Previous Page Next Page 
శ్రీమద్భగవద్గీత పేజి 35


    సంగ్రామమున శోకించుచున్న ద్రోణునితో వారందరు "ద్రోణా! నీవు ఆయుధము వదలి మమ్ము చూడుము. నీవు ఇంతవరకు అధర్మ యుద్దము చేసినావు. నీకు మరణ సమయము ఆసన్నమైనది. కావున ఈ క్రూర కర్మను ఇక చేయవద్దు".
    ఆ మాట చెప్పినారు అంతర్ధానులు అయినారు.
    ధృష్టద్యుమ్నుడు ఆయుధ పాణియై ద్రోణుని పాలిట మృత్యువుగా ఎదుట నిలిచి ఉన్నాడు.
    భీముడు అశ్వత్ధామ చచ్చెనని చెప్పినాడు. మహర్షులు మరణము ఆసన్నమైనదని చెప్పినారు. ద్రోణునకు మనసు కకావికలమైనది. చికాకు పడినాడు. ఇసుకలోనికి కూరుకొని పోవుచున్నట్లయినాడు.
        "సందేహ్యమానో వ్యధితః కుంతీపుత్రం యుధిష్ఠిరమ్
        అహతంవా హతం వెతి పప్రచ్చసుతమాత్మనః
        స్థిరాబుద్ధిర్హి ద్రోణస్య నపార్దో వక్ష్యది నృతమ్
        త్రయాణామపిలోకానామైశ్వర్యార్తే కథంచన"

    సందేహమున కొట్టుమిట్టాడిన ద్రోణుడు వికలమనస్కుడై తన పుత్రుడు చచ్చెనా? చావలేదా? అని యుదిష్టిరుని అడిగినాడు.
    కుంతీపుత్రుడు యుధిష్ఠిరుడు ముల్లోకామూలా ఐశ్వర్యము కొరకు సైతము ఎన్నడైనను అబద్దమాడడని ద్రోణునకు స్థిరముగా తెలియును.
    శ్రీకృష్ణుడు ద్రోణుడు - ధర్మరాజును అడిగిన ప్రశ్నవిన్నాడు అన్నాడు -
    ద్రోణుడు ఈ సగము రోజు యుద్దము చేసిన మన రథికులలో ఒక్కని కూడా దక్కనీయడు. ఈమాటల ద్రోణుని స్తుతించుటకు కాదు. వాస్తవము చెప్పుచున్నాను. ప్రాణములు రక్షించుటకు అబద్దము చెప్పుట దోషము కాదు. "సత్యవాన్ హిత్రయోలో కేస్మిన్". ముల్లోకములందు సత్యవంతునిగా కీర్తిబొందిన నీ మాటవిని ద్రోణుడు ఆయుధము, ప్రాణములు విసర్జించగలడు.
        "తమతథత్యభయే మగ్నో జయే సక్తో యుధిష్ఠిరః
        అశ్వత్థామా హత ఇతి శబ్దముచ్చైశ్చకారహ
        అవ్యక్తమబ్రవీద్ రాజన్ హతః కుంజర ఇత్యుత"

    అసత్య భయమున మగ్నుడును, గెలుపునందు ఆసక్తి గల యుధిష్ఠిరుడు "అశ్వత్ధామ హతుడైనాడని ఉచ్చస్వరమున చెప్పి వినిపించనంత మెల్లగా కుంజరము" చచ్చినది అని అన్నాడు.
    "తస్య పూర్వం రథః పృథివ్యాశ్చతురంగుల ముచ్చితః
    బభూవైవం తేనోక్తేవాహాః స్పృహన్మహీమ్"
    అంతకు ముందు ధర్మరాజు రథము నేలను అంటక నాలుగు అంగుళములు పైన ఉండెడిది. అతడు -అబద్దము చెప్పిన వెంటనే రథాశ్వములు నేలను అనతి నడిచినవి.
    ద్రోణుడు తాను నమ్మిన ధర్మజుని మాటలు విన్నాడు. అశ్వత్థామ మరణించినాడని నిశ్చయించినాడు. తాను పాండవులకు చేసిన ద్రోహమునకు అశ్వత్థామ తన పుత్రుడు చచ్చుట యుక్తము అనుకున్నాడు.
    ఎదుట ధృష్టద్యుమ్నుడు ఉన్నాడు.
    ద్రోణుని ఉత్సాహము, తేజస్సు, శౌర్యము అంతరించినవి.
    ద్రోణుని మనసు నిండ దుఃఖము నిండినది.
    ద్రోణుని వధించుటకే అగ్నినుండి ఉద్భవించిన ధృష్టద్యుమ్నుడు ద్రోణుని మీద బాణములు వేయుచునే వున్నాడు.
    ద్రోణుడు తలచిన అతని దివ్యాస్త్రములు పలుకలేదు.
    దివ్యాస్త్రములు పలుకనందున సాధారణ శరముల ధృష్టద్యుమ్నుని ధనుస్సు విరిచినాడు. గుర్రములను చంపినాడు. సారథిని కూల్చినాడు ధ్వజమును విరిచినాడు. ధృష్టద్యుమ్నుడు వికలుడై గద విసిరినాడు. ద్రోణుడు ముక్కలు చేసినాడు. ధృష్టధ్యుమ్నుడు కరవాలముచే ద్రోణుని సారధిని చంపి, గుర్రములను కూల్చినాడు. ద్రోణుడు ధృష్టద్యుమ్నుని కత్తిని నరికి నొప్పించినాడు. అది చూచి సాత్యకి వచ్చి ద్రోణుని మీద పది క్రూరబాణములు వేసినాడు. భీముడు వచ్చి ధృష్టద్యుమ్నుని తప్పించినాడు.
    ఆ విధముగా భీష్ముడు పడిపోయిన పిమ్మట నాలుగు రోజులు, ఒకరాత్రి, ఇరువది గడియలు యుద్దము చేసిన ద్రోణాచార్యుడు మహారణ్యమును దహించిన దావానలమువలె పాండవ సేనను హతమార్చి ఆరిన నిప్పువలె శాంతించినాడు. తన చేత ఉన్న ధనుర్భాణములు రథము మీద పెట్టినాడు. రథము మీద కూర్చున్నాడు. పుణ్య స్వరూపుడైన ద్రోణుడు యోగనిష్ఠను పొందినాడు. జ్యోతిర్మయ స్వరూపుడై వెలుగొందినాడు.
    ద్రోణునకు బాహ్యప్రపంచము తెలియదు.
    యోగమును అవలంబించినాడు. అంతర్ముఖుడైనాడు.
    ద్రోణుడు వెలుగు రూపమును, వెలుగు ద్రోణుని రూపము దాల్చినవి.
    ధృష్టద్యుమ్నుడు కరవాలము పట్టుకొని పాదచారియై ద్రోణుని రథము వైపునకు సాగినాడు.
    అంతకు ముందే యోగనిష్టుడైన ద్రోణుని దేహము విడిచి ఒక మహాజ్యోతి ఆకాశమునకు ఎగసి పరమపదమునకు పోయినది. అట్లు నిర్గమించిన దివ్యజ్యోతి సంజ యునకు శ్రీకృష్ణునకు, అర్జునునకు, ధర్మరాజునకు, కృపాచార్యులకు తప్ప అన్యులకు కనిపించలేదు.
    ఖడ్గపాణియై ద్రోణుని రథము వైపునకు సాగిన ధృష్టద్యుమ్నుని చూచి ఉభయసైన్యములు హాహాకారములు చేసినవి. 'వలదు వలదు' అని కేకలు పెట్టినవి. అయినను ధృష్టధ్యుమ్నుడు ద్రోణుని రథము ఎక్కి ద్రోణుని మృతశరీరపు కళేబరపు జుట్టుపట్టుకొని కంఠమును అతి క్రూరముగా నరికినాడు. తలను, మొండెమును నేలమీద పడవేసినాడు.
    ద్రోణుని ఆత్మజ్యోతి అనంత ఆకాశమున లీనమైనది.
    ద్రోణుని పార్ధివ శరీరము పృథ్వి మీద పడినది.
    
    వాదోపవాదములు
    
    "అన్నా! ధర్మజా! నీవు సత్యవ్రతుడవని నమ్మి ద్రోణుడు చచ్చినాడు. వారించినను వినక ధృష్టద్యుమ్నుడు ద్రోణుని తల నరికినాడు. వీటివలన లోకమున మనకు అపకీర్తి వచ్చును. అశ్వత్ధామ పుట్టినపుడు ఇంద్రుని ఉచ్చైశ్రవము సకిలించినందున ఆ పేరు వచ్చినది. అశ్వత్దామ మహావీరుడు. అతడు మన సైన్యమును, ధృష్టద్యుమ్నుని హతమార్చుట తథ్యము. వారిని రక్షించుట నీకు గాని ఇక్కడివారికి గాని సాధ్యపడదు" అని బెదిరించినాడు అర్జునుడు.
    అర్జునుని మాట విన్నాడు భీముడు. గర్జించినాడు.
    "అర్జునా! అడవులందు కాయగసరులు తిను మునులవలె మాట్లాడుచున్నావు! నిండు సభలో ద్రౌపది బట్టలు విప్పి పరిహసించుట యెరుగవా? వారు మనను పెట్టిన హింసలకు ఎందరు ద్రోణులను చంపినను మనను పాపము తాకదు. నీ మాటలు పగిలిన పుండుమీద ఉప్పు చల్లినట్లున్నవి. నీవే మొనగాడవనుకొనకుము. నాకు కూడా చేతనగును కౌ=రవసేనను హతమార్చక మానను చూడుము".
    
    ధృష్టద్యుమ్నుడు వివరించినాడు


    అర్జునా! నీవు నీ తండ్రికి మిత్రుడగు భగదత్తుని చంపినావు. మీ పితామహుడు భీష్ముని వధించినావు. ఇవి ధర్మములు అగునా? శత్రువు ఏ రూపమున ఉన్నను చంపుట దోషము కాదు. అందువలన ధర్మజునకు అసత్యవాద దోషము అంటదు. నేను పుట్టినదే ద్రోణుని చంపుటకు నా ధర్మము నిర్వర్తించి నాను. నా తప్పులు లేవు. నీవు ఎన్నపనిలేదు. శత్రువును ఎదిరించుము.
    సాత్యకి ధృష్టద్యుమ్నుని మాట విని భగ్గుమన్నాడు.
    "ఓరీ! ధృష్టద్యుమ్నా! ఎంతటి మాటలంటివిరా! ఇంకను నీ నాలుక తెగకుండుట తల పగలకుండుట ఆశ్చర్యము! మహాత్ముడగు ద్రోణుని అవమానింతువా? అర్జునుడు భీష్ముని అనుమతి పొంది బాణములు వేసినాడు. శిఖండియు, నీవును పాంచాల కులమున చెడపుట్టినారు" అని తెగడినాడు.
    ధృష్టద్యుమ్నుడు నిప్పులు చెరిగినాడు.
    "ఓరీ సాత్యకీ! నీవు భూరిశ్రవుని గొంతు తరగుట న్యాయమా? భూరిశ్రవుడు నిన్ను చంపకుండ అర్జునుడు వాని చేయినరుకుట న్యాయమా? పరధ్యానమున ఉన్న సైంధవుని దొంగచాటున అర్జునుడు చంపుట న్యాయమా? ద్రోణుని ఎన్ని మారులు ఎదిరించితినో, ఎన్ని తిప్పలు పెట్టితినో ఎరుగుదువా? ఇక్కడ కాదు నీ ప్రతాపము శత్రుసేనల మీద చూపుము".
    "ఓరీ! ధృష్టద్యుమ్నా! అధిక ప్రసంగము చేసిన ఒక్క వెతుకు కూల్తును" అని సాత్యకి ధృష్టద్యుమున్నని మీదికి ఉరకగా శ్రీకృష్ణుడు పంపగా భీముడు వెళ్ళి సాత్యకిని పట్టుకున్నాడు. "భీమా! విడువుము. సాత్యకికి చూపింతును నాశక్తి. నేను ఒంటి చేతి భూరిశ్రవుడను కాను" అన్నాను ధృష్టద్యుమ్నుడు. సాత్యకి భీముని పట్టును విడిపించుకొన జాలక పామువలె బుసలు కొట్టినాడు.

 Previous Page Next Page