వంటగదిలో కెళ్ళి పచ్చడి, పెరుగు తెచ్చుకొని భోం చేస్తుండగా ఫోన్ మోగింది. ఎక్కడ నుండీ? నీలిమ అయుంటుంది! హాస్పిటల్ నుండి అయ్యే అవకాశం లేదు!
నీలిమ అయితే బావుణ్ణి! ఆశతో అతని మనసు రెపరెపలాడింది. చూపు రింగవుతున్న ఫోన్ మీదే నిలిచింది! గభాల్న వెళ్ళి ఫోనెత్తాడు.
విషయం వింటూనే అతని మొహంలో వెలుగు మాయమయింది! మరో పది నిమిషాల్లో అతని కారు వీధిలో దూసుకుపోతోంది!
* * * *
కారుదిగి గ్రౌండ్ ఫ్లోర్ లోని కార్డియాలజీ విభాగం వైపు వడివడిగా నడిచాడు శరత్ చంద్ర. అతన్ని చూస్తూనే ఎదురొచ్చి -
"సారీ శరత్ చంద్రా! డిస్టర్బ్ చేయాల్సొచ్చింది!" అన్నాడు రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ గోపాలకృష్ణ..
"పేషెంట్ ఎలా ఉన్నాడు సార్?" ఆయన మాటలు పెద్గగా పట్టించుకోనట్టు ప్రశ్నించాడు శరత్ చంద్ర. అతని నడకవేగం ఆగలేదు.
"సీరియస్ కండీషన్. ట్రిపుల్ వెసల్ బ్లాక్ అయింది. ఎమర్జన్సీ చెయ్యాల్సొచ్చింది." అతని వేగాన్నందుకుంటూ అన్నారు గోపాలకృష్ణ తన వియ్యంకుడి గురించి చెప్తూ.
శరత్ చంద్ర ఎమ్.సి.హెచ్ చదివేప్పుడు గోపాలకృష్ణ కార్డియో థొరాసిక్ ప్రొఫెసర్ గా వుండేవారు.
గొప్ప సర్జన్ గా ఆదర్శవాదిగా మంచి పేరు ఉండేది. వైద్య ఆయన కొడుకు, చదువులో ఎక్కిరాలేదు. కొడుకుని కార్డియో థొరాసిక్ సర్జన్ గా చూడాలనుకొన్న కోరిక అతను తీర్చలేకపోయాడు. ఒక్కొక్క సంవత్సరం రెండు మూడేళ్ళ చొప్పున చదివి అతికష్టం మీద ఎమ్.బి.బి.యస్. పూర్తి చేశాడు. శరత్ చంద్రంటే వల్లమాలిన అభిమానం గోపాలకృష్ణకి.
తన కొడుకులో చూడాలనుకున్న గుణాలన్నీ శరత్ చంద్రసో వుండడమే అందుకు కారణం.
త్వరత్వరగా రోగిని చేరాడు శరత్. వెళ్ళడమే, అతని పల్స్ మీద చెయ్యి వుంచి పరిశీలించాడు. లోతైన బావినీళ్ళలో చిన్న గులకరాయి విసిరినప్పుడు వచ్చే బలహీనమైన శబ్దంలా.... పల్స్ రిధం అందీ అందకుండా తగుల్తోంది.
అంతకు ముందోసారి అటాక్ వచ్చింది. రికవర్ అయ్యాక సర్జరీ చేయాలన్నారు. నిన్న నీకోసం వచ్చారట. కలవడం కుదరదని చెప్పాడట మీ అసిస్టెంటు" శరత్ చంద్రనే చూస్తూ చెప్పాడు అక్కడే నిలబడిన వైద్య.
"నిన్న కిరణ్ తనదగ్గరకొచ్చి - నిన్న మీకోసం ఎవరో వచ్చి వెళ్ళారని చెప్పడం గుర్తొచ్చింది శరత్ చంద్రకి.
రోగి ఊపిరి అందనట్లు గిజగిజ లాడుతున్నాడు.
అప్పటివరకూ అతనిని జరిగిన వైద్యపరీక్షల రిపోర్టులన్నీ చూశాడు. భగవంతం ఈ కేసు చేయడం కుదరదని ఎందుకన్నాడో అర్ధమైంది శరత్ చంద్రకి.
గుండెకు రక్తప్రసరణ జరిపే మూడు రక్తనాళాలు మూసుకుపోవడంవల్ల గుండెలో దాదాపు సగభాగానికి రక్తప్రసరణ ఆగిపోయి పనిచేయడంలేదు.
పనిచేస్తున్న సగం గుండె శరీర భారాన్ని మోయలేక ఏ క్షణమైనా ఆగిపోవచ్చు. రక్తప్రసరణ ఆగిపోయి కొద్దిసేపే అయింది కనుక వెంటనే ఆపరేషన్ చేస్తే అతను బ్రతకవచ్చు!
కానీ, ఆపరేషన్ చేస్తుండగా గానీ, ఆపరేషన్ తట్టుకోలేకగానీ ఏ కారణానయినా అతను పోతే....??
చదువుకొనే రోజులనుండీ గోపాలకృష్ణ గారి కుటుంబంలో ఒకడిగా మెలిగాడు శరత్ చంద్ర.
ఒకవేళ అతను పోతే.... వాళ్ళముందు.... ముఖ్యంగా వైద్య భార్య ముందు చాలా ఇబ్బందిగా ఉంటుంది.
తన పొరపాటేం లేకపోయినా బాగా తెలిసిన మనిషి తనచేతుల్లో ప్రాణాలు పోగొట్టుకోవడం చాలా ఇబ్బందికరమైన విషయమే. దాన్ని వాళ్ళెలా తీసుకుంటారో తెలీదు.
ఆలోచిస్తూ "చెప్పండి సార్! ఏం చేయమంటారు?" డాక్టర్ గోపాలకృష్ణ వైపు తిరిగి అడిగాడు.
"సర్జరీ చేయించుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. బాబూ!" అన్నారాయన.
"మీకు తెలియందేముంది? చాలా రిస్క్ తో కూడినపని, మనకి బాగా కావాల్సిన వాళ్ళు. ఏం జరిగినా మనమే రెస్పాన్సిబుల్ అని వాళ్ళనుకోవచ్చు. మరెవరి దగ్గరయినా చేయించుకుందామా?" సాలోచనగా అన్నాడు శరత్ చంద్ర.
ఈ కేసు గోపాలకృష్ణగారి బంధువు అనే కాకుండా, స్వంత మనుషులకు వైద్యం చేయకూడదన్నది వైద్యుల్లో ఓ నమ్మిక. జరగకూడనిది ఏదయినా జరిగితే జీవితకాలం తమ వాళ్ళు తమని దోషులుగా చూస్తారేమోననే భయం వుండడం సహజమే!
అతని భావాన్ని అర్ధం చేసుకున్నట్లు "నీకన్నా మంచి సర్జన్ లు ఎవరున్నారు శరత్ చంద్రా? సర్జరీ అంటూ జరిగితే నీ చేతుల్లోనే జరగాలి! లేకపోతే అలా వదిలేయడం మంచిది" అన్నారు గోపాలకృష్ణ.
శరత్ చంద్రని మించిన కార్డియాక్ సర్జన్ ఇక్కడెక్కడా లేడని ఆయన ప్రగాఢ నమ్మకం.
రిటైర్డ్ కార్డియాక్ సర్జన్ గా అతను ఎందరో సర్జెన్స్ ని ఎరిగి ఉన్నాడు. ఎంతో జీవితాన్ని చూసి ఉన్నాడు. తను వృత్తిలో ఉన్నవారికీ, ఇప్పటికీ పెరిగిన ఆధునిక వైద్య పద్ధతుల్ని ఆకళింపు చేసుకుంటూనే ఉన్నాడు. సబ్జక్ట్ మీదున్న ఆరాధనతో ఏ రోజు ఎక్కడ, ఏ సర్జన్ ఏ ఆపరేషన్ చేస్తున్నాడో.... ఎటువంటి హార్ట్ కేసు ఏ రకంగా ఎంతవరకూ సక్సెస్ అవుతుందో క్షుణ్ణంగా తెలుసుకుంటూనే ఉన్నాడు. అందుకే శరత్ చంద్ర సామర్ధ్యం గురించి ఆయనకొక ఉన్నతమైన అభిప్రాయం, గౌరవం ఉన్నాయి.
"వాట్ శరత్ చంద్రా! డూ ఇట్ యార్! వాళ్ళకి నేను చెప్పుకుంటానుగా" శరత్ ఆలోచిస్తుండటం చూసి చెప్పాడు వైద్యా. అతడొక తమాషా వ్యక్తి దేన్నీ లెక్కచేయనట్లుంటాడు.
"వాళ్ళు రిస్క్ కి సిద్ధపడితే నాకేం అభ్యంతరం లేదు" అన్నాడు శరత్ చంద్ర.
"శరత్ చెప్పింది కూడా సబబే వైద్యా! మనం వెళ్ళి మీ అత్తగారికి, బావమరిదికి రిస్క్ విషయం వివరంగా చెప్పడం మంచిది. వాళ్ళు సరే అంటే మనం శరత్ చంద్రని ఆపరేషన్ చేయమనడం బావుంటుంది" అంటూ పదమన్నట్లు వైద్య భుజమ్మీద చెయ్యేసి ఐసిసియు నుండి బయటికి కదిలాడు గోపాలకృష్ణ.
ఏ క్షణమైనా ఆగిపోగల రోగగ్రస్తమైన వేలగుండెలతో, చెడు జరిగినపుడు నోటికొచ్చినట్లు మాట్లాడగల గుండెలేని వేల మనుషులతో ఏళ్ళ తరబడి అనుభవం కలిగిన విజ్ఞుడు ఆయన. శరత్ చంద్ర మీద వాళ్ళిద్దరికున్న నమ్మక మొక్కటే చాలదని ఆయనకి తెలుసు.
శరత్ చంద్రకి ఆయన కేవలం ప్రొఫెసరే కాదు జీవితానికి గురువూ, ఆదర్శవంతుడూ తండ్రి సమానుడు కూడా.