"నేను చాలా పిరికిదాన్నని మా బుచ్చికక్కి ఎప్పుడూ అంటుంది. నాకు ధైర్యం వుందని మీరనాల్సిందే" అంది అవంతి.
"ఆ రోజు" అంటూ ఇందర్ గబుక్కున ఆగాడు.
"ఏ రోజు" అవంతి అర్ధం చేసుకోక రెట్టించింది.
"అదే....ఆ రోజు....భద్రకాళి అవతారం ఎత్తి చాలా పరుషంగా మాట్లాడటం చూసి ఆశ్చర్యపోయాను. ఎంతో తెలివితేటలు వుంటే తప్ప ఫిరంగి గుళ్ళలా మాటలు వదలలేరు...."
"గతాన్ని తిరగ తోడవద్దని మరీ మరీ కోరాను"
"నిజమే అపర్ణా! నీవు ఒకటికి రెండు సార్లు అడిగేసరికి మాట ఎత్తక తప్పలేదు. గతాన్ని తిరగతోడను. నా మనసులో విషయం ఒక్కటి చెపుతాను. నీలో ధైర్యం తెలివితేటలు లేకకాదు. నిన్ను ఎవరో పిరికిగా తయారుచేశారు. ఆ పిరికితనం వల్ల అమాయకంగా మాట్లాడుతున్నావు. అంతే సానపట్టంది వజ్రం అయినా మెరవదు రాణించదు" అన్నాడు ఇందర్.
"రక్షించావ్ మహానుభావా. నీవు నన్ను ఈ విధంగా అర్ధం చేసుకోవడం కూడా నా అదృష్టం" అనుకున్న అవంతి మాట మారుస్తూ "నేను వంట నేర్చుకుంటాను" అంది.
"వంట నేర్చుకుని శాశ్వతంగా యిక్కడే వుంటావా! అదెలా కుదురుతుంది. నేనసలే పదివూళ్ళ పాపరాజుని. నా కెన్ని వ్యవహారాలూ ఏం కథ...." ఇందర్ ఆలోచనలు అలా సాగాయి.
"వంట నేర్చుకోవడం కష్టమా?" అవంతి మళ్ళీ అడిగింది.
"గొప్పింటి వాళ్ళకి అంత శ్రమ పనికిరాదు. అదృష్టవంతులు ఎక్కడికి వెళ్ళినా కష్టపడ కుందా నాలుగు వేళ్ళూ లోపలికి వెళతాయి"
"లోపలికా?"
"అంటే నోట్లోకి"
"ఓహో"
"చంద్ర త్వరగా వస్తే బాగుండును" కొద్దిసేపు ఆగి ఇందర్ అన్నాడు.
"నా ఖర్మ కాలితే అలాగే వస్తాడు" అనుకున్న అవంతి అమాయకంగా ముఖం పెట్టి అంది.
"ఎందుకు?"
"కంపెనీ పనిమీద వూరు వెళ్ళాల్సి వస్తే నేను వున్నఫళాన వెళ్ళిపోతాను. చంద్ర నాకన్నా బాగా వంటచేస్తాడు. వాడు యింట్లో వుంటే నేను లేకపోయినా ఫర్వాలేదు.
"అయితే తొందరగా రమ్మని ఉత్తరం రాయండి" అమాయకంగా ముఖం పెట్టి అంది.
"మా యిద్దరి ఖర్మ, నీకు వంట వాళ్ళం అయ్యాము" అనుకున్నాడు ఇందర్.
కొద్దిసేపు తర్వాత ఇందర్ లేచి తయారయ్యాడు. "ఇంటికి కావాల్సినవి కొన్ని వస్తువులు కొనుక్కురావాలి. వచ్చి వంట చేస్తాను" అన్నాడు సంచి తీసుకుంటూ.
"ఆకలేస్తే నేను కాసేపు కూడా వుండలేను. తొందరగా రావాలి మరి" అంది అవంతి.
"అలాగే" అని ఇందర్ బైట తాళం వేసుకొని వెళ్ళిపోయాడు.
"ఇందర్ మీద అవంతికి యిప్పుడిప్పుడే అనుమానం వస్తున్నది. ఆ పెద్ద పెట్టెమీద కూడా, ఓ రోజు రాత్రి తొమ్మిది గంటలవేళ ఇందర్ పెట్టె తెరిచాడు. అవంతి దగ్గరకు రావడం చూసి కంగారుగా పెట్టె మూత వేశాడు. అంతేగాక తాళంవేసి తాళం చెవిని జేబులో వేసుకున్నాడు.
"ఒక్కసారి ఆ పెట్టె తెరిచి చూడగలిగితే...." అనుకుంది అవంతి.
అవంతి పెట్టె తెరిచి చూడగలిగితే ఇందర్ రహస్యం బైట పడేమాటనిజమే. ఆ రహస్య ఫిరంగి పేలుడులాంటిది. పక్కలో బల్లెం ఎవరూ సహించరు. పరస్పర విరుద్ధం గల వృత్తులు చేస్తున్న వాళ్ళు ఎవరి వృత్తి ఏదో తెలుసుకున్న మరుక్షణం ప్రత్యర్ధిమీద చావుదెబ్బ తీయడానికి రెడీ అవుతారుగాని ప్రాణం పోయినా కలవరు.
"అరగంట పైనే పడుతుంది గురుడు రావడానికి. ఈ లోపల పరిశోధన చేసెద. చోరాగ్రేసర చక్రవర్తి ఆచూకీ తీసేద...." అనుకున్న అవంతి చీర చెంగు నడుంకి బిగించి లేచింది.
అరగంట తర్వాత అవంతికి దొరికింది. అతిచిన్న క్లూ.
* * *
అవంతి స్టవ్ వెలిగించి కూరగిన్నె పొయ్యి మీద పెట్టింది.
ఈ యింట్లో కాలు పెట్టిన వారంలో అవంతి వంట చేయలేదు. ఇప్పుడు చేసే అవసరం లేదు. అరగంటకల్లా తిరిగి రావాల్సిన ఇందర్ గంటన్నర అయినా రాలేదు. తను అమాయకంగా ఏదో చెయ్యాలి. ఆ ఏదో అన్నది వంట తగలెట్టడం అయితే విషయం రక్తి కడుతుంది. అనుకున్న అవంతి దొండకాయ కూర చేయడానికి (తగలెట్టడానికి) రంగం సిద్ధం చేసుకుంది.
స్టవ్ మీద పెట్టిన కూరగిన్నె అడుగు మాడిం తరువాత అరకప్పు నూనె గిన్నెలోకి వంపింది. ఆ నూనె కాగకుండానే దొండకాయ సగానికి తరిగింది. మిగతా దొండకాయలని కూడా రెండు ముక్కలుగా తప్ప మూడో ముక్కగా మాత్రం తరగలేదు. అవసలే పెద్దసైజు దొండ కాయలు. ఆక్కడికో చాప్టర్ పూర్తి అయింది. నూనెలో మొత్తం వేసింతరువాత వేయించిన శనగపప్పు గుప్పెడు, ధనియాలు గుప్పెడు, నాలుగు చంచాల ఆవాలు, పచ్చి మిరపకాయముక్కలు, అయిదు టీ స్పూన్ల కారం, అరస్పూను ఉప్పు, చెంచాడు పంచదార వేసి ముక్కలు కలియ పెట్టింది. దానిమీద కొత్తిమీర కరేపాకు చల్లింది. పెట్టి, అప్పటికే చాలా కష్టపడి పోవడం వల్ల ఇవతలి గదిలోకి వచ్చి రెస్ట్ గా కుర్చీలో కూర్చుండి పోయింది.