Previous Page Next Page 
నవ్వితే నవ్ రత్నాలు - 1 పేజి 34

    "నాగమణి ఖర్మా?... ఆయన శత వెధవానీ కదా?..." అమాయకంగా అడిగింది జానక
    వెంకుమాంబ పకపకా నవ్వింది.
    "నీ అమాయకత్వం కూలా... శత వెధవానీ కాదు శతావధాని!!... అయినా ఆయనే ఏదైన మార్గం చూపిస్తాడేమోనని నా బోడి సలహా!!..."
    "ఇఇంకేం?... బోడి సలహా అంటున్నావ్ కదా... తప్పకుండా ఆయన దగ్గరికే వెళ్తాంలే..." అంది జానకమ్మ.
    ఓ మంచిరోజు చూస్కుని నాగమణి ఖర్మ దగ్గరికి వెళ్లింది జానకి. ఆయనకి తన కూతుళ్ల పెళ్లి సమస్య గురించి చెప్పింది... ఓ స్కూలు టీచర్ గా తక్కువ జీతంతో ఆమె జీవితాన్ని ఎంత భారంగా లాక్కొస్తున్నదీ చెప్పింది.
    నాగమణి ఖర్మ ముందుకీ వెనక్కీ ఊగుతూ... గుడ్లు పైకి పెట్టి చూస్తూ "ఊ...ఊ...ఊ..." అనడం మొదలు బెట్టాడు.
    జానకి కంగారుపడింది.
    "అయ్యో... ఏంటండీ ఖర్మగారూ అలా బాధగా మూలుగుతున్నారు?... మీకు ఆరోగ్యం బాగోలేదేమో... మేం ఇంకోరోజు రామా?..."
    నాగమణి పకపకా నవ్వాడు.
    "హెంత అమాయకులమ్మా మీరు?... ఇది ములగడం కాదు... నేను అవధానం చేస్తున్నప్పుడు ఎవరైనా ఏదైనా సమస్యని పూరించమని చెప్పిప్పుడు నేను దాన్ని ఎలా పూరించాలా అని ఆలోచిస్తున్నప్పుడు ఇలానే మూలుగుతూ ఉంటాను... అలా ఏం ఆలోచించినా ఇలా మూలగడం అలవాటై పోయిందన్నమాట?..."
    "అలాగా?... అయితే బాగా మూలిగి మా అమ్మాయికి పెళ్లి సంబంధం కుదరాలంటే ఏం చెయ్యాలో మంచి మార్గం చెప్పండి..." సంబరంగా అంది జానకి.
    నాగమణి ఖర్మ కళ్లు మూస్కుని ముందుకీ వెనక్కీ ఊగుతూ కాస్సేపు మూలిగి తర్వాత కళ్లు తెరిచాడు.
    మీ అమ్మాయి పెళ్లి కుదరడానికి ఒక్కటే మార్గముందమ్మా" అన్నాడు.
    "ఒక్కటే మార్గమా?... అదేంటో చెప్పండి నా ఖర్మ..." నెత్తి కొట్టుకుంటూ అంది జానకి.
    "సంపూర్ణ క్షవర హోమం చేయిస్తే దోషాలన్నీ పోయి మీ అమ్మాయికి ఠక్కున పెళ్లి కుదుర్తుంది!" చిద్విలాసంగా నవ్వుతూ అన్నాడు నాగమణి ఖర్మ.
    జానకి సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతూ "అలాగే స్వామీ... తప్పకుండా చేయిస్తా!" అంది.
    "కానీ కాస్త ఖర్చు అవుతుంది!!"
    "అవనీండి స్వామీ... మహా అయితే అయిదొందలో వెయ్యో అవుతుంది.. అంతే కదా?"
    "అదే మరి అమాయకత్వం అంటే... సంపూర్ణ క్షవర హోమానికి యాభైవేల రూపాయలు ఖర్చవుతుంది..." చికాకు పడ్తూ అన్నాడు నాగమణి ఖర్మ.
    అది వినగానే జానకి వెనక్కి విరుచుకుపడ్తూ మూర్ఛపోయింది. నాగమణి ఖర్మ ఆమె మొహం మీద నీళ్ళు చల్లి లేపాడు.
    "ఇదే ఓవర్ యాక్షన్ అంటే... మ్మా... నీకు యాభైవేల ఎక్కువా... నీ కూతురు జీవితం ఎక్కువా?... చక్కగా శ్రద్ధగా నీకోసం వేద పండితుల్ని పిలిపించి ఆ హోమం చేయిస్తాను... తర్వాత నీ యిష్టం..."
    జానకి నీర్సంగా "సరే... మీ యిష్టం స్వామీ" అంది.
    "ఊ...ఊ...ఊ..." నాగమణి ఖర్మ ముందుకు వెనక్కీ ఊగుతూ మూలిగాడు.
    జానకి మొహం సంతోషంతో వెలిగిపోయింది.
    "మీరు మూలుగుతున్నారంటే తక్కువ ఖర్చుతో ఏదైన పూజ చేయించాలని ఆలోచిస్తున్నారు అంతే కదూ?..."
    నాగమణి ఖర్మ చికాకుగా అరిచాడు.
    "కాదు... ఈసారి నేను ఐడియాలకోసం ఆలోచిస్తూ మూలగడం లేదు... నాకు నడ్డి పీకుతుంటే మూలిగాను... నువ్వు సంపూర్ణ క్షవరహోమం చేయించక తప్పదు."
    జానకి క్షణంపాటు బిత్తరపోయి "అలాగే స్వామీ... అలాగే... మీ యిష్టం"అంది.
    నాగమణి ఖర్మ పంచాంగం చూసి హోమానికి ఓ మంచిరోజు నిర్ణయించి ఆ రోజున రమ్మన్నాడు. డబ్బు మొత్తం రెండు రోజుల్లో తెచ్చి ఇవ్వమన్నాడు.
    జానకి వెళ్లడానికి లేచి నిలబడ్తూ "అన్నట్టు మీ పేరేంటి స్వామి విచిత్రంగా ఉంది! నాగమణి సరే... ప్రక్కన ఖర్మ అని ఎందుకు కలుపుకున్నారు?" అని అడిగింది.
    "ఆఅంటే నీలాంటి వాళ్లంతా ఖర్మకాలి ఖర్మఖర్మ అంటూ నెత్తి కొట్టుకుంటూ నా దగ్గరికి వస్తారు కదా... వాళ్లకి పట్టిన ఖర్మని నేను తీస్కుంటాను కాబట్టి నా పేరు నాగమణి ఖర్మగా పెట్టుకున్నాను" అన్నాడు అతను.
    "అలాగా?..." అంటూ నోరు తెర్చింది జానకి.
                               *   *   *
    రెండ్రోజుల తర్వాత జానకి స్కూల్ టీచర్ గా అప్పుడుకొంత... ఇప్పుడు కొంత అయిదేళ్లుగా బ్యాంకులో దాచుకున్న నలభైవేలకి తన చేతి గాజులు కూడా అమ్మి పదివేలు జతచేసి నాగమణి ఖర్మకి మొత్తం యాభైవేలు సమర్పించుకుంది...
    సంపూర్ణ క్షవర హోమం చేయించే రోజు రానే వచ్చింది. ఆ రోజు ఉదయం అయిదు గంటలకే జానకి, రాధ, లతలు తలకిస్నానం చేసి తయారై ఏడు గంటలకల్లా నాగమణి ఖర్మ ఇంటికి వెళ్లారు...
    అక్కడి సీన్ ని చూసిన జానకి తెల్లబోయింది.
    నాగమణి ఖర్మ యింటి ఆవరణలో హోమ గుండం ఉంది... దాని చుట్టూ మరో తొమ్మిదిమంది జంటలు కూర్చున్నారు. వారి వెనకాల వారి వారి బంధుమిత్రులు కూర్చుని ఉన్నారు మొత్తానికి యాభైమంది దాకా జనం ఉన్నారు.
    "ఎవరు వీళ్లంతా?" అని నాగమణి ఖర్మని అడిగింది జానకి.
    "ఎవరేంటి?... నీలాగే ఖర్మకాలి సంపూర్ణ క్షవర హోమం చేయించుకోవాలని వచ్చిన వాళ్లు... ఏంటీ?... మనమ్మాయిలేనా?... పిటపిటలాడ్తూ బాగానే ఉన్నారు..." నాలుకతో పెదాల చుట్టూ నాక్కుంటూ రాధ, లతలను చూస్తూ అన్నాడు నాగమణి ఖర్మ.
జానకి తను మోసపోయినట్లు గ్రహించింది. నాగమణి ఖర్మ యాభైవేలు తీసుకున్నాడంటే తనకోసం ప్రత్యేకంగా శ్రద్దగా హోమం చేయిస్తున్నాడని అనుకుంది గానీ ఇలా గుంపులో గోనిందలా చేయిస్తాడని అనుకోలేదు.
    హోమం ప్రారంభం అయింది... నలుగురు వేదపండితులు మంత్రాలు చదువుతున్నారు... మధ్య మధ్య నాగమణి ఖర్మ కూడ ఏదో తనకు వచ్చీరాని మంత్రాలు చదువుతున్నాడు. అవును మరి... ఆయనకి మంత్రాలు ఎలా వస్తాయ్... అతను శతవధాని కదా?...
    జానకికి మాత్రం ఆ మంత్రాలేమీ వినబడ్డంలేదు... ఆమె ఏదో అయోమయ లోకంలో ఉంది... కష్టపడి అయిదేళ్లు పైసాపైసా కూడపెట్టి ఇలాంటి మోసగాడి చేతిలో పెట్టానే అని కుమిలిపోయింది...
    హోమం ముగిసింది... ఆ పూట పదిమంది దగ్గర యాభైవేలు చొప్పున ఆయన వసూలు చేసింది అయిదు లక్షలు ... హోమం చేయించినందుకు అతనికి అయిన ఖర్చు పదివేలు మాత్రమే. మొత్తానికి ఆ పూట ఆయన సంపాదన నాలుగు లక్షలా తొంభైవేలు!
    నాగమణి ఖర్మ ఇలాంటి చక్కని కార్యక్రమాలు చేస్తాడని ప్రభుత్వం మెచ్చి ఆయనకి ఏనాడో కోట్ల విలువచేసే భూమి హైటెక్ సిటీలో ఎలాట్ చేసింది.
    జై ప్రభుత్వమూ!... జైజై నాగమణి ఖర్మా!!

                     *   *   *
         

 Previous Page Next Page