ఓ పెద్దాయన ఏమన్నాడో తెలుసా?
లవ్ ఈజ్ టెంపరరీ అండ్ లవ్ ఈజ్ అనీక్వల్ అని.
భయపడకు. లవ్ ఈజ్ టెంపరరీ అంటే మొత్తం ప్రేమ గురించే కాదు ఉద్వేగపూరితమైన ప్రేమ మాత్రమే తాత్కాలికమని ఆయన అభిప్రాయం.
'లవీజ్ అనిక్వల్' అంటే నేను నీ గురించి ఇంత ఉద్వేక పూరితంగా ఆలోచిస్తున్న ఈ అర్ధరాత్రి టైమ్ లో నువ్వక్కడ నా గురించి ధ్యాసయినా లేకుండా హాయిగా గుర్రుకొట్టి పోతున్నావన్నమాట!
ఒకే టైములో ప్రేమికులిద్దరి ఉద్వేగాలూ ఒకే స్థాయిలో ఉండవని ఆయన ఉద్దేశ్యం!
అబ్బా.... నిద్దరొస్తోంది! కాలం ఊపిరాడక గింజుకొంటూంది. ఇంక వదిలేద్దామా? ప్రొద్దునే ఎనిమిదికే మళ్ళీ డ్యూటీ! అయితే ఏం? పడుకోబోయే ముందు నీతో ఇలా ఈ క్షణాలని గడపడంలోని మధురమైన అనుభూతికి విలువ కట్టగలనా?
మిగిలిన ఈ రాత్రంతా.... ఇసుక తిన్నెల పరువు మీది వాలి వయ్యారంగా ప్రవహించే గోదావరి ఒంటి మలుపులాంటి నీ నడుము అందాల వంపులో తలవాల్చి.... నీ శరీర పరిమళాల్ని ఆస్వాదిస్తూ విశ్రమిస్తున్న అనుభూతిలో నిద్రిస్తాను ప్రియతమా!
దటీజ్ చందూ యువర్ డాళింగ్!
నే రానందుకు కోపం పోయింది కదూ! ఉంటాను.
నీ
చంద్ర
ఉత్తరం చదవడం ముగిసే వరకూ అతనికి తానెక్కడున్నాడో కూడా గుర్తురాలేదు. ఆ కలల, కళలు ఏమైపోయాయో? అనుకున్నాడు. ఇప్పుడు ఇంత ఉత్తరం వ్రాయగలడా తను? అంత టైము హృదయానందమూ ఏవీ?
రాత్రింబవళ్ళు తరుముతున్న పనివత్తిడి అన్నిటినీ మింగేసింది!
ఉత్తరం మడిచి యధాస్థానంలో పెట్టేసాడు, ఆ ఉత్తరం అతన్ని పాత రోజుల్లోకి తీసుకెళ్ళి ఎంతో ఉత్తేజ పరిచింది. మనసంతా తీయతీయని భావంతో నిండిపోయింది.
నీలిమ మీద అవాజ్యమైన ప్రేమ పొంగింది. ఆమె ఇంట్లో లేని లోటు ఇప్పుడు మరీ ఎక్కువగా అనిపిస్తోంది.
ఎంతెంత ఉత్తరాలు రాసేవాడు! నీలిమ మాత్రం కొట్టె, కట్టె, తెచ్చె అన్నట్లు అతికష్టంమ్మీద ఒక పేజీని నింపగలిగేది. తనలాగా, రాయలేక పోతున్నందుకు ఎంతో దిగులుపడిపోయేది.
నా ప్రియమైన చంద్రా!
నువ్వంటే నాకు ప్రాణం! నా రక్తమూ, కన్నీళ్ళు సాక్షిగా నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఇంతకంటే ఎలా చెప్పాలో నాకు తెలీడం లేదు. నీలాగా ప్రేమని గొప్పగా వ్యక్తం చేయడం రానందుకు ఎంత బాధగా ఉందో తెలుసా? ఏడుస్తూనే ఉత్తరం రాస్తున్నాను.
వేలుకోసుకుని, ఆ రక్తం - కన్నీరు మిశ్రమంలో నా జడపిన్ను ముంచి నీకీ ఉత్తరం రాస్తున్నాను. నా ప్రేమ అర్ధమయింది కదూ!
నీ
నీలు
ఆ ఉత్తరం గుర్తుకొచ్చి ఆమెపిల్ల చేష్టకి నవ్వుకొంటూ వెళ్ళి మంచమ్మీద కూర్చున్నాడు.
కిటికీల్లోంచి తెరలు తెరలుగా వస్తున్న గాలి అప్పుడే స్నానం చేసిన శరీరాన్ని హాయిగా నిమురుతోంది. కుండీలో పెరిగిన నైట్ క్వీన్ ఉండుండీ గుప్పుగుప్పున పరిమళాలని వెదజల్లుతోంది. జ్ఞాపకాలు - వాతావరణం అతని మనసుని మరువపు పొదలా గుబాళింప చేస్తున్నాయి.
ఇప్పుడిలా నవ్వుకుంటున్నాడు గానీ ఆ ఉత్తరం అందినరోజు చాలా కోపమొచ్చింది నీలిమ మీద. ఇలా రాశాడు.
"నీలూ!
ఇంకెప్పుడూ ఇలా పిచ్చి ఉత్తరాలు రాయకు. నువ్వసలు ఉత్తరమే రాయక పోయినా - నీ ప్రేమని అర్ధం చేసుకోగలను.
మాట మాటకీ ఏడ్చా ఆడవాళ్ళంటే నాకంత గౌరవం లేదు. ఏడ్చీ, వేళ్ళు కోసుకుని జాలి, సానుభూతి ఆశిస్తూ భర్తను లొంగదీసు కొంటున్నామనకునే ఆడవాళ్ళంటే నాకు చిన్నచూపు.
నీలూ! నీమీద నువ్వు జాలిపడటం ఎప్పుడు మొదలవుతుందో అప్పుడే నీ పతనం మొదలయిందన్నమాట!
సెల్ఫ పిటీకి నువ్వెప్పుడూ ఇలా లొంగిపోకు. అది నీలో జీవాన్ని చంపేస్తుంది! రీజనింగ్ ని ఎమోషన్ డామినేట్ చేయకుండా జాగ్రత్తపడుతుండాలి!
అందరూ అన్నిటిలోనూ నిష్ణాతులు కాలేరు. నీకున్న కొన్ని గుణాలు నాకు లేకపోవచ్చు! రీజనింగ్ లోంచి ఆనందాన్ని వెదుక్కోగలిగితే - జీవితంలో ఎప్పుడూ జీవాన్ని కోల్పోలేవు. సెల్ఫ్ పిటీతో పోరాడ్డం ఈ క్షణం నుండే మొదలెట్టు!
నీ
శరత్ చంద్ర
తలచుకుంటే పాపం అనిపిస్తోందిప్పుడు. ఏదో పిచ్చి ప్రేమతో రాసిన దానికి గొప్ప మేధావిలా చివాట్లు పెట్టాలా?? ఛ! అనుకున్నాడు.
ఇప్పుడు నీలూ ప్రత్యక్షమైతే బావుణ్ణనిపిస్తోంది.
ఆర్తిగా ఆమెని చేతుల్లో పొదువుకోడానికి మనసు ఆరాటపడుతోంది.
ఇప్పుడే కారు తీసుకుని వెళ్లి పిల్లల్నీ, తననీ తీసుకొస్తే? వెళ్ళినా ఇప్పుడు తనతో రావడానికి నీలిమ సిద్ధపడుతుందా?
మళ్ళీ.... వెళ్లాలనిపించలేదు. తన అనుమతి లేకుండా తన భార్య పిల్లల్నీ తీసుకెళ్ళిపోయిన మామగారింటికి తను వెళ్ళడమా? ఉహూ... రేపు డ్రయివర్ నిచ్చి కారు పంపించాలి! రేపటి దాకా నీలూతో మాట్లాడకుండానా!
మంచం మీద నుంచి లేచివెళ్ళి ఫోను డయిల్ చేశాడు. తనఫోన్ కోసమే ఎదురు చూస్తున్న దానిలా అటువైపు నీలిమ లిఫ్ట్ చేసింది.
"నీలూ నువ్వు లేకుండా ఒక్క గంట కూడా ఈ ఇంట్లో ఉండలేను. వెంటనే వచ్చేయ్! నా బంగారం కదూ! నువ్వు లేకపోతే పిచ్చిపట్టేస్తుంది. త్వరగా రా!" మనసులోని తొందరనంతా త్వరత్వరగా చెప్పేసాడు. నీలిమ నుండి జవాబు లేదు. ప్లీజ్ నేనుండలేను!" అభ్యర్ధనతో అతని గొంతు వణికింది. అటునిండి ఏమి సమాధానం రాకపోవడంతో నిస్పృహగా ఫోన్ పెట్టేశాడు. ప్రక్కింట్లో కంచాల చప్పుడు వినపడి మళ్ళీ ఆకలేయడం మొదలెట్టింది.