అది చూసి ఆశ్చర్యపోవడం మనోజ్ వంతయింది.
ఛటర్జీ అందరూ త్రాగే విధంగా కాఫీతాగడు. కాఫీలో రెండు చెంచాల పంచదార ఎక్కువ వేసుకుని కాఫీని కాఫీ పానకంలా తయారుచేసుకుని మరీ తాగుతాడు. కాఫీలో అరచెంచా పంచదార తక్కువ అయినా యిట్టే పసిగడతాడు.
అలాంటిది....?
మనోజ్ కాఫీ ఊదుకుని మొదటి సిప్ చేసే సమయానికి ఛటర్జీ పావుకప్పు ఖాళీ చేసేశాడు.
మనోజ్ కాఫీ కప్పుని అలాగే వదిలేశాడు. ఛటర్జీ ఖాళీ కప్పుని టీపాయ్ మీద వుంచాడు. ఆ తరువాత అయినా ఏమీ మాట్లాడక తీవ్రాలోచన చేస్తూ పైకి చూడసాగాడు.
మావయ్యని మాట్లాడిస్తే ఆలోచనా స్రవంతిలోంచి బయట పడతాడు, అనుకున్న మనోజ్ రెండుకప్పులూ తీసుకువెళ్ళి సింక్ లో పడేశాడు. తరువాత మావయ్య దగ్గరికి వచ్చి కూర్చున్నాడు.
ఇంతవరకూ "గిఫ్ట్" కేసులు అన్ని దినపత్రికలలో ప్రచురించటం జరిగింది. వాటి తాలూకా ఫొటోలు కూడా వార్తలతో పాటు ప్రచురించారు. అయితే, హంతకుడు ఇలా అట్టముక్క ప్రతిచోటా వదిలివెడుతున్నాడని, దాని మీద గిఫ్ట్ బొమ్మ వేసి "ది గిఫ్ట్" అని రాసి పైన 'బి' అన్న అక్షరమూ కింద 'పి' అన్న అక్షరం పొడి అక్షరాలు ఇంగ్లీషులో రాస్తున్నాడని ఇలా వివరాలు ఇవ్వటం జరిగింది పత్రికల్లో.
ఒక పత్రికలో హత్యకాబడిన ముసలి వాడి ఫొటో ప్రచురించినపుడు "గిఫ్ట్" అట్టముక్కకూడా ఫోటోలో వచ్చేటట్టు ఫొటో తీయగాలిగాడు కానీ, ఆ ఫోటో ప్రింట్ లో స్పష్టంగా పడలేదు.
మనోజుకి రెండు రోజుల క్రితమే మంచి ఆలోచన వచ్చింది. తన ఆలోచనలని బబితకి చెప్పాడు.
బబిత తను చేసే పత్రికలో కాక అన్ని పత్రికల్లో వచ్చేలాగా కొంత మాటర్ ని తయారుచేసింది. "ది గిఫ్ట్" తాలూకా అట్టముక్కని ఫోటోలో స్పష్టంగా పడేలా ఆ అట్టముక్కని ఫోటో తీసి, కార్డుసైజు ఫోటోని అన్ని పేపర్లలలో వచ్చేలా చేసి, క్రింద మాటర్ ని కూడా విపులంగా చక్కగా రాసి ప్రచురణ అయ్యేలా చేసింది.
"అటు పోలీసులని ఇటు ప్రజలని హత్యలతో భయభ్రాంతులని చేస్తూ తికమక పెడుతున్న హంతకుడిని సాధ్యమయినంత తొందరగా పట్టుకోవాలని పోలీసు డిపార్టుమెంట్ తీవ్రప్రయత్నం చేస్తూనే వున్నారు.
ఈ విచిత్రమైన హంతకుడిని పట్టుకోవటానికి ప్రజలెందుకు సహకరించకూడదు మీకెందరో చిత్రకారులు తెలిసి వుంటారు. మీ పరిచయస్థులలో చిత్రకారులు వుండవచ్చు లేక ఎప్పుడో ఎక్కడో చూసి వుండవచ్చు. "ది గిఫ్ట్" ఫోటోని బాగా పరిశీలించండి. అచ్చం అలానే బొమ్మవేసిన వాళ్లు ఎవరైనా వున్నారా! పోనీ ఆ అక్షరాలనయినా అలా ఆర్ట్ గా రానేవాళ్ళని మీరు ఎప్పుడైనా చూశారా?
మీకు ఎవరిమీదనైనా అనుమానం వస్తే పోలీసులకి వార్త అందేలా చెయ్యండి. పోలీసులకి అయినా, ప్రభుత్వానికి అయినా ప్రజల సహకారం అవసరం.
మీరేమంటారు?"
ఇలా ఫోటో క్రింద బబిత ఒక మాటర్ తయారుచేసి అన్ని పత్రికల్లో వచ్చేలా చేసింది. ఇప్పటికే సంచలనం కలిగిస్తున్న "ది గిఫ్ట్" కథాకమామిషు ఈ ఫోటోతో మరింత సంచలనం కలిగించింది.
ఆ విషయం గుర్తుకి వచ్చిన మనోజ్, మావయ్య ఆలోచనలు మళ్ళించటానికి టాపిక్ అదే ఎత్త దలుచుకున్నాడు.
"మావయ్యా!" మనోజ్ పిలిచాడు.
పరధ్యానం నుంచీ తేరుకున్న ఛటర్జీ "ఊ".... మటుకు కొట్టి ఊరుకున్నాడు.
"మావయ్యా!" ఈ తఫా గట్టిగా పిలిచాడు మనోజ్.
"ఏమిటి?" ఛటర్జీ ఆలోచనా స్రవంతిలోంచి బయటపడి అడిగాడు.
"నేను ఎన్నిసార్లు అడిగినా కాదంటున్నావ్ కానీ ఉదయం నుంచీ గమనిస్తున్నా కదా చాలా తీవ్రంగా ఆలోచిష్టున్నావ్ దేని గురించీ?" అడిగాడు మనోజ్.
"దీర్ఘంగా ఆలోచిస్తున్నానా?" ఛటర్జీ అడిగాడు.
"చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్!
"ఎలా చెప్పగలవ్?"
"ఇలాంటిది ఫేస్ చూస్తేనే తెలుస్తుంది మావయ్యా! కానీ నాకు ఒక క్లూ కూడా దొరికింది" మనోజ్ చెప్పాడు.
"మొత్తానికి పోలీసు బుద్ధి పోనిచ్చుకున్నావు కాదూ. ఇంతకీ నువ్వు ఎలా పసిగట్టావ్? అది చెప్పలేదు" నవ్వుతూ అన్నాడు ఛటర్జీ.
"వెరీ సింపుల్! కాఫీలో పంచదార వెయ్యటం పూర్తిగా మరిచిపోయాను. చిటికెడు పంచదార తక్కువ అయితేనే, కాఫీ తాగని నువ్వు అసలు పంచదార వెయ్యని కాఫీని. మామూలుగా త్రాగేశావ్! ఈ చిన్న క్లూ చాలనుకుంటాను మావయ్యా! నువ్వు పరధ్యానంగా వున్నావూ అని గ్రహించటానికి" మనోజ్ చెప్పాడు.
ఛటర్జీ పకపకా నవ్వాడు. "షుగర్ లేని కాఫీ నేను తాగడమా? ఇంపాజిబుల్!" అన్నాడు నవ్వుతూనే.
తెల్లబోవటం మనోజ్ వంతయింది.
"నేను అబద్ధం చెప్పడం లేదు మావయ్యా!"
ఛటర్జీ కాఫీ కప్పు కోసం అటూ ఇటూ చూశాడు. "నేను తాగిన కాఫీ కప్పు ఏది? అసలు నాకు కాఫీ ఇచ్చావా? జోక్ చేస్తున్నావా?" మనోజ్ కళ్ళల్లోకి గుచ్చి చూస్తూ అడిగాడు.
మనోజ్ కి తలక్రిందులయినంత పని అయ్యింది.
"నేను కాఫీ ఇచ్చాను. నువ్వు తాగేశావు. నువ్వు తాగుతున్నంతసేపూ నేను ఆశ్చర్యంగా చూస్తూ వున్నాను. చివరికి ఖాళీ కప్పు తీసుకువెళ్ళి వూరికినే ఒకసారి నీళ్ళతో కడిగి సింక్ లో పడేసి వచ్చాను."
"నువ్వు చెప్పింది నమ్మమంటావ్!"
"నమ్ముతావో లేదో నీ యిష్టం మావయ్యా!"
"అయితే నేను నమ్మనురా! నీ యిష్టం నువ్వు ఎలా అనుకున్నా సరే!" ఛటర్జీ అన్నాడు.
మనోజ్ కి ఓ ఆలోచన వచ్చింది.
"నీకు కాఫీ ఇద్దామని పాలు వెచ్చబెట్టాను. పాలు విరిగిపోయాయి. "ఈ పూట కాఫీ లేవు బయట నుంచీ తెమ్మంటావా మావయ్యా!" అని అడగటానికి ఇక్కడ వచ్చి కూర్చున్నాను. నువ్వేమో ఆలోచిస్తున్నావు. దాంతో తమాషా చెయ్యాలని బుద్ధి పుట్టింది.
దీర్ఘాలోచనలో వున్నావు కదా. నేను చెప్పింది నమ్ముతావు కదా అనుకున్నాను. నీకు కాఫీ ఇచ్చినట్లు, ఆ కాఫీలో పంచదార అసలు వెయ్యనట్లు అబద్ధం ఆడాను, పాలు విరిగిపోయినంత వరకూ కరెక్టే. నీకు కాఫీ ఇవ్వటం నువ్వు తాగటం మాత్రం అబద్ధం. చిన్న తమాషా చేశాను అంతే. వెళ్ళి కాఫీ తీసుకురానా" మనోజ్ అడిగాడు.
"నాకు తెలుసురా నువ్వు జోక్ చేస్తున్నావని. పంచదార తక్కువ అయితేనే నేను కాఫీ తాగను. అలాంటిది అసలు పంచదార లేకుండా కాఫీ తాగటమా! ప్రపంచం తలక్రిందులయ్యేది. పంచదార లేని కాఫీ నాచేత తాగించలేరు." అన్నాడు ఛటర్జీ.
"మావయ్య తనని జోక్ చేస్తున్నాడా? లేక మావయ్యకి మతిపోయిందా? లేక నాకు మతిపోయిందా?" మనోజ్ అలా వుండిపోయాడు ఏం మాట్లాడాలో తెలియక.