Previous Page Next Page 
డెత్ సెంటెన్స్ పేజి 34


    జ్ఞాపకాలు అందించిన భావోద్వేగం అలాంటిది!

 

    షవర్ నాబ్ బిగించి, టవల్ అందుకున్నాడు. వాష్ బేసిన్ పైన గోడకునన అద్దంలో అతని విశాలమైన ఛాతీ కనిపిస్తోంది. అద్దంకన్నా ఎత్తుగా ఉన్నాడతను. వంగి మొహం చూసుకున్నాడు.

 

    వెలుగు మొహ మెరుగని ఛాతీమొహం కన్నా ఛాయలో ఉంది.

 

    ఛాతీమీద పరచుకున్న వెంట్రుకలు, ఒంపు తిరిగిన సన్నని నల్లతీగలని ఒకచోట కుప్పపోసనట్లున్నాయి.

 

    'నీకేమిట్రా గ్రీకు శిల్పానివి' అంటూ ఈర్ష్యపడే వాళ్ళు మిత్రులు. ఛాతీ తుడుచుకుంటూ నవ్వుకొన్నాడు. అద్దంలో కనిపిస్తూన్న గండు మీసాల అందమైన కోలమొహం అతన్నే ఆకర్షిస్తోంది.

 

    నీలిమతో ప్రేమ వ్యవహారం తెలిసి చాలామంది మెడికో అమ్మాయిలు ఈర్ష్యపడ్డారని అతనికి తెలుసు! అతని దృష్టిలో పడాలని వాళ్ళు చేసిన ప్రయత్నాలు కూడా అతనికి తెలుసు!

 

    "ఎంత కాలమైంది ఇంత తీరికగా స్నానం చేసి" బయటికొస్తూ అనుకున్నాడు. అతని మనసింకా గతం తాలూకు అనుభూతుల నుండి బయటపడలేదు. డ్రెస్ వేసుకొని వెళ్ళి గాడ్రేజ్ బీరువా తెరిచాడు.

 

    తలుపు తెరవగానే శాండిల్ స్ప్రే వాసన హాయిగొలుపుతూ బయటికి తొంగిచూసింది. నీట్ గా సర్ది ఉంచిన నీలిమ ఇస్త్రీచీర వెనుక ఓ ప్రక్కగా అందమైన గంధంపెట్టి ఒదిగి కూర్చుని ఉంది.

 

    ఆనాడు తమ మధ్య తిరిగిన ఉత్తరాలన్నిటినీ పొదుపుకొన్న ఆ గంధం పెట్టె తెరిచి, అన్నిటి కంటె పైన మడిచి వుంచిన ఓ ఉత్తరం తీశాడు.

 

    అక్కడే నిలబడి తెరిచి చూశాడు. అతనిచూపులు అక్షరాల వైపు పరుగులు తీసాయి.

 

    నీలూ డియర్!

 

    పదిరోజుల సుదీర్ఘకాలం తర్వాత నిన్ను చూడబోతున్నందుకు ఈ హృదయం ఎంత తేలిపోయిందో తెలుసా? అనుభవించబోయే ఆ మధురక్షణాలని తలుచుకుని.... తలుచుకుని ఎన్నిసార్లు లయ తప్పిందో!

 

    ఆ ఆనందాన్ని భగ్నం చేస్తూ అనుకోని డ్యూటీ పడింది.

 

    మళ్ళీ నాలుగు రోజులకుగానీ నిన్ను కలిసే వీలులేదు. వరుసగా డ్యూటీలు ఉన్నాయి. ఇప్పుడే పని ముగించుకుని నీ దగ్గర కూర్చున్నాను.

 

    ఇప్పుడు టైమెంతైందో తెలుసా! అర్ధరాత్రి ఒకటిన్నర!

 

    లోకమంతటిని మత్తులో ముంచి, దొంగచాటుగా పారిపోతున్న కాలాన్ని నేనొక్కణ్ణి మెలకువతో ఉండి మనకోసం నిలుచోబెట్టాను!

 

    అమాయకంగా, "ఎందుకూ?" అంటున్నావు కదూ!

 

    ఈ అర్ధరాత్రి నిశ్శబ్దంలో నా అనుభూతుల్ని అక్షరాల్లో పట్టి నీతో పంచుకొంటూ, నువ్వు నా కళ్ళముందు లేని లోటుని నింపుకొంటూ నీ సాన్నిహిత్యాన్ని అనుభవించాలని!

 

    'విరహము కూడా సుఖమేకదా - విరహపు చింతన మధురము కాదా' అన్నాడో కవి. నిజం కదూ!

 

    నువ్వు నా ఊహల్లో దూరి ఎంతెంత కాలాన్ని కరిగిస్తున్నావో.... నా కళ్ళ కాంతిలో, నా నవ్వులో..... నా నడకలో అంతర్లీనమై ప్రవహిస్తూ నన్నెంత ప్రభావితం చేస్తున్నావో నీకేం తెలుసురా నీలూ??

 

    నువ్వండబట్టే నాకీ ప్రపంచం ఇంత అందంగా ఆనంద భరితంగా కనిపిస్తూంది! నువ్వు లేకపోతే ప్రతి చిన్న విషయాన్ని ఇంతలా ఆనందించే వాడిని కాదనుకుంటా!

 

    రాస్తూ.... రాస్తూ.... తల ప్రక్కకి తిప్పితే అద్దంలో నా ప్రతిబింబము కనిపించింది. నాకు నేనే ముద్దొచ్చేంత బావున్నాను తెలుసా? చాలాసేపు అలాగే చూసుకున్నాను.

 

    ఈరూపం నీకెంత ఇష్టముండడంవల్ల - ఇప్పుడు నాకు, ఎప్పుడూ లేనంత ఆనందంగా కనిపిస్తోంది. నాకూ ఎంతోకష్టం కలుగుతూంది!

 

    ఇప్పుడీ శరీరమ్మీద ఎంత శ్రద్ధ పెరిగిందనీ.... ఎప్పుడూ పుస్తకాల పురుగులా వుండే నేను.... నీ దగ్గరికి రావడానికి రెండురోజుల ముందునుండీ ఏ షర్టు వేసుకొంటే బావుంటానూ, క్రాపు బావుంటుందా - సరి చేయించుకోవాలా - షూష్ రెడీగా ఉన్నాయా లాంటి ఆలోచనలతో గడుపుతుంటాను. గతంలో ఎప్పుడూ ఈ శరీరాన్ని గురించి నేనింతలా పట్టించుకోలేదు.

 

    వస్తానని చెప్పి రానందుకు నామీద కోపంగా ఉందికదూ! నన్ను చూసినప్పుడు నీ కళ్లలో కదిలే వెలుగురేఖని చూడాలని నాకు మాత్రం లేదూ?

 

    గులకరాళ్ళ గోదావరి రవళింపుని.... ఏటిగాలి దోసిళ్ళతో మోసుకొచ్చి.... నా హృదయంమీద కుమ్మరించినట్లుండే నీ చూపులలో సేద తీరాలని ఒకటే తపన!

 

    'చందూ' అనే నీ పిలుపు నా చెవుల్లో జీరాడినప్పుడు, ఆ స్వరం లోని తీయదనం నాకేమీ తోచనివ్వదు! నలుగురిలో నా కలవరాన్ని ఎలా దాచుకోవాలో తెలీక ఎంత కంగారుపడి పోతుంటానో చెబితే 'పిచ్చిముండా' అని నీ గుండెల్లోకి లాక్కుని నా మొహమంతా ముద్దులతో ముంచెయ్యవూ.....!

 

    "ఎప్పుడూ పనీ..... పనీ,,,,, పనీ! నీ ఆరోగ్యం పాడయిపోదూ!" అన్నావుకదూ! పిచ్చిదానా! నేనింత చదువుకొంటున్నది నా ఒక్కడి ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడు కోవడానికి కాదుగా! ముందు ముందు కడుపార భోజనం, కంటినిండా నిద్రకి మాత్రం కూడా టైమ్ మిగలని బాధ్యతలుంటాయి, ఇదినాంది మాత్రమే!

 

    నేను జీవితాన్నెంతో గాఢంగా ప్రేమిస్తాను. కాబట్టే ఈ ప్రొఫెషన్ ని ఎన్నుకున్నాను.

 

    మన ఉనికి ఎదుటి వారికి ఆనందదాయకమో, జ్ఞానదాయకమో, ప్రాణవసరమో అవడంకన్నా మనిషికి సార్ధకత మరేముంటుంది.??

 

    నీలూ! కళాత్మకంగా బ్రతకడమంటే ఏమిటో తెలుసా నీకు? కొంతమంది కసలు ఎలా బ్రతకాలో, ఎందుకు బ్రతుకుతున్నారో కూడా తెలీదు.

 

    మనం బ్రతికి - జీవిస్తూ బ్రతకడమెట్టాగో నేర్పించుకుందాం!

 

    ఏ చిన్ని ఆనందాన్ని కూడా 'నిర్లిప్తత'తో చేజార్చుకోకుండా పూర్తిగా అవుపోసన పట్టాలి మనం.

 

    నవ్వుతున్నావా? మరి నాకు బోలెడన్ని కలలు!!

 

    'కాలం అంచున చూపులు నిలిపి -

 

    కనురెప్పల్ని కాపలా వుంచి....' అని ఎదురుచూపుల గురించి అన్నాడో కవి. నువ్వు నాకోసం ఎదురుచూడ్డం గుర్తొస్తే ఈ మాటలే గుర్తుకువస్తాయి.

 

    ఏయ్! నాకిప్పుడేమనిపిస్తుందో తెలుసా?

 

    ఈ తెల్లవారుజామున, ఈ మసక వెన్నెల్లో..... పెరటితోటల్లో ముగ్ధలా విచ్చుకుంటున్న నిద్రగన్నేరుని, ముద్దులాడుతున్న మంచుతెరలా.... నా పెదవులతో నీ అణువణువు నీ రాగమయంచేయాలని వుంది!!?

 Previous Page Next Page