పరిశీలనగా మెహబూబ్ మొహంలోకి చూశాడు రెడ్డి.అతనికి ఇంకా నూనూగు మీసాల వయసే. లేతగా ఉంది మొహం. పద్ధెనిమిదేళ్ళు నిండీ నిండకముందే సర్వీసులో చేరినట్లున్నాడు.
విచారంగా అన్నాడు రెడ్డి. "దేఖో మెహబూబ్! నీలాంటి కుర్రాళ్ళే దేశానికి వెన్నెముక! మీరే వెన్ను జారిపోయినట్లు వెన్ను చూపి పారిపోతే ఇంక దేశం ఎటు పోతుందయ్యా! డ్యూటీలో పిరికితనం పనికిరాదు మీర్ మెహబూబ్! మోతుబర్లు అయినా, పొగరుమోతుబర్లు అయినా సరే, నేరస్థులు నేరస్థులే! పద!"
తను నమ్మిన దానిని త్రికరణశుద్ధిగా ఆచరించగలుగుతున్నానన్న ఆత్మవిశ్వాసంతో, మీటరు స్కేలు మింగేసినవాడిలా నిటారుగా నిలబడి మాట్లాడుతున్న వెంకటరెడ్డిని ముందు ఆశ్చర్యంగా, తర్వాత ఆరాధనగా చూశాడు మెహబూబ్. అతని శరీరంలోని వేడినెత్తురు వడివడిగా ప్రవహించింది.
"అవున్సార్! ఇవాల్టినుంచీ మీరు నిప్పుల్లో దూకమంటే దూకడానికి సిద్ధం ఈ మాబూ సాయిబు!" అన్నాడు ఉద్రేకంగా.
"నిప్పుల్లో దూకుతావా? పీర్ల పండగలో నిప్పులమీద నడవడం అలవాటా ఏమిటి నీకు?" అన్నాడు రెడ్డి. సబార్డినేట్లతో స్నేహితుడిలా, పెద్దన్నయ్యలా కలిసిపోవడం అతని నైజం.
"ఎక్కడ వాళ్ళిల్లు?"
"హరి సచ్చన్నారాయణ వాళ్ళిల్లా సార్? మనం వెళుతోంది ఆయన తమ్ముడి కోసమే అయితే అతను ఇంట్లో ఉండడు సార్! ఎప్పుడూ కేరాఫ్ ఏరోడ్రోమే! అతనూ అతని స్నేహితులూ రాత్రింబవళ్ళు ఏరోడ్రోమ్ లోనే ఉండి చీట్లాటా, పులిజూదం ఆడుతూ సారా తాగుతుంటారు!"
"ఎయిరోడ్రోమా?" అన్నాడు రెడ్డి ఆశ్చర్యంగా. "ఇక్కడ ఈ పల్లెలో ఎయిరోడ్రోమా?"
* * * *
విమానంలో సర్వేంద్రియాలూ సమన్వయంలోనికి తెచ్చుకుని, శతృఘ్న మీదికి లంఘించబోయాడు రాజేందర్.
అంతలో అతని షర్టుని వెనకనుంచి ఎవరో పట్టుకుని గుంజినట్లయింది.
ఉలిక్కిపడి వెనక్కి చూశాడతను.
తెల్లజుట్టు ముసలాయన సుభాష్ చంద్రబోస్ ప్రశాంతంగా నవ్వుతున్నాడు.
"నీకు థాంక్స్ ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు బాబూ! ఇవాళ ఈ విమానంలో ఉన్న అందరి ప్రాణాలూ రక్షించావు నువ్వు! పైలట్లు ఒళ్ళు తెలియకుండా పడిపోయినా, నువ్వు విమానాన్ని కంట్రోలు చెయ్యబట్టి సరిపోయిందిగానీ, లేకపోతే అందరం విమానంతోసహా కూలిపోయి ఉండేవాళ్ళం. థాంక్స్ నాయనా!"
"థూత్తెరీ!" అనుకున్నాడు రాజేందర్ మంటగా. "నీ చాదస్తపు నోరు ఇంకాసేపు కట్టేసి ఉంచితే, ఈ హైజాకర్లని కట్టిపడేసి, మీ అందరినీ నిజంగా రక్షించి ఉండేవాణ్ణి గదయ్యా తండ్రీ! ప్రమాదం ఇంకా తప్పలేదని గ్రహించని వృద్ధ సన్నాసీ, బంగారం లాంటి అవకాశాన్ని పాడు చేశావ్ గదయ్యా!"
పైకి మాత్రం ఏడవలేక నవ్వుతూ, "డోంట్ మెన్షన్ సర్! అంతా ఆ పైవాడి దయ!" అన్నాడు.
ముసలాయన గొంతు వినగానే రాజేందర్ తోబాటు శతృఘ్న కూడా ఛివాల్న వెనక్కి తిరిగాడు. అతని దృష్టి వెంటనే రాజేందర్ మీద పడింది.
రాజేందర్ నిలుచున్న భంగిమ అనుమానాస్పదంగా తోచింది అతనికి. కొద్దిక్షణాలు తను అజాగ్రత్తగా ఉంటే ఏం జరిగి ఉండేదో అతనికి అర్థమైపోయింది.
తనకు తెలియకుండానే నెమ్మదిగా నిట్టూర్చాడు అతను.
తృటిలో తనకి ప్రమాదం తప్పిపోయిందన్నమాట!
ఈ ముసలాడు సమయానికి అసందర్భంగా ఏదో పేలి ఉండకపోతే ఈ రాజేందర్ గాడు వెనకనుంచి తనని ఎలుగ్గొడ్డులా వాటేసుకుని ఉండేవాడన్నమాట!
దీర్ఘంగా ఊపిరి తీసుకున్నాడు శతృఘ్న. కేబిన్ ని అంతా ఒక్కసారి అలర్టుగా పరికించి చూసి, ఆలోచించటం మొదలెట్టాడు.
హైజాక్ అంటే సులువుగా అయిపోతుందనుకున్నాడు తను. ప్లేన్ గాలిలోకి లేచీ లేవగానే రివాల్వర్ చూపించి పైలట్లను లొంగ దీసుకుని, ప్లేన్ ని దారిమళ్ళించి పాకిస్తాన్ లోని రావల్పిండి ఎయిర్ పోర్టుకి తీసుకెళ్ళి పోవచ్చుననుకున్నాడు.
కానీ అలా జరగలేదు.
ఏదో పక్షివచ్చి విమానాన్ని తాకడంతో ఎదురయ్యాయి ఆటంకాలు. ప్లేన్ వెంటనే లాండ్ అవవలసి వచ్చింది. రిపేర్ల కోసం చాలా టైం వేస్టు అయింది. మళ్ళీ టేకాఫ్.
ఇవన్నీ చాలనట్లు డ్రింక్ లో ఏదో విషం కలిసి పైలట్లు విరుచుకుపడిపోయారు. ఈ కాలక్షేపం బఠాణీ లాంటి జోకుల రాయుడు రాజేందర్ తనే కంట్రోల్స్ దగ్గర కూర్చుని విమానం కూలిపోకుండా ఎలాగైతేనేం కాసేపు గాల్లో తిప్పగలిగాడు.
భీముడు విషాన్ని జీర్ణించుకున్నట్లు ఈ సవ్యసాచి కోలుకుని, మళ్ళీ కంట్రోల్స్ దగ్గర చేరాడు.
"ఫ్యూయెల్ అయిపోవస్తోంది, మెడ్రాసు మీనంబాకం ఎయిర్ పోర్టులో దింపాలి" అంటున్నాడు సవ్యసాచి. అందులో నిజమెంత? అబద్ధమెంత?
ఇప్పుడీ రాజేందర్ గాడి వెధవ ప్రయత్నం చూశాక ఏమనిపిస్తోంది? ఈ సవ్యసాచి మాటలు సవ్యంగా లేవనిపిస్తోంది? ఫ్యూయెల్ నిజంగానే అయిపోతుందా? లేకపోతే తనని ఫూల్ ని చేసి మెడ్రాసులో దింపి లొంగదీసుకుందామని మాటలు చెబుతున్నాడా?
గట్టిగా తల విదిలించాడు శతృఘ్న.
అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి.
కొద్ది నిముషాల తర్వాత ఏదో స్ఫురించి, వెంటనే కాక్ పిట్ లోకి వెళ్ళాడు శతృఘ్న.