Previous Page Next Page 
మరోమనసు కథ పేజి 35

                                                 23
   
    మరుసటి రోజు ఉదయం-
   
    ఏడు గంటలు దాటింది-
   
    డాక్టర్ హేమచంద్ర నర్సింగ్ హోంలో, పదమూడవనంబరు గదిలో మురళీకృష్ణ ఇంకా నిద్రపోతూనే వున్నాడు.
   
    సుధ లేచింది. ముఖం కడుక్కొని బొట్టు పెట్టుకొంది. భర్త మంచం పక్కగా కుర్చీ లాక్కుని కూర్చుంది.
   
    పదకొండు కొడుతుండగా విమల కాఫీప్లాస్కూ, కప్పు సాసర్లూ, ప్లాస్టిక్ బుట్టలో పట్టుకొచ్చింది.
   
    "బావగారింకా నిద్రలేచినట్టులేదే?" విమల తను తెచ్చిన సామాను టేబుల్ మీద సర్దిపెడుతూ అడిగింది.
   
    "లేదు విమ్మీ! రాత్రి మీరు వెళ్ళిపోయినప్పటినుంచీ ఇలాగే వళ్ళు మరిచి నిద్రపోతున్నారు!"
   
    "నిన్న వాళ్ళిచ్చిన ఇంజక్షనూ, ట్రీట్ మెంట్ ఎఫెక్టు అనుకొంటాను" అంది విమల ఫ్లాస్కులోని కాఫీ ఒక కప్పులోకి వంపుతూ.
   
    "కాస్త ఆగరాదూ విమ్మీ! మీ బావగారు లేచాక ఒక్కసారే తాగవచ్చుగా?" అంది సుధ.
   
    "ఎప్పుడు లేస్తారో ఏమో? ముందు నువ్వు తాగెయ్. రాత్రంతా మేలుకొనే ఉన్నట్టున్నావ్. కళ్ళుచూడు ఎలా లోతుకు పీక్కుపోయిఉన్నాయో?" విమల సుధకు కాఫీకప్పు అందించింది.
   
    "అక్కా నువ్వు కాఫీ తాగి ఇంటికెళ్ళిపో, స్నానంచేసి భోజనం చేశాక కాసేపు పడుకొని మధ్యాహ్నానికి రా! అంతవరకూ నేనుంటాను" సుధా పక్కనే కూర్చుని అంది విమల.
   
    "ఇప్పుడు తొందరేమొచ్చిందే వారిని లేవనీ?" కాఫీ తాగి కప్పు పక్కన పెడుతూ అంది సుధ.
   
    "నాన్నా అంకుల్ ఎప్పుడొస్తానన్నారూ?"
   
    "డాక్టర్ గారు తొమ్మిదింటికి రమ్మన్నారట ఇంటివద్దనుంచి ఫోన్ చేసి అడిగితే, ఎనిమిదిన్నర కంతా వచ్చేస్తామన్నారు."
   
    ఎనిమిది అయినా ఇంకా కృష్ణ నిద్రపోతూనే ఉన్నాడు.
   
    "వీరిమ్కా లేవలేదు. నిద్ర లేపొచ్చేమో డాక్టరుగారిని అడిగొస్తావా విమ్మీ?" అంది సుధ.
   
    "నిద్రపోనియ్ అక్కా ఎందుకు బలవంతంగా లేపడం, ఆయనకు ఎంతో విశ్రాంతి అవుసరం" విమల మాటలు పూర్తి కాకుండానే వాళ్ళిద్దరూ వచ్చారు.
   
    "ఏమ్మా సుధా ఎలా వున్నాడు మీ ఆయన?" వస్తూనే అడిగాడు విమల తండ్రి.
   
    "రాత్రినుంచి ఇలాగే నిద్రపోతున్నారు అంకుల్!"
   
    "పది పన్నెండు గంటలదాకా నిద్రపోవచ్చని డాక్టర్ నిన్ననే చెప్పారు. నిన్న ఇచ్చిన ఇంజక్షన్ ఎఫెక్టు పన్న్మేడునుంచి పద్నాలుగు గంటల వరకు ఉంటుందట."
   
    "అయితే అక్కా నువ్వింటికెళ్ళు. బావగారు లేచేసరికి ఉండాలనుకుంటే పదిన్నరా, పదకొండు కొచ్చెయ్" అంది విమల.
   
    "సుధా! నువ్వెళ్ళిరా మన కారు గేటుపక్కనే వుంది" విమల తండ్రి సుధను బలవంతంగా పంపించాడు.
   
    సుధను కారెక్కించి చౌదరీ,. మూర్తి డాక్టర్ ని కలవడానికి వెళ్ళారు.
   
    "గుడ్ మార్నింగ్."
   
    "గుడ్ మార్నింగ్."
   
    వరండాలోనే డాక్టర్ వాళ్ళకు ఎదురయ్యాడు. అతని వెనకే కన్సల్టింగ్ రూంలోకి వెళ్ళారు."
   
    "కృష్ణ ఎలా ఉన్నాడు?" రివాల్వింగ్ చైర్లో బరువైన దేహాన్ని పడేస్తూ అడిగాడు డాక్టర్.
   
    "ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు" రమణమూర్తి చెప్పాడు.
   
    "లెట్ హిమ్ స్లీప్! వియ్ షల్ నాట్ డిస్టర్బ్ హిమ్!" అంటూ పక్క రాక్ మీద ఉండిన ఫైల్సు అందుకొన్నాడు. అందులోంచి మురళీకృష్ణ అని రాసి వుండిన ఫైల్ ను తీసి ముందు పెట్టుకొన్నాడు. ఓ ఐదు నిముషాలు పైలు చదివి మూసి పక్కన పెట్టాడు. ఎదురుగా కూర్చుండిన ఇద్దరినీ చూస్తూ అర్ధయుక్తంగా నవ్వాడు.
   
    గొంతు సవరించుకొని "ఈ కేసు డ్యుయల్ పర్సనాలితీ కేసులా ఉంది. పూర్తిగా నిర్ధారణకు రావాలంటే ఇంకా కొంత సమాచారం సేకరించాలి, విశ్లేషణ జరగాలి" చెప్పాడు డాక్టర్.
   
    వాళ్ళిద్దరూ మొహమొహాలు చూసుకొన్నారు. తిరిగి డాక్టర్ కేసి ఉత్కంఠతో చూశారు.
   
    "జగన్మోహనరావు అనేవాడు కేవలం మురళీకృష్ణ ఊహల్లో రూపుదిద్దుకొనిన మనిషి అనేగా మీ ఉద్దేశ్యం?" అడిగాడు చౌదరి.
   
    "మీ ఇన్ ఫరిన్స్ కరెక్టుకాదు. జగన్మోహన్ రావు అనేవాడు ఉన్నాడు" హేమచంద్ర అన్నాడు.
   
    "మూర్తీ, చౌదరీ కుర్చీలలో అంతెత్తున ఎగిరిపడ్డారు.
   
    జగన్మోహన్ రావు అనే వ్యక్తి ఉన్నాడా? ఉంటే కృష్ణ చెప్పినదంతా నిజమేనా?
   
    కోడిపెట్టను తిని మందగమనం చేస్తున్న కొండశిలువలా ఓ పెద్ద సందేహం చౌదరి మెదడును చుట్టుకొంది.
   
    రమణమూర్తి ఇంత దుర్మార్గుడా?
   
    సరిగ్గా ఆ రెండేళ్ళూ తను విదేశాల్లో వున్నాడు. ఇక్కడేం జరిగిందో తనకు తెలియదు.
   
    రమణమూర్తి కేసి చూడాలంటే అతడికి చాలా ఇబ్బందిగా వుంది.
   
    "అంటే కృష్ణ చెప్పేదంతా నిజమేనన్నమాట" బొంగురుపోయిన కంఠంతో అన్నాడాయన.
   
    "చౌదరీసాబ్ మీరు మళ్ళీ పొరబడుతున్నారు. జగన్మోహన్ రావు వున్నాడంటే, వేరే రక్త మాంసాలతో మరో వ్యక్తి వున్నాడని కాదు. నా ఉద్దేశ్యం జగన్మోహన్ రావు అనే మరో వ్యక్తిత్వంకూడా కృష్ణలోనే ఉంది. మనకు కన్పించే ఈ మురళీకృష్ణ డ్యూయల్ పర్సనాలిటీ, అతనిలో మనకు తెలిసిన కృష్ణా, తెలియని జగన్మోహనరావూ వున్నారు__"
   
    "ఒక్క నిముషం డాక్టర్! నాదో సందేహం!" అన్నాడు మూర్తి కుర్చీలో కొంచెం ముందుకు వంగి డాక్టరు చంద్రను చూస్తూ.
   
    "ఊ! చెప్పండి!"
   
    "జగన్మోహన్ రావు-మురళీకృష్ణ-ఒకరికొకరు తెలుసా? అంటే ఈ రెండు వ్యక్తిత్వాలూ ఒకదానిని మరొకటి గుర్తిస్తూనే వుందా?"
   
    "ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాడు. అందువల్లనే మీకీ ప్రమాదం వచ్చిపడింది. ఇంతకాలం వాళ్ళిద్దరూ ఒకరిని మరొకరు ఎరగరు. మొన్నను మద్రాసులోనే కలుసుకున్నారు, మాట్లాడుకొన్నారు-"
   
    "డాక్టరు చంద్రా మీరు చెప్పేది నాకేం అర్ధంకావడంలేదు. నాబుర్ర తిరిగిపోతూంది కొంచెమాగండి" అన్నాడు చౌదరి.
   
    "మీకొచ్చిన కన్ ఫ్యూషన్ నాకర్ధమైంది. మద్రాసులో వాళ్ళిద్దరూ కలుసుకున్నారన్నానుకదూ? నా ఉద్దేశ్యం అలాటి వ్యక్తులిద్దరు కలుసుకున్నారనికాదు. ఒకే వ్యక్తిలో వున్న ఆ రెండు పర్సనాలిటీలు కలుసుకొన్నాయని చెప్పడమే నా ఉద్దేశ్యం. ఇప్పుడర్ధమైందనుకొంటాను" అతడికేసి సూటిగా చూశాడు డాక్టర్ చంద్ర.
   
    "ఇంతకాలం కలుసుకొని ఆ రెండు వ్యక్తిత్వాలూ మద్రాసులోనే న్దుకు కలుసుకొన్నట్టు?" నిట్టూర్పు విడిచాడు రమణమూర్తి.
   
    "సరిగ్గా అదే అంశాన్ని గురించి నేనాలోచిస్తున్నాను. మద్రాసులో మురళీకృష్ణ ఉన్న ఆమూడురోజుల్లో జరిగిన సంఘటనలు తెలుసుకోవాలి. అప్పుడే విశ్లేషణచేసి ఒక అభిప్రాయానికి రాగలం. కృష్ణ చెప్పేదానినిబట్టి అతను జగన్మోహన్రావుని మొదటిసారిగా రతన్ బజార్ సిల్క్ ప్యాలెస్ లో చూసినట్టు తేలుతూంది. జగన్మోహన్ పర్సనాలిటీ గుర్తించగలిగిన మనుషులెవరో కన్పించి వుండాలి. కృష్ణలో దాగివున్న జగన్మోహన్ బయటికొచ్చి వాళ్ళతో మాట్లాడి వుండాలి. అలా మాట్లాడి తనపాటికి తను, తన స్థానానికి తిరిగి వెళ్ళకుండా, కృష్ణతో తగాదాకు దిగివుంటాడు. తెల్లవారి విమానం ఎక్కేంతవరకూ వాళ్ళిద్దరూ ఘర్షణపడి వుంటారు. రతన్ బజార్లోని బయటికొచ్చిన జగన్మోహనరావు తెల్లవారేంతవరకూ కృష్ణని డామినేట్ చేసి వుండాలి."
   
    ఓ క్షణమాగాడు డాక్టర్ చంద్ర.
   
    వెంటనే మళ్ళీ సాలోచనగా ప్రారంభించాడు డాక్టర్__
   
    "ఆ సాయంకాలంనుంచీ తెల్లవారేదాకా జరిగిన సంఘటనలన్నీ మోనాను చూడటం, అడయార్ ఇంటికెళ్ళడం, హోటల్ రూమ్ ఖాళీచెయ్యడం, అంతా జగన్మోహన్ రావు పనే. మురళీకృష్ణ ప్రేక్షకుడిగానే ఉండి పోయాడు. కాని కృష్ణ తన స్థానాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినప్పుడే ఇద్దరిమధ్యా ఘర్షణ బయలుదేరింది. చివరకు జగన్మోహన్ ను తొక్కిపట్టి కృష్ణ బయటికొచ్చి తన స్థానాన్ని ఆక్రమించుకొన్నాడు." ఓ క్షణమాగి దూరంగా దేనినో చూస్తూండిపోయి, మళ్ళీ ప్రారంభించాడు డాక్టర్.
   
    "ఆ ఘర్షణలో తగిలిన మానసిక గాయాలు కృష్ణ మనసుకు నొప్పికలిగిస్తూనే వున్నాయి. వాటి దుష్పరిణామమే ఇదంతాను. కృష్ణ పర్సనాలిటీకి తగిలిన గాయాలు ముందు మానాలి. ఆ తర్వాత జగన్మోహన్ రావును శాశ్వతంగా బయటికి వెళ్ళగొట్టాలి. సైకోథెరపీలో ఉన్న సాధనాలనూ, ప్రక్రియలనూ, ఉపయోగించి దానిని సాధించాలి. విజయం పొందగలననే పూర్తి ఆత్మవిశ్వాసం నాకుంది. అందుకు మీకు నాకు పూర్తి సహకారాన్ని అందించాలి. ఈ జటిలమైన కేసులో విజయం సాధిస్తే అంతర్జాతీయ ఖ్యాతి పొందే అవకాశం నాకుంది. ఎందుకంటే, ఇలాంటి కాంప్లికేటెడ్ కేసులు మన దేశంలో చాలా తక్కువ. మా బాస్, ప్రొఫెసర్ భాటియా, ఆయన ముప్పయ్ ఐదేళ్ళ సర్వీసులో ఇలాటిది ఒకేఒక కేసు చూశానని చెప్పేవాడు."

 Previous Page Next Page