సుజాత ఆశ్చర్యంగా వింటూంది. ఆనందు తన ఆనందుని అపార్థం చేసుకుంది. ఆనందు తనకోసం ప్రాణాలన్నా అర్పించడానికి సిద్ధపడ్డాడు.... ఆమె కళ్ళు చెమర్చాయి_ చాలు. తనకింక కావాల్సిందేం లేదు.
"ఈ లోకంలో కలిసి బ్రతకలేని తామిద్దరూ పై లోకంలో హాయిగా బ్రతుకుదాం అని తెగేసి చెప్పాడట. కట్టుకున్న భార్యకి అప్పుడెలా వుంటుంది! తనముందే పరస్త్రీ మీద తన ప్రేమ వెల్లడిస్తూ ఆమెకోసం ప్రాణాలర్పిస్తానని చెపుతూంటే ఏ స్త్రీ ఆవేశపడదు? ఆమె ఆవేశపడి భర్తని దూషించింది. ఏడ్చింది. ఏంచేసి భర్తని దక్కించుకోవాలో అర్థంకాలేదు ఆమెకి. భర్త ఆవేశంలో ఏ అఘాయిత్యం చేస్తాడోనని భయపడి పిస్తోలు లాక్కోబోయింది. కాని అతను ఈయకుండా భార్యని త్రోసేసి పిస్తోలు లాక్కున్నంత మాత్రాన, చావదల్చుకుంటే మార్గం వుండదనుకోకు, అంటూ వెళ్ళిపోయాడట.
"భర్త ఆవేశంలో ఏంచేస్తాడో అన్న భయంతో భార్య అతనికి తెలియకుండా వెంబడించి ఆ హోటలుకీ వెళ్లింది. కిటికీ దగ్గర నిలబడిన భార్యకి లోపల సుజాత చాలా ఆవేశపరురాలై ఆనందరావుని దూషించడం, అతను ఆమెని శాంతపరచడానికి నచ్చచెపుతూ బ్రతిమిలాడుతున్నా వినిపించుకోకుండా మోసగాడవంటూ దూషించి నీలాంటివాడు యింకా బ్రతికి వుంటే ఇంకెంతమందిని నాశనం చేస్తావో అంటూ ఆవేశంతో కమల తలుపులు తట్టి పిలిచేలోపలే పిస్టలు పేల్చింది. శ్రీమతి కమలాదేవి కేకలు విని అందరూ వచ్చేసరికి ఆనందరావు రక్తపు మడుగులో వున్నాడు. సుజాత తెల్లపోతూ చూస్తూ నిల్చుంది చేతిలో పిస్టలు పట్టుకుని."
సుజాత ప్రాసిక్యూటర్ కథనం వింటూ ఆశ్చర్యపోయింది .... కమల చెప్పిన కథనం విని ఆమె పెదాలమీద చిన్న నవ్వు మెదిలింది.
"యువర్ ఆనర్. ఈ హత్య ముద్దాయి సుజాత మోసగింపబడ్డానన్న ఆవేదనతో చేసిందని స్పష్టమవుతూంది. ఆనందరావుని హత్య చేయవల్సిన అవసరం, చేసే వీలు మరెవ్వరికి లేదు. హతుని దగ్గిర వున్న పిస్తోలు ముద్దాయి పనిని మరింత సులువు చేసింది. ఆనందరావు మరణం ఆ పిస్తోలులోని రెండు గుళ్ళవలననే అని స్పష్టమవుతూంది. పిస్తోలు మీదవున్న వేలిముద్రలు హతుడు, అతని భార్యవి కూడా వున్నాయి. ఆనందరావు మరణం ఆ పిస్తోలులోని గుళ్ళ వల్లనే అని డాక్టరు రిపోర్టు తెలియచేస్తూంది. యువర్ ఆనర్, ముద్దాయి ఆవేశంలో చేసినదే అయినా నిలువునా నిండు ప్రాణం తీయడం, ఓ భార్యకి భర్తని, పిల్లలకి తండ్రిని దూరం చేసిన ఆమె నేరం క్షమించరానిది. యువర్ ఆనర్, న్యాయం విచారించి ముద్దాయికి తగిన శిక్ష విధించాలని కోరుతూ ఇంతటితో ముగిస్తున్నాను."
ప్రాసిక్యూటర్ కథనం ముగించి కూర్చున్నాడు. కోర్టులో కలకలం ఆరంభమయింది. జడ్జిగారు ఆర్డర్ అంటూ హెచ్చరించి ముద్దాయివంక తిరిగాడు. ముద్దాయి తను చెప్పవలసింది ఏమన్నా వుందా? అని ప్రశ్నించారు సుజాతని. సుజాత తలెత్తి ఒక్కక్షణం చూసి తల అడ్డంగా తిప్పింది.
"అంటే ముద్దాయి తన నేరం అంగీకరిస్తుందా?.... ఆమె చెప్పదలిచింది ఏమీ లేదా? ముద్దాయి తరుపు లాయరు ఎవరు లేరా? సుజాత మరోసారి తల అడ్డంగా తిప్పింది. కోర్టులో కలకలం ఆరంభమయింది. ఆనందరావు భార్య కమల అంత దుఃఖంలోనూ ఆశ్చర్యంగా చూసింది సుజాత వంక. సుజాత తండ్రి ఆరాటంగా నిలబడి ఏదో చెప్పబోయాడు, అంతలో ఒక నల్లకోటు లాయరుగారు ఆయన్ని కూర్చోమని తను లేచి తనని డిఫెన్సు లాయరుగా ముద్దాయి తరపున కేసు నడిపించడానికి ముద్దాయి తండ్రి నియమించినట్లు కేసు ప్రొసీడ్ అవడానికి జడ్జిగారి అనుమతి కోరుతున్నట్టు లాంఛన ప్రకారం చెప్పుకున్నాడు.
జడ్జిగారు అనుమతించడం, ఆయన కేసు విచారించడానికి ప్రారంభించడం, డాక్టరు రిపోర్టు, పోలీస్ ఇన్ స్పెక్టరు వాజ్మూలం, హోటలు యజమాని వివరణ, హోటల్ బాయ్ సాక్ష్యం- ఒక్కొక్కరిని బోనులో నిలబెట్టి ప్రశ్నలు, క్రాస్ ఎగ్జామినేషన్స్_
ప్రతిరోజూ .... అంతా వింటూంటే సుజాతకి ఏదో వినోదంగా వుంది. తను చదివిన ఇంగ్లీషు డిటెక్టివ్ నవల్లో మాదిరి ఏదో కథ చదువుతున్నట్టు కుతూహలంగా అందరి సాక్ష్యాలు, వివరణలు వింది. అందరి సాక్ష్యాలు తననే దోషిగా నిరూపిస్తున్నాయి తనకి కావల్సిందదే! తన ఆనంద్ లేని ప్రపంచంలో బ్రతకాలన్న కోరిక తనకు లేదు! అసలింతకాలం ప్రాణం తీసుకుందామన్నా వీలులేకుండా బంధింపబడ్డానన్నదే విచారం! హ -పిచ్చి నాన్న. తననింకా రక్షించాలన్న తాపత్రయపడుతున్నాడు. లాయర్ల చుట్టూ తిరుగుతున్నాడు. డబ్బు పోస్తున్నాడు. నిజం చెప్పమ్మా, ఏం జరిగిందో చెప్పు అని బ్రతిమలాడుతారు తల్లిదండ్రులు. నిజం! ఏం నిజం! తను చెప్పేదే నిజం? అంతకంటే ఏం చెప్పలేనంది. ఏం చెప్పలేదుకూడాను! తనకి ఒక్కటే కోరిక మిగిలింది. ఈ కేసు ఇలా రోజుల తరబడి నడవకుండా త్వరగా ముగిసి తన ఆనంద్ దగ్గిరకి తనని పంపిస్తేచాలు! తను స్పష్టంగా చెపుతూంటే ఇంకా తన లాయరు ఎందుకో తికమక ప్రశ్నలు వేసి సాక్షులద్వారా ఏదో లాగాలని ప్రయత్నిస్తాడు.
ఆ రోజు ఆనందరావు భార్య కమల సాక్షిగా బోను ఎక్కింది. సుజాత ఆమెని పిలవగానే కుతూహలంగా వినసాగింది. కమలని చూడడం సుజాతకిది రెండోమారు మాత్రమే! ఆ రోజు ఆనంద్ హత్య జరిగినరోజు ఆ గొడవలో ఆమెని సరిగా చూడలేదు. కమల అందగత్తె కాదు. మామూలు. సుమారుగా కూడా లేదు. చామన ఛాయగా, పొట్టిగా, పీలగా పాతికేళ్ళలోపు వయసే అయినా అప్పుడే ఏదో వయసు మీదపడిన స్త్రీలా కనపడ్తూంది. ఆనంద్ లాంటి భావుకుడు, ఆరాధకుడు ఈమెని వివాహం ఎలా చేసుకున్నాడో? వివాహాలు స్వర్గంలో నిర్ణయం అవుతున్నాయన్నది, విదిలిఖితం అంటే ఇదే గాబోలు? కమల ఈ కొద్దిరోజులలో చాలా మారిపోయింది.
హఠాత్తుగా పైబడిన వైధవ్యం! ఆ దిగులు, ఆ చింత, ఆ భయం ఆమెని ఎంత కృంగదీశాయో స్పష్టంగా తెలుస్తుంది. నల్లబడిన మొహంతో, అదురుతున్న పెదాలతో భయంభయంగా, బెరుకుగా తడబడుతూ ఆమె చెప్పే మాటలు వినసాగింది సుజాత.
డిఫెన్సు లాయరు అడిగే ప్రశ్నలు, కమల జవాబులు అన్నీ అప్పటివరకు ప్రాసిక్యూటర్ కథనంలో విన్నవే. ఆమెకి సుజాత విషయం తెలియడం అక్కడనించి వారి కాపురంలో కలతలు, అంతా ఆమె ఆవేశంగా, కోపంగా ఆవేదనతో చెప్తూంటే సుజాత నేరస్థురాలిగా తలవంచుకుంది! జరిగిందానికి తనెంతవరకు బాధ్యురాలు! ఆనంద్ వివాహితుడని తనకి తెలియకపోవడం వల్ల గదా ఇంత అనర్ధం! డిఫెన్సు లాయరు చాలా తెలివిగా ఆమెని తికమకపెట్టే ప్రశ్నలు అడిగి గాభరాపెడ్తున్నాడు. అసలే గాభరాగా వున్న కమలకి ఆ ప్రశ్నలకి జవాబులు చెప్పేసరికి చెమటలు పడుతున్నాయి. సుజాతకి విసుగేసింది. ఆమెకి గావల్సింది, వినాలనుకుంటున్నది ఆఖరిరోజు తనకు తెలియని, జరిగిన సంగతులు.
ఆఖరికి లాయరు ఆ ప్రశ్నకి వచ్చాడు. "శ్రీమతి కమలాదేవీ ఆఖరి రోజున అంటే మీ భర్తగారి హత్య జరిగినరోజు మీ ఇద్దరి మధ్య చాలా గొడవ జరిగిందని. మీరు సుజాతతో వివాహానికి ఒప్పుకోకపోతే తనకి ఈ బ్రతుకే అక్కరలేదని అన్నారు. తరువాత పిస్తోలు తీసుకుని బయలుదేరుతూంటే మీరు అడ్డగించారని చెప్పారు. ఆయన దగ్గిరనించి పిస్తోలు తీసుకుని మీరు ఏం చేశారు....?"