"వాట్? సంవత్సరన్నర క్రితం డ్రాఫ్టా?"
"అవునాండి!"
"మరాసంగతి చెప్పరేం?"
"రెండుసార్లు చెప్పామండి!"
"ఎవరికి?"
"మీకేనండీ!"
"సంవత్సరన్నర క్రితం డ్రాప్ట్ పోతే మీరు ఇంతకాలం ఎందుకూరుకున్నారు?"
"అది నేను పంపిన వ్యక్తికి ఎప్పటికయినా చేరుతుందనుకున్నానండీ-"
"మరింకా వెయిట్ చేయకుండా ఇప్పుడెందుకొచ్చారు?"
"మా అంకుల్ చనిపోయారండీ-"
"చనిపోయాడా?"
"అవునండీ! స్కూటర్ యాక్సిడెంట్-"
"అరెపాపం! అందుకే స్కూటర్, మోటార్ సైకిళ్ళూ ఎక్కకూడదు-"
"అవునండీ-"
"బస్ లో వెళ్ళాలి - లేదా నడిచి తిరగాలి-"
"మా ఇంకో అంకుల్ నడిచి వెళ్తోంటే లారీ వచ్చి కొట్టేసిందండీ-"
"అలాగా"
"అవునండీ-"
"అందుకే మనం నడవకూడదు-"
"అవునండీ-"
"అయితే సరే - ఓ పనిచేయండి! ఇక్కడికి కిలోమీటర్ దూరంలో మా క్లియరెన్స్ ఆఫీస్ ఉంది. అక్కడికి వెళ్ళి ఈ నెంబరుగల డ్రాఫ్ట్ అవుట్ స్టాండింగ్ లో ఉందా, లేదా అనే విషయం కనుక్కురండి-"
నేనూ శాయిరామ్ క్లియరెన్స్ ఆఫీస్ వెతుక్కుంటూ బయల్దేరాం. గంటసేపు వెదికాక ఓ పెద్ద బిల్డింగ్ లో గోడౌన్ లాంటి చోట దొరికింది.
అక్కడి మేనేజర్ దగ్గరకెళ్ళి సంగతంతా చెప్పాం.
"అలాగా- పాపం దానికోసం వచ్చారా?" అన్నాడు జాలిగా.
"అవునండీ!"
"సంవత్సరన్నర క్రితం దయితే ఇప్పుడు వెదకటం చాలా కష్టమండీ-"
"అయితే ఏం చేద్దామంటారు?"
"ఓ వారం రోజులాగిరండి! మా వాళ్ళు వెతికి ఉంచుతారు-"
మేము కాగిత మీద డ్రాఫ్ట్ వివరాలు రాసిచ్చి తిరిగి కాలనీలోకి చేరుకున్నాం. వారం రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళాం.
"ఆ క్లర్క్ శెలవులో ఉన్నాడండీ రేపురండి!" అన్నాడతను.
మర్నాడు మళ్ళీ వెళ్ళాం.
ఓ రెండు గంటలు బయట కూర్చోపెట్టాక చెప్పాడతను.
"అవుట్ స్టాండింగ్ లోనే ఉందని చెప్పండి"
మళ్ళీ బాంక్ కి చేరుకున్నాం. మేనేజర్ మళ్ళీ 'యస్' అంటూ మావేపు చూశాడు.
"మీరు చెప్పినట్లు క్లియరెన్స్ ఆఫీస్ కెళ్ళి తెలుసుకున్నామండీ. అది అవుట్ స్టాండింగ్ లోనే ఉందని చెప్పారు వాళ్ళు-"
"ఏ విషయం మాట్లాడుతున్నారు మీరు?"
మళ్ళీ కథంతా చెప్పాను.
"సరే- అయితే ఈ సంగతంతా డూప్లికేట్ లో ఓ అప్లికేషన్ రాసివ్వండి-"
ఇద్దరం బయట కూర్చుని అప్లికేషన్ రెండు కాపీలు ఆయన కిచ్చాం.
"మీరు వారం రోజులు అయ్యాక రండి" అన్నాడతను.
ఎందుకయినా మంచిదని పదిరోజుల తరువాత వెళ్ళాం.
"యస్?" అన్నాడతను అలవాటు ప్రకారం. అలవాటు ప్రకారం శాయిరామ్ కథంతా చెప్పాడు.
"ఓ! అదా అది ఆఫీసర్ ని కాంటాక్ట్ చేయాలి! నన్ను కాదు-" అన్నాడు చిరాగ్గా. ఇద్దరం ఆఫీసర్ దగ్గరకు వెళ్ళాం.
"ఏం కావాలి?
అతనికి మళ్ళీ కథంతా చెప్పాము.
"ఓహో- అదా-"
"అవునండీ! అదే-"
"దానికి లెటర్ పంపించామండీ- ఇంకా జవాబు రాలేదు-"
"ఎవరికి పంపించారండీ-"
"మా క్లియరెన్స్ ఆఫీస్ కి?"
"లోకల్ లెటర్ కి వారం రోజులు టైమ్ పడుతుందా?"
"పట్టదుకానీ- ఒకోసారి పడుతుంది- అంచేత ఓ వారం ఆగండి-"
మళ్ళీ వారం తర్వాత వెళ్ళాము.
"ఇంకా రిప్లయ్ రాలేదే-" అన్నాడతను మళ్ళీ కథంతా విన్నాక.
"ఒకవేళ లెటర్ పోస్ట్ లో మిస్సయిందేమో-"
"మేము అందుకే లోకల్ లెటర్స్ అన్నీ మెసెంజర్ ద్వారా పంపిస్తాము. పోస్ట్ లో పంపం-"
"ఇప్పుడేం చేయమంటారు?"
"ఇంకో నాలుగు రోజులు-"
నాలుగు రోజుల తర్వాత మళ్ళీ వెళ్లాము.
మళ్ళీ కథంతా చెప్పాడు శాయిరామ్.
"ఓ పని చేస్తారా?" జాలిగా అడిగాడతను.
"లక్ష పనులు చేస్తామండీ! ఒకటేమిటి?"
"మీరే స్వయంగా మా క్లియరెన్స్ ఆఫీస్ కెళ్ళి మా లెటర్ కి ఎందుకు రిప్లయ్ ఇవ్వలేదు అని అడగండి-"
"సరే-"
కాళ్ళీడ్చుకుంటూ క్లియరెన్స్ ఆఫీసుకి చేరుకున్నాం.
"అబ్బే- వాళ్ళ దగ్గర్నుంచి మాకు లెటరేమీ రాలేదు మాష్టారూ- వస్తే మేము రిప్లయ్ ఇవ్వకుండా ఎందుకుంటాం?"
"అదేమిటండీ! మీ మనిషే స్వయంగా టపా తెస్తాడు కదా. ఎలా మిస్సవుతుంది?" ఆశ్చర్యంగా అడిగాడు.
"ఇదిగో ఇప్పుడీ లెటర్ మిస్సయినట్లే-" అన్నాడతను.
"అంటే ఆరోజు వాళ్ళు పంపించిన టపా అంతా ఎక్కడో పోయి ఉంటుంది! అంతే?"
"ఎగ్జాక్ట్ లీ-"
"అంటే ఇప్పుడిక మేము కట్టిన డబ్బు మాకు రాదంటారు."
"అయ్యో - ఎందుకివ్వమండి ఇస్తాం కానీ-"
"ఓపట్టాన్న ఇవ్వరు- అంతేగా-"
"మీరో పని చేయండి- మా బాంక్ కెళ్ళి వాళ్ళు మీ డ్రాప్ట్ గురించి మాకు పంపిన లెటర్ కాఫీ తీసుకురండి-"
మళ్ళీ బాంక్ కి చేరుకున్నాం 'యస్' అంటూ ప్రశ్నించారు ఆఫీసర్.
కథంతా చెప్పాడు శాయిరామ్.
"మీరు పంపించిన లెటర్ వాళ్ళకి చేరలేదట! అందుకని ఆ లెటర్ కాపీ తెమ్మన్నాడు"
"ఆశ్చర్యంగా వుందే లెటర్ చేరకపోవటం ఏమిటి?"