అమర్ ఖాయమ్
(ఉమర్ ఖయామ్ రుబాయీలకు స్వేచ్చానువాదము)
బ్రతుకోక చిత్రమైన పొగ
బండి అయోమయ మార్గమందు ఆ
ద్భుతముగా పర్వులెత్తు; దిగి
పోదురు వత్తురు క్రొత్త యాత్రికుల్
ప్రతి మజిలీకి; ఇక్కటుల
పాలగు "టిక్కెటు" లేనివాడు; జా
గ్రత్త! గజదొంగ లుందురు; ద
గా పడిపోదువు రెప్పవాల్చినన్.
రసో వైసః
శ్రీ టి. భాస్కరరావు, ఎం.ఏ.
"స్పూర్తిశ్రీ"
౧
"జయన్తి తే సుకృతినో రససిద్దాః కవీశ్వరాః
నాస్తి యేషాం యశఃకాయే జరామరణజం భయమ్."
అని భర్తృహరి వక్కణము. యశశ్శరీరమునకు ముసలితనము వల్ల గాని, మరణము వల్ల గాని , భయము లేక సుకృతులై రససిద్దులయిన కవీశ్వరులు వర్ధిల్లుదురని భావము. పదునోకండవ శతాబ్ది యెక్కడ? పందొమ్మిదవ శతాబ్ది యెక్కడ? ఫిడ్జేరాల్డు 1858వ సంవత్సరములో ఉమర్ ఖయ్యామును గూర్చి అన్గాములో ఒక వ్యాసమును వ్రాసి ప్రకటించెను. అపిమ్మట 1860లో డెబ్బదియైదు పద్యములతో ఉమర్ కావ్యమునకు తాను చేసిన ఆంగ్లానువాదమును ప్రకటించెను. దీనితో ఆంగ్ల సాహిత్య లోకమునకు నవాలోకము చేకూరినది. ఆంగ్ల కవుల చూపులు పారశీక కవి సూర్యునిపై మరలినవి. మరికొన్ని అనువాదము లాంగ్లమున బయలు వెడలినవి. పారశీక భాషాకవి ప్రపంచకవులలో ప్రతిష్టితుడయ్యెను. ఉమర్ ఖయ్యాము రససిద్దుడై అమరాకాయుడయ్యెను.
ఫిడ్జేరాల్డు రచించిన ఆంగ్లానువాదమే ఖయ్యాము సాహిత్యమున కాంధ్రభాషలో అంకురార్పణము గావించినది. ఆచార్య రాయప్రోలు సుబ్బారావు 'మధు కలశము" పేర 1926లో ఖయ్యము పద్యముల ననువదించి ప్రతీకాముఖమున ప్రకటించిరి. కవికోకిల దువ్వూరి రామిరెడ్డి మూల పారశీక గ్రంధమునుండి రసవత్తరములయిన దుబాయిలను మాత్రమే యెన్నుకొని, అవసరమైనచో రెండు మూడింటి నొక్కటిగా చేసి తమ యనువాదమును సాగించిరి. అదికూడ పత్రికా ముఖమున 1928 లో వెలువడినది. హరికధాపితామహ ఆదిభట్ల నారాయణదాసు ఫిడ్జేరాల్డు రచనను, పారశీకమూలమును కూడ సంస్కృతములోనికిని అచ్చ తెలుగు లోనికిని అనువదించి 1932 లో పరకటించిరి. 1927 ప్రాంతమునందే డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ఉమర్ ఖయ్యామును గూర్చి కొన్ని వ్యాసములను వ్రాసి 'సుజాత' పత్రికయందు ప్రకటించిరి. ఉదాహరణములుగా దాదాపు ముప్పది పద్యములు ఉదాహృతము లయినవి. అంతకుమించి వారు వ్రాసిరో ,లేదో తెలియదు.
అంతటితో రసాస్వాదనాభిలాష ఆగిపోలేదు. పాఠకుడై పొందెడి అనుభూతి వేరు, రచయితయై పొందెడి అనుభూతి వేరు. ఖయ్యాము కవిత్వములో తమ స్వత్వమును చూచుకోకొని సంతోషింపవలయునన్న కోరిక పలువురిలో ఈరికలెత్త సాగినది. కావుననే ఇరువదవ శతాబ్ది ద్వితీయపాద ప్రారంభమునందే పదము మోపిన ఉమరు సాహిత్య ప్రస్థానము నేటి వరకు దీటు తగ్గక సాగుచునేయున్నది. శ్రీయుతులు ఉమర్ ఆలీషా, రామచంద్ర అప్పారావు,
చిలుకూరి నారాయణరావు, మాధవపెద్ది బుచ్చిసుందరరామశాస్త్రి, మల్లవరపు విశ్వేశ్వరరావు, గుడిపాటి వెంకటచలం, బీర్నీడి విజయదత్తు , నారవరెడ్డి, రఘునాధచక్రవర్తి , మడిపడిగ బలరామచార్య, స్పూర్తిశ్రీ, పి. హనుమయ్య, అద్దేపల్లి రామమోహనరావు, శ్రీమతి పి. శ్రీదేవి మున్నగువారు ఉమరు సాహిత్యానువాదమునందు భాగస్వామిత్వమును సంపాదించుకొని తమ భాగధేయమును పండించుకోనిరి. ఇప్పుడిది కరుణశ్రీ కరమునుండి స్రవించిన కమనీయ కవిత్యాస్రవంతి 'అమర్ ఖయ్యామ్."
౨
తెలుగుపొలములో ఖయ్యాము కవితావాహిని త్రిపధగామిని యైనది. పారశీకమూలము ననుసరించిన పాయయొకటి; ఆంగ్లానువాదముల ననుసరించిన పాయ మరొకటి; ఇతరానువాదముల తోడ్పాటుతో ఉమరు తత్వమును స్వాయత్తము చేసికొని స్వతంత్ర్యముగా సాగిన పాయ యింకొకటి.
దువ్వూరి రామిరెడ్డి, బూర్గుల, ఉమర్ ఆలీషా మొదటి పాయను ప్రవహింప జేసినవారు. రెండవ పాయను రాయప్రోలు మొదలుగా పలువురు పలుముఖాల పారించిరి. మూడవ పాయకు భగీరధులు మాధవపెద్ది బుచ్చిసుందరామశాస్త్రి , బీర్నిడి విజయదత్తు మున్నగువారు.
దువ్వూరివారి అనువాదము మిక్కిలి ప్రశస్తికెక్కినది. డాక్టర్ కె. గోపాల కృష్ణారావుగారు "ఒక విధముగ జూచిన ఉమరు ఖయ్యాముకంటే రామిరెడ్డిగారి అనువాదము మధురముగ దోచును. పారశీకము కంటే మాధుర్యమున తెలుగు బాస మించుటయు నందును రామిరెడ్డిగారి రమణీయభావుకత మేళవించుటయు నిందులకు కారణములు" అని ప్రశంసించుటకు పాత్రమయినది.
బూర్గులవారును, ఉమర్ ఆలీషాగారును యధామాతృకముగానే అనువాదము చేసినట్లు ప్రసిద్ది. మొదటివారి పద్యములు మిక్కిలి తక్కువ. రెండవవారి పద్యములు మిక్కిలి యెక్కువ. పాఠాంతరములు కూడ అనూదితములయినవి. ఈ యిరువిరికి మూలము ననుసరించుటలో ఉన్న శ్రద్ధ పద్యరచనా శిల్పమునందు గోచరము కాదు. మూలతత్వమున కిచ్చిన ప్రాధాన్యమును స్థానిక వాతావరణ పరిరక్షణమున కిచ్చినట్లు లేదు.
రెండవ పాయకు చెందినవారిలో మొదటివారు రాయప్రోలు వారు, ఆధునిక కవితాయుగమున కాదిపురుషుడు రాయప్రోలు, అయన సమాన నిర్మాణము , శైలీ విన్యాసము, భావనాసౌకుమార్యము విశిష్టములనుటలో విప్రతిపత్తి లేదు. ఖయ్యాము కావ్యమునందు సైతము ఆయా నిసర్గ లక్షణములు అట్లే అలరారినవి. "నిశాకమండలువు" మొదలయిన ఆర్షసంప్రదాయ సంస్మారక పదముల నుపయోగించుటయు, ఒకటి రెండు మాటలు మాత్రమే మూలములో ఉన్నప్పుడు స్పష్టత కొరకై అయిదారు పదములలో వివరించి వ్రాయుటయు రాయప్రోలువారి అభ్యాసము, మొత్తము గ్రంధమును ఉత్పలమాలాది సమవృత్తములలోనే నిర్వహించుట మరొక సొగసు. కొందరి దృష్టిలో పానశాలకంటే మధుకలశమే మధుర తరము.
ఎక్కువమంది అనువాదకులు ఫిడ్జేరాల్డు రచనమునే అనువదించిరి. ఫిడ్జేరాల్డు రచనలో ఒక విలక్షణత్వమున్నది. అది నాటి పాశ్చాత్యలోకమునకు మహాప్రసాద మయినది. ఎన్ని గ్రంధములు వెలువడినను ఫిడ్జేనాల్డు గ్రంధమునకున్న పలుకుబడి మరియే గ్రంధమునకు దక్కలేదు. ఈ సర్వ విషయములను సమీక్షించిన రిచర్డ్ లీ గలీమీ" అను నత డిట్లు చెప్పెను.
'ఉమరు యొక్క గులాబి నిజామునకు పువ్వు కానేకాదు; పువ్వుగా మారుటకు సిద్దముగా నున్న రేకులు మాత్రమె. రేకులు పారశీకమునుండి వచ్చినవి. ఆంగ్లేయ మాంత్రికుడు వానిని సజీవమైన పువ్వుగా సంతరించినారు.
అందువల్లనే యితర గ్రంధముల కంటే ఫిడ్జేరాల్డు గ్రంధమునకే ప్రశస్తి హెచ్చినది. పారశీకకవికి ప్రపంచ కవిలోకమునందు పెద్ద పీట వేయదగిన ప్రశస్తి తెచ్చినది. ఆదిభట్లవారు పారశీకమూలము ననువాదము చేసినట్లే ఫిడ్జేరాల్డు రచనను కూడా సంస్కృతములోనికిని, అచ్చ తెలుగులోనికిని అనువాదము చేసిరి. గుడిపాటి వెంకటచలంగారు ఆంగ్ల రచనను వ్యావహారిక వచనములోని కనువదించిరి. భారతదేశమునందు కూడ, నాకు తెలిసినంతవరకు, ఒక ఆంగ్లానువాదము వెలువడినది. స్వామి గోవిందతీర్ధ అన్న నామాంతరము వహించిన శ్రీ దాతార్ "The Nectar of Grace' అను పేరుతో సహస్రాదిక సంఖ్యాకములయిన రుబాయీలను మూలవిధేయముగా అనువదించిరి. స్పూర్తిశ్రీ యీ గ్రంధము నుండి యెన్నుకొనిన 249 పద్యములను సమవృత్తములలోని కనువదించి "మధుపాలిక ' అనే పేర ప్రకటించిరి.
ఇప్పుడింక మూడవపాయ. మాధవపెద్ది బుచ్చిసుందరరామశాస్త్రి గారు ఒడుపెరిగి ఒయ్యారముగా పద్యము నడపగల మహాశిల్పి, ఉమరు ఉదయరాగము, మధువు మొదలయిన శీర్షికలతో 120 పద్యముల పరిమితితో వీరి గ్రంధము వెలువడినది. శ్రీ బీర్నిడి విజయదత్తు "స్వర్గావతారణమ్" అను పేరుతొ వివిధ శీర్షికలతో తమ గ్రంధమును వెలువరించిరి. కరుణశ్రీగారు వెలువరించుచున్న "అమర్ ఖయామ్" కూడా ప్రకృత విభాగమును బట్టి యీ కోవకు చెందినది.
ఖయ్యాము కవితావాహిని తెలుగునాట మరొకవిధముగా సైతము త్రిపధగామిని యగుచున్నది. మొదటిపాయ పద్యము; రెండవది గేయము; మూడవది వచనము.
"ఉమర్ ఖయ్యామ్" వయస్సు గుడారములో తలదాచుకొన్న స్థితిని దాటి 'అమర్ ఖయ్యము" గా మారే ననుటకు ఇంతకంటే నిదర్శన మేమి కావలయును? అతని అమరత్వమునకు అతని రసిసిద్దియే కారణము. ఆంగ్లకవి యనువాదము సహకార కారణము మాత్రమే. 'సతి కుడ్యే చిత్రలేఖన" మ్మని ఆర్యోక్తి , బంగారు పళ్ళేరమునకు గోడ చేర్పు కావచ్చును.
3
ఉమర్ఖయ్యాము పూర్తి పేరు ఘియాత్ ఉద్దీన్ అబుల్ ఫతహ్ ఉమర్ బిన్ ఇబ్రహీమ్ "ఇబ్రహీము" తండ్రి పేరు కావచ్చును. "ఖయ్యాము" అని యనగా "గుడారములు నేయువాడని అర్ధము. దీనినిబట్టి కొందరు ఉమరు గుడారములు వేయుట యన్న వృత్తితో జీవించెనని ఊహించిరి. మరొకొందరు ఆ వంశమునందు జన్మించేనే కాని అతని వృత్తి అది కాదని నిరాకరించిరి. కొందరు దీనిని కవితా నామము (తఖల్లస్) గా పరిగణించిరి. ఏదైనప్పటికీ "ఉమర్ ఖయ్యాము" అనునది జగద్విదితమైనది.