Previous Page Next Page 
ఉషోదయం పేజి 36

    "అలాగే వుంది... కోలుకోవడానికి కొన్నాళ్ళు పట్టచ్చు... ఏమిటో పాపం ఆ ఫ్యామిలీకి కష్టకాలం... అటుచూస్తే శారద అమ్మగారికి పక్షవాతం... మొత్తానికి మా ఆవిడ అందరినీ చూసుకోలేక సతమతమైపోతోంది."
    "పాపం, ఆవిడ లేక మీకు ఇబ్బందిగా వున్నట్టుంది... నావల్ల ఏదన్నా సాయం కావలిస్తే చెప్పండి..." అర్థవంతంగా అంది కొంటెగా చూసి.
    ప్రకాష్ కి ఆ మాటలతో ధైర్యం వచ్చింది.
    "నా ఇబ్బందులు తీరుస్తామని ఆఫర్ ఇచ్చినందుకు థ్యాంక్స్. అవసరమైనపుడు తీసుకుంటానులెండి..." అతనూ చిలిపిగా అన్నాడు.
    "అవునూ, మీరు కొత్త ఫ్లాటుకి షిప్ట్ అయ్యారు గదా... ఒకసారి పిలిచి కాఫీ అయినా ఇవ్వాలనిపించలేదా, ఇంత చేశాను గదా మీకోసం... ఓసారి ట్రీట్ ఇవ్వచ్చు గదా!"
    "అయ్యో, ఈ బీద అమ్మాయి ఇంటికి మీరొస్తారా... వస్తానంటే స్వయంగా ఈ చేతులతో కమ్మగా వండిపెట్టి మీ ఆవిడ లేని లోటు తీరుస్తాను... ఏం వస్తారా?" ఆశగా చూస్తూ అడిగింది.
    "ఆఫ్ కోర్స్! వైనాట్... ఇంట్లో అమ్మతో ఏం మాట్లాడతాను... రాహుల్ తోనే సరిపోతోంది ఆవిడకి. ఒంటరిగా ఇంట్లోనే వుండాలనిపించడంలేదు... ఏం కంపెనీ కోసం, మీ భోజనం కోసం తప్పకుండా వస్తాను, సాయంత్రం రానా..."
    "సాయంత్రం వస్తానంటే నేను కాస్త ముందు వెళ్లిపోతానింటికి మిమ్మల్ని స్వాగతించాలి కదా. అరేంజ్ మెంట్స్ చూడాలిగా..."
    "ఓ! దానికేం వెళ్ళు. అర్జెంటు పనులు ఏమన్నా వుంటే చూసి వెళ్ళిపో... నేను వస్తాను తరువాత..." అన్నాడు సంతోషంగా.
    సుప్రియ తల ఆడించింది.
    వెడుతూ వెడుతూ "మీకిష్టమైన వంటకాలు ఏమిటో చెప్పండి, చేసి పెడతాను. నేను వంట బాగా చేస్తాను తెలుసా" అంది.
    "నీవేం పెట్టినా తింటాను. ఛాయిస్ నీదే."
    ఆ సాయంత్రం సుప్రియ షాంపూ చేసుకుని, తెల్లటి కోటాచీరమీద గులాబీ పువ్వులున్న చీర, స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుని, మంచి సెంటు స్ప్రే చేసుకుంది. ఇంట్లో ఫ్రెష్ పువ్వులు పెట్టింది. ఉన్నంతలో ఇల్లు సర్ది, పక్కమీద తెల్లటి దుప్పటి పరిచింది. ఘుమఘుమలాడే సాంబారు, బంగాళాదుంపల వేపుడు, కొబ్బరి పచ్చడి, సేమ్యా పాయసం, వేడి వేడి బజ్జీలు అన్నీ అమర్చింది. బెల్ వినిపించగానే తలుపు తీసింది. చీరలో, జుట్టు విరబోసుకుని, ఘుమఘుమలాడే సువాసనతో, మొహాన చిరునవ్వుతో తలుపుతీసిన సుప్రియని విభ్రాంతిగా చూశాడు. తానెరగని సుప్రియలా కనిపించింది.
    "మీరు సుప్రియా? ఈ ఇల్లు సుప్రియగారిదేనా" అమాయకంగా చూస్తూ అడిగాడు.
    "అబ్బో, ఫరవాలేదు, మీరూ చమత్కారంగా మాట్లాడగలరన్న మాట... రండి రండి లోపలికి స్వాగతం, సుస్వాగతం" చేతులు చాపి నాటకీయంగా ఆహ్వానించింది. ఆమేకాక ఇంటినీ చక్కగా అలంకరించిందని అర్థం అయింది.
    "బాగుంది... సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అయినా క్యూట్ గా వుంది" ఇల్లు కలియతిరుగుతూ అన్నాడు. మోడ్రన్ ఫెసిలిటీస్ తో వున్న ఆ చిన్నఇల్లు నిజంగానే బాగుంది.
    అతనికి అన్ని మర్యాదలూ చేసింది సుప్రియ. అప్పుడు ఆమె చూపిన ప్రేమకి, ఆమె మాటలకి ముగ్దుడైనాడు ప్రకాష్. "సుప్రియా, ఐ లైక్ యూ... ఇది ప్రేమంటారో ఏమంటారో నాకు తెలియదు. నాకు నీ సాహచర్యం కావాలి ప్లీజ్ కాదనకు... చాలా ఒంటరిగా నాకెవరూ లేనట్టు, నేనెవరికీ అక్కరలేనట్టు ఫీలవుతున్నాను. ప్లీజ్ లవ్ మి" ఉద్విగ్నుడై సుప్రియ మొహం పైకెత్తి పెదాలు కలిపాడు. ఆమెని గుండెలకి హత్తుకున్నాడు. మోహావేశంతో ఆమెని ముద్దాడుతూ, ఐ లైక్ యు సుప్రియా... నీవు నాకు కావాలి, కాదనకు" అంటూ ఆవేశపడిపోయాడు.
    సుప్రియ జవాబివ్వలేనట్టు అతని భుజాలమీద తలవాల్చి, చేతులు భుజాల చుట్టూ బిగించింది ఏదో అడగాలని. 'నీకు భార్యాపిల్లలున్నారు... నాతో ఈ పరిచయం ఎలా నిలబడుతుంది? నన్నేం చేస్తావు? నీ అవసరం తీర్చుకుని వదిలేస్తావా...' అంటూ అడగాలనుకుంది. కాని ప్రకాష్ దేనికీ అవకాశం ఇవ్వకుండా ఆమెని మైమరుపులో పడేశాడు.
    అరగంట తర్వాత "థ్యాంక్స్ సుప్రియా... ఇలాంటి గొప్ప అనుభూతి నాకింతవరకు దొరకలేదు. ఇంత చక్కని అనుభవం వుంటుందని కూడా ఊహకి అందలేదు ఇన్నాళ్ళూ. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడంలేదు" అన్నాడు ఎమోషనల్ గా సుప్రియ జుట్టు సవరిస్తూ. కోరికలు కోరాల్సిన సమయం రాలేదని సుప్రియకి తెలుసు. అందుకే మౌనంగా అతని భుజాల ఒంపులో తలవాల్చుకుని వుండిపోయింది.
                                           * * *
    "నిన్న మళ్ళీ ఏమొచ్చిందని అలా పరిగెత్తి వెళ్ళిపోయావు? చీమ చిటుక్కుమంటే ఆవిడగారు ఫోను చెయ్యడం, నీవు పరిగెత్తడం... మరి అంత క్లోజ్ గా ఆవిడకి అన్నివిధాల సాయంగా వుండాలనుకునేవాడివి ఈ డైవర్సు భాగోతం ఎందుకు, నన్నెందుకు మధ్యన మభ్యపెట్టడం..." రంజని నిలేసినట్టే అడిగింది.
    రవీంద్ర రంజని వంక కోపంగా చూశాడు. "చీమ చిటుక్కుమనలేదు. నా కూతురు నాలుగ్గంటలు కనపడకుండా పోతే వెతకడానికి వెళ్ళాను. స్వీటీ నా కూతురు, అదంటే ప్రాణం. ఆ మాట మర్చిపోకు."
    "కూతురు ప్ర్రాణం, కొడుకు ఊపిరి, మనసు భార్య... మరి నా స్థానం ఏమిటో..." రెట్టించింది అసూయగా.
    రవీంద్ర తిరస్కారంగా చూశాడు. జవాబివ్వాలనునీ మానేశాడు. "వాళ్ళతో తెగతెంపులు చేసుకోవాలనుకున్నవాడివి, వాళ్ళెలా చస్తే నీకేం... చీటికీ మాటికి ఆవిడ పిలవడం, నీవెళ్ళడం... ఇదంతా సహించి నేను పడివుండాలనా నీ ఉద్దేశం"
    "షటప్... వాగకు... నాకూతురు కనపడలేదన్న బాధ నాకుండకూడదనా నీ ఉద్దేశం... ఎవరెలా చస్తే నాకేం అని ఊరుకోవడానికి వాళ్ళు పైవాళ్ళు కాదు. నా రక్తంపంచుకుని పుట్టిన పిల్లలు. వాళ్ళతో నా అటాచ్ మెంట్ పదేళ్ళది. ఆట్టే వాగకు... మరోసారి నా పిల్లలగురించి ఏదన్నా మాట్లాడితే సహించను... పిల్లలు, అనుబంధాలు నీకెలా అర్థమవుతాయి? పడివుండాలని నీకు లేకపోతే నేనేం బలవంతంగా నిన్ను కట్టిపడేయలేదు. నీకు స్వాతంత్ర్యం వుంది నీ ఇష్టం వచ్చింది చేయడానికి. నిర్ణయం తీసుకునే అధికారం, స్వేచ్ఛా నీకున్నాయి. డోన్ట్ బ్లేమ్ మీ అన్ నెససర్లీ" కటువుగా అన్నాడు.                                                                                    

 Previous Page Next Page