Previous Page Next Page 
చెక్ పేజి 34


    చూస్తున్న జనం ఒక్కసారి షాక్ తిన్నారు. కొందరు భయంతో కేకలు పెట్టారు.

 

    రక్తం ముద్దలా జయ.

 

    ఓ పది పదిహేనుమంది వెళ్ళి జయను కూర్చోబెట్టారు. ఆమె నిలబడటంలేదు. ఆమె శరీరం వాలిపోతోంది.

 

    ఒకరు చేయిపట్టి చూశారు. మరొకరు ముక్కు దగ్గర వేలుపెట్టి చూశారు.

 

    "జయ చచ్చిపోయింది."

 

    ఎవరో అరిచారు. కేకలు, హాహాకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.

 

    జయ చుట్టూ రక్తం గడ్డకట్టి ఎర్రటిపలకలా వుంది. చివరి సూర్యకిరణాలు ఆ ప్రాంతాన్ని మరింత బీభత్సం చేశాయి.

 

    జయ ముంగురులు రక్తంలో తడిసి, నల్లటి తాళ్ళలా వున్నాయి. పైటజారిన ఆమె వక్షస్థలం గడ్డకట్టిన నల్ల సముద్రంలా వుంది. ఆమె చేతులు తోటకూర కాడల్లా చలనరహితంగా వాలిపోయాయి. కాళ్లు బిగుసుకుపోయి కర్రల్లా అయిపోయాయి. ఆమె చీర రక్తంలో ముంచి లేపినట్టుంది. నల్లటి రవికలో రక్తం మరకలు తెలియలేదుగానీ, అట్టలు తేలివుంది.

 

    పెరుమాళ్ జయను చంపేశాడన్న వార్త నిముషంలో గుప్పుమంది. పొగ ప్రాకుతున్నట్టు ఆ విషయమే గ్రామాలపై తేలుతూ పయనిస్తోంది.

 

    నేను కథ చెప్పడం ఆపాను.

 

    "దారుణం. జయను పెరుమాళ్ చంపడం!"

 

    "అయ్యో పాపం" దామూ విడిచిన నిట్టూర్పు వినిపించింది.

 

    "కథ ఇంకా కాలేదు" అన్నాను సడన్ గా.

 

    "అవునా! మరి చెప్పు!"

 

    "జయ చనిపోయిన విషయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు సత్యనారాయణరెడ్డి. జయ శవాన్ని పోస్ట్ మార్టమ్ కోసం తీసికెళ్ళారు. పెరుమాళ్ ను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు.

 

    అయితే పోలీసులకు శ్రమ ఇవ్వకుండా మరుసటిరోజే పెరుమాళ్ వూర్లోకి వచ్చాడు.

 

    "ఆ!" దామూ కీర్తీ ఒకేసారి అన్నారు.

 

    "అవును దామూ, మరుసటి రోజు సాయంకాలానికి వూర్లో తేలాడు."

 

    "జనం వాడ్ని రాళ్ళతో కొట్టి చంపేశారా?"

 

    "లేరు పెరుమాళ్ ను ఆకాశానికి ఎత్తేశారు. పెరుమాళ్ దేవుడని స్తుతించారు. పిల్లలు అతని చుట్టూ చేరి ఆనందంతో చప్పట్లు చరిచారు. యువకులు అతన్ని భుజాల మీద ఎక్కించుకుని వూరేగించారు. స్త్రీలయితే అతనికి దిష్టితీసి, బుగ్గమీద చుక్క పెట్టి, మామంచి బంగారం అన్నట్లు మెటికలు విరిచారు. ముసలీ ముతకా అతన్ని దేవుడని కీర్తించారు."

 

    "జయను చంపేసినవాడ్ని అందలం ఎక్కించారు. జనాన్ని మోసం చేయడానికి పెరుమాళ్ మళ్ళీ ఏం ఎత్తుగడ వేశాడు?"

 

    "అది చెప్ప. ఈ కథకున్న రెండో కొస మెరుపు అది."


                                                     *    *    *    *    *


    పడుకున్నాను గానీ నిద్రరావడం లేదు.

 

    చలిగాలి నా పక్కన చేరి, గిలిగింతలు పెడుతోంది. కిటికీలోంచి చూస్తే ఎస్వీ గెస్ట్ హౌస్ వెలుగు కొండలా కనిపిస్తోంది. పచ్చటి కొండలు నల్లటి దుప్పటిని కప్పుకుని నిద్రపోతున్నాయి. లోయలు నక్షత్రాలు ఆకాశానికేసి చూస్తూ, కాలం గడుపుతున్నాయి.

 

    కీర్తి ఇప్పుడు నా గదిలోకి వచ్చేస్తే- షరతు ప్రకారం నేనేం చేసినా తను అడ్డు పెట్టకూడదు. అప్పుడు కీర్తి నా కౌగిట్లో- ఎలా వుంటుంది ఆ అనుభవం?

 

    మల్లెపూలు ఆకాశం నుంచి కురుస్తాయా- నక్షత్రాలు కళ్ళమీద పరుచుకుంటాయా- నీలం అలలు గుండల్లోంచి పొంగుతాయా- కోకిలగానం గొంతులోంచి పెల్లుబుకుతుందా-? ఎం జరుగుతుంది.

 

    'మదన్, నువ్వు ఓడిపోయావ్. ఆడపిల్లను, అందునా కాబోయే భార్యను నీ రూమ్ లోకి రప్పించుకోలేకపోయావ్. నీ అసమర్థతను తెలియజేయడానికే కీర్తిని తిరుమలకు పిలుచుకొచ్చావా? వేస్ట్ మదన్, నీ బతుకు వేస్ట్, నీ యవ్వనం వేస్ట్!!'

 

    నన్ను నేను తిట్టుకుంతూ, అసహ్యించుకుంటూ వుండగానే చీకటి కరిగిపోయింది. వెలుగు దొంగ తూర్పువాకిలిని తెరుచుకుని బయటపడుతున్నాడు.

 

    "సార్" అని వినపడేసరికి పడకమీద నుంచి లేచాను. దామూ పిలుస్తున్నాడు.

 

    "లేచారా సార్?"

 

    "ఆ"

 

    బయటికొచ్చాను. కాఫీ కెటిల్ తో రెడీగా వున్నాడు దాము.

 

    "రాత్రి మీరు చెప్పిన కథ చాలా బావుంది సార్. అయితే పెరుమాళ్ ను జనం చంపకపోవడం నాకు నచ్చలేదు సార్" అన్నాడు.

 

    ఆ కథని అతను చాలా ఫీలయినట్టు అనిపించింది నాకు.

 

    కాఫీ తాగుతుండగానే కీర్తి బయటకొచ్చింది.

 

    "గుడ్ మార్నింగ్. అదేమిటి కళ్ళు అంత ఎర్రగా వున్నాయి. సరిగా నిద్రపోలేదా?" అడిగాను.

 

    "లేదు మదన్. బాగా ఏడ్చాను, జయను అంతదారుణంగా చంపేశారంటే దుఃఖం ఆగలేదు. బాగా అలసిపోయే వరకు ఏడ్చి అలానే పడుకుండిపోయాను."

 

    ఇంత సెన్సిటివ్ అయినపిల్ల బెదిరిపోయేట్టు కథ చెప్పలేకపోవడం నా లోపమే అనిపించింది.

 

    "అంతగా ఏడ్చావా?"

 

    "అవును! ఎందుకో జయ అంటే ఇష్టం. కూలీలకోసం పెద్దపులిలాంటి సత్యనారాయణరెడ్డి లాంటి వాడితో ఢీ కొనాలంటే జనం మీద ఎంతో ప్రేముండాలి, అలాంటి అమ్మాయిని కత్తితో పొడిచి చంపేయడం అమానుషం. నోరులేని పువ్వును కర్కశహస్తాలతో తుంచేయడంలాగ! ప్రతి కథలో కరుణరసమే ఎక్కువైందనుకుంటా! అయితే మిగిలిన కథలకన్న ఈ కథలో టెంపో వుంది. చివరి వరకు వూపిరి సలపనివ్వని టెన్షన్ తో సాగిపోయింది. పెరుమాళ్ ను వూరి జనం ఎందుకు సన్మానించారో నువ్వు చెప్పలేదు. ఈ కథలో ఏమైనా లోటు వుంటే అదే" అంది.

 

    కీర్తి ఇంతలో విశ్లేషించి, అనుభూతిస్తుందని నేను వూహించుకోలేక పోయాను. అంత అద్భుతమైన అమ్మాయి నన్ను ప్రేమించిందంటే గర్వంగా అనిపించింది.

 

    నాలుగు రాత్రులయిపోయాయి. 'ఇంకా రెండు రాత్రులున్నాయి గదా. ట్రైచేద్దాం!' అని నాలో నేనే సర్ది చెప్పుకున్నాను.

 

    ముఖాలు కడుక్కుని ఇద్దరం బయటపడ్డాం.

 

    ఎక్కడెక్కడో తిరిగి సాయంకాలం కాటేజ్ కు చేరుకున్నాం. ఉడిపి హోటల్ భోజనం మొహం మొత్తింది. అందుకే టిఫిన్ తెచ్చుకున్నాం.

 

    ఎనిమిది గంటలకు టిఫిన్ చేసి, తిరిగి వరండాలో కూర్చున్నాం. ఎనిమిదన్నర ప్రాంతాన దామూ వచ్చాడు.

 Previous Page Next Page