Previous Page Next Page 
హైజాక్ పేజి 35

పంటచేల దగ్గర మనుషులు కనబడుతున్నారు. కొంతమంది చేతుల్లో బడితెలు ఉన్నాయి. మరికొంతమంది చేతుల్లో బరిసెలు ఉన్నాయి. మనుషులు మనుషుల్ని పందుల్ని కొట్టినట్లు చావబాదుతున్నారు.
పెద్దగా హారన్ మోగించాడు డ్రైవర్.
అందరూ తలలు తిప్పిచూసి, పోలీస్ వేన్ కనబడగానే కకావికలై పారిపోయారు.
ఒక మనిషి కింద బురదలో కూరుకుపోయి ఉన్నాడు. అతని కళ్ళలో ప్రాణభయం కనబడుతోంది.
అతని రొమ్ముమీద కాలు పెట్టి నిలబడి ఉన్నాడు మరొక మనిషి. అతని చేతుల్లో గొడ్డలి ఉంది. దానితో వేటు వెయ్యబోతూ, హారన్ వినబడగానే ఆగిపోయాడు అతను.
అతను పోలీసులని చూసి భయపడినట్లు కనిపించలేదు. ఆశ్చర్యపడినట్లు మాత్రం కనబడ్డాడు.
తర్వాత హఠాత్తుగా ఒక నిశ్చయానికొచ్చినట్లు చేలకడ్డం పడి పరిగెత్తి, దట్టమైన వృక్షాల చాటున అదృశ్యమయ్యాడు.
గొడవ జరిగినప్పుడు కేసుపెట్టడం కంటే మనిషి ప్రాణాలు రక్షించడమే తన ప్రథమ కర్తవ్యం అనుకునే పోలీసు అధికారి వెంకటరెడ్డి. అతను తటపటాయించకుండా తన సూట్ కేస్ లోనుంచి సర్వీసు రివాల్వర్ అందుకుని, వాను తలుపుతెరిచి కిందకి దూకాడు.  
బురదలో పడివున్న మనిషి షాక్ లో ఉన్నాడు. అతని మొహానికంతా బురద అంటింది. ముక్కుపుటాల్లోకి కూడా బురద దూరింది. అతని వంటిమీద చిన్న చిన్న గాయాలు ఉన్నాయి, అంతే! కానీ రెడ్డి సమయానికి అక్కడికి రాకపోతే గొడ్డలి వేటుపడి ఈపాటికి శవంలా మారి ఉండేవాడతను.
అప్పటిదాకా చావుదెబ్బలు తిన్నవాళ్ళందరూ ఆక్రందనలు చేస్తూ రెడ్డి చుట్టూ మూగారు.
"టయానికి మీరుగానీ రాకపోతే, ఈ పొలంలో ఉన్న మట్టి అంతా రగతంతో ఎర్రగా మారిపోయి ఉండేది బాబూ!" అన్నాడొక వృద్ధుడు. అతని కళ్ళవెంట నీళ్ళు ప్రవాహంలా కారుతూ నెరిసిన మీసాన్ని, గెడ్డాన్ని తడిపేస్తున్నాయి.
"అసలు ఏమయింది?"
"వీడు పంది జాన్ గాడు బాబూ!" అన్నాడు వృద్ధుడు కిందపడి ఉన్న మనిషిని చూపిస్తూ. "వాడి ఇంటి పేరు పంది అయినా వాడు పంది కాదు గద బాబూ! మడిసే గద బాబూ! గూడెంలో ఉండే ఈ జాన్ గాడు గూట్లో రామసిలకలాంటి సాయిత్రమ్మను పెళ్ళి చేసుకుందామనుకున్నాడు. అది తప్పయిపోయింది బాబూ! పెద్దోళ్ళందరికీ బారెడు పొడుగు రోసం పొడుచుకొచ్చి మీసాలు మెలేస్తూ మీదపడి చావగొట్టారు బాబూ! మీర్రాకపోతే ఈడీపాటికి సచ్చుండేవాడే!"
కళ్ళు తడితో మసక మసగ్గా అయ్యాయి రెడ్డికి.
తూరుపు అప్పుడే తెలతెలవారుతోంది.
 కానీ ఈ మూర్ఖపు మనుషుల మనసుల్లో కొండంత చీకటి తొలిగి గుప్పెడు వెలుగు తొంగి చూసేదెప్పుడు?
వంగి, జాన్ కి ఆసరా ఇచ్చి లేవనెత్తాడు రెడ్డి. అతన్ని వాన్ లో ఎక్కించాడు.
రెడ్డికి ఏర్పాటుచేసిన బాసని చేరుకుంది వాన్.
అప్పటికే అక్కడ మెట్లమీద కూర్చుని ఉన్నాడు ఒకతను. అతని చేతిలో బాగా బలిసిన నాటుకోడి ఒకటి ఉంది.
రెడ్డిని చూడగానే లేచి నిల్చున్నాడు ఆ మనిషి.
ప్రశ్నార్థకంగా చూశాడు రెడ్డి.
"అరిచ్చచ్చినాయనగారు ఇచ్చి రమ్మన్నారండీ!" అన్నాడు కోడిని చూపిస్తూ.
"ఎవరు పంపారూ?" అన్నాడు రెడ్డి. అప్పటికే గొంతులో తీవ్రత చోటుచేసుకుంది.
"అరిచ్చచ్చినాయనగారండీ!"
"హరి సచ్చనారాయణగారు సార్!" అన్నాడు మహబూబ్.
"ఇదిగో మబ్బు సాయిబూ! ఈ కోడితో దొరగారికి కమ్మగా కూరొండిపెట్టు ఏం!" అన్నాడు మనిషి.
బిగుసుకుపోయాడు రెడ్డి.
"ఇలా కోళ్ళూ, కొక్కిరాళ్ళూ ఇంకెప్పుడూ తేకు. తీసుకెళ్ళిపో!" అన్నాడు.
హరి సత్యనారాయణగారి పాలేరు అసందిగ్ధంగా చూస్తూ ఉండిపోయాడు.
"వెళ్ళు!" అన్నాడు రెడ్డి గొంతు పెద్దది చేస్తూ.
పాలేరు రెడ్డిని ఎగాదిగా చూసి, కసిగా కోడి మెడ విరిచి, దాన్నక్కడే పారేసి పెద్ద పెద్ద అంగలేస్తూ వెళ్ళిపోయాడు.
అది చూసి భయంతో వణకడం మొదలెట్టాడు మెహబూబ్.
"ఎవరీ హరి సత్యనారాయణ?" అన్నాడు రెడ్డి మహబూబ్ తో.
పెదిమలు తడిచేసుకున్నాడు మహబూబ్. తర్వాత హీనస్వరంతో చెప్పాడు.
"పంది జానుగాణ్ణి ఇందాక నరకబోయాడే, అతనికి అన్నసార్ హరిసచ్చనారాయణ! పెద్ద కామందు! వాళ్ళకి అణిగిమణిగి ఉండకపోతే ఆ కోడిని మెడవిరిచి చంపినట్లు మనని చంపుతామని హెచ్చరిక అన్నమాట ఇది!"
"బెదిరింపులూ, హెచ్చరికలూ నాకు కొత్తకావుం మెహబూబ్!" అన్నాడు రెడ్డి స్థిరంగా.
"బెదిరిస్తే భయపడిపోయే మనిషిని కాను నేను. నేరం చేసినవాడు ఎవడైనా సరే, వాణ్ణి పట్టుకోవాలి మనం! పద! ఈ హరి సత్యనారాయణ ఇల్లెక్కడ?"
"భూతాన్ని సీసాలో బంధిస్తాను!" అని చెబుతున్న మాంత్రికుడిని చూసినట్లు సంభ్రమంగా చూశాడు మెహబూబ్.
 చివరి ప్రయత్నంగా అన్నాడు.
"వాళ్ళతో తగూ పెట్టుకుంటూ ఈ ఊళ్ళో బతకలేరు సార్! వాళ్ళు చాలా మోతుబర్లు సార్!"

 Previous Page Next Page