Previous Page Next Page 
అడుగడుగునా... పేజి 33


    అవంతి స్నానం చేసి వచ్చింది.

    "ఇందర్ కోసం తను భోం చేయకుండా కనిపెట్టుకు వుంటే అతను సంతోషిస్తాడు. దాంతో తను చల్లబడిందని కూడా ఆనందిస్తాడు. అంత తొందరగా తను చల్లబడడం మంచిది కాదు."

    "ఎప్పుడో చల్లబడ్డావ్! ఇంకా వేడిగా వున్నానను కుంటున్నావా ఏమిటి?" అంతరాత్మ ప్రశ్నించినట్లయింది.

    "నువ్వొక దానివి మధ్యలో అడ్డు తగులుతూ" అంతరాత్మ మీద విసుక్కుంది అవంతి.

    "ఇందర్ తిరిగి వచ్చే సరికి తను భోంచేయవచ్చు. అతనిలో మాట్లాడే బెడద ఈ పూటకి వుండదు. కాని వంట చేసింది అతను. తను వున్నది వాళ్ళింట్లో హాయిగా మెక్కి కూర్చోటం.

    అవంతి కొద్దిసేపు ఆలోచించింది. ఆలోచన తెగలేదు. రెండు నిమిషాలు కూర్చుంది. చివరికి లేచి వెళ్ళి అధరువులు అన్నీ వేసుకుని భోంచేసింది.

    ఇందర్ గంటపైన బైట తిరిగి వచ్చాడు.

    ఇందర్ వచ్చే సరికి ఫ్యాన్ ఫుల్ గా పెట్టుకుని అవంతి నిండా దుప్పటి ముసుకు తన్ని పడుకుంది.

    "ఈ పిల్లకి బాగా కోపం వచ్చింది. అన్నం తినకుండా నిరాహారదీక్ష మొదలు పెట్టిందంటే తన పని గోవిందా" అనుకున్న ఇందర్ రెండు కంచాలు పెట్టి అవంతిని పిలుద్దామనుకున్నాడు.

    గదిలోకి వెళ్ళిన ఇందర్ కి ఎంగిలి కంచం తూముపక్కన కనిపించింది. గిన్నెల మీద మూతలు తీసి చూశాడు. అన్నీ సగం పైన ఖాళీ.

    "అమ్మయ్య" అనుకున్నాడు ఇందర్.

    అవంతి భోం చేయటం ఇందర్ కి తృప్తి అనిపించింది.

    ఆ పూటకి ఇరువురు మౌనంగా కాఫీ భోజనం కానిచ్చారు.

   
                           *    *    *


    అలకలు తగాదాలు వారిరువురి మధ్య సర్డుకున్నాయి. మరో యిరవై నాలుగు గంటల తర్వాత రాజీ పడ్డారు.

    తను తొందరపడి తప్పు చేశానేమో అన్న పచ్చాత్తాపంతో ఇందర్ పూర్తిగా తగ్గి రాజీ పడ్డాడు.

    అవసరం తనది బెట్టుసరి పోతూనే మంచిగా తలవగ్గటమే ప్రస్తుత మార్గం అనుకున్న అవంతి రాజీపడింది.

    "మీ బుచ్చికక్కిగారు క్షేమమేనా?" ఇందర్ తీరుబడిగా కూర్చుని గోళ్ళు కొరుక్కుంటూ అడిగాడు.

    "గోళ్ళు అలా కొరుక్కోకూడదు. దరిద్రం" అంది అవంతి.

    "నేను అడిగింది గోళ్ళు గురించి కాదు"

    "కాని నేను చెప్పింది మాత్రం గోళ్ళు వాటి జాగ్రత్తలు గురించి"

    అవంతి అన్న తీరుకి ఇందర్ కి నవ్వు వచ్చింది.

    "ఎందుకు నవ్వుతున్నారు?" అవంతి అడిగింది.

    "నేను నవ్వానా!"

    "ఆహా, నవ్వానా! అంటే విలన్ లాగా కాదు. నవ్వీనవ్వనట్లు నవ్వారు. ఎందుకు నవ్వారు?"

    "ఈ పిల్ల నన్ను బాగానే కనిపెడుతున్నది." అనుకున్నాడు ఇందర్.

    "ఎందుకు నవ్వారో చెప్పలేదు"

    "చెప్పక తప్పదా?"

    "తప్పదు"

    "నేను మొదట్లో నీలో పిరికి తనము, మరీ లోకం తెలియని అమాయకత్వం చూశాను. కదిలిస్తే చక్కగా మాట్లాడటం అవసరం వస్తే ఎదిరించే ధైర్యం ఒక్కో సంఘటన వల్ల తెలుసుకున్నాను__

    ఇందర్ చెపుతుంటే "ఓహ్, నేను బైట పడిపోతున్నాను. జాగ్రత్తపడకపోతే ప్రమాదం" అనుకున్న అవంతి చిలకలాగా నవ్వి "నాకు ధైర్యం వుందా! ఆహా ఆహా మీరనాల్సిందే. ఏదైనా జరిగితే నా గుండె గంట సేపు ఆగకుండా కొట్టుకుంటుంది" అంది.

    "ఆ గంట తర్వాత కొట్టుకోదా?"

    "ఉహూ ఆగిపోతుంది"

    "పాపం ఎంత అవస్థ"

    "అవును చాలా అవస్థ"

    "ఇలా అయితే అవస్తే కాదు కష్టం కూడా"

    "ఆ మరే....ఇంతకీ నా ధైర్యం గురించి చెప్పలేదు. నాలో ఏ ధైర్యం చూశారట...."

    "ఇంట్లోంచి పారిపోయి రావటం ధైర్యం కాదా! మీవాళ్ళు చాలా మండి వున్నట్లు తెలుస్తున్నది. అంతమంది కళ్ళు గప్పి వాంటెడు నగలలో వంటరిగా యింత దూరం...."

    "ఓ అదా! యిది ఏమంత దూరం ఏమిటి?"

    "అంటే నీ వుండేది ఈ వూళ్ళోనే అన్నమాట?" ఇందర్ గొప్ప సత్యం కనిపెట్టిన వాడిలా అన్నాడు.

    ఇందర్ గుర్తించేలా నాలుక కొరుక్కొని "ఏమో నాకు తెలియదు" అని ముఖం ప్రక్కకు తిప్పుకుంది అవంతి. కావాలనే అతన్ని తప్పు తోవ పట్టించడానికి అలా చేసింది" ఇందర్ నమ్మాడు.

    "సరే చెప్పొద్దులే" అన్నాడు ఇందర్.

    ఇందర్ ఆలోచనలు వేరుగా సాగుతున్నాయి. అవంతిది ఈ వూరే. ఆమె వచ్చి రాత్రి ఈ వూళ్లో ఎక్కడెక్కడ పెళ్ళిళ్ళు జరిగాయో ఏ యింట్లో గోల అయిందో తెలుసుకుంటే చాలు. ఆమె ఏ యింటి పిల్లో తెలిసి పోతుంది. ఇల్లు ఏదో తెలిస్తే తర్వాత ఏమీ చేయవలసింది చూసుకోవచ్చు.

 Previous Page Next Page