Previous Page Next Page 
గోరింటాకు పేజి 34

   
    అసహ్యం వేసింది  రాజారావుకు. ఇహ ప్రాణంపోయినా వాళ్ళ సహాయం అర్థించకూడదనుకున్నాడు.

 

                                            * * *

 

    పల్లెటూరి రాజకీయాల్లో ఊపిరిసలపటల్లేదు రాజారావుకు. ఒకప్పుడు అతని పెద్ద అన్నగారిమాట వేదవాక్యంలా చెల్లింది. కాని ఇప్పుడు గాలంతా రాజారావువైపు తిరిగింది. అతను బయటకు వస్తే గ్రామీణులు చుట్టూ చేరి ముక్తకంఠంతో ఆహ్వానవచనాలు చెప్పసాగారు.

 

    వాళ్ళ వూరికి కలెక్టరుగారు వచ్చినా, ఎప్పుడైనా మంత్రులు వగైరాలు వచ్చినా రాజారావే ప్రతినిధిగా వుండి సంప్రదింపులు జరిపేవాడు. అదిగాకుండా అతను మంచివక్త. ఉత్సాహం, చొరవ వున్నవాడు. ఎటువంటి సమస్యలలోనైనా నిర్భయంగా దూసుకుపోగలడు. బ్లాక్ డెవలప్ మెంటు స్కీమ్, కో - ఆపరేటివ్ బ్యాంకు వంటి వ్యవహారాలలో అతను పలుకుబడి ఉపయోగించి గ్రామస్థులకు మహోపకారం చేశాడు.

 

    ఊళ్ళో అతని పలుకుబడి, ప్రభావం హెచ్చుతున్నా, ఇంట్లో అతని జీవితం దుస్సహంగా పరిణమించసాగింది. లంకంత ఇల్లు వాళ్ళది. అన్నదమ్ములు విడిపోయాక దాన్ని మూడు భాగాలుగా విభజించారు. అతనున్న భాగంవైపు సాధారణంగా ఎవరూ తొంగిచూడరు. తల్లి తనదగ్గిరే ఉండి వండిపెడుతోంది గాని, అడిగితేనేగాని సమాధానం చెప్పదు. వదినలు - తనతో చనువుగా వుంటూ పరిహాసోక్తులాడే వదినలు, తను కనిపిస్తే పరాయి పురుషుణ్ణి చూచినట్లు దూరంగా తొలగిపోతున్నారు. 

 

    తాను చేసిన మహాపరాధం - సత్యవతిని తిరస్కరించటమేనా?

 

    కాని అతను నలుగురిమధ్యా సిగ్గుపడి, అవమానంతో కృంగిపోయే అంశం ఇంకొకటి వున్నది. మంజువాణితో తన సంబంధం బట్టబయలు కావడం. ఆనాడు మేనమామకొడుకు ఆమెపేరైతే ఉచ్చరించలేదు కాని ఈ రహస్యం వాళ్ళందరికీ తెలిసిపోయినట్లు తేటతెల్లమవుతూనే వున్నది. ఓ వయసులోవున్న స్త్రీ ఓ యువకుడు - వీళ్ళిద్దరి ప్రణయకలాపాలు. ఇంతకంటే ఏంకావాలి పగ సాధించదలుచుకున్నవారికి?

 

    ఇప్పుడతనిని ఎవరైతే వేలెట్టి చూపిస్తూ నిందాగర్భితంగా ప్రగల్భాలు పలుకుతున్నారో - వాళ్ళు మడిబట్ట కట్టుకుని కూర్చున్నవారేంకాదు. అవకాశం వస్తే వదులుకునే త్యాగమూర్తులెవరూ లేరక్కడ. సమయం చూసుకుని నానాగడ్డి కరిచినవారే అందరూ. ఒకప్పుడు ఈ వదిన, ఈ అన్నయ్య చేష్టితాలను తనముందు కన్నీళ్ళతో మొరబెట్టుకుంది. ఒకప్పుడు ఈ అన్నయ్య తనకు పట్టుబడి తలవంచుకుని మెల్లిగా అవతలకు నిష్క్రమించాడు.  

 

    కాని పరిస్థితి అంటారే! అది - బాప్ రే! నీచుడ్నికూడా అహంకారిని చేస్తుంది. ఇది నిబంధన కాదు. మామూలు సత్యం కాదు. నగ్న సత్యం.

 

                                                             * * *

 

    రాజారావు విజయవాడ వచ్చేశాడు. కొన్నాళ్ళు హోటల్ లోనే వున్నాడు. అతనికి ఈ ఊరు విడిచిపెట్టి పోవాలనివుంది. కాని ప్రస్తుతం నట్టనడిసంద్రాన వున్నాడు. ఇహ చదువు మానుకోవాలి, లేకపోతే వల్లకాదు.

 

    చివరకు కాలేజీదగ్గరలోనే ఓ ఇంట్లో గదిచిక్కింది. చుట్టుప్రక్కల ఇళ్ళుకూడా తక్కువే. ఇల్లు చిన్నది. ఓ వృద్ధుడు, ఆయన వృద్ధ సతీమణి మిగతా ఇంట్లో కాపురం. ఇంటి యజమానులు వాళ్ళే. పిల్లాజల్లా లేరు. ఆయన ఓవర్సీస్ చేసి రిటైరై ఊరిబయట చిన్నఇల్లు కట్టుకుని శాంతిమయజీవితం గడుపుతున్నాడు. చాలా ప్రశాంత వాతావరణం. ఓ ఆశ్రమవాస అనుభూతి. కిటికీలోంచి చూస్తే అదిగో సౌదామిని తనూ ఎక్క ప్రయత్నించిన కొండశిఖరం. ఇటుప్రక్క పడవలు వయ్యారంగా సాగిపోతూండగా అందమైన ఆ కాలువ.

 

    అతను ఎప్పుడోగాని ఊళ్ళోకి పోయేవాడుకాదు. అతనికి భయం మంజువాణిగాని, ఆమె భర్తగాని, మేనమామతరపు మనుషులుగాని కనిపిస్తారేమోనని, బహుశా సత్యవతి తనను అసహ్యించుకుంటూ వుండవచ్చు మనసులో, ఈ నీచుణ్ణి, నీతిమాలినవాణ్ణి అయ్యో ప్రేమించానే అని. ఆ ఆలోచన వచ్చేసరికి అతని రక్తం సిగ్గుతో ముడుచుకుని ఘనీభవించినట్లయ్యేది. చివరకు ఈ భూమ్మీద తాను ఎందుకూ పనికిరాకుండా అసహ్యానికి ప్రతిరూపంగా మిగిలాడు.

 

    సత్యవతి అంటే తనకెలాంటి అభిప్రాయముందని ఆలోచించి చూశాడు. అసలు లోకంలో త్యాగం అనేది లేకపోతే బ్రతుక్కి అర్థంలేదేమో అనిపించింది. అప్పుడు ప్రదర్శిస్తే బాగుండిపోయేది. సామాన్యంగా జీవించేవాళ్ళని చూస్తే ఏదో ఎగతాళిగానే ఉంటుందిగాని అసలది కష్టతరం. అక్కడనే ఒకింత, ఒకింత ఏమిటి, సంపూర్ణ సౌఖ్యం కూడా.

 

    రాజారావు తను సామాన్యుడిలా జీవించాలనుకున్నాడు. కాని జీవితాన్ని ఎప్పుడుపడితే అప్పుడు తిరిగి మొదలుపెట్టటానికి అది ఏమీ వ్యవహారం కాదు. దానికి ఓ ఆధ్యాత్మికమైన విలువ వుంది. దాన్ని అవ్యక్తంగా స్పృశిస్తున్నట్లుగానే వుంటుందిగాని ఆ అవతలిఒడ్డు ఎప్పటికప్పుడు దూరంగా జరుగుతూనే వుంటుంది. ఆ జరుగుకూ, తన మనస్సుకూ సంబంధముందనుకున్నా, రాజారావుయొక్క మానసిక వృద్ధాప్యంవల్ల కూడా ఏమీ ప్రయోజనం లేకపోయింది.

 

    ఈ మానసిక వృద్ధాప్యం వున్నదే - ఇది ఆవహించినవాళ్ళు హఠాత్తుగా ఎక్కడికో పెరిగిపోయేమాట వాస్తవమేగాని, చాలా కొద్దికాలంలోనే తిరిగి ఎందుకూ పనికిరాని జడపదార్థావస్థలోకి పడిపోయే ప్రమాదం వుంది. అప్పుడిహ పూర్వంవున్న జ్ఞానంకూడా కోల్పోతారు. ఎంతసేపటికీ బాల్యం దాటినట్లు వుండదు. ఏ కోణం నుంచి చూసినా అభివృద్ధే గోచరించదు. ఒక తటస్థజీవి అవుతాడు మనిషి. ఈ వేదాంతం, దీర్ఘచింతన తలుచుకుంటూపోతే అంతువుండదుగాని సామాన్యుడిలా బ్రతకదల్చిన రాజారావు ఏం చేశాడు? సామాన్యుడికి మనశ్శాంతి వుంటుంది. అది తనకు ఎలా వస్తుంది? భగవద్గీత చదివాడు. మహనీయుల జీవితచరిత్రలు చదివాడు. తాత్కాలికోపశాంతేగాని పుస్తకం మూసీమూయగానే, లేదా దాని తాలూకు ఆలోచన ఛాయలు అంతరించగానే ఆకస్మికంగా మళ్ళీ ఈ మనుష్యులు, ఈ మంజువాణి.

 Previous Page Next Page