"ఓ గాడ్, స్వీటీని కాపాడు.. ఖర్మ, నేనివాళే ఆలస్యంగా రావాలా! పాపం గౌతమ్ ఒక్కడూ అలా ఏడుస్తూ కూర్చున్నాడు. మనకి ఫోనన్నా చెయ్యాలని తట్టినట్టు లేదు. వస్తుంది అనుకుంటూ చూస్తూ కూర్చున్నాడు" సునీత గొంతు రుద్ధమైంది.
రవీంద్ర డ్రైవ్ చేస్తూ రకరకాల ఆలోచనలతో సతమతమయ్యాడు.
కారు దిగగానే వాచ్ మేన్ ఆశ్చర్యంగా చూశాడు. గబగబా స్వీటీ గురించి చెప్పగానే "లేదమ్మాగారూ, పిల్లలంతా అప్పుడే వెళ్ళిపోయారు. అంతా వెళ్ళాక తాళాలు వేస్తూ చూశాను, లోపల ఎవరూ లేరమ్మా..."
"మా పిల్ల బస్సెక్కనే లేదంటే లోపల వుండిపోయివుండాలి. నీవు సరిగా చూసి వుండవు. ఏ బాత్ రూమ్ కో వెళ్ళినప్పుడు నీవు చూడకుండా తలుపులు వేసేసి వుంటావు. ముందు తలుపులు తీయి లోపలుండిపోయిందేమో చూడాలి. లోపల లేదంటే అపుడు బయట వెతకాలి. త్వరగా తీయి" వాచ్ మేన్ తో తాళాలు తీయించి ముందు స్వీటీ క్లాస్ రూమ్ చూసి, బాత్ రూమ్ లు, వరండాలు, ఒక్కొక్క క్లాసు పరిగెత్తినట్టే చూసుకుంటూ వచ్చారు.
ఒక్కొక్క రూము అయిపోతుంటే ఇద్దరి గుండెలు దడదడ కొట్టుకున్నాయి... స్వీటీ క్లాసుకి ఎడంపక్కనున్న సెకండ్ క్లాస్ 'బి' సెక్షన్ తలుపు తెరవగానే గుమ్మం దగ్గిర స్వీటీ పడివుంది. తెలివితప్పి వుంది. స్కూలు బ్యాగ్, టిఫిన్ బాక్స్ చెల్లాచెదురుగా పడిపోయి వున్నాయి. "స్వీటీ" ఒక్క ఉదుటున సునీత పిల్లని ఒళ్ళోకి తీసుకుంది. "మైగాడ్! రవీ... స్వీటీ తెలివి తప్పింది... భయపడిపోయి వుంటుంది..."
రవీంద్ర కూతురిని గుండెలకి హత్తుకుని "స్వీటీ... కళ్ళు తెరువమ్మా, భయంలేదు మేం వచ్చేశాం... సునీత! వాటర్ బాటిల్ లో నీళ్ళున్నాయేమో తీసి మొహాన జల్లు... అయ్యయ్యో... ఎంతోసేపటినించి ఏడిచి ఏడిచి భయంతో స్పృహతప్పినట్లుంది" సునీత నీళ్లు చల్లినా స్వీటీ కళ్ళు తెరవలేదు.
"షాక్ తో తెలివితప్పింది. పద డాక్టరు దగ్గరకి తీసుకెడదాం..." రవీంద్ర కూతురిని ఎత్తుకుని గబగబా బయటికి వెళ్ళాడు.
"చూశావా లోపలెవరూ లేరన్నావు. తాళాలు వేసేముందు అన్ని గదులు సరిగా చూడద్దా! ఈరోజు మా పిల్లకేదైనా అయితే నీవే బాధ్యుడవు అవుతావు" సునీత కోపంగా అంది.
కారులో సునీత "నాదే తప్పు... నాదే తప్పు, ఇవాళ ఆలస్యం చేశాను రావడం. స్వీటీకి ఏదైనా అయితే నే బతకలేను. రవీ, స్వీటీకి ఏం కాదంటావా?"ఒళ్ళో పడుకోబెట్టుకున్న కూతురిని ముద్దాడుతూ ఏడుస్తూ అంది. గొంతునిండా దుఃఖం అడ్డుపడి అతనికీ మాట రావడంలేదు.
"ప్లీజ్, ఊరుకో సునీతా! ఏడవకు. స్వీటీ దొరికింది అంతే చాలు. ఏడ్చి ఏడ్చి భయంతో స్పృహ తప్పింది. ఇంకేం కాదు ఊరుకో" డ్రైవ్ చేస్తూనే సునీత భుజాలచుట్టూ చెయ్యివేసి ఓదార్పుగా అన్నాడు.
డాక్టరు స్వీటీని పరీక్షించి ఇంజక్షన్ ఇచ్చాడు. "మరేం పరవాలేదు. త్వరలో తెలివివస్తుంది. షాక్ తో తెలివి తప్పింది. పల్స్, హార్ట్ అన్నీ బాగానే వున్నాయి. కాసేపు వెయిట్ చేద్దాం. తెలివి రావచ్చు" అన్నాడు డాక్టర్.
పదినిముషాలకి కళ్ళు విప్పింది స్వీటీ. తల్లిని చూస్తూనే ఒక్క ఉదుటున తల్లిమెడ కావలించుకుని "మమ్మీ... మమ్మీ" అంటూ ఏడవసాగింది.
రవీంద్ర కూతురి తలనిమురుతూ "ఏడవకు తల్లీ... నీకేం కాలేదు మనం ఇంటికెళ్ళిపోదాం..."
"వాచ్ మేన్ నేను లోపలుండగా తలుపేశాడు. నేనెంత అరిచినా వినిపించుకోలేదు. లోపల చీకటి, భయం..." వెక్కి వెక్కి ఏడ్చింది.
"అసలు నీవు లోపలెందుకుండిపోయావు? పిల్లలంతా వెళ్ళిపోతూంటే నీవెందుకు వెళ్ళలేదు" సునీత అడిగింది లాలిస్తూ.
"మమ్మీ, నా వాటర్ బాటిల్ డింపుల్ తీసుకుంది నీళ్లు కావాలని. తరువాత ఇవ్వలేదు. బస్సెక్కడానికి వస్తూంటే వాటర్ బాటిల్ గుర్తుకువచ్చి దాని క్లాసుకెళ్ళాను. టేబిల్ మీద పెట్టేసి వెళ్ళిపోయింది. అది తీసుకువద్దామని వెళ్ళేసరికి తలుపువేసేసి వెళ్ళిపోయాడు వాచ్ మేన్" ఏడుస్తూ ఒక్కొక్క ముక్కా చెప్పింది స్వీటీ.
"ఇంకేం ఫరావాలేదు. ఒకసారి యూరిన్ కి తీసుకెళ్ళండి. తరువాత ఇంటికి తీసుకెళ్ళండి. రాత్రి ఈ మాత్ర ఒకటి వేయండి పడుకునేముందు" డాక్టర్ చీటీ ఇచ్చాడు. "మీరు అదృష్టవంతులు. స్కూలులో వెతికారు మళ్ళీ, లేకపోతే పిల్ల రాత్రంతా అలా పడివుండేది" అన్నాడు.
"ఎస్, డాక్టర్... పిల్ల క్షేమంగా వుంది అంతే చాలు..." అన్నాడు రవీంద్ర.
స్వీటీని తీసుకుని ఇంటికొచ్చేసరికి గౌతమ్ ఎదురొచ్చి చెల్లెల్ని కావలించుకున్నాడు. "ఎక్కడ దొరికిందమ్మా స్వీటీ?"
"స్కూల్లోనే వుండిపోయింది. వాచ్ మేన్ చూసుకోకుండా తాళం వేసేశాడు. ఏడ్చి ఏడ్చి భయంతో తెలివి తప్పితే, డాక్టరు దగ్గిరకెళ్ళి వస్తున్నాం..." కొడుక్కి చెబుతూ గబగబా పాలు వేడిచేసి తెచ్చింది.
రవీంద్ర స్వీటీకి తాగిస్తూ "నాన్నా, నీవు పెద్దవాడివి. చెల్లి బస్సు ఎక్కిందో లేదో చూడాలి. నీవు ఇకముందు ఎప్పుడూ అది బస్సు ఎక్కిందో లేదో చూసుకోవాలి తెలిసిందా..."
గౌతమ్ తలవూపాడు.
సునీత వచ్చి రవీంద్ర పక్కన కూర్చుని స్వీటీ తల నిమురుతూ కాళ్ళ నీళ్ళు పెట్టుకుంది. గౌతమ్ వచ్చి తండ్రి పక్కన కూర్చున్నాడు. ఒకే సోఫాలో కూర్చున్న ఆ నలుగురూ ముచ్చటైన చిన్న ఫ్యామిలీలా వున్నారు. రవీంద్ర, సునీత మనసుల్లో అదే ఆలోచన వచ్చింది. కొడుకుని, కూతురిని దగ్గిరకు లాక్కుని ఆ చేత్తోనే సునీత భుజంచుట్టూ చెయ్యివేసి "నో మోర్ క్రయింగ్, హ్యాపీ ఎండింగ్" అన్నాడు మనసారా.
పిల్లలు పడుకున్నాక "సునీతా, మనం ఎంత అదృష్టవంతులం! స్వీటీకేమన్నా అయితే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేకపోయేవాడివి" అన్నాడు.
* * *
"సార్! శారద సిస్టర్ ఎలా వుంది? నిన్న వెళ్ళి చూద్దామనుకున్నాను గాని కుదరలేదు" అంది సుప్రియ. కుదరకపోవడం కంటే ఎందుకో శారద మొహం చూడాలంటే కాస్త బిడియం అనిపించింది.