Previous Page Next Page 
అభయారణ్యం పేజి 34


    "అది ప్రతి మగాడిలోనూ వుండేదే ఆర్తీ" నచ్చచెబుతున్నట్లుగా అన్నాడు." అయినా ఇంత తెలివైనవారే....... మీరు అతడ్ని మీకనుకూలంగా మార్చుకోవడం కష్టంగా ఎందుకు ఫీలవుతున్నారు? ప్రేమ వుండాలే గాని మలుచుకోవడం యిబ్బంది కాదుగా."

    "ప్రేమన్నది రెసిప్రోకల్ మాస్టారూ! అప్పుడే మార్పుగానీ, మార్చుకోవడంగానీ సాధ్యమయ్యేది."

    "కానీ మీరో విషయం గుర్తుంచుకోవాలి. చాలామంది మగాళ్ళకి భార్య మీద ప్రేమ వున్నా దాన్ని ఎక్స్ ప్రెస్ చేయడం తెలీదు."

    "అలాంటప్పుడు ఏ భార్యయినా భర్త మనసుని ఎలా అర్థంచేసుకోగలదు? ఒంట్లో జ్వరం తెలుసుకునే ధర్మామీటర్ లా భర్త మనసు తెలుసుకునే డివైన్ అంటూ లేదుగా?"

    "ఎందుకు లేదు...... ఉంది ఆర్తీ! అది మీ మనసే. కోపం తెచ్చుకోకండి. మరో మనసుని అర్థం చేసుకోవాలీ అంటే ముందు మనకు మనసు వుండాలి."

    "మీరు కాగితాలమీద వ్రాసే వాక్యాలతో నన్ను బుజ్జగించాలని ప్రయత్నిస్తున్నారు తేజా! నేను నా భర్త ఏమిటో అర్థంకాక మాట్లాడటం లేదు. అతడేమిటో తెలిశాకనే అశాంతికి గురైపోతున్నాను."

    ఆమెను వారించలేదు తేజా. మనసు తేలికపడాలీ అంటే ఎమోషనల్ గా మాట్లాడనివ్వాలన్న సూత్రాన్ని పాటిస్తూ మౌనంగా వుండిపోయాడు.

    "నా భర్తలో నేనో పురుషోత్తముడ్ని కోరుకోలేదు. అతడికి మైనస్ పాయింట్స్ వున్నా, అసలు నా ఉనికినే ఓ మైనస్ గా భావించని మనిషైతే సరిపెట్టుకుందామనుకున్నాను. అతడు నాకు గైడ్ కానవసరం లేదు- కనీసం ఫ్రెండ్ లా వున్నా చాలనుకున్నాను.  ఇంటెల్లెక్చువల్ గా మాట్లాడనవసరం లేదు- ఇంటిమేట్ గా వుంటే సంతృప్తి పడాలనుకున్నాను కానీ ఆయన వాటికి అతీతుడు."

    ఆమె ఆగింది క్షణంపాటు.

    "నిజమే....... నాకు కావాల్సినంత డబ్బిస్తారు. కావాల్సింది అడక్కుండానే తీసుకొస్తారు. కానీ ఇది నేను నీకోసం తెచ్చాననే మాట చెప్పటం నామోషీగా భావిస్తారు. ఉన్నవాళ్ళ ఇంట్లో అడుగుపెట్టడమే ఆడపిల్ల ఆశయమైతే నాకు అవన్నీ వున్నట్టే. కానీ నేను మనసున్న మనిషి నీడలో చేరానన్న ఆలోచనతో బ్రతకాలనుకునేదాన్ని. అలా బ్రతకడం గురించి కలలు కన్నదాన్ని తేజా! అలా అని చంద్రుడు వెన్నెల కురిపించినట్లు-సూర్యుడు వెలుగుని అందించినట్లు...... భర్త ప్రేమ కూడా చాలా సహజంగా నాకు అందాలని నేను తపించలేదు. ఒక ఆడపిల్లగా అది సాధించడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నీ అనుసరించాను. కానీ ఫలితం శూన్యం. అలా అని రోజులోని ఇరవై నాలుగు గంటల్లో ఇరవై రెండు గంటలు నా భర్త ప్రక్కనే కూర్చోవాలని, ప్రేమ కబుర్లు చెబుతూ పరిసరాల్ని మరిచి ప్రవర్తించాలని నేను కోరుకోవడంలేదు. నా ఉనికిని గుర్తిస్తేచాలని, ఆ కొద్దిపాటి కన్ సర్న్ తో రోజంతా ఆనందంగా గడిపేయాలని అనుకుంటూ వుంటాను. కానీ ఏదీ?
 
    మీకు తెలీదు తేజా!

    ఈ ప్రపంచంలో అభిప్రాయాలు కలవని వ్యక్తులు భార్యాభర్తలు కావడం పెద్ధశాపం. నాచుట్టూ వుండే చెట్లు, పువ్వులు, ఫలాలు, పక్షులు నాకు ఆనందాన్నిస్తాయి. ఆకాశంలో చంద్రుడ్ని, నక్షత్రాల్నీ చూస్తూ గంటలతరబడి గడపటం నాకిష్టమైన విషయం. కానీ అతడికి బావుకత్వం అంటే చిరాకు కాదు అసహ్యం. ఎలా నన్ను నేను నిగ్రహించుకునేది?

    తల్లి, తండ్రి, అక్క, తమ్ముడులాంటి బంధువుల్ని విడిచిపెట్టి, కొత్త ఇంట్లో - కొత్త బాధ్యతలతో అడుగుపెట్టిన ఆడపిల్ల మానసికంగా ఒంటరిది కాకుండా వుండాలీ అంటే, కొత్త వాతావరణంలో ఇమడాలీ అంటే జాగ్రత్త పాటించాల్సింది భర్తే అని మీరు అంగీకరిస్తారో లేకో నాకు తెలీదు. కానీ వయసులో, అనుభవంలో మెచ్యూరిటీ ఎక్కువ వుండాల్సిన మగాడు ఖచ్చితంగా భార్యని తన మనిషిగా మార్చుకోటానికి ప్రయత్నించి తీరాలి."

    ఆర్తి ఆగింది.

    "మీ అద్భుతమైన విశ్లేషణని అభినందిస్తున్నాను ఆర్తీ! విఫలమవుతున్న దాంపత్య జీవితాల మౌలికమైన సమస్యల్ని అందంగా చెప్పారు" క్షణం విరామం తర్వాత అన్నాడు తేజా-
   
    "నిజమే! ఈ ప్రపంచంలో తల్లి, తండ్రి, భర్తలాంటి చాలామంది మధ్య వున్నది డబ్బుతో మాత్రమే ముడిపడివున్న వ్యాపార బంధాలు కావు డబ్బే ముఖ్యమైతే ప్రతి డబ్బున్న తండ్రీ గొప్ప తండ్రి అయ్యేవాడు. డబ్బున్న ప్రతి భర్తా గొప్ప భర్తగా భార్యలచేత ఆరాధించబడేవాడు. దురదృష్టం ఒక్కటే ఆర్తీ...... సంతోషాన్ని చిన్న ప్రక్రియల ద్వారా పొందగలమన్న విషయం చాలామందికి తెలీదు. అందుకే అభిమానాన్ని వ్యక్తం చేయటానికి చాలా ఎక్కువ ఖర్చు చేస్తుంటారు. ఉదాహరణకి మా ఎదురింట్లో ఓ ఆరేళ్ళ పిల్లవాడు నేను బాల్కనీలో నిలబడితే ఆసక్తిగా నన్ను చూస్తుంటాడు. నేను చెయ్యి వూపి ప్రేమగా పలకరిస్తే చాలు పులకరించిపోతాడు 'మంచి అంకుల్' అంటూ తన తల్లిదండ్రులకి చెబుతాడు. నిజానికి నేను చేసింది చాలా స్వల్పం. చిన్న యాక్ట్ అది..... అయితేనేం నాకూ. ఆ పసికందుకు. వాడి తల్లిదండ్రులకి ఆనందాన్నిస్తుంది అయితే ఇలాంటి కర్టెసీలు పాటించటానికి డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని చాలామందికి తెలీదు. భర్త స్థానంలో వున్న ఎందరో మగాళ్ళు దీనికి అతీతులు కాకపోవటం వాళ్ళ దురదృష్టం"

    ఆర్తి మొహంలో అసాధారణమైన సంతృప్తి చోటుచేసుకుంది. తేజా తన మాటల్ని ఖండించకపోవడంతో అలా ఆమె రియాక్టయిందని ఆమెకీ తెలీదు. మీ శ్రీమతి చాలా అదృష్టవంతురాలు కదూ?"
 
    తేజా నవ్వు వినిపించింది.
 

 Previous Page Next Page