ఆ కంపెనీలో పనిచేసే ఒక యువకుడికి పెళ్ళయింది. అతను పెళ్ళయిన దగ్గర్నించి రోజూ ఆఫీసుకి ఆలస్యంగా వచ్చేవాడు.
జాన్సన్ బ్రదర్స్ లో ఒకరు అది కనిపెట్టి ఓరోజు అడిగాడు- లేటుగా రావడానికి కారణమేమిటని? అందుకు అతను నసుగుతూ- నా భార్యకు వంట చేయడంరాదు. కనీసం బ్రెడ్ కట్ చేయటం, వాటికి వెన్న రాయడం, టోస్ట్ చేయడం, రెడీ ఈటబుల్ టైంస్ ఓపెన్ చేయడం కూడా రాదు. ఆమె బాగా సంపన్నవంతులైన కుటుంబం నుంచి వచ్చింది. నేను మిడిల్ క్లాస్ కి చెందినవాడ్ని. ఇద్దరం ప్రేమించి పెళ్ళి చేసుకున్నాం. ఆమె నాకు మంచి ఆహారం పెట్టాలనే ఆరాటంలో చేతివేళ్ళు, చేతులు వంటఇంటి కత్తులతో, కేన్ ఓపెనర్స్ తో, ఇతర వంటింటి పరికరాలతో కోసుకుంటోంది. ఆ గాట్లకు దెబ్బలకు ట్రీట్ మెంట్ ఇప్పించడంలో లేటయిపోతోంది- అని నొచ్చుకుంటూ అలాంటి చిన్న చిన్న గాయాల్ని ట్రీట్ చేయడానికి డాక్టర్స్ దగ్గరకు వెళ్ళక్కర్లేని మందేదయినా లభిస్తే బావుండని మాట వరసకు అన్నాడు. అంతే... అతని బాధలోని సలహాని రాబర్ట్ జాన్సన్ క్యాచ్ చేశాడు.
వెంటనే ఎవరికి వారే తేలిగ్గా తమ దెబ్బలకు, గాయాలకు బేండేజ్ వేసుకోగల వస్తువుకోసం పరిశోధన ప్రారంభించాడు.
దాని ఫలితమే 'రెడీమేడ్ ఎడిసివ్ బేండేజ్' చిన్న పిల్లలు కూడా వుపయోగించగలిగేట్టు మెడికేటెడ్ డ్రెస్సింగ్ బేండ్- ఎయిడ్ స్టాండర్ట్ సీవ్ (పట్టీ) కనుక్కోగలిగారు జాన్సన్ బ్రదర్స్. అంతే- రాత్రికి రాత్రే కోటీశ్వరులై పోయారు వాళ్ళు.
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా బేండ్ ఎయిడ్ అనూహ్యంగా అమ్ముడయి పోతోంది.
అమెరికాకి చెందిన ఆ కంపెనీ పర్మిషన్ తోనే ఇండియాలో- బొంబాయి నగరంలో జాన్సన్ అండ్ జాన్సన్ లిమిటెడ్ అనే కంపెనీ ఆ బేండేజ్- ఎయిడ్ మెడికేటెడ్ పేడ్ ని ఉత్పత్తి చేసుకొని అమ్ముకొనేందుకు అనుమతి పొందారు. 1.9 సెం.మీ పొడవు, 7.2 సెం.మీ వెడల్పుగల ఆ చిన్న పట్టీ కొన్నివందల కోట్లు ఆర్జించి పెట్టింది ఆ కంపెనీకి. ఈ కంపెనీ బ్రాండ్ ట్రేడ్ మార్క్ వాడుకుంటూ ఎన్నో ఇతర దేశాల కంపెనీలు కూడా ఈనాడు కోట్లు ఆర్జిస్తున్నాయి.
మార్కెట్ లో దొరుకుతుంది- వీలైతే ఒక పట్టీ కొనిచూడు... దాని మీద BAND-AID అని పెద్ద అక్షరాలతో, ఆ పైన చిన్నసైజులో 'R అనే అక్షరం సర్కిల్ లో వుంటుంది. ఆ క్రిందే జాన్సన్ అండ్ జాన్సన్ అని వుంటుంది. ఆ క్రింద ట్రేడ్ మార్క్స్ ఆఫ్ జాన్సన్ అండ్ జాన్సన్, యు.ఎస్.ఏ. అని వుంటుంది-" ఆమె చెప్పడం ఆపింది.
ఎంత అద్భుతమైన ఆలోచన...?!! చిన్న ఆలోచన, కొద్దిపాటి పరిశోధనా... కోట్లు ఆర్జించి పెట్టింది...! త్రినాధ్ లో అంతకంతకు పట్టుదల పెరుగుతోంది! ఏదో ఒకటి ఎవరూ కనిపెట్టని వస్తువును కనిపెట్టాలనే తపన పరవళ్ళు త్రొక్కుతోంది.
"ఎప్పుడైనా సరే ఎవరైతే అసంఖ్యాక జనబాహుళ్యానికి అత్యవసరమైన అవసరాన్ని కనిపెట్టి దాన్ని పరిష్కరించగల వస్తువును తయారు చేయగలరో వారే వ్యాపారపరంగా అత్యున్నత స్థాయికి వెళ్ళగలిగేది.
నీవు కాసిన పందెంలో నీవు నెగ్గాలంటే ఇలాంటిదేదో నీవు శోధించాలి. లేదంటే కేవలం నాలుగేళ్ళలో చట్టం వేరు, న్యాయం వేరు అని మాత్రమే సంపాదించగలవు. ఆ సంపాదనలో మోసం దాగుంటుంది. అప్పుడు పందెపు నిబంధనలను నీవు అతిక్రమించినట్లవుతుంది... ఆలోచించు... మనిషికి మెదడు వుంది ఆలోచించటానికే. ఆ మెదడు చాలామందికి జారిపోయి మోకాళ్ళలో సెటిల్ అవుతుంది..." అంటూ ఆమె లేచింది ఇక వస్తానంటూ.
జీప్ కాలేజీవేపు బయలుదేరింది.
సరిగ్గా అదే రోడ్ లో, అదే టైమ్ లో త్రినాధ్ జీప్ ని ప్రియాంక కారు ఓవర్ టేక్ చేయబోతోంది.
త్రినాధ్ కావాలనే జీప్ ని వంకరగా నడుపుతూ ప్రియాంక ఓవర్ టేక్ ని నిరోధించసాగాడు.
కావాలనే త్రినాధ్ తనను ఏడిపిస్తున్నాడని ప్రియాంక గ్రహించగానే ఆమెలో ఉక్రోషం బుసలు కొట్టింది. మాలిని ఆ వ్యవహారాన్ని గ్రహించి గమనించనట్టే వుండిపోయింది. కాలేజీ గేటు ముందు త్రినాధ్ జీప్ ముందుగా ఆగింది. మాలిని జీప్ దిగేసి వడివడిగా కాలేజీలోకి వెళ్ళిపోయింది.
త్రినాధ్ జీప్ ని దాటనిచ్చి, తన కారును ఆపి జీప్ దగ్గరకు వచ్చింది ప్రియాంక.
"చట్ట ప్రకారం నా ఓవర్ టేక్ ని అడ్డుకోవటం నేరం. అత్యవసరమైన పనులుండి వేగంగా వెళ్ళాలనుకొనే వెహికల్ కి దారి ఇవ్వకపోవటం అన్యాయం" అంది ఒకింత నిర్లక్ష్యంగా.
"ఇండియన్ మేడ్ లైట్ వెహికల్స్ కే నీవంటున్న చట్టం వర్తిస్తుంది. ఇకపోతే స్టూడెంట్స్ కన్నా లెక్చరర్స్ కే టైమ్ విలువ ఎక్కువ. నా జీప్ లో లెక్చరర్ వున్నారు..." అన్నాడు నింపాదిగా.
ఆమెకు అతనన్న మొదటి వాక్యం అర్ధం కాలేదు.
అర్ధం కాలేదన్న విషయాన్ని అతను చప్పున గ్రహించాడు.
"ఇండియన్ మేడ్ లైట్ వెహికల్స్ అంబాసిడర్, ప్రీమియర్, స్టాండర్డ్, మహేంద్ర జీప్. వీటి వెడల్పు తక్కువ. అందుకే మన రోడ్లు ఇరుకుగా వుంటాయి. ఇప్పుడు మనం వచ్చిన రోడ్ లో లైట్ వెహికల్స్ మాత్రమే ప్రయాణించాలి. అది ట్రాఫిక్ వింగ్ రూల్. నీ కారు విదేశానికి చెందింది. పైగా లగ్జరీ కారు. దాని వెడల్పు ఇండియన్ కార్సుకన్నా ఎక్కువ. అలాంటప్పుడు నీకు ఓవర్ టేక్ చేసే హక్కులేదు. చట్టాన్ని కదిలించకు" చిరునవ్వుతోనే అన్నాడు జీప్ లోకి ఎక్కి కూర్చుంటూ త్రినాధ్.
అతను వెళ్ళబోతున్నాడు.
ఆమెకు ఆతృతగా వుంది.
ఏదో ఒకటి అతన్ని హేళన చేసే మాటనాలి... ఏమిటి...?
"అప్పుడే నాలుగు నెలలు పూర్తవబోతున్నాయి. 1460 రోజుల్లో 120 రోజులు నీచేతినుంచి జారిపోయాయి. ఇక మిగిలింది 1340 రోజులు మాత్రమే. వేష భాషల్లో మార్పు కోట్లు ఆర్జించి పెట్టదని గుర్తించు. ఛా... ఛా... నేనేదో సరదా పడ్డాను. ఈ నాలుగు సంవత్సరాలు థ్రిల్లింగ్ గా గడిచిపోతాయని. నో థ్రిల్లింగ్ మూమెంట్ ఫ్రమ్ యువర్ సైడ్... దెబ్బకు దెబ్బ... ఎత్తుకు ఎత్తు... అలా వుండాలి ఛాలెంజ్ అంటే. ఈ పందెమే ఏ పౌరుషమున్నవాడితోనో, పట్టుదల వున్నవాడితోనో కాసుంటే బావుండేదన్న ఆలోచన వచ్చేలా చేస్తున్నావ్. వెరీబాడ్" అంది తన అందమైన కనుబొమ్మల్ని వంకరగా కదిలిస్తూ.
"అసలు యుద్ధం ఇప్పుడే ఆరంభం కాబోతోంది బ్యూటీ. ఇంతకుముందే నీ ఓవర్ టేక్ ని ప్రతిఘటించాను సింపుల్ గా. ఇప్పుడిక నీ రిచ్ నెస్, ప్రోగ్రెస్ ని నేను ఓవర్ టేక్ చేయబోతున్నాను. అదీ ఇండియన్ వెహికిల్ తో, ఇండియన్ బ్రెయిన్ తో".
"ఉందా అసలు...?"
"ఏమిటి?"
"బ్రెయిన్..."
కోపంతో అతని వేళ్ళు స్టీరింగ్ మీద బిగుసుకుపోయాయి.
"ఉంది. అది నీ మోసంతో, అవమానంతో పదునెక్కింది. పగబట్టింది. పదునుగా పనిచేయబోతోంది. నా మెదడు పనిచేయటం ప్రారంభం కాబోతున్న ఆ క్షణం నుంచే నీ తండ్రి మెదడు, నీ మెదడు బ్రెయిన్ ట్యూమర్ కు గురికాబడతాయి. థ్రిల్లింగ్ కదా నీక్కావలసింది? ఇకనుంచి నేను వేసే ప్రతి అడుగు, ఎత్తు, నీకు, నీ అబ్బకు గొప్ప థ్రిల్లింగ్ నిస్తాయి. సిద్ధంగా వుండు" అంటూ ఆవేశంగా జీప్ ని ముందుకు దూకించాడు.
* * * *
వసుంధరా ఇండస్ట్రీస్ కంపెనీ చట్టం క్రింద రిజిస్టర్ అయిపోయింది. ఉద్యోగుల నుంచి కలెక్ట్ చేసిన 6,80,000 డిపాజిట్స్ కు ఛటర్జీ తన భార్య ద్వారా బ్యాంక్ గ్యారంటీ ఇప్పించాడు.
20 మంది ఉద్యోగులు ప్రతిరోజూ ఆఫీస్ కు రావటం ప్రారంభమయింది.
అయితే ఆ ఇరవైమందికి తమకు ఉద్యోగం వచ్చింది. తమ డిపాజిట్స్ కి గ్యారంటీ లభిస్తుందన్న ఆనందంతోపాటు ఏ పనీ లేకుండా కూర్చోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
వసుంధరా ఇండస్ట్రీస్ ఆఫీస్ సిబ్బందితో ప్రారంభమయిన రోజు ఉదయం పదిగంటలకు బ్యాంక్ కు వెళ్ళాడు త్రినాధ్. అక్కడి నుండి సరాసరి సిటీ సివిల్ కోర్టుకి వెళ్ళాడు. కోర్టులో తను పూర్తి చేయవలసిన పనిని అరగంటలో ముగించుకొని ఆఫీస్ కి బయలుదేరాడు.
దారి పొడవునా అనంతమైన ఆలోచనలు అతన్ని చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరిచేస్తున్నాయి.
ఈ పందెమే ఏ పౌరుషమున్న వాడితోనో కాసుంటే బావుండన్న ప్రియాంక మాటలే అతన్ని ముల్లుల్లా గ్రుచ్చుతున్నాయి.
లక్షరూపాయల విలువ చేసే తన తెలివిని కేవలం రెండువేలకు అమ్ముకోవటం- ఆ రెండువేలు కూడా చేతికి దక్కక పోవటం- దక్కకపోగా ఘోరంగా అవమానింపబడటం, ఆ సంఘటన తాలూకు దృశ్యాలు కళ్ళముందు కదలాడుతూ అనుక్షణం బాధించటం అతనికి దుర్భరంగా వుంది.
తనకి పౌరుషం వుంది.
కసి, పగ, ప్రతీకారం వున్నాయి. తన వంటిమీద నాట్యం చేసిన సుదర్శనరావు చేతిలోని కొరడా దెబ్బ గుర్తుంది.
అవి తీర్చుకొని, తనో మనిషని నిరూపించుకోవాల్సిన సమయం క్రమంగా కరిగిపోతోంది.
లాభం లేదు. కాలానికి కళ్ళెం వేయాలి. శబ్దానికన్నా రెండు రెట్లు వేగంగా ప్రయాణించే కాంకర్డ్ విమానంలా తను ఉద్యమించాలి తప్పదు.
ఆఫీసులోకి ఎంటర్ అవుతూనే ఒక మేనేజర్ ని పిలిచాడు.
"వెంటనే స్మాల్ స్కేల్ లైసెన్సింగ్ అధారిటీకి ఒక అప్లికేషన్ డ్రాప్టు చేయండి. మనం చేసే వ్యాపారం ఇంజనీర్ ని అడిగితే తెలుస్తుంది. క్విక్" అని ఆ మేనేజర్ ని పంపించేసి మరో మేనేజర్ ని పిలిపించాడు.
"జెకొస్లవేకియా నుంచి మనం ఓ యంత్రాన్ని తెప్పించుకోవాలి. దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తిచేయండి" అంటూ అతన్ని పంపిచేసి మరో మేనేజర్ ని పిలిపించాడు.
"తక్కువ అద్దెకు మనకో షెడ్, కొంత ఖాళీ స్థలం కావాలి. వెంటనే ప్రయత్నించండి." త్రినాధ్ మాటలు పూర్తవుతుండగా బోస్ గదిలోకి వచ్చాడు.
ఆ మేనేజర్ ని పంపించేసి బోస వేపు చూశాడు త్రినాధ్. అతని ముఖం ప్రశాంతంగా వుంది. ఎప్పుడూ ఏదో ఒక గొడవతో అగ్నిగోళాల్లా మండిపోయే అతని కళ్ళు ఇప్పుడు ప్రశాంతంగా వున్నాయి.
"బావున్నావా?" అన్నట్టు చిరునవ్వుతో పలకరించాడు త్రినాధ్.
గతంలో ఏ తప్పుచేసినా... ఏంచేస్తే... ఏంటంట అని పొగరుమోతుగా కనిపించే బోస్ లో ఇప్పుడు గిల్టీనెస్ కనబడుతోంది.
బోస్ విషయంలో అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన త్రినాధ్ సీట్లోంచి లేచి, అతని వద్దకువెళ్ళి ఆప్యాయంగా అతని భుజాన్ని తడుతూ "ఏం బోస్... అమ్మా, నాన్న బావున్నారా?" అన్నాడు.
అతను మౌనంగా బావున్నారన్నట్టు తలూపాడు.
"ఇప్పుడేం చేయాలనుకుంటున్నావ్? చదువు పూర్తిచేస్తావా?" బోస్ అంతరంగాన్ని పసిగట్టేందుకే ఆ ప్రశ్న వేశాడు త్రినాధ్.
"అమ్మ బయట కూర్చునుంది" అన్నాడు మెల్లగా బోస్.
త్రినాధ్ ఓ క్షణం ఆశ్చర్యపోయి, హాల్లోకి వెళ్ళి ఆమెను సాదరంగా లోపలకు తీసుకొచ్చాడు.
"వాడు నీతో చెప్పటానికి సిగ్గుపడుతున్నాడు బాబు, వాడికిక చదువుకోవాలని లేదు. నీతోనే కల్సి పనిచేస్తానంటున్నాడు. నాకూ నా కొడుకును నీ చేతిలోనే పెట్టాలని వుంది. నా కంటి దీపాన్ని మిగిల్చి, నాకు కడుపుకోత లేకుండా చేసి పుణ్యం కట్టుకున్నావ్. వాడ్నో పరిపూర్ణమైన వ్యక్తిత్వమున్న మనిషిగా తీర్చిదిద్దగల బాధ్యతను కూడా నీ చేతుల్లోనే పెడుతున్నాను. ఇది స్వార్ధమే కాని కన్నతల్లిగా నా కొడుకు అభివృద్ధిలోకి వస్తే చూసి ఆనందించాలన్న చిన్న స్వార్ధమే బాబు నాది. నీ మీదే ఎంతో ఆశపెట్టుకుని వాడ్ని నీ దగ్గరకు తీసుకొచ్చాను" అనంటుంటే ఆమె కళ్ళు తడిదేరాయి.