Previous Page Next Page 
సీతాచరితం పేజి 35

   
    తెల్లవారింది:


    తెల్లవారింది. దశరథుణ్ణి మేల్కొల్పడానికి వైతాళికులు వచ్చారు. రాజు వారిని నిరాకరించాడు. వారు వెళ్లిపోయారు. కైక మళ్లీ మొదలుపెట్టింది.


    "సత్యమే ఓంకారం. సత్యమే ధర్మం. వేదాలన్నీ సత్యాన్ని గురించే ఘోషిస్తున్నాయి. సత్యం వల్లనే మోక్షం కలుగుతుంది. నీవు ధర్మబుద్ధివి, నాకు తెలుసు. సత్యాన్ని ఆచరించు. నేను కోరిన వరాన్ని చెల్లించు. బలిచక్రవర్తి మూడడుగుల నేల ఇస్తానని వాగ్ధానం చేశాడు. ఇచ్చాడజు. అలాగే నువ్వు నాకు ఇచ్చినమాట చెల్లించుకో."


    ఆ మాట విన్నాడు దశరథుడు కోపంతో పిచ్చివాడైపోయాడు - అన్నాడు.


    "ఛీ నీచురాలా! నిన్ను వదిలేస్తున్నాను. నువ్వు నాకు పెళ్లానివి కావు. నీవు పెళ్లానివి కానప్పుడు భరతుడు నాకు కొడుకు కాడు. రాముడే నాకు శ్రాద్ధం చేస్తాడు. నీకు గాని నీ కొడుక్కుగాని ఆ హక్కు లేదు. రాముడు అడవులకుపోతే నేనే కాదే కోసలదేశం నశిస్తుంది."


    కైక తొణకలేదు బెణకలేదు. "రాజా! ఎందుకలా విషం కురిపిస్తావు. మాట ఇచ్చావు. చెల్లించు. రాముణ్ణి అడవులకు పంపు. భరతునికి పట్టం కట్టు" అని కొరడాతో కొట్టి గుర్రాన్ని లొంగదీసినట్లు లొంగదీసింది కైక. దశరథుడు ధర్మబుద్ధుడు. కైక కోర్కె తీర్చక తప్పింది కాదు. "రాముణ్ని చూడాలి" అన్నాడు.


    సూర్యుడు ఉదయించాడు. ముహూర్తం సమీపించింది. వశిష్ఠుడు వచ్చాడు. దశరథుని దగ్గరకు సుమంత్రుణ్ని పంపించాడు. సుమంత్రుడు దశరథుని దగ్గరకు వెళ్లాడు.  "పట్టాభిషేకానికి అన్నీ సిద్ధంగా వున్నాయి. ముహూర్తం సమీపించింది. వశిష్టుడు సిద్ధంగా ఉన్నాడు. విచ్చేయవలసింది" అని విన్నవించాడు.


    సుమంత్రుని మాటలు దశరథునికి ములుకుల్లా గుచ్చుకున్నాయి. "సుమంత్రా! నీ మాటలతో నా గుండె చీలుస్తున్నావు" అన్నాడు దీనంగా. సుమంత్రుడు ఆశ్చర్యపడ్డాడు.  అతనికి ఏమీ అర్ధం కాలేదు. "ఎందుకలా ఆశ్చర్యపడ్తావు? పట్టాభిషేకం జరుగుతుందని ఆనందంలో ఉన్నాడు రాజు! రాత్రి సాంతం నిద్రించలేదు!! రాముణ్ని చూడాలనుకుంటున్నాడు. వెళ్లి తీసుకొనిరా. ఇది రాజాజ్ఞ" అన్నది కైక.


    రాజాజ్ఞ విన్నాడు రాముడు బయల్దేరాడు. అగ్నివలె ప్రకాశిస్తున్న రథం ఎక్కాడు. అది మేఘగర్జనలా సాగింది. లక్ష్మణుడు వెనుక కూర్చుని చామరం వీస్తున్నాడు. ఆ రథం వెనుక అనేక అశ్వాలూ, గజాలు బయలుదేరాయి.క వీధుల్లో జనం గుమిగూడారు. వారు రాముణ్ని చూశారు. జయధ్వానాలు చేసారు. రాముని రథం రాజప్రాకారం చేరుకుంది. రాముడు మూడు ప్రాకారాలను రథం మీదనే దాటాడు. రెండు ప్రాకారాలు కాలినడకన సాగాడు. అక్కడే అందరినీ ఉండమన్నాడు. అంతఃపురంలో ప్రవేశించాడు.


    రాముడు దుఃఖంతో కుమిలిన దశరథుణ్ణి చూచాడు. పాముతోక తొక్కినవానిలా బెదిరిపోయాడు.


    దశరథుడు దుఃఖంతో నల్లపడిపోయాడు. అతని మనసు సాధారణంగా క్షోభించేదికాదు. అది సముద్రంలా క్షోభిస్తుంది. అతడు రాహు గ్రస్తుడయిన సూర్యునిలా ఉన్నాడు. అబద్ధం ఆడి నిస్తేజుడయిన ఋషిలా ఉన్నాడు.


    రాముడు దశరథుని చూచాడు. భరించలేకపోయాడు. అయినా సమీపించాడు. అతడు పౌర్ణమినాటి సంద్రంలా కలతచెందాడు. ముందుకు నడచాడు. ముందు దశరథునికి, తర్వాత కైకకు పాధాభివందనం చేశాడు.


    దశరథుని గొంతు దుఃఖంతో పూడుకొనిపోయింది. మాట పెకిలిరావడం లేదు. దుఃఖం పొంగులు వారుతూంది.


    "రామా!" అన్నాడు అంతే. ఇహ పలకలేకపోయారు. దుఃఖం ముంచుకుని వచ్చింది. కన్నీరు జలజల రాలింది.


    రాముడు అది చూచాడు. భరించలేకపోయాడు. దుఃఖంతో గుండె నిండిపోయింది. తండ్రికి తనమీద కోపం వచ్చిందనుకున్నాడు. కైకను అడిగాడు.


    "అమ్మా! నా తండ్రి ఎంతో కోపంలో ఉన్నా నాతో తీయగా మాట్లాడ్తాడే! ఎందుకమ్మా అలా ఉన్నాడు? నా మీద కోపం వచ్చిందా? నేనేమైనా అపరాధం చేశానా? నా తండ్రికి ఏమైన జబ్బు చేసిందా? అతనికి కోపం తెప్పించేపని ఎవరైనా చేసారు? నా తండ్రికి కోపం వస్తే నేను భరించలేను. నా తండ్రి దుఃఖం నేను భరించలేను. చెప్పుతల్లీ చెప్పు నేను భరించలేకున్నాను."


    "రామా! నా మంచి నాయనా! నీ తండ్రికి ఎవరూ ఎలాంటి అపకాలం తలపెట్టలేదు. అతనికి ఎవరిమీదా ఎలాంటి కోపం లేదు. జబ్బు కానేకాదు. అతడు నీతో ఒకమాట చెప్పాలనుకున్నాడు. అందుకతనికి ధైర్యం చాలకున్నది. భయపడుతున్నారు. పామరునిలా విలపిస్తున్నాడు. అంతకుమించి ఏమీలేదు.


    నీ తండ్రి నాకు పూర్వం రెండు వరాలిచ్చాడు. వాటిని ఇప్పుడు కోరుకుంటున్నాను. వాటిని తీర్చలేని దుర్బలుడై ఏడుస్తున్నాడు. ఇంతకూ వాటిని నెరవేర్చాల్సింది నువ్వు. నీ తండ్రి అసత్యవాది కాకుండా కాపాడవలసింది నువ్వు. తండ్రి ప్రతిజ్ఞ నెరవేరాల్సిన తరుణం వచ్చింది. "నెరవేరుస్తాన"ని ముందు నాకు మాట ఇవ్వు" కైక మెల్లగా చెప్పింది. రాముని మీదికే ఒక ఉచ్చు విసిరింది.


    "తల్లీ! ఎంత మాటన్నావు?" రాముడు అన్నాడు. దశరథుడు నాకు తండ్రి, గురువు, రాజు. అతని ఆజ్ఞ అవుతే అగ్గిలో దూకగలను. విషం తినగలను. సముద్రంలో దూకగలను. రాముడు రెండు నాల్కలవాడు కాడు. రామోద్విర్నాభిభాషతే"


    కైక కుండబద్దలు కొట్టింది. "ఏం లేదు. ఒక వరానికి నీవు పధ్నాలుగేళ్లు అడవికి వెళ్లాలి. రెండో వరానికి భరతుడికి పట్టం కట్టాలి."


    ఆ మాట అప్రియం లాంటిది. మరణం లాంటిది. అయినా రాముడు కలత చెందలేదు.


    "తల్లీ! నీవు చెప్పినట్లే చేస్తాను. నా తండ్రి మాట నిలపడానికి అడవులకు వెళ్తాను. భరతుడు నాకు తమ్ముడు. స్వచ్ఛందంగానే అతనికి సీతనూ, రాజ్యాన్నీ, ప్రాణాన్నీ, ధనాన్నీ ఇస్తాను. అలాంటప్పుడు అతనికి రాజ్యం ఇవ్వడం నీకూ, నా తండ్రికీ సంతోషం కలిగిస్తే అంతకన్నా కావల్సిందేమి? భరతుని పిలిపించు. పట్టం కట్టు. నేను పధ్నాలుగేళ్లు అడవులకు వెళ్లిపోతాను" అన్నాడు.

 Previous Page Next Page