Previous Page Next Page 
జయ - విజయ పేజి 34


    అప్పుడు నీ మాటల విలువ నాకు తెలిసివచ్చింది. అందుకే నీకోసం వెతుక్కుంటూ వచ్చాను. కానీ నీకు పెళ్ళి అయిపోయిందని తెలిసేసరికి షాక్ తిన్నాను. ఏం చేయాలో తెలీని పరిస్థితిలో నీదగ్గరకొచ్చాను. జయా! నిజమయిన ప్రేమ నీమీద ఇప్పుడు కలిగింది నాకు. ఇది నీ శరీరం మీద కోరిక కాదు. నువ్వు మరొకరి సొత్తువన్న విషయం కూడా నేను పట్టించుకోదల్చుకోలేదు. ఐ లవ్ యూ జయా!"
    అతని కళ్ళ వెంబడి నీళ్ళు తిరిగినయ్.
    జయ నవ్వింది.
    అతని మీద ఆమెకు జాలి కలుగుతోంది. అతనిని తన గుండెకు హత్తుకోవాలని ఉంది.
    అతను తనకు దూరమైనా, ఇప్పుడు పరాయి వ్యక్తి అయినా తను అతనిని గాఢంగా ప్రేమించింది.
    ఆ ప్రేమ ఎప్పటికీ అలానే ఉంటుంది.
    "నేను నిన్ను ఎప్పటిలానే ప్రేమిస్తున్నాను కిషోర్! కానీ మన ప్రేమ మన జీవితాలను అల్లకల్లోలం చేయకూడదు. అదే నేను కోరేది"
    "జయా! నువ్వు నాక్కావాలి! శాశ్వతంగా కావాలి!" అన్నాడతను హఠాత్తుగా.
    జయ వెర్రిదానిలా అతనివేపు చూసింది.
    "కిషోర్ ఏమిటి నువ్వు మాట్లాడుతోంది?" అంది కలవరంతో.
    "నేను నిన్ను విడిచి ఉండలేను జయా! నన్నేం చేస్తావో నాకు తెలీదు. నా జీవితం నీ చేతుల్లో ఉందిప్పుడు..." అతను కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు.
    జయకు అతనిని చూస్తూంటే దుఃఖం ఆగటం లేదు. అంతవరకూ లావాలా లోపల దాగివున్న ప్రేమంతా అగ్నిపర్వతం బ్రద్ధలయినట్లు బయటకు ప్రవహించసాగింది.
    అతి కష్టం మీద దుఃఖం ఆపుకుందామె.
    "ఇప్పుడేం ఆలోచించి ఏం ప్రయోజనం కిషోర్. ఇలాంటి ఆలోచన వల్ల ఏమయినా ఉపయోగం ఉందా?" అంది నెమ్మదిగా.
    "ఎందుకుండదు జయా! నువ్వు తల్చుకుంటే మనం ఒకటవలేమా?"
    జయ ఉలిక్కిపడింది.
    "అదేమిటి? అదెలా సాధ్యం!" అంది కలవరపాటుతో.
    "సాధ్యం కాకపోయినా సాధ్యపడేట్లు చేసుకోవాలి జయా! మనిద్దరం తల్చుకుంటే మనల్నెవరు విడదీయగలరు?"
    "నీకు మతిపోయింది కిషోర్! నేను వివాహితురాలినన్న సంగతి మర్చిపోతున్నావ్! నేనిప్పుడు గర్భవతిని కూడా అన్న విషయం తెలీటంలేదూ?"
    "తెలుసు జయా! ఆ పాపాయి మన పాపాయేనన్న సంగతి కూడా నాకు తెలుసు!"
    జయ ముఖం పాలిపోయింది.
    "ఎవరు చెప్పారీ విషయం?"
    "సరిత!"
    "సరితకెలా తెలుసు?"
    "ఏమో! ఆ విషయం నాకు తెలీదు! పోనీ అది నిజమా, కాదా చెప్పు."
    జయ మాట్లాడలేదు.
    "జయా! నా కళ్ళల్లోకి చూసి చెప్పు! ఆ యింట్లో నువ్వు ఆనందంగా ఉంటున్నావా?"
    "నాకే లోటూ లేదక్కడ?"
    "నాకు తెలుసా విషయం! నేనడిగేదదికాదు. నువ్వు మనస్ఫూర్తిగా సంసారం చేస్తున్నావా? నన్నెప్పుడూ గుర్తుతెచ్చుకోకుండానే గడుపుతున్నావా? మనిద్దరం కలిసి ఉంటే కలిగే ఆనందం నీకు అక్కడ లభిస్తుందా?"
    జయ అసహనంగా అతనివేపు చూసింది.
    "కిషోర్! వద్దు! ఇంకేమీ మాట్లాడకు! నీ ఆలోచనలేమీ జరిగేవి కావు. ఇదేం చిన్నపిల్లలాటా? ప్రశాంతంగ ఉన్న నా జీవితం మళ్ళీ అల్లకల్లోలం చేయకు! నీకు నమస్కరిస్తాను..." అంది కళ్ళ నిండుగా నిండిన నీటితో.
    కిషోర్ కృంగిపోయాడు.
    "సరే జయా! నీ ఇష్టం! నీ మనసుకి నచ్చినట్లే ప్రవర్తించు! కానీ ఓ విషయం గుర్తుంచుకో! ఏదొకరోజు మనం ఒకటవక తప్పదు. ఏదోవిధంగా నిన్ను నాదాన్ని చేసుకుంటాను."
    ఆవేశంగా అన్నాడతను.
    "నాకు టైమయింది..." అంది జయ లేచి నిలబడుతూ.
    ఇద్దరూ రెస్టారెంట్ బయటికొచ్చారు.
    "నేను వెళ్తానిక..."
    "నేను మీ ఆఫీస్ వరకూ వస్తాను."

 Previous Page Next Page