"ఫిరంగి పేట...."
"అక్కడ దిగి శివదేవునిపల్లె వెళ్ళొచ్చా?"
"శివదేవుని పల్లా? అదెక్కడుంది?" ఎదురు ప్రశ్న వేశాడు పక్కనున్న ప్రయాణికుడు.
తెల్లబోయాడు ఆదిత్య.
ఫిరంగిపేట రైల్వేస్టేషన్ చాలా చిన్న రైల్వేస్టేషన్. ఉర్దూ, మరాఠీ కలగలిసిన భాష!
కిటికీలోంచి బయటకు చూశాడు ఆదిత్య. ప్లాట్ ఫారమ్మీద మనుషులెవరూ కనిపించలేదు. పోలీసులు లేరు.
దిగి, స్టేషన్ మాష్టర్ కు టిక్కెటిచ్చి-
"శివదేవునిపల్లె వెళ్ళాలి. ఎలా?" అన్నాడు.
"ఇక్కడ నుంచి శివదేవునిపల్లె చాలా దూరం. వెంకటాపురం రైల్వేస్టేషన్ లో దిగితే దగ్గర. మీరో పని చెయ్యండి. మరో పావుగంటలో ట్రైనొస్తుంది. ఎక్కి వెంకటాపురంలో దిగండి" అన్నాడాయన.
ఆదిత్యకు వెంకటాపురం ఫ్లాట్ ఫాం మీదున్న పోలీసులు గుర్తుకువచ్చారు.
"నడక దారి ఏదయినా వుంటే చెప్పండి."
"ఇక్కడ నుంచి పదిమైళ్ళకు పైగా వుంటుంది దూరం! నడక దారంటే... బండి దారి లేదు. కొండలు, పొలాలూ... వాటి మీదుగా వెళ్ళాలి."
"దారిలో గ్రామాలేవీ లేవా?"
"ఫిరంగిపేట గ్రామం వుంది. అంతే" అని స్టేషన్ మాస్టర్ తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు.
స్టేషన్ బయటికొచ్చి కనిపిస్తున్న దారి వెంబడి నడవటం ప్రారంభించాడు ఆదిత్య.
అప్పటికి సూర్యుడు నడినెత్తి మీదకొచ్చాడు.
* * * * *
మట్టిరోడ్డు మీద సర్ర్ మని శబ్దం చేసుకుంటూ వచ్చి ఆగింది పోలీస్ జీప్.
డ్రైవింగ్ సీటు పక్కన కూర్చున్న సర్కిల్ డ్రైవర్ వేపు చూశాడు.
"టీ తాగుదాం సర్!" అని డ్రైవర్ జీప్ దిగి పాక వేపు నడిచాడు.
సర్కిల్ ఇన్స్ పెక్టర్ డేవిడ్.
అయిదడుగుల ఏడంగుళాలు వుంటాడు. గుబురు మీసాలు, వెడల్పాటి ముఖం!
బలమైన కండరాలు, వ్యాయామంతో నునుపుదేలిన దేహం, బట్టతల, కాఠిన్యానికి, కరుడుగట్టిన పోలీసు జులుంకీ నిదర్శనంగా వున్న కళ్లు. చాలాకాలం సిన్సియర్ గా డ్యూటీ చేశాడు. ఒక్క అవార్డుగాని, ప్రమోషన్ గానీ రాలేదు.
అప్పట్నుంచీ రూటు మార్చాడు. తనతో సహా డ్యూటీలో చేరిన వాళ్ళు ఎసిపి రేంక్ లో వున్నారు ప్రస్తుతం.
అందుకే చిదంబరరావుని నమ్ముకున్నాడు. చిదంబరరావు హోం మినిస్టర్ అయ్యాడు. ఆయన సి.ఎం.ని పరిచయం చేశాడు.
అనుకోకుండా చిదంబరరావు ఆదిత్యను పట్టుకునే పనిని అప్పగించాడు.
ఈ పనిని తను సక్సెస్ గా చేస్తే....
హోంమినిస్టరే కాదు, చీఫ్ మినిస్టర్ కి కూడా తను దగ్గరౌతాడు. డైరెక్ట్ గా చీఫ్ మినిస్టర్ సెక్యూరిటీ స్టాఫ్ లోకి వెళ్లాలని డేవిడ్ కోరిక!
ఇదే మంచి అవకాశం... ఈ అవకాశాన్ని తను వుపయోగించుకోవాలి.
అందుకే-
ఆదిత్య కోసం పూర్తిగా తన లక్ష్యాన్ని కేంద్రీకరించాడు.
హైద్రాబాద్ నుంచి బొంబాయి, పూనాలకు వెళ్ళే అన్ని దారులలోనూ వెతకడం అయిపోయింది.
ఒక్క ఈ దారి తప్ప...
ఆదిత్య పోలీసు కాల్పుల్లో చచ్చిపోలేదు కాబట్టి - గాయాలతో బైటపడి వుండాలి. కొండల్లోంచి, అడవిలోంచి బయటికొస్తే ఇటువేపే రావాలి. ఇటు వేపున్న ఒకే ఒక గ్రామం... రెడ్డిపాలెం.
గాయపడిన ఏ ఖైదీ అయినా వెళ్ళేది... మొట్టమొదట డాక్టర్ దగ్గరకి!
జీపు దిగి పాక వేపు నడిచి-
టీ తాగుతూ-
"ఈ చుట్టుపక్కల ఇంకేమైనా గ్రామాలున్నాయా...?" అడిగాడు డేవిడ్ టీ పాక యజమాని బాబూమియాను.
"లేవు బాబూ! ఇదొక్కటే గ్రామం."
"ఈ గ్రామంలో డాక్టరెవరైనా వున్నారా?"
"ఉన్నారు బాబూ! ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ బాలేశం..."
"డాక్టర్ బాలేశం?"
ఈ దారి వేపు, ఈ ఊరి వేపు, ఎప్పుడోగాని కారుగాని, జీపుగాని, పోలీస్ జీపుగానీ రాదు ఇప్పుడెందుకొచ్చిందీ?
ఉదయాన్నే ఈనాడు పేపర్లో చూసిన ఫోటో, తన దగ్గరకొచ్చిన వ్యక్తి ముఖం గుర్తుకొచ్చాయి బాబూమియాకు.
"ఊళ్ళోకి దారెటు?" అడిగాడు డేవిడ్.
చూపించాడు బాబూమియా.
వాళ్ళెందుకోసం వచ్చారో, ఎవరికోసం వచ్చారో, వాళ్ళు అడగకుండా తనెందుకు చెప్పడం. మౌనంగా కదులుతున్నజీపువేపు చూస్తూ వూరుకున్నాడు టీ పాక యజమాని బాబూమియా.
రెడ్డిపాలెం బస్టాపు దగ్గర జీపు మలుపు తిరిగి ఊళ్ళోకి ప్రవేశించింది.
* * * * *
ఫిరంగిపేట గ్రామం ప్రశాంతంగా వుంది. మూడొందల ఇళ్ళున్న చిన్న వూరు.
రైల్వేస్టేషన్ కు పదికిలోమీటర్ల దూరంలో వుంది.
ఊళ్ళో అరుగు మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న గ్రామీణులు వూళ్ళోకి వస్తున్న పట్నం వ్యక్తిని ఆశ్చర్యంగా చూస్తున్నారు.
"శివదేవునిపల్లికి దారి ఇదేనా?" అడిగాడు ఆదిత్య ఓ యాభైఏళ్ళ వ్యక్తిని.
"దారి ఇదేగానీ... ఎక్కడ శివదేవునిపల్లె... చాలా దూరం... వెంకటాపురం నుంచి అడ్డదారుంది... ఇక్కడనుంచి లేదు... పొలాలమీంచి వెళ్లాలి."
"ఎంత టైమ్ పడుతుంది."
"రాత్రి పదో, పన్నెండుకో వెళతావు నువ్వు"
ఆ మాటతో నీరసం వచ్చేసింది ఆదిత్యకు.
"కొంచెం మచినీళ్ళిస్తారా?"
పక్కనే ఉన్న పాకలోంచి మంచినీళ్ళు తెచ్చిచ్చాడు ఆ వ్యక్తి-
"ఇక్కడేమైనా... తినడానికి దొరుకుతుందా?"
"ఇక్కడ మేం జొన్నరొట్టె తింటాం... పట్నం నుంచి వస్తున్నట్టున్నావు... అది తినగలవా?"
"పెడితే తింటాను."
ఆ గ్రామీణుడు ఆదిత్యను ఆప్యాయంగా తన గుడిసెకు తీసికెళ్ళి జొన్నరొట్టె పెట్టాడు.