"ఏమిటో అనుకున్నాను గాని , మన మనసులు అతి మెత్తనో ఏమిటో! ఆయనలా నా పనిలో సాయం చేస్తుంటే పాపం అనిపించింది. కూరలు తరుగుతూ వేలు కోసుకున్నారు. 'ప్రొద్దుట నీవు వండు, రాత్రి నేను వండుతాను. నీవు మాత్రం నాలా ఉద్యోగం చేయడం లేదా? అలాంటప్పుడు నీవొకర్తివే ఇంటిపని ఎందుకు చెయ్యాలి? ఇన్నాళ్ళూ నాకీ విషయం ఎందుకు తట్టలేదో!' అని ఎంతో బాధపడుతూ అన్నారు. ఎంతయినా మగాడు వంటా గింటా చేస్తుంటే చేయించుకోడానికేదో అదోలా వుంది సుమండీ!" లలిత అంది.
"నిజమే, ముందు ఇలా చెయ్యాలి. అలా చేసి వాళ్ళకి బుద్ది వచ్చేట్టూ చేద్దామనుకున్నామా? ఆరోజు నేను ఇంటిలో చెప్పాచెయ్యకుండా, ఓ స్నేహితురాలిని వెంట పెట్టుకుని సినిమా చూసి పది గంటలకి యింటికి వచ్చినా పాపం అయన విసుక్కోలేదు సరికదా. "అవును పాపం ఇంటిలో అస్తమానుపడి వుండి, వుండి విసుగుపుట్టి వెళ్ళి వుంటావు. సినిమా బాగుందా!' అంటూ అభిమానంగా పలకరించారు. అంతేకాక పిల్లలకి అన్నాలు పెట్టి, అయన తిని , నాకోసం అన్నీ టేబిల్ మీద పెట్టి , వంట ఇల్లంతా సర్ది కడిగేశారు. అదంతా చూస్తె నేనేదో తప్పు చేసినట్లు చిన్నతనం అనిపించి బాధపడ్డాను, మన నిర్ణయాల మాట మరచి .' పద్మావతి అంది.
"నాన్సెన్స్! వాళ్ళందరూ మన "నిరాకరణోద్యమానికి అడ్డు తగలడానికి ఏదో ఎత్తేసుంటారు! అదంతా నిజమని మీరందరూ బుట్టలో పడుతున్నారు, మన ఆశయాలని, నిర్ణయాలని విస్మరించి! వాళ్ళ కల్లబొల్లి మాటలు, ప్రేమ కబుర్లు మాయజాలంలో పడిపోయారు అందరూ..."
"ఇదంతా నటన అని నేను అనుకోను! వాళ్ళ కసలు మన విషయం , మన నిర్ణయాల గురించే తెలిస్తే గదా. ఏదో ఎత్తులు వేశారనుకోడానికి ...." ప్రియంవద సందిగ్ధంగా అంది.
'అయితే కూడబలుక్కున్నట్టు ఒకేరోజు నుంచి ముహూర్తం చూసుకుని అందరూ మారిపోయారంటావా?"
"ఏమో గాని వాళ్ళ ఈ మార్పు సహజమైనదే అనిపిస్తుంది . మన సమావేశం, మన మాటలు, మన నిర్ణయం సంగతి వాళ్ళకి తెలిసే అవకాశం లేదు..... మేమెవ్వరం చెప్పలేదు..... వాళ్ళకేం శ్రవణేద్రియాలున్నాయా? ..... ఇక్కడ మనం, సింహాచలం తప్ప ఎవరూ లేరు గదా ...."
"ఆ ....... సింహాచలం గాని ఎవరితో చెప్పలేదు గదా!" చటుక్కున అంది శారదాదేవి.
"సింహచలమా! దానికేం తెలుసు దాని మొహం!" సులోచన అంది. " అయినా అడుగుదాం .... పిలవండి దాన్ని... ఏయ్ సింహాచలం ఇటురా !"
అమాయకంగా మొహం పెట్టి వచ్చి నిల్చున్న సింహచలాన్ని అందరూ ఒక్క క్షణం చూశారు. "సింహాచలం! మొన్న మేము, అంటే బుధవారం నాడు ఇక్కడ అనుకున్న మాటలు గాని ఎవరితో నన్నా అన్నావేమిటి? ఏ బాబుగార్లన్నా నిన్ను ఏమన్నా అడిగారా?" శారదాదేవి ప్రశ్నించింది.
"అందరి బాబుగార్లతో నేనెందుకు సెపుతానమ్మా. నన్నే బాబుగార్లు అడగలేదు? ఒక్క మావాడు తప్ప!ఇంటి కాడ మా ఇంటివాడు అడిగితె చెప్పానంతే!"
"ఆ ......... మీ ఇంటివాడా? ఏం అడిగాడేమిటి?" పది గొంతుకలు ఒక్కసారిగా ప్రశ్నించాయి.
"మీరంతా ఏటి మాటాడుకుంటారో ఇనమని, ఇని తనకు సేప్పమని, ఆరోజు సాయంత్రం క్లబ్బు కాడనించి వచ్చి చెప్పాడు, అనక ఇంటి కెళ్ళాక నన్నడిగినాడు...."
"ఓ! ----- కొంప ముంచావు గదే! ---- నీ మొగుడు ఆఫీసర్ల క్లబ్బులో బంట్రోతు కాదూ! ----- "శారదాదేవి గాభరాగా అడిగింది.
"అవునండమ్మా!"
"ఇంకేం చూశావా నే చెప్పలేదూ వాళ్ళకి మన మాటలు తెలిసే అలా నాటకం ఆడారని!.... మనం ఇలా అర్ధాంతరంగా సమావేశం అవడం. వాళ్ళు ఇంటిలో అడిగినా మనం ఎవ్వరూ ఈ సమావేశానికి కారణం చెప్పక పోవడం , అందరం కలిసి ఏదో గూడుపుఠాణీ చేస్తున్నట్టు వాళ్ళకి అనుమానం తగిలి వాళ్ళంతా చేరి దీని మొగుడిని పంపి , దీని ద్వారా సంగతి రాబట్టారన్నమాట!..... మా వారే దీనికి మూల కారకులు అయి వుంటారు. ఆరోజు ఆ కధ చదివి నా ఆవేశం , మన సమావేశం, నేను రహస్యంగా ఈ సంగతి వుంచడం ఆయనకి అనుమానం కలిగించి వుంటుంది. అందుకే అందరూ క్లబ్బులో చేరి ఈ ఎత్తేసి లాగారు సమాచారం!....
'అయినా దీనికేం తెగులు! మా దగ్గిర పనిచేస్తూ మా మాటలన్నీ చెపుతావా వాళ్ళకి? ------ నిన్నేం చేస్తే పాపం వుంటుంది. ఇలాంటి వెధవ పని చేసినందుకు!" ఉగ్రురాలైంది శారదాదేవి.
"నాకేటి తెలుసండమ్మ గారు, ఇదంతా రగస్యం చెప్పకూడదని . నాకేటి తెల్సు, అడిగితే సెప్పాను-"
'చాల్లే --- ఇంకా సమర్ధించుకుంటున్నావు చేసిన పని చాలక. నీనించి మా ప్లానులన్నీ తలక్రిందులయిపోయాయి. ఫొ . ఇక్కడనుంచి!"
"ఏమిటమ్మగారూ! తీరికూకుని యీ తగూలాటలు ఎందుకమ్మా! ఓర్పుగొప్ప ఏంటి! మగాడు లేకపోతే ఆడదానికి గడుస్తుందా! ఆడది లేకపోతే మగాడికి గడుస్తుందా! ఇద్దరూ ఒకరికొకరు వుండాల్సిందే గదా! దాని కోసం హక్కులు, గౌరవాలు, విలులూ అంటూ తీరి కూకుని మొగాల్లతో దెబ్బలాటలు ఎట్టుకోడం ఎందుకమ్మా! నాకు తెలీక అడుగుతాగాని!"
అంతా తెల్లబోయి చూశారు. సృష్టి రహస్యాన్ని లోకరీతిని ఇంత తేలిగ్గా రెండు మాటల్లో చెప్పిన సింహాచలం వంక!
--------