Previous Page Next Page 
సీతాచరితం పేజి 34


    "నీకు  భరతుని మీద ప్రేమవుంటే అతనికి పట్టంగట్టు. రాముణ్ణి అడవులకు పంపించి ఏం సాధిస్తావు? నేను ముసలివాణ్ణి అయిపోయినాను. కాటికి కాళ్లు జాచుచున్నాను. నన్నెందుకిలా రంపంతో కోస్తావు? కావాలంటే లోకంలోని సంపదంతా తెచ్చి నీ కాళ్లముందు పోస్తాను. ఇంక వృద్ధుణ్ణి - నీకు భర్తను. రాజాను. దోసిలొగ్గి ప్రార్ధిస్తున్నాను. కావాలంటే కాళ్లు పట్టుకొని బతిమిలాడుతాను. నా మాట విను. రామునికి పట్టం కడ్తానని ప్రకటించాను. నన్ను అసత్యవాదిగా చేయకు" అని బోరుబోరున ఏడ్చాడు. బ్రతిమాలాడు. బామాడాడు. విలపించాడు.


    దశరథుని దైన్యం చూచింది. కైకకు అరికాలిమంట నెత్తికెక్కింది. "రాజా! మాట యిచ్చావు. ఎందుకిచ్చానని బాధపడ్తున్నావు. ఇది నీకు ధర్మమా! శిబి చక్రవర్తి తన శరీరాన్ని కోసి ఇచ్చాడు. కాని మాట తప్పలేదు. అలర్కుడు తన కళ్లనిచ్చాడు. కాని మాట తప్పలేదు. సముద్రుడు చెలియకట్ట దానినని మాట ఇచ్చాడు. దాటలేదు. నీవు మాట ఇచ్చావు. మాట నిలుపుకో. ధర్మాత్ముడివికా. ఒకసారి మాట ఇచ్చింతర్వాత ధర్మమైనా, అధర్మమైనా దాన్ని చెల్లించాలి. రామునికి పట్టం కడ్తావు. కౌసల్య రాజమాతయై కులుకుతుంది. అది నేను భరించలేను. సహించలేను. అంతెందుకు, నేను భగవంతుని మీద ఒట్టుపెట్టి చెబ్తున్నాను. రాముడు అడవులకు వెళ్లకుంటే నాకు సంతృప్తిలేదు" ఖండితంగా చెప్పేసింది. దశరథుడు కైక శపధం విన్నాడు. తన ప్రతిజ్ఞ తల్చుకున్నాడు. నరికిన చెట్టులా నేల కూలాడు. అప్పుడు దశరథుడు మనసు నశించిన వానిలా పిచ్చెక్కినవానిలా, విపరీతమయిన ఆతృత గలవానిలా, వ్యాధిగ్రస్తునిలా మంత్రముగ్ధమైన సర్పంలా కనిపించాడు.


    దశరథుడు కైకను చూచాడు. మండిపడ్డాడు. "ఓసీ రక్కసి! నీకు సిగ్గూ బిడియం లేవు. నీవు ఇక్ష్వాక వంశాన్ని నాశనం చేయడానికి వచ్చిన రాక్షసిలాగున్నావు. నీకు భయం భక్తి లేదు. పోనీ, లోకాన్ని చూచైనా వెరపు రాదా? నేను నీకెన్నో ఉపకారాలు చేశాను. దానికిదా ప్రతిఫలం? రాముడు అడవులకు పోతాడు. అప్పుడు నా ప్రాణాలు యమలోకానికి పోతాయి. రాముడు అడవులకు పోయిన వార్త, నా మరణవార్త విని కౌసల్య జీవిస్తుందా? రామున్ని విడిచి లక్ష్మణుడు, సీత, సుమిత్ర బ్రతుకుతారా! ఇలా అందరినీ పొట్టబెట్టుకుంటావు. అప్పుడేం సాధిస్తావు-ఓసీ! స్వామిద్రోహి! నీవు - ఏడువు - మొత్తుకో - కోపించు - నేను నీ కోర్కెను తీర్చలేను - తీర్చను." అని గట్టిగా చెప్పేశాడు.


    ఐనా కైక రవ్వంతైనా చలించలేదు. మహారాజా! నీవు సత్యవాదివి. ధర్మాత్ముడివి. నన్నెందుకు మోసం చేస్తావు? వరమిస్తావని వాగ్దానం చేశావా? మరి ఎందుకు ఎగబెడ్తావు? అని ఖచ్చితంగా అడిగింది.


    "దుర్మార్గురాలా! రాముణ్ణి అడవులకెలా పంపనే? రామునికి దుఃఖం కలుగకముందే నా ప్రాణాలు పోయినా బాగుండేది. నాకూ రామునికీ ఎడబాటు ఎందుకు కల్గిస్తావు? దానివల్ల నాకు అపకీర్తి, పరాభవం కల్గుతాయి." అలా దుఃఖించి, దుఃఖించి దశరథుని కళ్లు ఎర్రబడ్డాయి. అతడు రాజు. కైకకు  భర్త. వృద్ధుడు. జ్ఞాని. అలాంటివాడు రాత్రి సాంతం కైకను ఎన్నో విధాల బ్రతిమలాడాడు. ఐనా కైక అతని మాటలు పెడచెవిన పెట్టింది. రాజు దుఃఖిస్తుండగానే రాత్రి గడచిపోయింది.


    రాణుల్లో కైకకు ప్రత్యేకస్థానం ఉందనడానికి మరో ఉదాహరణ. కైక అంతఃపురాన్ని అందంగా వర్ణించాడు వాల్మీకి. అక్కడ చిలకలున్నాయన్నాడు. హంసలున్నాయన్నాడు. అవి ఆమె అభిరుచిని కూడా సూచిస్తాయి.


    రాముని పట్టాభిషేక వార్త నగరం నిండా వ్యాపించింది. కైకకు అందలేదు. కైకకు స్వయంగా తానే ఆ వార్త అందించాలనుకున్నాడు దశరథుడు. అది ఆమెకున్న ప్రత్యేక స్థానాన్ని సూచిస్తుంది.


    ఈ ప్రత్యేక స్థానం కైకకు పుట్టింటి బలంవల్లనే కలిగి ఉండాలి. ఆ బలంతోనే ఆమె దశరథుణ్ణి లొంగదీయడానికి ధైర్యంచేసి ఉండాలి. దశరథునికి కేకయరాజుల విషయంలో జంకు ఉందని ముందే గ్రహించాం. దశరథునిలోని ఆ బలహీనతను గ్రహించి కైక. ఇహ అతణ్ణి లొంగదీయడానికి మంకుపట్టు పట్టింది.


    వంశంలో పెద్దవాడికే రాజ్యం వస్తుందనే రాజనీతి కైకకు తెలుసు. అది ఆనాటి ఆచారం అని ఆమె గ్రహించింది. రాముడు రాజు కావడం న్యాయం అనే విషయం కైకకు తెలియంది కాదు. భరతుని మీద ఆమెకు అపారం అయిన ప్రేమ లేకనూపోలేదు. అయినా రాముడు రాజవుతున్నాడనే వార్త ఆమెను సంతోషపరిచింది.


    అలా సంతోషపడడానికి కారణం ఉన్నట్లు కనిపిస్తుంది. రాముడు కొంతకాలం రాజ్యం ఏలి భరతునికి ఇస్తాడనే నమ్మకం ఆమెకు ఉన్నట్లుంది. ఇది భ్రమ అనుకోవడానికి వీల్లేదు. ఆమె వెర్రిదికాదు. రాజు బిడ్డ. రధసారధ్యం చేయగల సామర్ద్యం గలది. రాజకీయం ఆమెకు తెలియందికాదు. భరతుని రాజును చేయాలనే వప్పందం ఏదో ఆమె పెళ్లి సమయంలో జరిగింది. అది ఆమెకు తెలియనట్లుంది. అయితే ఒకసారి రాజయినవాడు మరొకణ్ణి రాజు కానివ్వడు అనే సూత్రం ఆమెతలకు ఎక్కించింది మంధర. కాబట్టి ఆమె తన కొడుకు రాజు కావాలనే చూచింది. కాన న్యాయాన్ని గురించి ఆలోచించలేదు. కొడుకుమీద ఉండే మమకారం అలాంటిది. అది దేన్నీ ఆలోచించనీయదు. కొడుకుమీది మమకారం ఎంత వినాశనానికి దారితీయగలదో ఈ మధ్యనే చూచాం. కొడుకుమీది అభిమానానికి లేక దురభిమానానికి అంతకంటే నిదర్శనం ఇవ్వలేం.


    దశరథునికి రాముడంటే ప్రాణం. అది సహజం. అతడు పెద్ద భార్య కొడుకు. న్యాయంగా రాజు కావలసినవాడు. అతనికి రామునిమీద ఉన్న అభిమానం ఎంతటిదంటే అది అనేక కీడులను శంకించింది. అతనికి కేకేయరాజులంటే జంకు పట్టుకుంది. తన ముసలితనాన్ని గురించి భయం ఏర్పడింది. ఏ అవాంతరం వస్తుందోనని శంకించాడు. త్వరగా కార్యం జరిపించేయాలనుకున్నాడు. అలాంటివాడిమీద కైక పిడుగులు కురిపింది.  


    దశరథుడు మాట ఇచ్చాడు. అంతే తప్పుకోవచ్చు కదా! మాట తప్పకపోవడం ఆనాటి న్యాయం. మొత్తం వ్యవస్థ సత్యంమీద ఆధారపడింది. ఆనాడు ఇవ్వాల్టిలాంటి పటిష్టం అయిన న్యాయ వ్యవస్థ లేదు. అన్ని వ్యవహారాలూ మాటమీదనే నడిచాయి. అంతే వ్యవహారాలన్నీ ఆ మాటమీదనే జరిగిపోయాయి. అలాంటి వ్యవస్థలో అబద్ధం ఆడితే పూర్తి వ్యవస్థ కూలిపోతుంది. దశరథుడు రాజు. అతడే అబద్ధం ఆడితే ఎలా? అంతేకాదు అతని మాటకు అనేకమంది సాక్షులను ఏర్పరచింది కైక. వాళ్లేం సాక్షులు? సాక్ష్యం చెప్పడానికి వస్తారా? అని ఈనాడు మనం అనుకోవచ్చు. కాని ఆనాటి భయం అలాంటిది. అందువల్ల ఇచ్చిన మాటను తప్పుకోలేకపోయాడు దశరథుడు. పైగా రాముని పేర ప్రమాణం చేశాడు. కాబట్టి తప్పుకోవడం సాధ్యపడలేదు.


    ఇవాళ తిరుపతి దేవునికి వచ్చే కోట్ల ఆదాయానికి పత్రాలూ, రశీదులూ లేవు. ఎవరూ డిమాండ్ చేయడం లేదు. ఎవరి వత్తిడీ లేదు. అయినా మొక్కింది ఇస్తున్నారు. అలాంటి భయమే ఏదో దశరథునితో అబద్ధం ఆడనీయలేదు.


    ఒక మనిషికి ఒక గుణం ఉంటుంది. ఆ గుణాన్ని కనిపెట్టి, అతని బలహీనతమీద దెబ్బకొట్టి పని సాధించుకోవడం చతురుల చాతుర్యం. కైక చాతుర్యం అందులోనే కనిపిస్తుంది. దశరథుడు సత్యవాది అని ఆవిడకు తెలుసు. "అసత్యవాదివి అవుతావు, అపవాదు వస్తుంది." అని పదే పదే హెచ్చరించి దశరథుణ్ణి లొంగదీసింది. దశరథునికి లొంగక తప్పలేదు.

 Previous Page Next Page