Previous Page Next Page 
ఫాలాక్షుడు పేజి 34


    టిక్కెట్ తీసుకుని పరిసరాల్ని పరిశీలిస్తూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. వైటింగ్ హాల్లో సగానికి పగిలిపోయిన అద్దంలో తన ముఖాన్ని చూసుకుని తనే ఉలిక్కిపడ్డాడు.

 

    పై పెదవి మీద గాయం యింకా తగ్గలేదు... చెంపలమీద చీరుకుపోయిన గాయాలు...

 

    ఈనాడు పేపర్ని చూసిన వాళ్ళెవరైనా తనని చూస్తే స్పష్టంగా గుర్తుపడతారు... ముఖాన్ని కప్పుకోవాలి...

 

    తప్పదు... స్టేషన్ బయటికొచ్చి ఒక తువ్వాలు కొనుక్కొని చుట్టుకున్నాడు.

 

    ఇప్పుడతనికి ధైర్యంగా వుంది.

 

    మరో పది నిమిషాల తర్వాత ట్రైన్ వచ్చింది. ఎక్కి కూర్చున్నాడు.

 

    ట్రైన్ లో ఎక్కువమంది జనం లేరు.

 

    నెమ్మదిగా నడుస్తోంది ట్రైన్.

 

    అరగంట తర్వాత ట్రైన్ ఏదో స్టేషన్లో ఆగింది.

 

    "మరాఠ గూడెం."

 

    పేరు విచిత్రంగా అనిపించింది.

 

    కంపార్ట్ మెంట్లో పూర్తిగా పదిమంది కూడా లేరు. ట్రైన్ కదులుతుండగా పరుగుపరుగున వచ్చి ఓ యువతీ చిన్నపాపతో ఎక్కింది.

 

    ఆ యువతికి పాతికేళ్ళపైనే వుంటాయి. చక్కగా కుందనపు బొమ్మలా వుంది సన్నగా, పొడవుగా వుంది. మెడలో మంగళసూత్రం, కాళ్ళకు మట్టెలు, చేతులకు రెండు బంగారు గాజులు, చక్కగా అల్లుకున్న పొడవాటి జడ.

 

    ఆ జడలో ఒకే ఒక గులాబీ పువ్వు... చక్రాల్లాంటి కళ్ళు...

 

    అందానికి అందమైన నిదర్శనంలా వుంది ఆ అమ్మాయి.

 

    ఆ యువతి పక్కన బుద్ధిగా కూర్చున్న పాపకు నాలుగో, అయిదో సంవత్సరాలుంటాయి.

 

    గుండ్రటి ముఖం, అందమైన పెదాలు, ఉత్సాహంగా చేతులు తిప్పుతూ రకరకాల ప్రశ్నలు వేస్తోంది తల్లిని.

 

    వాళ్ళిద్దరూ ఆదిత్య కెదురుగానే కూర్చున్నారు.

 

    ఆ యువతీ పక్కన ప్లాస్టిక్ బ్యాగ్...

 

    వాళ్ళది దగ్గర్లో వున్న గ్రామం కావచ్చు....

 

    ఆ చిన్న పాపను తన దగ్గరకు రమ్మంటున్నట్టుగా కళ్ళతోనే సంజ్ఞ చేశాడు ఆదిత్య.

 

    రానని తల అడ్డంగా ఊపేసింది ఆ పాప. నవ్వుకున్నాడు ఆదిత్య.

 

    ఆ యువతి కిటికీలోంచి కదిలిపోతున్న చెట్లవైపు, ఎలక్ట్రిక్ స్తంభాలవైపు, పచ్చని పొలాలవైపు చూస్తోంది.

 

    ఆ అమ్మాయినీ, ఆ పాపనూ చూడగానే ధరణికుమార్ భార్య, పాప గుర్తుకొచ్చారు ఆదిత్యకు.

 

    గంట గడిచింది.

 

    "నేను శివదేవుని పల్లె వెళ్ళాలి. ఎలా వెళ్ళాలో చెప్తారా?" ఆ యువతిని అడిగాడు ఆదిత్య.

 

    తలతిప్పి చూసిందామె ఆదిత్యవైపు.

 

    "వెంకటాపురం స్టేషన్లో దిగండి. అక్కడ గుర్రపు బగ్గీలుంటాయి. సగం దారివరకూ వస్తాయి... గుండుపాలెం వరకూ. అక్కడ నుండి నడవాలి" చెప్పిందా యువతీ.

 

    "వెంకటాపురం స్టేషన్ కు చాలా దూరంలో వుందా గ్రామం..." మళ్ళీ అడిగాడు ఆదిత్య.

 

    "అవును... ఆంధ్రా, మహారాష్ట్ర బోర్డర్ లో వుందా గ్రామం. అసలా  గ్రామం వున్నట్టే ఎవరికీ తెలీదు. రిమోట్ విలేజ్... ఇదే మొదటిసారా అక్కడికి వెళ్ళడం?"

 

    ఔనన్నట్టుగా తలూపాడు ఆదిత్య.

 

    "నేను వెంకటాపురంలోనే దిగుతాను. నాతోపాటు దిగండి" చెప్పిందా యువతి.

 

    సగం సమస్య తీరిపోయింది ఆదిత్యకు.

 

    మరో గంట గడిచింది.

 

    మహమ్మద్ పేట అనే స్టేషన్లో ట్రైన్ ఆగింది.

 

    "వచ్చేదే వెంకటాపురం" చెప్పిందా యువతి. అయిదు నిమిషాల తర్వాత ట్రైన్ మళ్ళీ బయలుదేరింది.

 

    వాతావరణం ఆహ్లాదంగా వుంది. ఎందుకో ధరణి కుమార్ జ్ఞాపకానికొచ్చాడు. మనసంతా దిగులుగా అయిపోయింది ఆదిత్యకు.

 

    తను ఊహించని వింత సంఘటనలన్నీ జీవితంలో జరుగుతున్నాయి.

 

    మరో ఇరవై నిమిషాల తర్వాత-

 

    "వెంకటాపురం" వచ్చింది.

 

    నెమ్మదిగా ట్రైన్ ప్లాట్ ఫారమ్మీద ఆగింది.

 

    ఎక్కువమంది జనమే వున్నారు. మిగతా స్టేషన్ లతో పోల్చుకుంటే, పాపను ఒక చేత్తో పట్టుకొని, కుడిచేత్తో సంచిని పట్టుకుని లేస్తూ-

 

    "దిగండి" అంది ఆ యువతీ తను ముందుకు నడుస్తూ.

 

    ఆమె వెనకే నడుస్తూ అకస్మాత్తుగా కిటికీ పక్కన కనిపించిన ఖాకీడ్రెస్సును చూసి ఆగిపోయాడు ఆదిత్య.

 

    తలవంచి ప్లాట్ ఫారం మీదకు చూశాడు.

 

    కంపార్ట్ మెంట్ ఎక్కుతూ ఒక పోలీసు, ప్లాట్ ఫారమ్మీద అటూ యిటూ తిరుగుతున్న పోలీసులు.

 

    ఆదిత్య తనను తాను హెచ్చరించుకున్నాడు.

 

    అంటే... తనకోసమే పోలీసులు వెతుకుతున్నారేమో! లేకపోతే ఏ స్టేషన్ లోనూ కన్పించని పోలీసులు యిక్కడెందుకున్నారు?

 

    ఏమాత్రం ఆలస్యం చెయ్యలేదు ఆదిత్య.

 

    గబగబా వెనక్కి నడిచి టాయ్ లెట్ లోకి దూరిపోయాడు.

 

    కంపార్ట్ మెంటు ఎక్కిన పోలీసు కానిస్టేబుల్ అటూ ఇటూ చూసి, మళ్ళీ దిగిపోయాడు.

 

    ప్లాట్ ఫారం దాటి, చెకింగ్ కలెక్టర్ ను దాటుకొని, స్టేషన్ లోనుంచి బయటికొచ్చి వెనక్కి చూసిందా యువతి.

 

    ఆమెకు ఆదిత్య ఎక్కడా కనిపించలేదు.

 

    "ఏమైపోయాడబ్బా?" అనుకుంటూ చుట్టూ చూసింది. ఏం జరిగిందో అర్ధంకాలేదామెకి.

 

    తలతిప్పి కదులుతున్న ట్రైన్ వేపు చూస్తూ ముందుకడుగేసిందా యువతి.

 

    ఆ యువతీ పేరు సుమబాల!

 

    ఆ పాప పేరు ప్రెటీ!

 

    ట్రైన్ కదలడంతో టాయ్ లెట్ లోంచి బయటికొచ్చిన ఆదిత్య విండోలోంచి బయటికి చూశాడు.

 

    ప్లాట్ ఫారమ్మీద పోలీసులలాగే వున్నారు.

 

    ఏం చెయ్యాలో తోచక నిట్టూరుస్తూ సీట్లో కూర్చుండిపోయాడు ఆదిత్య.

 

    ట్రైన్ పరుగెడుతూనే వుంది.

 

    మరో నలభై నిమిషాలవరకూ ట్రైన్ ఎక్కడా ఆగలేదు.

 

    "వచ్చే స్టేషన్ ఏమిటి?" పక్కనున్న వ్యక్తిని అడిగాడు ఆదిత్య.

 Previous Page Next Page