"మీరంటే నాకు ఒకవిధమైన హీరోవర్షిప్ వుంది."
"ఏం చూశావు నాలో నువ్వు?"
"చాలా చూశా. మిమ్మల్ని మొదటిసారి కాలేజీ ఆవరణంలో చూసినప్పుడు చకితుణ్నై నిలబడిపోయాను. ఏం సౌందర్యం? నేను ఆడదానినైతే మీ వెంటపడి వుండేవాణ్ణి."
చక్రపాణికి శరీరం రోమాంచితమయింది. అతని పెదవులు హసించాయి.
"మీ నవ్వు మొగవాళ్ళను సైతం వెర్రివాళ్ళని చేస్తుంది. అప్పట్నుంచీ మీతో స్నేహం చెయ్యాలనీ, మీ ప్రక్కన తిరగాలనీ కుతివుండేది."
"మరి నేను చెడ్డవాడిని తెలుసా?"
"ఎవరన్నారు?"
"నేనుతప్ప అంతా అలానే అనుకుంటున్నారు. నేనెక్కడికి పోయినా ప్రజలు వేలెత్తి చూపిస్తున్నారు. లెక్చరర్లు సైతం నేనంటే ద్వేషభావంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు."
"నిజమే అది. కాని నేనుమాత్రం అలా అనుకోవటల్లా."
"ఏమలా?"
"నేను ఎలావుండాలని అనుకుంటానో - అచ్చం అలా మీరున్నారు."
చక్రపాణి వులిక్కిపడ్డాడు. "వద్దు వద్దు. నువ్వలా మాట్లాడకూడదు" అన్నాడు.
"ఏం?
"నువ్వు నాకు పూర్తిగా వ్యతిరేకంగా వున్నావనే నువ్వంటే నాకు ఇష్టం. అది భగ్నం చేయకు."
ఆ కుర్రవాడు బిక్కమొహం వేసి "నా కర్థంకాలా. నన్ను గురించి ఏమనుకున్నారేమిటి?" అన్నాడు.
దీనికి చక్రపాణి జవాబు చెప్పడానికి సిద్ధపడేలోగా అక్కడికి బేరర్ వచ్చాడు.
"ఏం తీసుకుందాం?" అన్నాడు.
టీకి ఆర్డర్ చేసి చక్రపాణి చెప్పనుపక్రమించాడు: "ఏం అనుకున్నానా నీ గురించి? నిర్మలంగా జీవితం గడపడంలో నేర్పరిపని, దుర్వ్యసనాలు దరిరానీయని ఆత్మశుద్ధిగలవాడివని, తల్లిదండ్రులు గర్వించగల సుపుత్రుడవని, నిగ్రహంగల బుద్ధిశాలివని, వృధాకోరికలు పెంచుకోని నీతిపరుడివని."
"నీతిపరుడు" అంటూ అస్పష్టంగా గొణిగాడు కుర్రవాడు. "అవును. అప్రయోజకులందరూ నీతిపరులే."
చక్రపాణి అదిరిపడి అయోమయంగా చూశాడు.
"అవును. వినండి చెబుతా నన్నుగురించి. మీముందు నేను సిగ్గుపడను. మీరు అనుకున్నట్లు బుద్ధిమంతుడిని కాను. ఒంటరిగా కూర్చుని ఎంత అసహ్యంగా, నీచంగా ఆలోచిస్తానో మీకేం తెలుసు? ఆడవాళ్ళను గురించి ఎడ తెరిపిలేకుండా ఆలోచిస్తాను. వాళ్ళను నా చేతుల్లో ఊహించుకుని... వికృతంగా, కోరికలతో మండిపోతూ - అబ్బ! ఆ అవస్థ వర్ణించలేను. కాని నా కెట్లా లభిస్తుంది అనుభవం? నేను ఒట్టి పిరికివాణ్ణి, అసమర్ధుణ్ణి. ఎన్నోసార్లు 'అక్కడి'దాకా వెళ్ళా. గుండె గబగబ అల్లాడేది. రక్తం చల్లబడేది. ముచ్చెమటలు పోసేవి. ఇంటికి వచ్చిన చుట్టాలకోసం ఎన్నో విధాల ప్రయత్నించా. ఒకరిద్దరు తిరస్కరించి గడ్డిపెట్టారు. ఒకరిద్దరు అంగీకరించినా ఏవీ అవకాశాలు? అవకాశాలు మనకోసం సృష్టించబడటం తక్కువ. మనమే వెతుక్కోవటం ఎక్కువ. ఆ ధైర్యం, చాకచక్యం నాకులేవు. నిజమే అనుకుంటారు నా గురించి మా ఇంట్లో 'మా మోహన్ చాలా బుద్ధిమంతుడు. వాడికేం? అని. దీని కీలకం నా ఆత్మనిగ్రహం కాదనీ, పరోక్షంగా ఇతరులు పెట్టిన భిక్ష అనీ వాళ్ళకేం తెలుసు? ఏమీచేతగాక నేను బుద్ధిమంతుడి క్రింద చలామణీ అవుతున్నానని వాళ్ళెట్లా ఊహించగలరు? అందుకనే మిమ్మల్నిచూస్తే నా కారాధన. మీరు కావాలనుకున్నది చెయ్యగలరు. నేనో...?
కుర్రాడు ఆగాడు. అతని కోమలమైన ముఖంమీద ఉబుకుతోన్న భావాల ఉద్రేకానికి ఎర్రగా రంగు వ్యాపించింది. పల్చటి పెదాలు మృదువుగా వణుకుతున్నాయి. ఉన్నట్లుండి అతని కన్నులలో ఓ విచిత్రమైన మెరుపు గోచరించింది. అప్పటికప్పుడు చేసుకున్న ఓ వెకిలి దృఢనిశ్చయం దృగ్గోచరమైంది. ఆ మెరుపులో గట్టిగా చక్రపాణి చెయ్యి పట్టుకున్నాడు . "మీరు నాకు..." అంటూ ఏదో చెప్పటానికి సిద్ధపడ్డాడు.
"వద్దు!" అంటూ అరిచాడు పాణి కంగారుగా. "నువ్వు చెప్పబోయేది నాకు తెలుసు. ఆమాట నీ నోటినుంచి బయటకు రానియ్యబోకు . నాయనా మోహన్! నీకంటే నేను అట్టే పెద్దవాణ్ణి కాకపోవచ్చుగాని ఓ పుత్రవాత్సల్యం ఇనుమడిస్తోంది నాకు నువ్వంటే. అలాంటివి కావాలనుకోకు. ఇదేమిటి నన్ను ఓ విచిత్రమైన పరిస్థితిలో పడేశావ్! రేపటి నుంచి నిన్ను చూస్తే భయం వేసేటట్లు చెయ్యబోకు."
ఆ కుర్రాడు దుఃఖం ఆపుకుంటూ "మీ ముందు బయటపడిపోయాను. మీరు ఇప్పుడు నన్ను అసహ్యించుకుంటున్నారా?" అన్నాడు.
"ఉఁహుఁ! నేను ఎవర్నీ పూర్తిగా అసహ్యించుకోలేను. అయినా ఆ అర్హతకూడా నాకు లేదు."
టీ వచ్చింది. తాగి ఇద్దరూ బయటకు వచ్చారు. కుర్రాడు తనలో తాను కుమిలిపోతున్నట్లుగా వున్నది.
11
మొదటి సంవత్సరం పరీక్షలు రాసి వూరికి తిరిగివచ్చాడు రాజారావు. వచ్చేముందు చక్రపాణిని కలుసుకున్నాడు. రెండేరోజులు ఇద్దరూ కలిసి తిరిగారు. పాణి అతన్ని మంజువాణి గురించి అడిగాడు. రాజారావు ముఖంమీద శరత్కాలంలోని చార ఒకటి తాండవమాడినది. అతను వివరంగా చెప్పలేకపోయాడు. చివరకు "నాకు ఎక్కడో వంచన జరిగింది... అయినా, నా హృదయంలో సానుభూతికి లోటులేదు" అన్నాడు.
ఆమె చరిత్ర విని పాణి నిట్టూర్చి "ఓసారి నాకామెను చూడాలని వుంది" అన్నాడు.
"ఎందుకు?"
"అలాంటివాళ్ళ మనస్తతత్వాలని పరిశీలించాలంటే - నాకు చాలా కుతూహలం."
"నీ గురించి ఆమెకు తెలుసు?"
"ఎలా?"
"నేను వర్ణించాను నీ గురించి, 'నాకో అద్భుతమైన స్నేహితుడున్నాడని. నేనేమైనా కొంటెపనులు చేసినప్పుడు 'మీ పాణికి చెబుతానుండండి' అనేది."
"చెబితే నేనేం చేస్తానట?"
"వద్దని వారిస్తావట."