Previous Page Next Page 
మరోమనసు కథ పేజి 34

    "విత్ ప్లెజర్! గోఎహెడ్!" కుర్చీ లాక్కొని కూర్చుంటూ అన్నాడాయన.
   
    "ఒక్క నిముషం! రమణమూర్తిగారితో అయిపోగానే మిమ్మల్ని అడుగుతాను" అన్నాడు చంద్ర.
   
    "ఏదో చెపుతూ వదిలేశానూ...." బట్టతల నిమురుకొంటూ రమణమూర్తిని చూసి అడిగాడు డాక్టర్ చంద్ర.
   
    "పోలీసాఫీసర్ల అల్లుళ్ళ కాంప్లెక్సు గురించి....."
   
    "యస్! యస్! ఇక్కడ మన కేసుకు సంబంధించిన ముఖ్యమైన విషయం ఒకటుంది. మీ అల్లుడు మిమ్ములను ద్వేషిస్తున్నాడనేది నిజం. డానికి కారణం ఏమై ఉంటుందా అని అన్వేషిస్తున్నాను. యామ్ ఐ రైట్ మిస్టర్ మూర్తి?"
   
    "యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్టు డాక్టర్."
   
    "థాంక్యూ? అఫ్ కోర్స్ దేర్ ఆర్ నో అబ్సల్యూట్స్ ఇన్ సైకాలజీ" అంటూ నవ్వేశాడు డాక్టర్.
   
    "సో! మీరు గుర్తించగలిగిన కారణమేమీ లేదనేగదా మీ అభిప్రాయం. పోతే జగన్మోహనరావు కథనంవల్లనే మీపై ద్వేషభావం ఏర్పడింది అనుకుందాం ప్రస్తుతానికి" అంటూ ఫైల్లో ఏదో నోట్ చేసుకొన్నాడాయన.
   
    "డాక్టర్ చౌదరిగారూ!" అంటూ రివాల్వింగ్ చైర్లో గిర్రున ఆయన కేసి తిరిగాడు డాక్టర్.
   
    అది చూసి లేచి నిలబడ్డాడు రమణమూర్తి.
   
    "మీరున్నా పర్వాలేదు, ఉండండి" డాక్టర్ రమణమూర్తిని కూర్చోబెట్టాడు.
   
    "చౌదరీసాబ్! కృష్ణ ఆరునెలలనుంచి మీకు బాగా తెలుసు. మీకు డైరెక్టు అసిస్టెంటుకూడాను. అతని ప్రవర్తనలో ఏమైనా ఒడుదుడుకులు గానీ, అసహజమైన ప్రవర్తనగానీ, కాంప్లెక్సెస్ గానీ, మేడ్ మూవ్ మెంట్సు గానీ మీకు కన్పించాయా?"
   
    "లేదు డాక్టర్, కృష్ణ చాలా ఫర్ ఫెక్టుగా ఉండేవాడు. పనికూడా మెథాడికల్ చేసేవాడు. మితభాషి ఎప్పుడూ ఉత్సాహంగా ఉన్నట్టే కన్పించేవాడు. నాలుగురోజులక్రితంవరకూ కృష్ణ మా మూర్తి అల్లుడని నాకు తెలియదు. ఓ రోజు యాక్సిడెంటల్ గానే వాళ్ళింటికి వెళ్ళడం జరిగింది, అప్పుడే కృష్ణ మా సుధ భర్త అని తెలుసుకొన్నాను."
   
    "తెలిశాక కృష్ణకు మీపట్ల అంతకుముందున్న గౌరవాభిమానాల్లో ఏదైనా మార్పు వచ్చిందా?"
   
    "మొదట్లో నాకేమీ అన్పించలేదు. ఈ రెండు రోజుల్లోనే చాలా మార్పు వచ్చింది. మొన్నటివరకూ నామీద పూర్తిగా విశ్వాసంతో వున్న వాడు ఒక్కసారిగా మారిపోయాడు. తనమీద ఏదో కుట్ర జరిగిపోతోందనీ, ఆ కుట్రలో నేనూ భాగస్వామిననే అభిప్రాయం ఏర్పడింది. రమణ మూర్తిని నేనే పిలిపించాననీ__"
   
    "అది వాస్తవమే గదా!"
   
    "అవును! నేనే పిలిపించాను,"
   
    "అలా ఎందుకు చేశారో వివరంగా చెబుతారా?"
   
    "మే ఐ హావ్ సమ్ వాటర్?"
   
    "ఓ ష్యూర్!" డాక్టర్ మంచినీళ్ళు  తెప్పించి ఇచ్చాడు.
   
    రెండుగ్లాసుల నీళ్ళుతాగి, చౌదరి, సుధ ఫోన్ చేసినప్పటినుంచీ, ఆ రోజు సాయంత్రంవరకూ జరిగిందంతా వివరంగా చెప్పాడు.
   
    డాక్టర్ మధ్యమధ్య కొన్ని పాయింట్స్ నోట్ చేసుకొంటూ అంతా శ్రద్దగా విన్నాడు.
   
    "సర్! అంతా రెడీ చేశాం!" సైకోలాబ్ నర్సు వచ్చి చెప్పింది.
   
    డాక్టర్ టైం చూసుకొన్నాడు.
   
    ఎనిమిదిన్నర అయింది.
   
    "ఓ.కే. పేషెంటు ఎలా ఉన్నాడు?"
   
    "రెస్ట్ లెస్ గా ఉన్నాడు. బాగా చిరాకుపడ్తున్నాడు. మీరు త్వరగా వస్తే మంచిదంటున్నాడు డాక్టర్ డయాసాగర్" అంది నర్సు.
   
    "అది కరెక్టు కాదు మిస్ రోజీ! పేషెంటు మాగ్జిమమ్ ఎన్ డ్యూరెన్స్ పాయంట్ కు రావాలి. అప్పుడుకాని బ్రేకింగ్ పాయింట్ కు రాడు. ఈలోపల ఆయన భార్య ఇంటర్వ్యూ పూర్తిచేస్తాను. డాక్టర్ దయాసాగర్ ను పక్కకు పిల్చి నేను చెప్పింది చెప్పు" అని చెప్పి డాక్టర్, నర్స్ రోజీని పంపించివేశాడు.
   
    "నేరస్థులనుంచి నిజాన్ని కక్కించడానికి మేము అనుసరించే పద్దతికూడా ఇలాగే ఉంటుంది డాక్టర్" అన్నాడు రమణమూర్తి.
   
    "కరెక్ట్! అయితే కొంత తేడా వుంది. మీరు మనిషిని శారీరకంగా హింసించి మనసును చెదరగొడ్తారు. మనసు చెదిరిన మనిషి తన వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు. మళ్ళీ కోలుకోలేడు. మీరేం చెప్పమంటే అదే చెబుతాడు. మీరేంచెయ్యమంటే అదేచేస్తాడు. కాని మేంచేసేది మనసుకు అలజడి కలిగించడం మాత్రమే. పెరుగును కవ్వంతో చిలికినట్టు మనసు అంతరాంతరాలకు కుదిపి కుదిపి చిలకటమే మా ప్రయోగంయొక్క ముఖ్య ధ్యేయం, బహిర్గతమైన పర్సనాలిటీ వెనుక దాగివున్న అంతర్గతమైన పర్సనాలిటీని బయటకు తోడడమే మా ధ్యేయంగా వుంటుంది. బహుముఖమైన వ్యక్తిత్వాల సంఘర్షణనుంచి పేషెంటును కాపాడి, అసలు వ్యక్తిత్వం ఏదో తెలుసుకొని, దానినిమాత్రమే నిలిచేట్టుగా చేయడమే మా సైకోథెరపీ లక్ష్యం, మానసికవ్యాధులు చాలా ఉన్నాయి. పారనాయిడ్ షిజోఫ్రేనియా కేసులే ఎక్కువగా వస్తుంటాయి మా దగ్గిరకు...."
   
    హడావిడిగా పరిగెత్తుకొచ్చిన రోజీని చూసి ఆగిపోయాడు డాక్టర్.
   
    "ఏమైంది రోజీ-ఎలా ఉన్నాడు?"
   
    "చాలా గొడవ చేస్తున్నాడు, అందరినీ తిడుతున్నాడు. మమ్మల్ని నెట్టేసి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు."
   
    "మరో పది నిముషాలు. అంతవరకు కూడా కంట్రోల్ చెయ్యడం కష్టమైతే దయాసాగర్ కు చెప్పు ట్రాంక్విలైజర్ ఇవ్వమని."
   
    "ఎస్ డాక్టర్."
   
    నర్సు రోజీ పరుగె నడకగా వెళ్ళిపోయింది.
   
    ఆమె వెళ్ళగానే డాక్టర్ రమణమూర్తిని చూసి "మూర్తిగారూ! మీ ఇద్దరూ కాసేపు బయట కూర్చొని సుధను రమ్మనండి" అన్నాడు.
   
    వాళ్ళిద్దరూ గదిలోంచి బయటకు వచ్చారు.
   
    దిగాలుపడి కూర్చుని వుండిన సుధను చూసి తండ్రి హృదయం తరుక్కుపోయింది.
   
    "సుధా! డాక్టరుగారు నీతో మాట్లాడాలంటున్నారు" చౌదరి సుధతో చెప్పాడు.
   
    "విమలా నువ్వుకూడా సుధతో వెళ్ళు, డాక్టర్ గారు సుధతో ఒంటరిగా మాట్లాడాలంటే నువ్వు తిరిగొచ్చెయ్" విమలతో చెప్పాడు మూర్తి.
   
    సుధా, విమలా, డాక్టర్ హేమచంద్రను చూస్తూనే గది మధ్యలో ఆగిపోయారు.
   
    నల్లగా, ఆరడుగుల ఎత్తుతో, పోతపోసిన పంచలోహం విగ్రహంలా ఉన్నాడు. గుబురు కనుబొమలు, తమాషాగా వున్న గడ్డం కొద్దిగా బట్టతల.
   
    ఈ మనిషిని చూస్తేనే పిచ్చెక్కేలావుంది అనుకొంది విమల.
   
    "కూర్చోండి. అలా నిలబడిపోయారేం?" అతని కంఠస్వరంలో ఏదో ఆకర్షణశక్తి ఉన్నట్టు అన్పించింది విమలకు.
   
    "మిమ్మల్నెక్కడో చూశానే? మీరెప్పుడైనా....." విమలను చూస్తూ అడిగాడు.
   
    "మీ కన్సల్ టేషన్ కు మాత్రం రాలేదు."
   
    "ఎక్కడ చూశానూ?" తనను తనే ప్రశ్నించుకున్నట్టుగా అన్నాడు.
   
    "మద్రాస్-హైదరాబాద్-ఢిల్లీ విమానంలో బహుశా చూసుంటారు."
   
    "యస్- యస్! హోస్టెస్ గా పనిచేస్తున్నారు గదూ? మురళీకృష్ణ మద్రాసునుంచి హైదరాబాదు వచ్చినప్పుడు, మీరు ఆ విమానంలో ఉన్నారు గదూ!"
   
    "అవును డాక్టర్!"
   
    "విమానంలో ఎలా బిహేవ్ చేశాడో గుర్తుచేసుకొని వివరంగా చెప్పండి" డాక్టర్ ఫైల్ ముందుకు లాక్కుని విమలకేసి చూశాడు.
   
    విమల చెప్పిన విషయాల్లో అవసరమైన అంశాలను నోట్ చేసుకున్నాడు డాక్టర్.
   
    డాక్టర్ సుధకేసి చూశాడు.
   
    సుధ కళ్ళలో నీరు నిండి ఉంది. పెల్లుబికి వస్తున్న దుఃఖాన్ని గొంతులోనే అణచుకొనే ప్రయత్నంలో సతమతమౌతున్నట్టుగా గ్రహించాడు డాక్టర్.
   
    "హి విల్ బి ఆల్ రైట్. మీరంతగా భయపడాల్సిందేమీ లేదమ్మా భార్యగా సహధర్మచారిణిగా, కృష్ణకు సంబంధించిన సరైన సమాచారం మీరే ఇవ్వగలరని నా నమ్మకం. కృష్ణ మానసిక ఆరోగ్యంకోసం చికిత్స చేయడానికి మీరిచ్చే సమాచారం చాలా ఉపయోగపడుతుంది. మనసు నిలదొక్కుకుని నా ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది."
   
    కళ్ళు తుడుచుకొని తల ఊపింది సుధ.
   
    "మీ పెళ్ళయి ఎన్నాళ్ళయింది?"
   
    "సంవత్సరం అయింది. ఏడాదిదాటి వారం రోజులైంది ఖచ్చితంగా చెప్పాలంటే."
   
    "మీ దాంపత్య జీవితంలో...." డాక్టర్ ఆగి విమలవంక చూశాడు.
   
    అతని ఉద్దేశ్యాన్ని గ్రహించి విమల గదినుండి బయటికి వచ్చింది.
   
    ఆమె వెనకే స్ప్రింగ్ డోర్ మెల్లగా మూసుకుంది.

 Previous Page Next Page