కనుక నాకున్న ఈ పచ్చళ్ళు పట్టే టెక్నిక్ తో వ్యాపారం ఎందుకు ప్రారంభించకూడదనుకుంది.
అంతే... ఆ మరుక్షణం డబ్బున్న మరో గృహిణితో కలిసి 'ఇన్ స్టెంట్ మసాలాస్' పెద్ద ఎత్తున తయారుచేసి వివిధ రకాల పచ్చళ్ళు పెట్టుకోవడానికి అతితేలికైన మార్గం చూపెట్టింది.
చూస్తుండగానే ఆమె తయారుచేసే పచ్చళ్ళు, మసాలాలు విపరీతంగా అమ్ముడుపోవడం మొదలైంది.
మనదేశంలో ఒక కొత్త ప్రోడక్ట్ ని ఏ మాత్రం చదువుకోని ఓ వంట ఇంటి గృహిణి కనిపెట్టింది.
ఆమె మరికొద్ది కాలానికే ఓ పెద్ద బిల్డింగ్ కొని తమ వ్యాపారాన్ని అందులోకి మార్చి లక్షలు కాదు కోట్లు గడించింది. ఆ తరువాతే కొన్ని పచ్చళ్ళ కంపెనీలు వివిధచోట్ల ప్రారంభమయ్యాయి.
ఆల్ రడీ వున్న వ్యాపారాన్ని ప్రారంభిస్తే పోటీని తట్టుకోవాలి. అదే వ్యాపారంలో వున్న మిగతా సంస్థలు తయారుచేసే వస్తువులకన్నా నాణ్యమైనవి చేసి, తక్కువ ధరకి అందిస్తేనే నిలబడగలిగేది..."
ఆమె చెప్పడం ఆపి టైమ్ చూసుకుంది.
"నాకు కాలేజీకి టైమ్ అవుతోంది. మరికొన్ని సక్సెస్ ఫుల్ స్టోరీస్ రేపు చెబుతాను. నన్ను కాలేజీ దగ్గర డ్రాప్ చేసి రాగలవా?" అంది చిరునవ్వుతో.
త్రినాధ్ వెంటనే లేచాడు.
జీప్ మాలిని పనిచేసే కాలేజీ వేపు దూసుకుపోతోంది.
కాలేజీ రోడ్ మలుపు తిరుగుతుండగా సడన్ గా ప్రియాంక మెర్సిడస్ జీప్ ని ఓవర్ టేక్ చేసి ముందుకెళ్ళి కొద్దిగా స్లో అయింది. స్లో అయిన కారులోంచి ప్రియాంక తొంగిచూసి ఓ క్షణం షాక్ తింది.
అంటే... తమ మేడమ్ త్రినాధ్ కి గురువా? లేక మరేదైనా సంబంధం వుందా? ఆమె ఆలోచిస్తూనే ముందుకు సాగిపోయింది.
ఆమె కారును మాలిని, త్రినాధ్ ఇద్దరూ చూశారు. కాని పైకేం మాట్లాడుకోలేదు.
జీప్ కాలేజీ ముందాగింది.
"ఈరోజు నుంచే కథ పాకానపడి రక్త కట్టబోతోంది. జాగ్రత్తగా వుండు" అంటూ చకచకా కాలేజీలోకి వెళ్ళిపోయింది మాలిని. వెళుతున్న ఆమెవైపే చూస్తూ జీప్ రివర్స్ చేశాడు త్రినాధ్.
జీప్ ని ఆఫీస్ వేపు త్రిప్పకుండా హిందూ రూమ్ వేపుకి తిప్పాడు.
రోడ్లింకా ట్రాఫిక్ తో నిండిపోలేదు. త్రినాధ్ చేతిలో జీప్ అరవై కిలోమీటర్లు స్పీడ్ దాటిపోయింది.
అతని ఆలోచనలు అంతకంటే వేగంగా ప్రయాణిస్తున్నాయి.
తన గురువు మాలిని జీవిత లక్ష్యం ఏమిటి? ఆమెకు వెనుకా ముందు ఎవరూ లేరా? గురుదక్షిణగా తననుంచి ఏమి కోరనుంది? ఏమి కోరినా అదెంతటి కష్టసాధ్యమైందైనా తను నెరవేర్చి తీరాలి.
అంతలోనే అతని ఆలోచనలు ఇంజనీర్ వేపు మరలాయి- ఒకసారి వాడిన లూబ్రికేటింగ్ ఆయిల్స్ నుంచి ఓ సరికొత్త వస్తువు ఉద్భవిస్తుందా... లేక తన ఆశలు, ఆలోచనలు తప్పుదోవని ప్రయాణిస్తున్నాయా?
త్రినాధ్ జీప్ హిందూ రూమ్ ముందు ఆగుతుండగా శబ్దాన్ని బట్టి గ్రహించిన ఇంజనీర్ బయటకు పరిగెత్తుకొచ్చాడు.
జీప్ ఆపిన త్రినాధ్ ఓసారి తలెత్తి ప్రియాంక బంగ్లావేపు చూసాడు సాలోచనగా. అంతలోనే చటుక్కున తలతిప్పి ఇంజనీర్ వేపు చూశాడు ప్రశ్నార్ధకంగా.
ఇంజనీర్ మొహంలో వెలుగు స్పష్టంగా కనిపిస్తోంది.
అతనేదో చెప్పబోతుండగా "నో... నాట్ హియర్..." అన్నాడు త్రినాధ్ అభినందనగా చూస్తూ.
అంతలో హిందూ వచ్చింది.
"లోపలకు రావచ్చుగదా? ఇక్కడే ఆగిపోయావేం...?" అంది.
"లోపల నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే అర్భకుడున్నాడు..." అన్నాడు జీప్ స్టార్ట్ చేస్తూ.
ఇంజనీర్, హిందూ జీప్ ఎక్కారు.
* * * *
"కమ్యూనిస్ట్ దేశం జెకోస్లవేకియాలో మనకు కావల్సిన మెషినరీ సప్లై చేసే కంపెనీ అడ్రస్సు సంపాదించాను. కాని..." ఆగిపోయాడు ఇంజనీర్.
"సందేహం మనలోని సగం బలాన్ని హరించి వేస్తుంది. విషయం సూటిగా చెప్పు..." అన్నాడు త్రినాధ్ నుదుటిని చూపుడు వేలితో రుద్దుకుంటూ.
"మెషిన్ ఖరీదు ఆరు లక్షలదాకా వుంది...." త్రినాధ్ విన్నాడేకాని ఇంజనీర్ కి సమాధానం ఏం ఇవ్వలేదు. హిందూవేపు తిరిగి అన్నాడు- "రేపే ఇంటర్వ్యూలు కండక్ట్ చేసేది. బీ ప్రిపేర్ ఫర్ దట్-"
* * * *
మరుసటి రోజు ఉదయం సరిగ్గా 10 గంటలకు బంజారా హోటల్ రూమ్ నెంబర్ 116లో ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి. ఇంటర్వ్యూ బోర్డ్ లో త్రినాధ్, హిందూ, ఛటర్జీ, రామచంద్ర, గుప్తాలు కూర్చున్నారు.
ఇంటర్వ్యూకి వచ్చిన అభ్యర్ధులు రూమ్ బయట లాబీలో కూర్చున్నారు.
మొదటి అభ్యర్ధి ఇంటర్వ్యూ ప్రారంభమైంది. ఇంటర్వ్యూ అంతా సవ్యంగానే జరిగింది. లాస్ట్ లో అభ్యర్ధి డిపాజిట్ దగ్గర చిన్న సందేహం వెలిబుచ్చాడు- డిపాజిట్ కి గ్యారంటీ ఏమిటనీ...
బోర్డ్ లో వున్నవాళ్ళంతా ఓ క్షణం అయోమయంలో పడ్డారు- ఒక్క త్రినాధ్ తప్ప.
ప్రశాంత గంభీర వదనంతో ఓ క్షణం ఆ అభ్యర్ధివేపు చూశాడు.
"మీది న్యాయమైన సందేహం. మీరు కట్టే యాభైవేల డిపాజిట్ కి బ్యాంక్ గ్యారంటీ ఇస్తాం. అయితే చెప్పాంగా ఐదేండ్ల వరకు ఉద్యోగం మానకూడదని-"
త్రినాధ్ నమ్మకంగా చెప్పిన మాటలకు అభ్యర్ధి సంతోషించాడు. యాభైవేలకు బ్యాంక్ గ్యారంటీ లభిస్తోంది. పైపెచ్చు కంపెనీయే తన ఉద్యోగానికి ఐదు సంవత్సరాల గ్యారంటీ ఇస్తోంది.
అతను ఆనందంగా వప్పుకొని యాభైవేలకు కంపెనీ పేర డి.డి. ఇచ్చాడు.
హిందూ ఓ క్షణం షాక్ తింది. యాభైవేల హార్డ్ క్యాష్ చేతిలో వుంచుకొని చిన్న ఉద్యోగానికి వెంపర్లాడే ఆ అభ్యర్ధి మొఖంలో భారత దేశపు సగటు బలహీనతల విద్యాధికులైన లక్షలాది నిరుద్యోగులు కనిపించారు ఓ లిప్తపాటు.
త్రినాథ్ ఆలోచనలెంత నిర్ధుష్టమైనవో, నిర్మాణాత్మకమైనవో అప్పటికిగాని ఆమెకు పూర్తిగా అర్ధంకాలేదు.
ఉదయం పదిగంటలకు ప్రారంభమైన ఇంటర్వ్యూలు మధ్యాహ్నం మూడు గంటల వరకు జరిగాయి.
ఇంటర్వ్యూకు పిలిచిన మొత్తం అభ్యర్ధులు 35 మంది. అందులో 20 మందిని త్రినాధ్ ఇంటర్వ్యూ బోర్డ్ సెలక్ట్ చేసింది. ఇంటర్వ్యూలు ప్రారంభం కాబోయే ముందు త్రినాధ్ మిగతా బోర్డ్ సభ్యులకు ఒక విషయం స్పష్టం చేశాడు. సెలక్షన్ కి ప్రధాన అర్హత డిపాజిట్ కట్టటమే అని.
త్రినాధ్ అనుకున్నట్లుగానే జరిగింది. మొత్తం 20మంది అభ్యర్ధులకు గాను 7,40,000 డిపాజిట్స్ క్రింద వస్తాయనుకుంటే 6,80,000 మాత్రమే వచ్చాయి.
* * * *
"నేనిచ్చిన మాట తప్పక నెరవేర్చుకుంటాను. చెప్పు బాబు... నీకే పరిశ్రమకు లైసెన్స్ కావాలి...? ఛటర్జీ త్రినాధ్ ని అభిమానంగా ప్రశ్నించాడు.
అప్పుడు సమయం రాత్రి పదిగంటలు కావస్తోంది. వసుంధరా ఇండస్ట్రీస్ ఆఫీసులో చిన్న పార్టీ ఏర్పాటు చేశాడు త్రినాధ్.
ప్రస్తుతం ఇప్పుడక్కడ ఛటర్జీ, గుప్తా, రామచంద్ర, హిందూ, ఇంజనీర్ లు వున్నారు.
ఆ హాలు గోడల మధ్య పేరుకున్న నిశ్శబ్దాన్ని చీలుస్తూ అన్నాడు త్రినాధ్. "మీరంతా నా శ్రేయోభిలాషులు, ఆప్తులని నా నమ్మకం. నేనో దుస్సాహసానికి పూనుకున్నాను. దాని వెనుక అవమానం, పరాభవం, దగా, మోసం, ఛాలెంజ్ దాగున్నాయి. అయితే అవి నా వ్యక్తిగతం. వాటికి ఎదురు దెబ్బలు తీయాలన్నది కూడా నా వ్యక్తిగతమే. సమిష్టి గతంగా నేను చేయబోయేది నలుగురు నిరుద్యోగులకు ఆసరా కల్పించడం, వారిలో ఆత్మవిశ్వాసం ప్రోది చేయడం. నా ఆశయం మీకు నచ్చితే నాకు సహకరించండి..." అంటూ ఒకింతసేపు ఆగిపోయి ఛటర్జీవైపు సాభిప్రాయంగా చూస్తూ, "ఇండస్ట్రీస్ వున్నవాడికే ఇంకా కొత్త లైసెన్స్ లు ఇచ్చే ముందు ఈ దేశ యువ పారిశ్రామికవేత్తల గురించి ఆలోచించండి. ఈ దేశ నిరుద్యోగుల గురించి ఆలోచించండి. ఏ వ్యాపకమూ లేక, బతుకూ దెరువు లేక చేసేందుకు ఉద్యోగం లేక నిరాశా నిస్పృహలతో మ్రగ్గిపోతున్న లక్షలాది నిరుద్యోగ యువకుల కాలానికి లైసెన్స్ లు ఇవ్వడం ద్వారా విలువ కట్టండి. ఈ దేశంలో ఆకలి చావుల్ని, యువత ఆత్మహత్యల్ని అరికట్టాలంటే భారీ పరిశ్రమలకు కాదు లైసెన్స్ లు ఇవ్వాల్సింది, చిన్నతరహా పరిశ్రమలకు. నా మాటలలో నీతీ, నిజాయితీ, నిజం వుందని మీకనిపిస్తే త్వరలోనే నా అభ్యర్ధన మీ కందుతుంది. మీ అంగీకారం ద్వారా నాకో దారి ఏర్పడుతుంది..."
త్రినాధ్ చెప్పడం పూర్తయ్యేసరికి ఛటర్జీ కళ్ళు చెమర్చాయి. అతనేం మాట్లాడలేదు. ఆ పార్టీ అలా అర్దరాత్రి పన్నెండు గంటల వరకూ కొనసాగింది.
* * * *
ఉదయం ఆరుగంటల సమయం... వసుంధరా ఇండస్ట్రీస్ ఆఫీస్...
పొడవాటి హాలు నిశ్శబ్దంగా వుంది. హాలుకి ఆ చివర మాలిని- ఈ చివర త్రినాధ్ కూర్చున్నారు.
"డేవిడ్ కర్టిన్ అనే వ్యక్తి సేల్స్ మేన్ గా ఉద్యోగం చేస్తుండేవాడు. అతను హోటల్స్ కి వెళ్ళినప్పుడు మంచినీళ్ళు త్రాగవలసి వచ్చినప్పుడు చిరాకు పడిపోయేవాడు. దానికి కారణం ఆ గ్లాసులు పరిశుభ్రంగా లేకపోవటమే. దానికేదో పరిష్కారం కనుక్కోవాలని శోధించడం మొదలెట్టాడు. ఆ శోధనకు ఫలితంగా అతను కోట్లు ఆర్జించాడు.
మంచి హైజెనిక్ కండిషన్ లో వుండే డిస్ కార్డబుల్ గ్లాసెస్ ని కనుక్కున్నాడు. ఆ డిస్ పోజబుల్ పేపర్ గ్లాసెస్ తయారీ మూలంగా ఓవర్ నైట్ లో అతను మిలియనీర్ అయిపోయాడు..." చెప్తూ చెప్తూ కొద్ది క్షణాలు ఆగిపోయిందామె.
త్రినాధ్ మెదడు ఆమె చెబుతున్న వ్యాపార చారిత్రక సత్యాల్ని నిశ్శబ్దంగా నిక్షిప్తం చేసుకుపోతోంది.
"జాన్సన్ బేండెడ్ ఎయిడ్..." అని ఆమె చెప్పడం ఆపింది.
మధ్యలో ఆమెందుకు ఆగిందో తెలియక త్రినాధ్ ఆమెవైపు ప్రశ్నార్ధకంగా చూశాడు.
ఆమె మనస్సులో కదలాడిన భావన వేరు. మనిషి శారీరకమైన దెబ్బలకు మందు వుందేమో కాని, మానసికమైన దెబ్బలకు...? చూస్తుండగానే ఆమె కళ్ళు రక్తవర్ణం దాల్చాయి.
సమయమొచ్చినప్పుడు తప్ప అడిగినా చెప్పదని అతనికి తెలుసు- అందుకే మౌనంగా వున్నాడు.
"పల్లెల్లో ఇప్పటికీ ఎవరికైనా దెబ్బ తగిలితే మలాం పట్టీలు వేస్తారు. మలాంని కొందరు ప్రకృతి వైద్యులు తయారుచేస్తారు. దాన్ని కొందరు జాడీలలో నింపుకొని గ్రామ గ్రామాన తిరుగుతూ కొద్దికొద్దిగా అమ్ముతుంటారు. అది మైనంలా వుంటుంది. దెబ్బలు తగిలినప్పుడు ఓ చిన్న గుడ్డముక్క మీద దానిని రాసి, దెబ్బ తగిలినచోట అంటిస్తారు. గాయం మానేవరకు ఆ పట్టీ శరీరాన్ని అంటిపెట్టుకుని వుంటుంది. గాయం మానగానే దానంతట అదే ఊడిపోతుంది. ఇంతకీ ఆ మలాంలో వుంది యాంటీ బయాటిక్.
దీనిమీద ఆధారపడిన వ్యాపారం గురించే నేను ఇప్పుడు చెప్పబోయేది.
అమెరికాలో రాబర్ట్ జాన్సన్, జేమ్స్ జాన్సన్, ఎడ్ వర్డ్ జాన్సన్ అనే ముగ్గురు అన్నదమ్ములుండేవారు. వాళ్ళకొక వ్యాపారసంస్థ వుంది. దాని పేరు జాన్సన్ అండ్ జాన్సన్.