మాట్లాడకుండా, చాచి అతని చెంపమీద కొట్టాడు శతృఘ్న.
గింగిరాలు తిరిగి వెనక్కిపడ్డాడు వెంకట్రావు.
ఆ క్షణంలో శతృఘ్న దృష్టీ, ఇక్బాల్ దృష్టి, వెంకట్రావు మీదే కేంద్రీకృతమై ఉంది.
విక్టర్ తన ధ్యాసలో తను ఉండి శాలినివైపే ఆరాధనగా చూస్తున్నాడు. ఆమె గుండెమీద పమిటలేదు. చీరెకట్టు కొద్దిగా కిందికి జారి నాభి లోతుగా కనబడుతోంది.
శతృఘ్నకి కంట్రోల్ చెయ్యడానికి ఇదే అదనని తోచింది రాజేందర్ కి.
రెండే రెండు అంగల్లో శతృఘ్నని చేరి వెనకనుంచే వాటేసుకోగలిగితే, అతన్ని అడ్డం పెట్టుకుని మిగతావాళ్ళ పని పట్టవచ్చు. అతనికంటే తను భారీ మనిషి కాబట్టి తనపని అంత కష్టం కాకపోవచ్చు.
నెమ్మదిగా సీట్లోనుంచి లేచి, శతృఘ్న మీదకు లంఘించడానికి దేహాన్ని సన్నద్ధం చేశాడు రాజేందర్.
* * * *
రూల్సు ప్రకారం నడుచుకోబోయిన వాడిని రూళ్ళ కర్రతో బాదినట్లయింది, సిన్సియర్ సబ్ ఇన్ స్పెక్టరు వెంకటరెడ్డి పని.
ఆడవాళ్ళని వేధించిన ఆకతాయి వెధవలు ఇద్దరిని అతను లాకప్ లో పెడితే పొలిటీషియను వెంకట్రావు పోలీసు డిపార్టుమెంటుని హడలగొట్టి ఆ కుర్రాళ్ళని విడిపించి, రెడ్డికి ద్వీపాంతరవాస శిక్ష విధించినట్లు మారుమూల ఊరికి ట్రాన్స్ ఫర్ చేయించాడు. ఆఘమేఘాలమీద జరిగిపోయింది ఆ పని.
మామూలుగా అయితే ట్రాన్స్ ఫర్ అయినవాళ్ళు ఆ కొత్తచోటికి వెళ్ళడానికి జాయినింగ్ టైం కొంత తీసుకోవచ్చు. రెడ్డికూడా అలాచేసి ఉండేవాడే. కానీ, అతనికి వ్యవధి ఇవ్వలేదు. అతను వెళ్ళవలసిన ప్రదేశంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణిస్తోందనీ, అతను తక్షణం వెళ్ళి జాయిన్ కావాలని ఆర్డర్సు వచ్చాయి. మరుసటి రోజు ఉదయం అతను అక్కడ చేరిపోవడానికి వీలుగా పోలీస్ వేన్ ఒకటి అరేంజ్ చేశారు, డ్రైవర్నీ ఇచ్చారు.
తను వెళ్ళవలసిన ఊరిలో అంతకుముందు పనిచేసిన సబ్ ఇన్ స్పెక్టరు కూడా చాలా స్ట్రిక్టు మనిషి అనీ, గిట్టనివాళ్ళు అతన్ని గండ్రగొడ్డలితో నరికి హత్య చేశారని తెలిసింది రెడ్డికి.
అందుకే ఆ స్థానంలో మరొకళ్ళని వెయ్యడానికి ఈ తొందర!
సంతోషంలేని నవ్వు నవ్వుకున్నాడు రెడ్డి. సో! తనను వెదికి వెదికి మాంచి పనిష్మెంట్ ఏరియాకి పంపిస్తున్నారన్నమాట.
భార్యని తనతోబాటు తీసుకెళ్ళే సావకాశం లేదు. ఇప్పుడు ఆమెని హైదరాబాద్ లో ఉంచి తనొక్కడే వెళ్ళిపోవాలి ముందు.
ఆ తర్వాత సంగతి తర్వాత?
తెల్లవారుఝామున ఆ బస్తీని సమీపించింది పోలీస్ వాన్. బస్తీకి చుట్టుపక్కలంతా శాటిలైట్లలా చాలా పల్లెలు వున్నాయి.
ఒక పల్లెని చేరగానే రోడ్డుమీద మానవాకారం ఒకటి మసకచీకట్లో చేతులూపుతూ కనబడింది.
వేన్ ఆగింది.
"నా పేరు మాబూ సాయిబు సార్! ఇక్కడ కానిస్టేబుల్ని" అన్నాడు అతను. "మీకు ఈ ఊళ్ళోనే మకాం ఏర్పాటు చెయ్యమని దొరగారు చెప్పాడు సారు!"
"సరే! వేన్ ఎక్కు!" అన్నాడు రెడ్డి.
కానిస్టేబులు ఎక్కాడు.
"నీ పేరేమిటన్నావూ?"
"మాబూ సాయిబండీ!"
"ఏమిటీ?"
"మాబూ సాయిబు"
కొద్ది నిమిషాల తర్వాతగానీ రెడ్డికి తట్టలేదు అది మహబూబ్ సాహెబ్ అయి ఉంటుందని. చిన్నగా నవ్వుకున్నాడు.
వాను కదిలింది.
"డ్రయివర్ గారూ! అటొద్దు! ఇటు పోనియ్యండి." అన్నాడు మహబూబ్ ఆదుర్దాగా.
"ఎందుకూ?" అన్నాడు రెడ్డి.
తటపటాయించాడు మహబూబ్. "అక్కడ దొమ్మీ జరుగుతోంది. మనం వెళ్తే డేంజరు!"
సీట్లో నిటారుగా కూర్చున్నాడు రెడ్డి.
"దొమ్మీ జరుగుతూంటే తక్షణం అక్కడికి చేరుకోవాలి మనం! ఇంకెటో వెళ్దామంటావేమిటి?" అన్నాడు అసహనంగా.
"ఈ ఊరి కొట్టాటల్లోకి పోలీసులు రారు సార్! మొండిగా జోక్యం చేసుకున్న పాత ఎస్సైగారు ఏమయ్యారో మీకు తెల్సుగదండీ!"
"నాన్సెన్స్! డ్రైవర్! వాన్ ని నేరుగా పోనివ్వు!" అన్నాడు రెడ్డి.
బెదురుగా ఓసారి చూసి వాన్ ని ముందుకు పోనిచ్చాడు డ్రైవరు.
దూరం నుంచి అరుపులూ, కేకలూ, ఏడుపులూ వినబడుతున్నాయి అస్పష్టంగా.
"త్వరగా పోనీ!" అన్నాడు రెడ్డి.
వేను వేగం హెచ్చింది.