Previous Page Next Page 
గోరింటాకు పేజి 35


    "అబ్బ... మంజువాణి!"

 

    అంత గొప్ప మంజువాణిని తెచ్చి ఏదో అజ్ఞాతశక్తి తనపాల పడవేసింది. చక్రపాణి సున్నిత మనస్కుడు. అతను అయితే తాకలేకపోయేవాడామెను. కన్నెత్తి చూడలేకపోయేవాడు. విరోధి హృదయంలో దయలాంటిది ఆమె... ఉఁహుఁ, కాదు, ప్రాణమిత్రుడి ప్రాణంలో పగలాంటిది ఆమె. ఉఁహుఁ... అదీకాదు. సూర్యకిరణంలో తారళ్యం... ఆమె. చంద్రరేఖలోని తారుణ్యం ఆమె. జారిపడిన చుక్క వెదజల్లే ధవళిమ.

 

    ఆమె, ఆ మూర్తి!

 

    "అలాంటి పవిత్రరత్నాన్ని, ఆ మణిమయ వైదగ్ధ్యాన్ని ఎలా స్పృశించగలిగావురా రాజారావూ! ఒరే పాపీ!"

 

    "ఆమె సృష్టించిన అపూర్వక్షణం అలాంటిది. అందులో కరిగి పరవశం చెందిన నేను దాసోహం అన్నాను."

 

    "ఆ క్షణం నువ్వు సృష్టించినదే కావచ్చుగా? నాలుగుగోడల మధ్య జీవించే ఆ సుకుమారి హృదయంలో విషబీజాలు నాటి, ఆమె వాతావరణాన్ని కలుషితంచేసి, ఆమె గుండెను ఆరని కుంపటిచేసి, ఆమె నీడను మరింత నల్లగాచేసి, పారిపోయివచ్చిన వో దుర్మార్గుడా! ఈ పాపంలో నీకు వాటాలేదా?"

 

    రాజారావు కళ్ళలో నీళ్ళుతిరిగాయి. దీన్నేనా సంఘం వ్యభిచారం అంటుంది? ఆ పేరు విన్నప్పుడు కలిగే ఆ భయంకరభావం, గగుర్పాటు లేవే ఇక్కడ?

 

    ఎందుకంటే ఇది ఓ బంగారుతొడుగు. రంగుటద్దాలలోంచి చూసుకున్న దృశ్యం. మనుషుల గొప్పదనం.

 

    అతనికి బాధ కలిగింది. ఆమెమీద జాలికలిగింది. ఇంతటి కఠినాత్ముడా తను? పైగా ఆమె సాన్నిధ్యంలో తృప్తిపడక ఏదో అసూయ రేపుకున్నాడు తనలో. అర్థంలేని అధికారం చెలాయించాలని చూశాడు. ఛీ! స్వార్ధపరుడు తను. అహంకారి తను!

 

                                                               * * *

 

    "పోనీ సత్యవతిని పెళ్ళి చేసుకుంటే?" అనుకున్నాడు రాజారావు.

 

    ఎవరిస్తారు తనకింకా ఆ పిల్లను? అది కొంతవరకు ప్రాయశ్చిత్తం అవుతుంది. నిజమే కాని ఆమెకుమాత్రం అభిమానం వుండదా? "ఎప్పుడైనా నీ మనస్సు మారితే కాస్త కబురుచెయ్యి బావా!" అంది ఆ రాత్రి. కాని ఆ సన్నివేశం వేరు. తను అందులోని మాధుర్యాన్ని మలినపర్చుకున్నాడు. అదీ లాభంలేదు. తనకు పెళ్ళెందుకిక? "అసలు తెలియకడుగుతాగాని, పెళ్ళి మనిషికి అంత అవసరమా ఏమిటి?"    

     

    కాని జీవితానికి ఏదో ఒక అవసరంవుంది. అది ఏమిటి? ఎక్కడ వుంటుంది? ఎలా వుంటుంది?

 

    రాజారావుకు భయంవేసింది.

 

                                             * * *

 

    అయోమయ గాఢాంధకార జీవితంలో ఒక చల్లని స్పర్శ. మధుర మనోహర వీచిక సౌదామినితో సాంగత్యం.

 

    భూమ్మీద సౌదామినిలాంటి వ్యక్తులు నివసించకుంటే భగ్న హృదయులు చితికి ఛిద్రమైపోయేవారు మరింత. నరకమంటే అప్పుడు!

 

    పవనవీచికలోని పరిమళం ఆమె వాగ్ధారలోని సౌజన్యం. మంజు కుసుమామృతంలోని మార్దవం ఆమె అమాయకత్వంలోని సౌందర్యం.

 

    అలాంటి... అలాంటి సౌదామిని సాహచర్యంలో ఆమెతోటి ప్రపంచ పరిశీలనలో కొంచెం... కొంచెం సేదతీరినట్లు కనిపించాడు రాజారావు. ఓ విషాద విలాప గతజీవి.     

 

                                                10

 

    చక్రపాణి కాలేజీలో ఎప్పుడూ ఓ కుర్రాణ్ని చూస్తుండేవాడు. అతనిపేరు మోహన్. మూర్తీభవించిన అమాయకత్వంలా సౌమ్యంగా వుండేవాడు. అతని కళ్ళల్లో ఓ ముగ్ధత్వముండేది. అతనికి కాలేజీకి వస్తూపోతూ వుండటంకన్న వేరే వ్యాపకాలు వున్నట్లు కనబడలేదు. చక్రపాణికి అతన్నిచూస్తే ఆశ్చర్యంగా, ముచ్చటగా వుండేది. అతను ఎంత బుద్ధిమంతుడు! అంత మంచిగా ఎలా వుండగలిగాడు? అతన్తో మాట్లాడదామనీ, అతన్ని గురించి తెలుసుకోవాలనీ ఉవ్విళ్ళూరుతూ వుండేవాడు.  

 

    ఓ సాయంత్రం కాలేజీ అయిపోయాక - అతని దగ్గరకు వెళ్ళి భుజంమీద చెయ్యి వేశాడు పాణి. అతను తలఎత్తి సిగ్గుపడుతూ పాణి కళ్ళల్లోకి చూశాడు.

 

    "నీ పేరు మోహన్ కదూ!" అన్నాడు పాణి.

 

    అతను లజ్జితుడై "అవును. మీరు చక్రపాణిగారుకదూ!" అన్నాడు.

 

    చక్రపాణి తల ఊపి "మీ ఇంట్లో ఏమయినా పని వుందా? లేకపోతే అలా సరదాగా షికారుపోయి రావటానికి వీలుంటుందా?" అన్నాడు.

 

    "పనేంలేదు. పదండి" అన్నాడా కుర్రాడు ఉత్సాహంగా.

 

    "ఎటువైపు పోదామంటావు? బంజారాహిల్స్ వైపు పోదామా? యేం ?"

 

    "ఊఁ" అన్నాడు అబ్బాయి.

 

    ఇద్దరూ వీధిలోకి వచ్చారు. టాక్సీస్టాండ్ వైపు పోతూంటే జేబులో డబ్బు అట్టే లేకపోవడంవల్ల గాబోలు - మోహన్ మొహమాటపడసాగాడు. చక్రపాణి గ్రహించి, ఆప్యాయంగా భుజంమీద చెయ్యివేసి నొక్కాడు.

 

    టాక్సీ బంజారాహిల్స్ వైపు పోతూంటే ఇద్దరూ మౌనంగా ప్రకృతి దృశ్యాలను తిలకిస్తూ ఊరుకున్నారు.

 

    "ఏదో ఇంగ్లీషు పిక్చర్లో దృశ్యంలా మనోహరంగా ఉందికదూ!" అన్నాడు కొంచెం ఆగి పాణి.

 

    నిజమే అది. ఆ కొండలు, లోయలు లోయల్లోనూ కొండలమీదా ఎత్తయిన సుందర భవనాలు మనోజ్ఞంగా ఓ పాశ్చాత్య దేశంలోని వాతావరణంలా వుంది.

 

    టాక్సీ రాక్ కేసిల్ హోటలుముందాగింది. ముందువున్న హాలు, గదులుదాటి, వెనక విశాలంగావున్న ఆరుబయలు ప్రదేశంలో ఓ టేబిలు దగ్గరకుపోయి కూర్చున్నాడు. దిగువున రంగురంగుల గార్డెన్స్, చిన్నచిన్న కొండలూ - ఇక్కడ దృశ్యం మరింత రాణిస్తోంది. దూరంగా మరో టేబిలు దగ్గర ఓ ఆంగ్లో ఇండియన్ కుటుంబం సంతోషంతో కేరింతలు కొడుతోంది.   

 

    "నేను ఇక్కడకు రావడం ఇదే మొదటిసారి" అన్నాడు మోహన్ చిన్నగా.

 

    "నీకాశ్చర్యంగా వుందా?" అన్నాడు పాణి అతని మాటకు జవాబు చెప్పకుండా, పరిచయం లేకపోయినా ఇక్కడకు తీసుకొచ్చినందుకు.

 

    "లేదు. నాకాశ్చర్యంలేదు" అన్నాడు కుర్రాడు. "కొంచెంకూడా లేదు. జరగాల్సిందేదో జరుగుతున్నట్లుగా వుంది."

 

    "ఎందుచేత?" అన్నాడు చక్రపాణి ఆశ్చర్యపడుతూ.

 Previous Page Next Page