"ఈ బాడీకి రెండ్రోజులుగా మందు పడలేదు... పోనీయ్... కాసేపు లెటజ్ హేవ్... ఫన్" కోరమీసాల్లోంచి కోరికగా అన్నాడు డేవిడ్.
కళ్ళముందు శివరాణి ఫుల్ బాటిల్ ఓల్డ్ మాంక్ రమ్ లా కదలాడుతోంది.
గేరు మార్చి స్పీడ్ పెంచాడు ఉత్సాహంగా డ్రయివర్ రాములు.
* * * * *
కొంత దూరం పొలాలు... ఆ తర్వాత పెద్ద చెరువు... చెరువు దాటాక దట్టమైన చెట్లు... కొండలు... అడవి ప్రాంతం మొదలయ్యింది. ఏ దారి ఎటు వెళుతుందో తెలియదు.
నడుస్తున్నాడు ఆదిత్య...
ఎంత దూరం నడిచాడో తెలీదు.
సాయంసంధ్యలో...
పక్షుల అరుపులు... ఆకుల గలగలలు... దూరంగా ఏదో నీటి శబ్దం విన్పిస్తే అటువేపు నడిచాడు.
మైదానంలో ప్రవహిస్తున్న వాగు....
క్రమంగా మసక చీకట్లు అలుముకుంటున్నాయి.
నరసంచారం లేని ఆ ప్రదేశంలో తనివితీరా వాగులో స్నానం చేయాలనిపించింది ఆదిత్యకు.
నెమ్మదిగా దుస్తులు విప్పి, ఒడ్డున పెట్టి వాగులోకి దిగాడు నగ్నంగా.
గంట... రెండు గంటలు...
నెత్తిమీద చంద్రుడు దీపంలా మెరుస్తున్న వేళకు వాగులోంచి బయటికొచ్చి సేదతీరాడు.
వళ్ళంతా ఆరిపోయాక బట్టలు వేసుకొని చెట్టు మొదట్లో కూర్చున్నాడు.
అతని మనసుకెంతో ప్రశాంతంగా వుంది. సమస్త దుఃఖాన్నీ, బాధనూ, ఆకలినీ మరిపించే ప్రకృతి.
వంటికి చల్లని గాలి తగులుతోంది. కళ్ళ మీదకు నిద్ర ఉప్పెనలా ముందుకొచ్చేసింది.
విశాలమైన పచ్చికమీద పడుకుండిపోయాడు ఆదిత్య.
* * * * *
మత్తు కళ్ళతో చేతి గడియారం చూసుకున్నాడు ఇన్ స్పెక్టర్ డేవిడ్. రాత్రి తొమ్మిదిన్నర దాటింది.
అప్పటికే అరబాటిల్ విస్కీ అతని నరనరాల్లో బాగా పనిచేస్తోంది. వేడి వేడి బిర్యానీ తిని, చేతులు కడుక్కుని వచ్చి జీప్ లో కూర్చున్నాడు. బిల్లు చెల్లించి, సిగరెట్ ప్యాకెట్లతో వచ్చాడు డ్రైవర్.
సిగరెట్ తీసుకొని వెలిగించి "రెడ్డిపాలెం పోదాం పద" అన్నాడు స్థిరంగా.
వెంటనే జీపు ముందుకి దూసుకుపోయింది. అయిదు కిలోమీటర్లు ముందుకెళ్లాక నేషనల్ హైవే రోడ్డు మీంచి, మెటల్ రోడ్డు మీదకు జీపుని తిప్పాడు డ్రైవర్ రాములు.
డేవిడ్ కళ్ళముందు నర్స్ శివరాణి... ఖాళీ బాటిల్లా నగ్నంగా కనిపిస్తోంది.
నిషా కళ్ళ చుట్టూ కామం కాటుక మరకలు.
జీపు రెడ్డిపాళెం బస్టాపు దగ్గరకొచ్చాక చెప్పాడు డేవిడ్-
"హెడ్ లైట్స్ ఆఫ్ చెయ్యి. జీపుని నెమ్మదిగా పోనీ."
దారిలో చిన్న వంతెన, అటూ ఇటూ సిమెంటు అరుగులు.
"జీపిక్కడ ఆపు..." అంటూ డేవిడ్ జీపులోంచి దిగాడు.
"జీపిక్కడే వుంచు... నే వెళ్ళొస్తాను. ఏదయినా అవసరమైతే పిలుస్తాను... రా."
డేవిడ్ సంగతి డ్రైవర్ రాములుకు బాగా తెలుసు.
ఉదయం శివరాణిని చూడగానే ఊహించాడు రాములు... శివరాణి చిక్కేవరకూ గురుడు పట్టు వదలడని.
"నన్ను మర్చిపోకండి గురూ గారూ" జేబులోంచి క్వార్టర్ బాటిల్ తీస్తూ అన్నాడు రాములు.
"మంచవూ లేదు... కంచవూ లేదు... పిల్ల పేరు శివరాణీ అన్నాట్ట నీలాంటి వాడెవడో. ముందు నన్ను వెళ్ళనీ. పరిస్థితి అంతా అనుకూలంగా వుంటే నిన్నెప్పుడు కాదన్నాన్రా."
గబగబా ముందుకు అడుగులు వేసాడు ఇన్ స్పెక్టర్ డేవిడ్.
* * * * *
ఎంత నిషాలో వున్నా పోలీసు... పోలీసే. ఉదయం జరిగిన ఏ సంఘటననీ మర్చిపోలేదు డేవిడ్.
నేరుగా ప్రైమరీ హెల్త్ సెంటర్ వెనక్కి వెళ్ళాడు. చెత్తకుప్ప దుర్గంధం దుస్సహంగా వుంది.
జేబులోంచి పెన్ టార్చి తీసి వెతకడం ప్రారంభించాడు.
రెండు... మూడు... అయిదు... పది నిమిషాలు...
అతని శ్రమ వృధా కాలేదు. చుట్టలు చుట్టి శివరాణి పారేసిన ఈనాడు పేపర్ని అందుకున్నాడు. బాగా మడతపెట్టి వెనక జేబులో పెట్టుకున్నాడు ముందుకొచ్చి-
హెల్త్ సెంటర్ మెట్లెక్కి డోరు వేపు చూశాడు. తాళం వేసుంది.
మళ్ళీ మెట్లు దిగి, పిట్టగోడ కానుకుని... చుట్టూ తిరిగి వెనక వేపుకి నడిచాడు.
వెనక ఒకటే డాబా ఇల్లు. ఆ యింటికి, హెల్త్ సెంటర్ కీ మధ్య విశాలమైన రహదారి. కొంచెం దూరంలో ఏవో గుడిసెలు.
డాబా యింటికి కుడిపక్కన సిమెంట్ స్థంభానికి వెలుగుతున్న ఎలక్ట్రిక్ బల్బు.
అటూ ఇటూ చూశాడు డేవిడ్. ఒక రాయిని తీసుకుని బల్బుని సూటిగా చూసి కొట్టాడు. అంతే! బల్బ్ బ్రద్ధలయిపోయింది.
ఇప్పుడక్కడ మిగిలింది చీకటే!
* * * * *
అప్పుడు రాత్రి పదింబావయ్యింది.
మంచం మీద పడుకుని టీవి. చూస్తోంది నర్సు శివరాణి.
వరల్డ్ దిస్ వీక్ ప్రోగ్రామ్ చాలా ఇన్ ట్రిస్ట్ గా వుంది. ముందురోజే హత్యకు గురైన శ్రీలంక ప్రెసిడెంట్ గురించి స్పెషల్ రిపోర్ట్. ఆ ప్రోగ్రామ్ అయిపోయాక-
జింబాబ్వేలో బంకమట్టి నుపయోగించి విచిత్రమైన తువ్వాళ్ళు తయారు చేస్తున్నారు...
కళ్ళు నొప్పులు పుడుతున్నాయి శివరాణికి.
లేచి టి.వి. ఆఫ్ చేసి... బెడ్ లైట్ వేసి, బెడ్ మీద కెక్కి పైన తిరుగుతున్న ఫ్యాన్ వైపు చూస్తోంది.
ఆదిత్య జ్ఞాపకానికొచ్చాడు....
ప్రతీ మూడు గంటలకొకసారి టీ.వి. వాళ్ళు ఆదిత్య గురించి ప్రకటన చేస్తున్నారు.
తన పేరు ఆదిత్య అయితే ధరణికుమార్ అని ఎందుకు చెప్పినట్టు?
ఆలోచిస్తోంది శివరాణి...
ఆదిత్య హంతకుడంటే నమ్మలేకపోతోంది ఆమె. హంతకుడి ముఖంలోగానీ, కదలికల్లోగానీ, కళ్ళల్లోగానీ వుండాల్సిన క్రౌర్యం ఆదిత్యలో ఆమెకు కన్పించలేదు.