"ఇందులో మాకేం ఆశ్చర్యం కనిపించటం లేదు. చాలా నేచురల్ గా వుంది."
అతను రెండు గంటలసేపు ఆ లెటర్ కోసం వెతికి కాపీ చేసి ఇచ్చాడు.
అది తీసుకుని మళ్ళీ క్లియరెన్స్ ఆఫీస్ కెళ్లాము.
ఆ లెటర్ చూసుకున్నాక "ఓకే మేము రిప్లయ్ పంపిస్తాంలెండి-"
అన్నాడతను.
"ఎప్పుడండీ?"
"రేపే"
"పోనీ ఆ రిప్లయ్ ఏదో మాకు రాసిస్తే-"
"అలా వీలుపడదండీ- మా రూల్స్ ఒప్పుకోవు"
రెండురోజుల తర్వాత మళ్ళీ బాంక్ కెళ్లాము.
"ఇంకా రాలేదే మీ డ్రాఫ్ట్ తాలూకూ లెటర్-" అన్నాడు ఆఫీసర్.
"మొన్నో పంపుతానన్నాడండీ అతను"
"కానీ పంపలేదు కదా మరి"
ఇక మాట్లాడి లాభం లేదని మళ్ళీ క్లియరెన్స్ ఆఫీస్ కెళ్ళాము.
"ఏమిటి మళ్ళీ వచ్చారు?" అడిగాడతను ఆశ్చర్యంగా.
"అదే మీరు పంపిన లెటర్ రాలేదని అన్నారు బాంక్ లో"
"అబ్బే ఆ రోజే పంపించేశాం-"
"మరిప్పుడెలా - అదీ మిస్ అయిపోయి ఉంటుంది"
"అవును"
"పోనీ- మీ రిప్లయ్ కాపీ ఒకటి ఇస్తే"
"సరే - రేపు రండి"
మర్నాడు వెళ్ళి కాపీ తీసుకుని బాంక్ కి చేరుకున్నాం.
"మంచి పనిచేశారు. లేపోతే ఓ పట్టాన తేలిచావదది" అన్నాడతను లెటర్ తీసుకుంటూ.
"అవునండీ."
"మరి స్టాంప్ పేపర్ తెచ్చారా?" అడిగాడతను.
నేను ఉలిక్కిపడ్డాను.
"అదేమిటి? స్టాంప్ పేపరెందుకు?"
"అయిదు రూపాయల స్టాంప్ పేపర్ మీద మేటర్ రాసి సంతకం పెట్టి ఇవ్వాలి కదా!"
"మా డబ్బుకి మేమే బాండ్ రాయాలా?"
"రూల్స్ బాబూ- రూల్స్-"
"మరీ విషయం ముందే - చెప్తే నిన్నే రడీ చేసుకువచ్చే వాళ్ళంకదా"
"మీరు ముందే అడిగివుంటే ముందే చెప్పేవాళ్ళం-"
"మరీ ఇంక చెత్తరూల్స్ వుంటాయని మేమనుకోలేదు."
"బాంక్ అన్నాక లేకుండా ఎలా వుంటాయండీ?"
"సరే స్టాంప్ పేపర్ తెస్తాం- అందులో లెటర్ ఏం రాయాలో రూల్స్ చూసి చెప్పండి.
అతను ఓ కాగితం కట్టను గంటసేపు వెతికి ఓ కాగితం తీసి ఇచ్చాడు. అయిదు రూపాయల స్టాంప్ పేపర్ కోసం హైద్రాబాద్ అంతా తిరిగి చివరకు బాగా పొద్దుపోయాక దొరకదని తెలుసుకుని మర్నాడు కోర్టు ఆవరణలోవున్న ఓ వ్యక్తి దగ్గర స్టాంప్ పేపర్ తీసుకుని మేటర్ టైప్ చేయించి బాంక్ కి చేరుకున్నాం. అతను కాగితం అంతా ఓసారి చదువుకున్నాడు.
"సరే- ఇవాళ ఎలాగూ టైమయిపోయింది రేపు రండి-" అన్నాడు.
మర్నాడు సంతోషంగా బాంక్ కెళ్ళాం ఆ రోజుతో మమ్మల్ని ఆవహించిన శని వదిలిపోయింది కదాని. గంటసేపు కూర్చున్నాక ఓ క్లర్కు మమ్మల్ని పిలిచాడు.
"ఇక్కడ సంతకం చేయండి" అక్కడ సంతకం చేశాడు శాయిరామ్.
అతను ఓ డ్రాప్ట్ శాయిరామ్ చేతికిచ్చాడు-
"ఇదేమిటి?" ఆశ్చర్యంగా అడిగాం.
"డూప్లికేట్ డ్రాప్ట్. ఒరిజినల్ పోయిందన్నారుగా"
"కామీ మేమడిగింది డూప్లికేట్ డ్రాప్ట్ కాదు- పోయిన డ్రాప్ట్ కాన్సిల్ చేసి డబ్బు ఇమ్మన్నాం."
"అలాగా! మరి మా ఆఫీసర్ గారు అలా చెప్పారేం?"
"ఎలా చెప్పారు?"
"ఇలా." మళ్ళీ ఆఫీసర్ దగ్గర కెళ్ళాం.
"యస్?" అన్నాడతను ప్రశ్నార్థకంగా. అని శాయిరామ్ వంక చూశాడు. నేనూ శాయిరామ్ వంక చూశాను.
మా ఇద్దరికీ అర్థమయిపోయింది. కథ మళ్ళీ మొదలయిందని. ఆ డ్రాప్ట్ మళ్ళీ కాన్సిల్ చేసి డబ్బు తీసుకోవాలంటే మళ్ళీ ఆ కథంతా జరగాలి. శాయిరామ్ చిరునవ్వు నవ్వాడు.
"మరేం లేదు సార్ - థాంక్స్ చెప్దామని"
"ఏం ఫర్లేదు- మీ సేవకోసమే మా బ్యాంక్ లున్నయ్. వెల్ కమ్- ఆల్వేస్ వెల్ కమ్-"
బయటికొచ్చాక శాయిరామ్ డ్రాప్ట్ ముక్కలు ముక్కలుగా చింపి పారేశాడు. మర్నాడు పొద్దునే శాయిరామ్ వచ్చి తలుపుకొట్టాడు. "మళ్ళీ ఏమిటి?" అన్నాడు కోపంగా.
"ఈ ఫార్స్ చూశావా?" అన్నాడు పేపర్లో ఓ బాక్స్ అయిటమ్ చూపిస్తూ.
"ఏమిటది?"
"మనం ఇన్ని రోజులూ తిరిగిన బ్యాంక్ ఉంది చూడు - అక్కడి మేనేజర్నీ స్టాఫ్ నీ మోసం చేసి మెయిల్ ట్రాన్స్ ఫర్ అరవై లక్షలు కొట్టేశాడు ఒక ముత్యాలు, వజ్రాలు అమ్మే బిజినెస్ మెన్-"
"అందులో కొత్తేముందీ? బాంక్ ని ముంచనోడెవ డీరోజుల్లో."
"అది నిజమేగాని ఈ ముత్యాల వార్తకుడెవరో గుర్తుకొచ్చిందా?"
"లేదే- ఎవరు?"
"అదే మనం మొదటిరోజు డ్రాప్ట్ కోసం బాంక్ కెళ్ళినప్పుడు మేనేజర్ కి ముత్యాలు కన్సెషన్ లో యిస్తానని చెప్తాడు చూడు-"
"అవునవును! గుర్తుకొచ్చింది- మనెదురుగ్గానే మేనేజర్ ఫోన్ చేశాడు స్టాఫ్ కి- అతని వ్యవహారం వెంటనే ఓకే చేయమని"
"వాడే వాళ్ళను ముంచేశాడు- కేవలం కొన్ని ముత్యాలు దానాగా చల్లి. అదే మనలాంటి పక్షులు వెళ్తే మన డబ్బు మనకివ్వటానికి సవాలక్ష రూల్స్ అడ్డం వస్తాయ్- ముత్యాలు జల్లే వాళ్ళకు సలాంకొట్టి తప్పుకుంటాయ్-"
నేనేం మాట్లాడలేదు.
* * * * *