"నీరదా, ఇటుచూడు. శారదని నేను, నన్ను గుర్తుపడుతున్నావా? నీరదా! ఇటు చూడమ్మ" అంటూ చెల్లెలి తలమీద చేయివేసి నిమురుతూ రకరకాలుగా పలకరించింది. నీరద ఆ మాటలు విననట్టు అదే శూన్యంలోకి చూపు - ఏ స్పందనా లేని భావం!
"ప్చ్, ఆమెకింకా తెలివిరాలేదు. ఆమె శరీరం నిండా మత్తు పదార్థాలు నిండిపోయి వున్నాయి. నెత్తురులోంచి ఆ దుష్టప్రభావం పోవడానికింకా సమయం పడుతుంది. ఆమెకి తెలిసిన మనుషుల గొంతు, స్పర్శ, ప్రేమతో నిండిన ఓదార్పు మాటలు వినిపిస్తూండాలి. కావాల్సిన వారి ప్రేమాభిమానాలు, స్పర్శ తొందరలో ఆమెకి తెలివిరావడానికి ఉపయోగపడుతుంది" డాక్టరు విశదీకరించాడు. "మీలో ఎవరో ఒకరు తరచూ ఆమెని పిలుస్తూ మాట్లాడుతూండండి... ఆమె శరీరం రియాక్ట్ అవకపోయినా మనసు ఆ స్పర్శని, ఆ శబ్దతరంగాలని గ్రహిస్తుంది..."
"తప్పకుండా, మేం ఎవరో ఒకరం విడవకుండా నీరద దగ్గిర వుండి మాట్లాడుతూ వుంటాం..." శారద అంది.
లలితమ్మ కళ్ళు తెరిచి యిటే చూస్తోంది. ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తోంది. శారద అది గుర్తించి "అమ్మా, మన నీరదమ్మా... అది ప్రాణాలతో బతికి బయటపడిందమ్మా... కొద్దిరోజులలో బాగవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. నీవు భయపడడానికి ఏమీలేదు. నీవు కోలుకోవలమ్మా. నీరదని ఎవరు చూసుకుంటారు, నీవిలా పక్కమీద పడుకుంటే! నీవు ఆరోగ్యంగా వుంటేనేనమ్మా ఇల్లు నడిచేది" తల్లిజుట్టు సవరిస్తూ తనే తల్లి అయింది.
లలితమ్మ నీరదవంకే చూస్తోంది. ఆమె కాళ్ళనిండా నీళ్ళు. ఏదో చెప్పాలని నోరు తెరవాలన్నా తెరవలేకపోయింది... మూతి వంకర తిరిగింది. కుడిచేత్తో తన నోరు చూసింది... ఎడమచెయ్యివంక చూసింది.
"నయం అవుతుందమ్మా. నీవు ప్రశాంతంగా వుంటే నీ బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. బ్లడ్ ప్రెషర్ తగ్గందే ఈ జబ్బు నయంకాదు. నీవు ప్రశాంతంగా వుండు ముందు. అమ్మా, మీరిద్దరూ ఇలా వుంటే నాన్న ఏమైపోతారు! నీవుధైర్యం తెచ్చుకో" అంటూ ఓదార్చింది.
సాయంత్రం సునీత ఆఫీసునించి డైరెక్ట్ గా వచ్చి చూసి చలించిపోయింది. "ఏమిటే ఈ ఘోరం... ఎంతకి తెగించారే ఆ దుర్మార్గులు" కళ్ళు తుడుచుకుంటూ అంది.
"అమ్మకూడా ఇలా అవడం ఏమిటే ఖర్మ.. కష్టాలన్నీ ఒకేసారి చుట్టబెట్టుకుని వస్తాయన్నది ఎంత నిజం... ఈ సమయంలో వీళ్ళకి నీవే ఆసరా. ఇల్లు, ప్రకాష్ పిల్లాడు కొన్నాళ్ళు మరిచిపోవాలి. నీ అదృష్టంకొద్దీ అర్థంచేసుకునే అత్తగారు వుంది."
"ఆవిడ పాపం అంతా చూసుకుంటున్నారే... అప్పుడప్పుడు ఈయనగారే కాస్త సణుగుతారు..." అంది శారద.
"ఏం పాపం నిన్ను మిస్ అవుతున్నాడటనా... అంత సీనుందా?" అంది హాస్యంగా అన్నట్టు. "అవునూ సుప్రియ ఎలా గెటాన్ అవుతోంది మీ ఆయనతో..."
"ఏమో, నా గొడవల్లో నేనున్నాను... దాని సంగతి ఎక్కడ పట్టించుకోను..."
"కాస్త పట్టించుకోవాలే తల్లీ... ఈ మగాళ్ళమీద ఓ కన్నేసి వుంచాలే..." నవ్వుతూ హాస్యంగా అన్నట్లంది.
శారద కాస్త అనుమానంగా "ఏమిటలా అంటున్నావు?" అంది.
"ఊరికే సరదాకి అంటే గాభారాపడుతున్నావు ఎందుకే... సరే, నే వెళ్ళాలి పిల్లలు ఒంటరిగా వున్నారింట్లో... మళ్ళీ వీలుచూసుకుని వస్తాలే."
* * *
సునీత ఇంటికి వచ్చేసరికి వీధిగుమ్మం దగ్గిర కూర్చుని గౌతమ్ ఏడుస్తున్నాడు. పక్కన పుస్తకాల సంచి... సునీత గుండె జారిపోయింది. పరుగున వచ్చి "ఏం నాన్న ఇక్కడ కూర్చున్నావు? లోపలికి వెళ్ళలేదేం, స్వీటీ ఏది?'' ఆదుర్దాగా అడిగింది.
"మమ్మీ... స్వీటీ... స్వీటీ బస్సులోరాలేదు. నేను బస్సు దిగి చూస్తే అది బస్సులో లేదు" అన్నాడు వెక్కుతూ.
"స్వీటీ రాలేదా... బస్సులో రాలేదూ... అది బస్సెక్కలేదా? నీవు చూడలేదా" పాలిపోయిన మొహంతో భయంగా అడిగింది.
"ఏమో మమ్మీ... గర్ల్స్ అంతా ముందునించి ఎక్కుతారుగా బస్సెక్కిందనుకున్నాను. దిగాకగాని చూడలేదు మమ్మీ" మళ్ళీ ఏడుపు ఆరంభించాడు.
సునీత బెంబేలుపడిపోయి కొడుకు తల గుండెలకదుముకుని తాళం తీసి లోపలికి తీసుకెళ్ళింది. ఆమె గుండెలదురుతూ చేయి వణికింది. స్కూల్లోనే వుండిపోయిందా... అసలు బయటికొచ్చిందా, తనలో తాను అనుకుంటూ గబగబా ఫోను తీసింది.
"రవీ... రవీ... స్వీటీ స్కూలునించి రాలేదు. రవీ! గౌతమ్ ఇంటికొచ్చి ఏడుస్తూ కూర్చున్నాడు. నేను నీరదని చూడడానికి వెళ్ళి వచ్చేసరికి ఆలస్యం అయింది. స్వీటీ ఏమైందో, స్కూల్లోనే వుండిపోయిందేమో... ప్లీజ్, వెంటనే మనం స్కూల్ కి వెళ్ళాలి రండి వెంటనే..." గాభారాగా వణుకుతున్న గొంతుతో అంది.
"ఓ మైగాడ్... స్వీటీ, ఆరైంది ఇంకా రాలేదా... స్కూలునించి ఫోనైనా రాలేదా... ఓ షిట్... వస్తున్నా, వెంటనే వస్తున్నా" ఫోను పెట్టేసి పరిగెత్తినట్టే బయటికి దూసుకుపోయాడు.
ఫోనులో మాటల వల్ల సునీత ఫోనని... స్కూలు, స్వీటీ రాలేదులాంటి మాటలవల్ల మళ్ళీ పెళ్లాం పిలవగానే పరిగెత్తాడన్నది అర్థమై కోపంగా చేతిలోని పెన్ను విసిరికొట్టింది.
రవీంద్ర ఇంటికొచ్చేసరికి సునీత ముక్కూ మొహం ఎర్రబడిపోయి ఏడుస్తూ గేటు దగ్గిరే నిలబడింది రవీంద్రకోసం చూస్తూ. "గౌతమ్, నాన్నా, లోపలికి వెళ్ళి తలుపువేసుకో... టిఫిన్ తిను, వచ్చేస్తాం... చెల్లిని తీసుకుని వచ్చేస్తాం ఏడవకు నాన్నా, భయంలేదు... లోపలికెళ్ళు..." అంటూ సునీత గబగబా కారులో వచ్చి కూర్చుంది.
"స్కూలు మూడున్నరకి వదిలితే ఇప్పుడు ఆరైంది. ఇంతసేపు రాలేదంటే ఏమయింది? ఈ బస్సు వెళ్ళిపోయినా ఇంకో బస్సులో పంపడమో లేక మనకి ఫోనన్నా చేసేవారు కదా స్కూలువాళ్ళు... అలా రాలేదంటే అదసలు ఎక్కడుండి వుంటుంది? కొంపదీసి" రవీంద్ర వివర్ణమయిన మొహంతో సునీతవంక చూశాడు.