"వెళ్ళి కాఫీ తీసుకు వస్తానన్నావ్ కదా! తీసుకురా మనోజ్ కాఫీ తాగకపోతే ఏమిటోగా వుంది. పనిమనిషి చూడబోతే అన్ని ఇళ్లూ చక్కబెట్టుకొని ఎనిమిది తరువాత గానీ రాదు" అన్నాడు ఛటర్జీ.
"నిన్ను తమాషా చేశాను మావయ్యా! వెళ్ళి తీసుకువస్తాను" అంటూ మనోజ్ లేచి షర్టు వేసుకుని, ప్లాస్క్ తీసుకుని బయటకి వెళ్ళాడు.
గుమ్మం దాటగానే కానిస్టేబుల్ ఎదురు వచ్చాడు. ప్లాస్క్ అతనికి ఇచ్చి పంపించాడు మనోజ్. ఇన్ స్పెక్టర్ మనోజ్ కి ఇంకా ఫామిలీ లేనందువల్ల తను పూర్తిగా తనకి ఇచ్చిన క్వార్టర్స్ లో వుండటం లేదు.
"మావయ్యా నేను ఈ ఊరు వచ్చేశాను కదా! నాతోపాటు క్వార్టర్స్ లో వుందువు గాని" అని చెబితే ఛటర్జీ ఒప్పుకోలేదు.
"నేను ఇప్పుడు వుంటున్నది చిన్నదైనా పొందికగా వున్న ఇల్లు. షాలినీకి ఈ ఇల్లు ఎంతో నచ్చింది. షాలిని వచ్చిన తరువాత అది ఇష్టపడితే అప్పుడు ఇల్లు మార్చేద్దాం. నాకిక్కడ ఎందుకో ప్రశాంతంగా వుంది. కొన్నాళ్ళపాటు నన్ను ఈ యింట్లోనే వుండనివ్వు. మీ మకాం కూడా ఇక్కడే పెట్టు.
కాదంటే అటు నీ క్వార్టర్స్ కి ఇటు ఈ యింటికి దగ్గరే కాబట్టి తిరుగుతూ వుండు. చేతిలో హోండా వుంది. చేతికింద మనుషులు వున్నారు, నీకేంబాధ ?"
ఛటర్జీ తోసిపుచ్చటంతో మనోజ్ తన వీలునుబట్టి అక్కడా ఇక్కడా వుంటున్నాడు. వీలయినపుడల్లా ఎక్కువ సమయం ఛటర్జీ దగ్గరే గడుపుతున్నాడు.
కానిస్టేబుల్ కి ప్లాస్క్ ఇచ్చి మావయ్య గురించీ ఆలోచిస్తూ ఇంట్లోకి వచ్చాడు మనోజ్.
మనోజ్ బయటికి వెళ్ళినపుడు హాలులో వున్న ఛటర్జీ ఇప్పుడు అక్కడలేడు.
మావయ్య లావెట్రీకి వెళ్ళాడేమో, మావయ్య వచ్చే లోపల రెడీగా కూర్చుంటే సరి అనుకున్న మనోజ్ కప్పులు తీసుకురావటానికి వంటగదివేపు నడిచాడు.
వంటగదిలో ఛటర్జీ వున్నాడు.
వంటగది గుమ్మం దగ్గరికి వచ్చిన మనోజ్ ని ఛటర్జీ చూడలేదు.
ఛటర్జీ కాఫీ కాచిన గిన్నెని పరీక్షగా చూశాడు. అడుగున కాఫీ చుక్కలు వున్నాయోమో, వేలితో వాటిని నాలికకి రాసుకున్నాడు. పక్కనే ఖాళీగా వున్న పాలగిన్నెను చూశాడు. సింక్ దగ్గరకి వెళ్ళి సింక్ లో పడేసిన రెండు కప్పులనీ చేతిలోకి తీసుకుని పరీక్షిస్తుండగా మనోజ్ మెల్లిగా గుమ్మందగ్గర నుంచీ తప్పుకొని ఆ తరువాత ఇంట్లోంచి బయటకి వచ్చేశాడు.
కాఫీ పోయించుకుని ప్లాస్క్ తో వస్తున్న కానిస్టేబుల్ కి ఎదురు వెళ్ళి "నువ్వు వెళ్ళిపో! డ్యూటీ టైముకి ముందుగా నేను క్వార్టర్స్ కి వస్తాను చెప్పవలసింది ఏమీ లేదుగా" అన్నాడు.
కానిస్టేబుల్ "లేదు సార్!" అని వెళ్ళిపోయాడు.
ప్లాస్క్ తో ఇంట్లోకి వచ్చాడు మనోజ్.
మనోజ్ మనస్సులో సవాలక్ష ఆలోచనలు జోరీగల్లా తిరుగుతున్నాయి. అతను మామూలు మనోజ్ కాదు. ఇన్ స్పెక్టర్ మనోజ్. అతని బుర్ర పోలీసుబుర్ర. శరవేగంగా పనిచేస్తున్నది అది.
మనోజ్ లోపలికి వచ్చేసరికి, ఛటర్జీ ఇందాక ఏ కుర్చీలో, ఏ పొజిషన్ లో కూర్చున్నాడో అలానే కూర్చున్నాడు.
ప్లాస్క్ ని టీపాయ్ మీద పెట్టి "కప్పులు తీసుకు వస్తాను మావయ్యా!" అని మనోజ్ కిచెన్ లోకి వెళ్ళాడు.
సింక్ లో అలాగే వున్న కప్పుల్ని కడుగుతూ కిచెన్ ని ఒకసారి పరీక్షగా చూశాడు.
"మావయ్య ఇక్కడ అన్నీ పరిశీలించి వచ్చి అక్కడ కుర్చీలో కూచున్నాడన్నమాట. ఎందుకలా చేశాడు?...." అలా అనుకుంటూ మనోజ్ ఓ కప్పులో రెండు స్పూన్ల పంచదార వేసుకుని హాల్లోకి వచ్చాడు.
ప్లాస్క్ లోని కాఫీని రెండు కప్పుల్లోకి వంచి చక్కర చేర్చిన కాఫీని మావయ్యకి అందించి, తను మామూలు కాఫీ కప్పుని అందుకున్నాడు మనోజు.
ఇద్దరూ మౌనంగా కాఫీ తాగారు.
ఖాళీ ప్లాస్ ని, ఖాళీ అయిన కప్పుల్ని తీసుకుని సింక్ లో పడేసి వచ్చాడు మనోజ్.
ఇందాక నన్ను జోక్ ఎందుకు చేశావని గాని, నేను వంటగదిలోకి వెళ్ళి అన్ని పరీక్షించి వచ్చాను అని గాని ఛటర్జీ ఏమాటా ఎత్తలేదు.
విషయాన్ని మనసులో పెట్టుకున్న మనోజు తను కూడా బయటపడలేదు.
కొద్దిసేపు ఇద్దరూ ఏవేవో విషయాలు మాట్లాడుకున్నారు.
"ఈ రోజు పేపర్ చూశావా మావయ్యా!" మనోజు మధ్యలో ఎత్తాడు విషయాన్ని.
"చూశాను ఇంకా చదవలేదు. ఎందుకో ఇవ్వాళ్ళ పేపర్ చదవబుద్ధికాలేదు. తిరగేసి ఊరుకున్నాను/ తొందరేముంది? నెమ్మదిగా చదువుతాను" అన్నాడు ఛటర్జీ.
"ది గిఫ్ట్ గురించి సమాచారం కొత్తగా అందించారు. ఈ పేపర్ వాళ్ళకి ఏం పనిలేదు. మమ్మల్ని డైరెక్ట్ గా తిట్టకపోయినా, ఇండైరెక్ట్ గా తిడుతూ వుంటారు. పోలీసు వాళ్లు అసమర్దులైనట్లూ. ప్రజలే సహాయం చెయ్యాలి అన్నట్లు దరిద్రపు రాతలు ఒకటి...." ఈ విషయం గురించీ మనోజు పది నిముషాలు మాట్లాడాడు.
ఎందుకో ఛటర్జీ మౌనంగా వింటూ వుండిపోయాడు గానీ, ఏమీ మాట్లాడలేదు.
మావయ్య ఈ విషయం గురించి ఒక్కమాటా మాట్లాడకుండా మౌనంగా వుండడం మనోజుకి ఆశ్చర్యాన్ని రవ్వంత అనుమానాన్ని కలుగజేసాయి.
తెలిసీ మావయ్య ఏదో దాస్తున్నాడు. మనోజుకి అనుమానం వచ్చింది. ఛటర్జీ ప్రవర్తన కూడా అలాగే వుంది మరి.
27
రాత్రి ఏడుగంటల వేళ.
బోసుబాబు హుషారుగా ఇంట్లోకి అడుగుపెట్టాడు.
అందరూ కూర్చునివుంటే వాళ్ళ మధ్యకి వచ్చి కూర్చున్నాడు.
ఇంకా అప్పటికి ఇంట్లో ఎవరూ భోజనాలు చెయ్యలేదు.
బోసుబాబుతో ఎవరూ మాట్లాడలేదు. ఆ విషయం అతను గ్రహించాడు. గ్రహించి కూడా పట్టించుకోలేదు. అందర్నీ ఒకసారి కలయజూసి "నా వల్ల మీకు ఇంకా ఏ ఇబ్బంది ఉండదు!" అన్నాడు.
ఎవరూ మాట్లాడలేదు.
ఈ తఫా మరో మాట అన్నాడు. "నా కృషి ఫలించింది!" అప్పటికీ ఎవరూ మాట్లాడలేదు.
ఈ తఫా మరో మాట వదిలాడు. "మిమ్మల్ని చూస్తూంటే నవ్వు వస్తోంది."
"ఎందుకు రాదు నాయనా! వస్తుంది. మేమంతా నీ దృష్టిలో సర్కస్ లో జంతువులం, నువ్వు ఆడించినట్లు ఆడుతున్నాం. నిన్ను చూసి భయపడుతున్నాం. నవ్వు రాక ఏమవుతుంది" సామ్రాజ్యలక్ష్మి అనుకుంది.