రాముని మాటలు విన్నది కైక. ఆమె సంతోషం పట్టలేకపోయింది. తొందర హెచ్చింది. "ముందు నువ్వు అడవులకు వెళ్లు. తరవాత భరతునికి పట్టాభిషేకం జరుగుతుంది. నీవు ఇహ ఒక్క క్షణమైనా నగరంలో ఉండరాదు. నీవిక్కడ ఉన్నంతకాలం నీతండ్రి స్నానం చేయడు. భోజనం చేయడు."
దశరథునికి కైక మాటలు పిడుగుల వానలా ఉన్నాయి. అతడు దుఃఖంతో కాలిపోయాడు. వేడి నిట్టూర్పులు విడిచాడు. మూర్ఛపోయాడు. రాముడు దశరథుణ్ణి లేవదీశాడు. కొరడా దెబ్బతిన్న గుర్రంలా అడవులకు వెళ్లడానికి త్వరపడ్డాడు.
"దేవీ! నీకు ధనం మీద ఆశక్తిలేదు. లోకాన్నిగాని, ఏ ఇతరవస్తువునూ కోరను. నేను ధర్మాన్ని అనుసరించి ఉన్నవాణ్ణి. మహితుల్యుణ్ణి. తండ్రి సేవచేయడం. అతడు చెప్పినట్లు నడచుకోవడం కంటే ధర్మం లేదు. తండ్రి ఆజ్ఞ అయింది. అడవులకు వెళ్లిపోతాను. నా తల్లి కైసల్యనూ, భార్య సీతనూ ఊరడించి ఇవ్వాళే దండకారణ్యానికి వెళ్లిపోతాను. భరతుడు రాజ్యం పాలించేట్టూ, తండ్రికి శుశ్రూష చేసేటట్టూ చూడాల్సిన భాధ్యత నీది. అది సనాతన ధర్మం."
రాముడు దశరథునికీ, కైకకూ నమస్కరించాడు. రాముని మాటలు విన్నాడు దశరథుడు. దుఃఖం ఆపుకోలేకపోయాడు. భోరున ఏడ్చాడు.
రాముడు వెళ్లిపోయాడు.
దశరథుడు ఒక క్లేశంలో వున్నాడు. ఒక ఉచ్చులో ఇరుక్కున్నాడు. అతడు సుమారు నిశ్చేష్టుడైనాడు. కైక అతని తరపున బాహాటంగా ఆజ్ఞలు ఇచ్చేస్తూంది.
ఇలా వుంది స్థితి. అలాంటి సమయంలో రాముడు వచ్చాడు. తండ్రి స్థితి చూచాడు. పరిస్థితి అర్థం చేసుకున్నాడు. కైక వున్న విషయం చెప్పింది. అప్పుడు రాముడు ఏం చేయాలి? తండ్రి మాట నిలబెట్టడానికి అడవులకు వెళ్లడమా? రాజ్యం తన హక్కు అని పోట్లాడ్డమా?
ఇలాంటి క్లిష్టదశలో ఏ తండ్రిగాని ఏ కొడుకు గాని ఆశించేదేమి? తండ్రికి తోడ్పడ్డం, కాని తండ్రి తప్పులు తోడడం కాదు.
తండ్రి విషయంలో రాముని అపారం అయిన ప్రేమ వుంది. అభిమానం ఉంది. గౌరవం వుంది. తండ్రికి కొడుకు విషయంలోనూ అంతే. దశరథునికి రాముడంటే ప్రాణం. పరస్పర అనురాగం వుంది. అనుభవం ఉంది.
ఇక్కడ రామునికి రెండు ప్రత్యామ్నాయాలున్నాయి. ఒకటి రాజ్యం సాధించడం, రెండోది తండ్రిమాట నిలబెట్టడం. ఈ తండ్రి మాట నిలబెట్టడం అనేది తండ్రి విషయంలో అతనికి గల ప్రేమ. ప్రేమనే వరించాడు రాముడు. త్యాగానికి సిద్ధం అయినాడు. రాజ్యం వదులుకుంటానన్నాడు. వదులుకున్నాడు.
ప్రేమ విలువను గుర్తించిన వాడు వాల్మీకి.
ప్రేమకోసం రాజ్యాలు వదులుకున్న రాజకుమారులు ఇటీవలా వున్నారు. ప్రేమకోసం ఆస్తులను అంతస్తులనూ వదులుకున్న వారున్నారు. ఇప్పటి ప్రేమ ప్రేయసి విషయంలో కావచ్చు. వస్తువు ఒకటే. విషయం వేరు.
ఒక కుటుంబం నిలిచి వుండడానికి పరస్పర ప్రేమానురాగాలు, త్యాగం అవసరం. మనలో చాలమంది ఏదో ఒకరకం అయిన త్యాగం చూస్తూనే వున్నాం.
వాల్మీకి ఒక ఆదర్శవంతం అయిన తండ్రి పాత్రను సృష్టించామనుకున్నాడు. సృష్టించాడు. కాని ఆదర్శవంతుని ఆదర్శం బహుభార్యత్వానికి ఎలా బలి అయిందీ చూపించాడు. ముగ్గురు పెళ్లాల మధ్య ముసలవాడు నలగాల్సి వచ్చింది. రాముడు తనకు ఇష్టుడైనా, జ్వేష్ఠుడైనా మూడో పెళ్లాం ముచ్చటకోసం రాముడ్ని అడవులకు పంపాల్సి వచ్చింది.
కైక ముద్దుల పెళ్లాం అతనికి, ముసలితనంలో పెళ్లాడినట్లున్నాడు. ముసలితనపు పెళ్ళిళ్ళవల్ల వచ్చే అనర్థాలను నిరూపించాడు వాల్మీకి.
ఆనాడే ముసలితనపు పెళ్ళిళ్ళకు విమర్శించాడు వాల్మీకి. బహుభార్యాత్వం ఆపదలకు హేతువని హెచ్చరించాడు.
"నహ్యతో ధర్మచరణం కించిదస్తి మహత్తరమ్
యథాపితృ శుశ్రూషా తస్యవా వచనక్రియాII
తండ్రికి శుశ్రూష చేయటం, అతను చెప్పినట్లు నడుచుకోవటం కంటే మహత్తరం అయిన ధర్మం మరోటి లోకంలోలేదు."
ఒకసారి మనం మన ఉమ్మడి కుటుంబాలను గురించి ఆలోచిస్తే ఈ ధర్మం ఎంత అవసరమో అర్థం అవుతుంది.
ఉమ్మడి కుటుంబం ఒక చిన్న రాజ్యంలాంటిది. దానిలో యజమాని కొడుకులే కాదు, మనమలూ, మునిమనుమలూ వుంటారు. వీరంతా వ్యవసాయం కాని, మరో వృత్తిగాని చేయాలి. వీరిది వైయక్తిక శ్రమకాదు. సామూహిక శ్రమ. వీరందరినీ ఒక తాటిమీద నడిపించే ఒక అధికారం కావాలి. కాకుంటే కుటుంబం వుండదు. ఎవని ఇష్టం వచ్చినవైపు వాడు లాగుతాడు. అలా లాగడం వల్ల కుటుంబం విచ్ఛిన్నం కావడమే కాక ఉత్పత్తి దెబ్బతింటుంది. అందుకోసం ఈ కుటుంబాన్ని శాసించే హక్కు యజమానికి ఇచ్చారు. ఆ యజమానికి అందరూ లోబడి వుంటాలని కొన్ని ధర్మాలు ఏర్పరచారు. అలాంటి ధర్మమే తండ్రికి పరిచర్యలు చేయడం, తండ్రి మాటలు వినడం, ఆ దశలో ఆ నియమాలు లేకుంటే ఉత్పత్తి సాధ్యం అయ్యేదికాదు. సమాజం నిలిచేది కాదు.
రామునికి భరతుని విషయంలో గల ప్రేమ తక్కువదేం కాదు. భరతునికి రాజ్యమేకాదు సీతను కూడా ఇస్తానంటాడు.
భార్యలకు వదలడం అంత సులభంలా కనిపిస్తుంది. ఆనాడు దశరథుడు అన్నాడు కైకను వదిలేశానని.
అలాంటి వ్యవస్థనుంచి ఒక పటిష్టమైన వివాహవ్యవస్థను ఏర్పాటు చేయడం వాల్మీకి ఆదర్శం.
నీడలు:
రాముడు రాజలాంఛనాలు విడిచాడు. ఈ వార్త వినిపించడానికి కౌసల్య దగ్గరకి వెళ్లాడు. నీడవలె లక్ష్మణుడూ అతణ్ణి అనుసరించాడు. కౌసల్య రాముని మేలుకోరి హోమం చేస్తూంది. రాముణ్ని చూచి పొంగిపోయింది. కౌగిలించుకుంది. తల ముద్దాడింది. అనేక విధాల దీవించింది. బంగారుపీట వేసింది. భోజనం చేయమంది.
"అమ్మా! నాకీ బంగారుపీట ఎందుకు? మహారాజు నన్ను అడవులకు పొమ్మన్నాడు. నేను పధ్నాలుగేళ్లు వనవాసం చేయాలి. రాజు భరతునికి పట్టం కడ్తాడు" అన్నాడు రాముడు.
రాముని మాటలు విన్నది కైక. గొడ్డలితో కొట్టిన మద్దికొమ్మలా పడిపోయింది. రాముడు ఆమెను లేవనెత్తాడు. ఆమెలో దుఃఖం కట్టలు తెగింది.
"నేను గొడ్రాలిని అవుతే ఒకటే దుఃఖం ఉండేది. నీవు పుట్టావు. నేను దుఃఖాల పుట్టనైనాను. వర్షాకాలంలో నదులు పొంగుతాయి. గట్లను కూలుస్తాయి. అలాగే ఈ వార్త వినగానే నాగుండె కూలాల్సింది. అలా కాలేదంటే నా రొమ్ములో గుండెలేదు. ఇనుపముక్క వుంది. యముడు నన్ను ఎత్తుకొని పోయినా బావుండేది. వాడు ఎత్తుకొని పోడు. నీవు లేకుంటే నేను బతకలేను. నీ వెంటనే నేనూ అడవికి వస్తా" అని ఏడ్చింది.