విజయ శంకర్ మరణవార్త తెలియగానే సంతాపం వెలిబుచ్చుతూ కేబుల్ యిచ్చి, తరవాత దుఃఖపడుతూ ఉత్తరం రాసింది.
"వాడు చచ్చి లేనివా డయాడు. ఇది బ్రతికిఉండి లేనిదయింది" అనుకుంది పార్వతమ్మ ఆ ఉత్తరం చూసి.
పూర్ణ నెలరోజు లుండి, తల్లీ తండ్రీ మళ్ళీ మామూలు ధోరణిలో పడ్డాక, వెళ్ళిపోయింది.
* * *
కాలం ఎవరికోసమూ ఆగదు! దాని పని అది నిర్విరామంగా చేసుకుంటూ పోతుంది.
రెండు నెల లయేసరికి కొడుకు మరణఘాతనుంచి జగన్నాథంగారు తేరుకోగలిగారు. కొడుకు దేశంకోసం ప్రాణత్యాగం చేశాడని తృప్తిపడి దుఃఖం తగ్గించుకోగలిగారు.
కాని కన్నతల్లి ప్రాణం మాత్రం అంత తొందరగా సమాధాన పడలేకపోయింది. ఈ రెండునెలల్లో పార్వతమ్మ గుర్తుపట్టలే నంతగా మారిపోయింది. ఇదివరకు వయసు పై బడ్డా ఆమె యింట్లో చకచక తిరుగుతూ పని చేసుకునేది. ఇప్పుడు ఒక్కమాటుగా పదేళ్ళు పైబడ్డట్టు ఆమె కృంగిపోయింది. అలా పడుకుని కొడుకుని తలుచుకుంటూ ఏడవడం, లేకపోతే ఎవరితోనూ మాట్లాడకుండా కూర్చోడం పరిపాటి అయింది. జగన్నాథంగారు పలకరించినా యేదో పరధ్యానంగా మాట్లాడుతోంది ఎప్పుడూ. భార్యలోవచ్చిన మార్పు ఆయన్ని కలవరపెట్టింది. ఎన్నో రోజులు గడిచినా భార్య దుఃఖంనుంచి తేరుకోలేకపోవడం చూసి, ఆయనకేమీ పాలుపోలేదు. ఆఖరికి పుణ్య క్షేత్రాలు దర్శించి వస్తే ఆమె మనసు కుదుటబడుతుందేమో అని, తామిద్దరూ తీర్ధయాత్రలు చేసి రావడానికి యేర్పాటులు కావించారు.
12
"నామాట వినమ్మా రాధా.....అనవసరంగా నాన్నకి కోపం తెప్పించకు......వాళ్ళు వచ్చేవేళ అయింది....కాస్త ముఖం కడుక్కుని, మంచి చీర కట్టుకో!....." అంది శకుంతల!
"అమ్మా!....ఎన్నిసార్లు చెప్పాలి మీకు?.....నేను చేసుకోను. నాకోసం సంబంధాలు చూడవద్దని చెప్పానా లేదా? ..నాకు చెప్పకుండా చెయ్యకుండా ఇష్టం వచ్చినట్లు అందరినీ పిలుచుకువచ్చి, వాళ్ళ ఎదురుగా కూర్చోమంటే కూర్చోవలసిన అవసరం నాకు లేదు.....నేను కూర్చోను.... ...." అని ఖరాఖండిగా చెప్పింది అనూరాధ.
"ఈ ఒక్కసారికి నామాట విను రాధా....మీ నాన్న స్టేషనుకి వెళ్ళారు......ఇప్పుడింక వాళ్ళు వచ్చాక కూర్చోలేకపోతే బాగుంటుందా?..... నీ కిష్టం లేకపోతే చేసుకోవద్దు పెళ్ళి.....ఊరికే ఓ నిమిషం వచ్చి కూర్చో.....ఇంటికి పిలిచాక, ఇప్పుడు నువ్వు కాదంటే అదేం మర్యాద?.....ఈసారికి నా మాట విను.....లే......బట్టలు మార్చుకో...." శకుంతల బ్రతిమాలింది కూతుర్ని.
అనూరాధ మొండిగా అలాగే కూర్చుంది. కూతురి మంకుతనం చూసి శకుంతలకు కోపం ముంచుకు వచ్చింది.
"ఏం వినవా మాట!.....లేవనా?"
"అమ్మా!.....పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేదంటే.....మళ్ళీ ఈ పెళ్ళి చూపుల అర్ధం ఏమిటి? నేనేం బజార్లో బొమ్మ ననుకున్నారా! అడ్డమయిన వాళ్ళకి నన్ను చూపించడానికి!......నేను వద్దంటున్నా వా రెవరినో పిలిచిన నాన్నే చూసుకుంటారు ఆ సంగతి...."
"రామచంద్రా.....ఈ సంసారం చేయడం నావల్ల గాదు.....ఎంత పాపం చేసుకుంటే ఈ కొంపలో పడ్డానో.....ఏ దానాలు చేసి మీలాంటి పిల్లల్ని కన్నానో!...." ఆవేదనపడుతూ తల కొట్టుకుంది శకుంతల. "ఆయన కోపం ఆయనది.....నీ పంతం నీది....మీ ఇద్దరి మధ్య నేను చస్తున్నాను....అదిగో, ఆయన వచ్చే టైమ్ అయింది.....ఆయనకి ఏం చెప్పుకుంటావో చెప్పుకో. దిక్కుమాలిన గొడవ. చెపుతూంటే వినకుండా పిలిచారు వాళ్ళని....ఆయనే జవాబు చెప్పుకుంటారు వాళ్ళకి......" తల పట్టుకు కూలబడింది శకుంతల.
శకుంతల తండ్రి దగ్గిరనుంచి వెళ్ళాక సూర్యనారాయణకి నచ్చచెప్పడానికి ఎంతో ప్రయత్నించింది. రాధ పెళ్ళి చేసుకోనని మొండికెత్తుతూంది. దాని కోరిక ప్రకారమే కొన్నాళ్ళు ఉద్యోగం చేయనీయండి...అప్పుడదే దారికి వస్తుంది అంది. ఆ సూచన జగన్నాథంగారు చేసిన దనగానే సూర్యనారాయణ పంతానికి మరీ వినలేదు.
"నా కూతురు బాగోగులు నేను చూసుకోగలను....నా కెవరి సలహాలు అక్కరలేదు." అంటూ బింకంగా మాట్లాడాడు. ఇంక చేసేదేం లేక ఓ నమస్కారం పెట్టి ఊరుకుంది శకుంతల.
ఈ పెళ్ళివారిని చూపులకి రమ్మని రస్తున్నప్పుడే శకుంతలకి తెలుసు, అనూరాధ యీ సంబంధానికి ఒప్పుకోదని. పిల్లవాడు బి. కాం. ప్యాసయి ఏదో కంపెనీలో మూడువందలఏభయి రూపాయల ఉద్యోగం చేస్తున్నాడు. పెద్దగా చెప్పుకోదగ్గ ఆస్తిపాస్తులు లేవు. రాధ అభిప్రాయం తెలిసిన శకుంతల భర్తతో ముందే అభ్యంతరం చెప్పింది. అది విని సూర్యనారాయణ మండిపడ్డాడు. "ఏం, నీ హోదాకి, నీ కూతురి అందానికి ఓ లక్షాధికారో, ఓ రెండువేల జీతగాడో వస్తాడనుకుంటున్నా వేమిటి?......మీకు కోరికలున్న తీర్చే శక్తి నాకు లేదు. నా తాహతుకి తగ్గట్లు చూస్తాను నా కూతురికి......ఎందుకు చేసుకోదో చూస్తాను.....అన్నింటికి దాని ఇష్టమే అనుకుంటోంది కాబోలు! ఊరుకుంటూంటే వేషాలు మరీ ఎక్కువవుతున్నాయి......నోరు మూసుకు పడివుండమను ఇంట్లో.....అదీ, దాని తలలో జేజెమ్మకూడా చేసుకుంటుంది పెళ్ళి......ఎలా చేసుకోదో చూస్తాను.....ఒళ్ళు దగ్గిర ఉంచుకుని మరీ మాట్టాడమను" అని పెళ్ళాంమీద ఎగిరాడు సూర్యనారాయణ. అనూరాధతో ప్రస్తావించకుండానే వాళ్ళకి పెళ్ళి చూపులకిరమ్మని రాసేశాడు.
అంతా విన్న అనూరాధ తల పంకించింది, పళ్ళు బిగపట్టి ఏదో మొండిధైర్యం ప్రవేశించింది ఆమెలో. ఆరోజునుంచీ పేపర్లలో ఉద్యోగాల ఎడ్వర్టయిజ్మెంట్లు చూస్తో నాలుగైదింటికి అప్లికేషనులు పెట్టింది. ఉద్యోగం చూసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుంది.'బలవంతంగా ఎలా పెళ్ళి చేస్తారో నేనూ చూస్తాను' అని అనూరాధ మొండికెత్తింది.
పెళ్ళివారు వచ్చేరోజున కూతుర్ని తయారుచేయమని శకుంతల లని పురమాయించి, వారిని తీసుకురావడానికి తాను స్టేషనుకి వెళ్ళాడు సూర్యనారాయణ.