    "సిటీకి వెళ్ళిపోదామా సార్?" అడిగాడు జీపు డ్రయివర్ రాములు.

 

    "కాదు... మనం మళ్ళీ చీకటి పడ్డాక ఈ హాస్పిటల్ కు రావాలి... బొంబాయి వెళ్ళే దారిలో ఏదో పంజాబీ డాబా చూసినట్టున్నాం కదా?"

 

    "అవున్సార్"

 

    "అక్కడ మందు దొరుకుతుందా?"

 

    "మందా సార్... మందేమిటి సార్... మజాకాలన్నీ దొరుకుతాయి."

 Previous Page Next Page