Previous Page Next Page 
అభయారణ్యం పేజి 33


    అది ధీర, శ్యాంలు యిద్దరికీ మంచిదనే భావంతో శక్తిని కూడగట్టుకుంటూ అంది ఆర్తి. "అవును శ్యాం......! ఒక స్త్రీ భర్తని కాక మరో మగాడ్ని యిష్టపడుతుందీ అంటే అర్థం-భర్తమీద ప్రేమ లేకనేగా. అలాంటప్పుడు మీరింకా ఆమె కోసం ఆలోచించటంలో అర్థమేముంది?"

    "ధీర లేకపోతే నేనూ బ్రతకలేను" గొణుగుతున్నట్టుగా అన్నాడు శ్యాం నేలచూపులు చూస్తూ మనసుని అంతా పరిచేశాడు-  "అవును ఆర్తిగారూ! నా చిన్నతనంలో ధీర పుట్టగానే నా భార్యన్నారు మా అత్తయ్య - మామయ్యలు. అందుకే ఆ వయసునుంచీ ఆమ మీద ఆశలు పెంచుకున్నాను. నేను తెలివైనవాణ్ని కాకపోవచ్చు. ఆమెకన్నా ఎక్కువ చదువుకోకపోవచ్చు. కానీ ధీరంటే ఇష్టముంది. నా భార్యని సుఖంగా పోషించుకోగల శక్తి ఉంది. మీకు తెలుసుగా-నాకు మా పల్లెటూర్లో పదెకరాల మాగాణీ వుంది. అసలు ధీర ఉధ్యోగం చేస్తానంటే అందరూ సరే అన్నరు. అసలు ఆమెకి నేనంటే చాలా ఇష్టమే. అందుకే మా బామ్మ చచ్చిపోయేటప్పుడు నాతో పెళ్ళికి ఒప్పుకుంది."

    "అది తప్పనిసరి పరిస్థితుల్లో" ఆర్తి అంది నిక్కచ్చిగా. "ఇష్టపడి కాదు."

    "దయుంచి మీరలా అనకండి" కంపించిపోయాడు శ్యాం. "నా దురదృష్టానికి దయాకర్ గారు మధ్యలో ధీరని తన ఉచ్చులోకి లాక్కున్నారుగాని ఆమెకి నేనంటే ఇప్పటికీ యిష్టమే."

    ఆర్తి సాలోచనగా చూసింది.

    ఏం చెప్పి ఒప్పించాలి ఈ వ్యక్తిని?

     పి జి చేసిన ధీర ఆమె ప్రమేయం లేకుండానే మరెవరి ఉచ్చులోకో వెళ్ళిందంటున్నాడు.

    అదికాదు..... దయాకర్ మీద కోపాన్ని ప్రకటించడానికి బదులు 'దయాకర్ గారు' అంటూ యింకా గౌరవాన్ని ప్రదర్శిస్తున్నాడు.

    ప్రపంచంలో యిలాంటి మగాడు అరుదని అనుకోవాలో లేక అతడ్ని జ్ఞానం కోల్పోయిన మనిషనుకోవాలో, అదీ కాకపోతే ఒక ఉన్మాదిగా భావించాలో తెలీక చాలాసేపు మౌనంగా వుండిపోయింది.

    మొన్నెప్పుడో ధీర వెర్షన్ వింది.

    ఇప్పుడు శ్యాం మనసేమిటో తెలుసుకుంది.

    ఇద్దరి దృక్పథాలలో ఇద్దరికి ఇద్దరూ కరెక్టే. కానీ ఈ ప్రపంచంలో కలిసి బ్రతకగలిగేది ఇద్దరి దృక్పథాలూ ఒక్కటైతే తప్ప విడివిడిగా ఆలోచనలు గొప్పవైనంత మాత్రాన కాదని ఎలా చెప్పగలదామె.

    అనుభవాన్ని మించిన జ్ఞానం లేదంటారే మరి. ప్రాక్టికల్ గా ధీర గురించి యింత తెలిసీ శ్యాం ఇలా మాట్లాడుతుంటే అతడికెలా నచ్చచెప్పగలదు.

    "నేను వెళతాను" అన్నాడు శ్యాం వున్నట్టుండి.

    నిర్లిప్తంగా చూసింది. "ఎక్కడికి?"

    "మా వూరే."

    నిశ్శబ్దంగా వుండిపోయింది ఆర్తి. ఓదార్పుకి అందని స్థితి అది. "భోంచేసి వెళుదురుగాని."

    "ఫర్వాలేదు" పైకి లేచాడు.

    ఎందుకో జ్ఞానం తెలీని పసికందులా అనిపించాడు.

    "ఒకవేళ ధీర మీ దగ్గరికి మళ్ళీ వస్తే దయుంచి కాస్త నచ్చచెప్పండి."

    అతడు వెళ్ళేవాడే.......

    "అయితే....." ఆర్తి గొంతు వింటూ ఆగాడు. "ధీర ఆ తర్వాత...... అంటే చాలా రోజులు ఎక్కడెక్కడో గడిపి మీ యింటికి వచ్చినా క్షమించగలరన్నమాట."

    అది అడగాల్సిన ప్రశ్న కాదని ఆమెకీ తెలుసు. కానీ శ్యాం సహనములోని చివరి పొరని మెత్తగా స్పృశించి చూడాలనుకుంది. లేదూ అతణ్ణి ధీరకి దూరంగా బ్రతికే అవకాశం కోసం ప్రిపేర్ చేయాలనుకుంది.

    "ఎక్కడెక్కడో అంటే దయాకర్ గారితో ఎక్కడెక్కడో గడిపి అన్నది మీ ఉద్ధేశ్యం అని నాకు తెలుసు ఆర్తిగారూ!" క్షణం ఆగాడు. "నేను ధీరకి తగ్గ భర్తని కాదని తెలుసు. అయినా నాకున్న ఒకే ఒక్క అర్హత ఆమె ఏం చేసినా క్షమించేయగలగడం."   

    ఆర్తి గొంతు తడారిపోతూంది.

    "ఆ తర్వాతైనా అందరికన్నా నేనే మంచివాడ్నని ఆమెకి ఎలాగూ తెలుస్తుందిగా. ఆ క్షణాల కోసం ఎదురుచూస్తూ బ్రతుకుతూ...... ఎప్పుడు తిరిగొచ్చినా మనస్ఫూర్తిగా, సంతోషంగా ధీరని దగ్గరకు తీసుకుంటాను."

    శ్యాం వెళ్ళిపోయాడు.

    స్థాణువులా నిలబడిపోయింది ఆర్తి.

    అతడిపై అనూహ్యమైన అభిమానం ఏర్పడితే అది ఆమె తప్పెలా అవుతుంది...... అందుకే మనసులోనే అనుకుంది - ధీరని క్షమించగలిగే గుణం కలకాలం అలాగే వుండాలని.

       
                         *    *    *


    "హల్లో!"

    ఆవలివైపు నుంచి తేజా కంఠం వినిపించగానే అలర్టయింది ఆర్తి. ఫర్వాలేదు రింగ్ చేయగానే దొరికారు. "నేనే" అంది.

    "థాంక్యూ!" అన్నాడు.

    "దేనికి?"

    "ఫోన్ చేసినందుకు."

    "ఈ మాత్రం దానికి థాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. రచయితగారూ!"

    "కాని నేను చతెప్పాలి, ఎందుకంటే నేను హర్ట్ చేసినా మీరు నన్ను క్షమించేయగలిగారుగా."

    ఆర్తి బిడియంగా కుంచించుకుపోయింది. తనంటే అంత అభిమానం చూపిస్తున్నాడా? "మీరు హర్ట్ చేయలేదు."

    "మరి?"

    "చాలావరకూ కరెక్ట్ గా గెస్ చేశారు" ఒక నిజాన్ని పరాయి వ్యక్తి ముందు అంగీకరించాల్సి వచ్చినందుకేమో ఆమె గొంతు కొద్దిగా వణికింది. "ఇతదాకా వచ్చాక,  మీతో యింత స్నేహం పెరిగాక ఈ నిజాన్ని నేను అంగీకరించకుండా వుండలేను తేజా! నిజమే..... దాంపత్య జీవితంలో కోరుకున్నది దొరక్క ఆర్తితో నలిగిపోయే చాలామంది భార్యల్లో నేనూ ఒకదాన్ని. అయితే విచిత్రం ఒకటుంది. నా భర్త చాలామంది మగాళ్ళలా దుర్మార్గుడు కాడు. నా మనసేమిటో అర్థం చేసుకోని వ్యక్తి. ఇంకా వివరంగా చెప్పాలీ అంటే భార్యని సబార్డినేట్ గా తప్ప సగభాగంగా అంగీకరించని మెటీరియలిజమ్ డామినేషన్ మాత్రమే తెలిసిన మనిషి."
 

 Previous Page Next Page