"రాత్రి కథ చాలా బావుంది సార్. బ్రహ్మచారి వెధవను. గదిలో నిద్ర రావడంలేదు. అందుకే మీకు మాత్రమే కాఫీలు పట్టుకొచ్చాను. మీకు కాఫీ ఇస్తూ, కథలింటాను సార్"
రోజూ కథ చెబుతానని అతనికెలా తెలుసు? అదే అడిగాను.
"వేరువేరుగా వుండడానికి పోర్షన్లు తీసుకున్నారు. రాత్రంతా కథలతోనే కాలక్షేపం చేస్తారని వూహించాను సార్" అని ముసిముసిగా నవ్వాడు దాము.
నాకు ఆ మాటలు అవమానంగా అనిపించాయి. అందమైన అమ్మాయిని పక్కనే వుంచుకుని వూరకనే రాత్రుళ్ళను తోస్తున్నానని దాము కూడా కనిపెట్టడం నాకు ఇష్టం లేకపోయింది. అయినా ఏం చేయను? దుష్ట గ్రహాల నీడ నావైపే వుండి కీర్తి నుంచి నన్ను దూరం చేస్తున్నది.
కీర్తి దాము మాటలకు ఇంకా నవ్వుతూనే వుంది.
నాకు పట్టు హెచ్చింది. ఈ రాత్రయినా సక్సెస్ కావాలన్న తపన ఎక్కువైంది.
మళ్ళీ మాముందు చదరంగం బల్ల సిద్ధమైంది.
త్వరలో అమావాస్య వస్తుందనడానికి గుర్తుగా ఆకాశం బ్లాక్ బోర్డులా వుంది. అందులో ఎవరో చాక్ పీస్ తో గుర్తులు పెట్టినట్టు అక్కడక్కడా నక్షత్రాలు.
"మరి కథ కానివ్వు" అంది కీర్తి.
దామూ కూడా సర్దుకుని కూర్చున్నాడు.
నేను గొంతు సవరించుకున్నాను.
మా ముందున్న పూలతోట చీకటిని మేస్తూ వుంది. అందులోని ఫ్లోరోసెంట్ దీపం వుండుండి వెలుగుతూ వుంది.
ఆ వూరి పేరు చెల్లూరు. తల్లి రెక్కకింద వెచ్చగా కూర్చుని బయటకు తొంగిచూస్తున్న కోడిపిల్లలా ఆఊరు చెట్ల మధ్య అద్భుతంగా వుంటుంది. దాదాపు వంద ఇళ్లుంటాయి. మంచి పొలాలు గనుక పంటలు బాగా పండేవి. అందుకే ఆ ఊరు ఎప్పుడూ పిల్లల కోడిలా కళకళలాడుతుంటుంది.
ఆ ఊరికి గుర్తింపు కూడా వుండేది. చెల్లూరంటే ఆ ప్రాంతంలోని మిగిలిన గ్రామాలన్నిటికీ అట్రాక్షన్. ఆ ఊరికి కూలికోసం వచ్చిన చాలా మంది అక్కడే స్థిరపడిపోయారు. వాళ్ళు అక్కడ వుండిపోవడానికి కారణం పంటలు బాగా పండుతాయనే కాదు. కూలీ బాగా దొరుకుతుందనీ కాదు. కేవలం ఆ ఊర్లో వుండే సుందరబాబుతో గడపొచ్చు కదా అని.
"సుందరబాబు ఎవరు" కీర్తి చాలా ఉత్సాహంగా ప్రశ్నించింది.
డ్రామాలు నేర్పేవాడు. ఆ ఊర్లో అందరూ అతన్ని 'డ్రామాఅయ్యోరు' అని పిలిచేవాళ్ళు. ఆయన మీదున్న గౌరవంతో ఆయన్నెవ్వరూ పేరుతో పిలిచేవాళ్ళు కాదు. ముసలీ ముతక నుంచి, స్కూల్ కెళ్ళే పిల్లాడి వరకు అందరూ 'డ్రామా అయ్యెరా' అని మనసారా పిలిచేవాళ్ళు. ఇంత చేస్తే ఆయన ఆయన వయసు ముప్పై ఏళ్ళు మించదు.
అతను గొప్ప కళాకారుడు. ఆ చిన్న పల్లెటూళ్లో వుండిపోబట్టి సరిపోయిందిగానీ లేదంటే ఆయన ఊరు ఆంధ్రదేశంలో మారుమ్రోగేది. అతను గొంతు విప్పి, రాగం తీస్తే గంధర్వుడు మారువేషంలో వచ్చి పాడుతున్నాడేమో అన్న భ్రమ కలిగేది. కృష్ణుడు వేషం వేసి, చిరునవ్వు నవ్వితే "అచ్చు రామారావులా లేడూ" అని మురిసిపోయేవాళ్లు. లవకుశలో చాకలివాడి వేషం కడితే, ప్రేక్షకులు నవ్వలేక కడుపు పగిలి చచ్చేవాళ్ళు. హార్మోనియం ముందు కూర్చుని స్నేక మ్యూజిక్ వాయిస్తే మన వెనుక త్రాచు పాములు వచ్చి నిలచినట్టే వుండేది.
డ్రామాకు కావాల్సిన సైన్ బోర్డుల నుంచి, డైరెక్షన్ వరకు ఆయన చేయని పనిలేదు.
ఆయన ఆ ఊళ్ళో వుండడం గొప్ప అదృష్టంగా భావించే వాళ్ళు ఊరి జనం. ఎప్పుడూ ఆయన ఇల్లు మనుష్యులతో కిటకిటలాడిపోయేది. ముఖ్యంగా రాత్రిళ్ళు. సంవత్సరం మొత్తం మీద ప్రతి రాత్రీ అక్కడ డ్రామా రిహార్సల్స్ జరిగేవి.
సాయంకాలం ఏడయితే చాలు అతని ఇంటికి జనం రావడం మొదలుపెట్టేవారు.
ఆయన హార్మోనియం ముందు కూర్చుని మొట్టమొదటగా 'పరబ్రహ్మ పరమేశ్వరా...' అని శృతిచేసి, చిన్నగా ఆలపిస్తుంటే చిన్న పిల్లలయితే తింటున్న అన్నం మధ్యలో వదిలి అక్కడకు పరుగెత్తుకొచ్చేవాళ్ళు. పెద్ద వాళ్ళయితే ఏడు గంటలకు ముందే భోజనం ముగించి, గుమి గూడిపోయేవాళ్ళు. ఇక స్త్రీలయితే వంటిల్లంతా క్షణాల్లో సర్దేసి ఆయన ఇంటి గోడకు నీడలైపోయేవాళ్లు.
ఆయన పద్యాలు పాడించడం- కొత్తగా పద్యాలు నేర్చుకునేవాళ్లు రాగం తీయడానికి పడే అవస్థ, మధ్య మధ్య ఆయన జోక్ ళు హార్మోనియం సంగీతం-ఇవన్నీ గొప్పగా వుండేవి.
ఆయన చుట్టూ చేరిన జనం కూడా అంతే. ఆయన పద్యం ఆలపిస్తే వాళ్ళు తన్మయం చెందేవాళ్ళు. ఆయన కొత్తవాళ్ళను మందలిస్తే వాళ్లూ భయంతో వులిక్కిపడేవాళ్ళు. మధ్యమధ్యలో వేసే జోకులకు పడిపడి నవ్వేవాళ్ళు. ఎప్పుడో ఏ అర్దరాత్రికో రిహార్సల్స్ ముగిసేవి. అప్పుడు సినిమా థియేటర్ వదిలినట్టు జనం అక్కడి నుంచి బయటపడి ఇంటికి చేరేవాళ్లు.
ఆ ఊర్లోని వాళ్ళేకాక చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా జనం డ్రామా నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు. సంవత్సరానికి నాలుగు పౌరాణిక నాటకాలు ఆడేవాడు సుందరబాబు. రెండు నాటకాలను ఊర్లోవాళ్ళచేత వేయిస్తే, మిగిలిన రెండు పక్క గ్రామాల వారిచేత వేయించేవాడు. ఒక నాటకాన్ని మూడునెలలు చెప్పించేవాడు. అన్నీ పౌరాణికాలే కావడంతో ఒక నాటకంలో సుమారు ముప్పై నలభై మంది నటించేవాళ్ళు. వాళ్ళందరికీ వేషాలు కేటాయించి, వాళ్ళకు పోర్షన్ రాసిచ్చి, వాళ్ళచేత పద్యాలు పాడించి, నటన నేర్పించి, అద్భుతంగా నాటకమాడి, అందరిచేతా సెహభాష్ అనిపించుకునేవాడు. పాత్రలు వేసిన వాళ్లు తృణమో, పణమో ఆయనకు ఇచ్చేవాళ్ళు. ఈ ఆదాయమేకాక వ్యవసాయం వుండడంతో ఆయనకు ఆర్ధిక ఇబ్బందులు ఏమీ వుండేవి కావు.
ఆయన డ్రామా బాగా నేర్పిస్తాడనే పేరుకంటే ఆయన చాలా తమాషాగా జోక్ ళు చెప్పి, భలే నవ్విస్తాడనే పేరే ఎక్కువగా వుండేది. అది నిజం. ఆయన జోక్ చెప్పడంతోపాటు, అభినయించి చూపేవాడు. దాంతో జనం విరగబడి నవ్వేవారు.
డ్రామాలో ఆయన పెద్దవేషం వేయడం చాలా అరుదు. ప్రతి డ్రామాలో హాస్యనటుడిగానే వుండేవాడు. లవకుశలో రజకుడిగానూ, మైరావణలో లంబుగానూ, చింతామణిలో శెట్టిగానూ వేషాలేసి, జనాన్ని వుర్రూత లూగించేవాడు.
ఆయనకు జోడీగా నాయుడుపేట నిర్మల నటించేది. ఆమె అతని పర్మనెంట్ ఆర్టిస్ట్, తన పక్క సుందరబాబు నటిస్తున్నాడంటే ఆమెకూ చెప్పలేని థ్రిల్ గా వుండేది.
ఒక్కోసారి ఆయన నటనకు స్టేజీమీదే ఆమె తన పాత్ర సంగతి మరచిపోయి విపరీతంగా నవ్వేసేది. నాటకపరంగా ప్రతి ఆర్టిస్టూ ఆయన్ను ప్రత్యేకంగా అభిమానించేవాళ్లు.
ఆయన హాస్యం అద్భుతం. అనితర సాధ్యం. అంతగా జనాన్ని ఆకట్టుకునే విద్య ఆయన కొక్కడికే తెలుసేమోననిపించేది. ఆయన డ్రామా అంటే మిగిలిన ఆర్టిస్ట్ ళు కూడా ఎంతో సంతోషంగా వచ్చేవాళ్ళు. డ్రామా ఆడే ఆ రెండు రోజులూ కో ఆర్టిస్ట్ లను సుందరబాబు తన చమత్కారంతో, హాస్యపు సంభాషణలతో, అద్భుతమైన అభినయంతో గొప్పగా ఆకట్టుకునేవాడు. ఆయన పక్కనుంటే తుపాను మనల్ని రాసుకుంటూ పోయినట్టనిపిస్తుండేది.