Previous Page Next Page 
నవ్వితే నవ్ రత్నాలు - 1 పేజి 33

 "అవునా?..." అయోమయంగా చూస్తూ అమాయకంగా అంటూ తలని తొండలా పైకి క్రిందకీ ఆడించింది కమల.
    రామారావ్ కమల వంక వెర్రి చూపులు చూశాడు.
                              *    *    *
    ఆరోజు ఆఫీసులో రామారావ్ కి అస్సలు మనశ్శాంతిగా లేదు... పనిమీద అస్సలు కానసన్ ట్రేషన్ చెయ్యలేక పోతున్నాడు...
    వారం క్రితం నుండీ అతనికి ప్రాబ్లెం స్టార్ట్ అయ్యింది...
    ఒక రోజు కత్తిపీటతో నరికెయ్యబోయింది... ఒకరోజు పాలల్లో విషం కలపబోయింది.... ఒకరోజు రోకలితో తల బద్దలు కొట్టబోయింది... ఒకరోజు కొడవలికి పదునుపెడ్తూ తను చూసేసరికి చట్టుక్కున దాచేసింది.
    ప్రతీసారీ ప్రమాదాన్ని వెంట్రుకవాసిలో తప్పించుకున్నాడు.
    ఎందుకు చంపాలనుకుంటుంది?... కమలకి ఓ బావ ఉన్నాడు... ఎప్పుడూ రామారావ్ కి బావ కబుర్లే చెప్తూ ఉంటుంది... వాడికింకా పెళ్లి కాలేదు... కొంపదీసి కమలకి బావంటే చాలా యిష్టమేమో... తనని చంపేసి వాడిని చేస్కుందామని అనుకుంటుందేమో!!...
    లేదా?... ఈ మధ్య పక్కింటోడితోనో, ఎదురింటోడితోనో అక్రమసంబంధం ఏర్పడిందా?...
    రామారావ్ బాధగా తల విదిలించాడు.
    "అలా బుర్రకాయ్ ని సరా...సరా...సరా...అంటూ అటూ ఇటూ ఊపడమేనా పని కూడా ఏమైనా చేసేది ఉందా?..."
    ఉలిక్కిపడి చూశాడు రామారావ్... ఎదురుగా క్రూరంగా చూస్తూ బాస్
    "ఇందాకటి నుండీ నీ వ్యవహారాన్ని చూస్తున్నా!" పళ్లు కొరుకుతూ అన్నాడు బాస్.
    "సారీ సార్..." అంటూ రామారావ్ ఫైళ్లలో తలదూర్చాడు.
    రోజూ బాస్ తో ఇలానే చివాట్లుతింటున్నాడు. కమల గురించిన ఆలోచనలు అతన్ని వెర్రివాడిని చేస్తున్నాయ్.
    సాయంత్రం ఆఫీసునుండి ఇంటికి వెళ్లిన రామారావ్ ఇంటి గుమ్మంలోనే బిగుసుకుపోయాడు.
    లోపలి దృశ్యంతో అతని పై ప్రాణాలు పైనే పోయాయ్...
    లోపల... హాలు మధ్య ఓ మంత్రగాడు పెద్ద బొట్టూ... పెద్ద జుట్టుతో హాం..హ్రీం...క్రీమ్...అంటూ ఏవేవో మంత్రాలు చదువుతున్నాడు... అతని ముందు ముగ్గువేసి ఉంది... ఆ ముగ్గులో సగానికి కోసిన నిమ్మకాయలున్నాయ్. సీలింగ్ ఫ్యాన్ నుండి ఓ బల్లిని తలక్రిందులుగా వ్రేళ్లాడదీసి ఉంది. మంత్రగాడి ఎదురుగా కమల పద్మాసనం వేస్కుని కూర్చుని ఉంది. ఆమె నల్లచీర కట్టుకుని జుట్టు విరబోస్కుని ఉంది.
    రామారావ్ కంగారుగా లోపలికి పరిగెత్తాడు...
    "ఏయ్... ఎవరు నువ్వు?" కంగారుగా అడిగాడు.
    "కనిపించడం లేదూ?... మంత్రగాడిని!" చిరాగ్గా సమాధానం ఇచ్చాడు  వాడు.
    "ఏం చేస్తున్నావ్?"
    "నా మంత్రశక్తితో సమాధిలో నిద్రిస్తున్న కాద్రాని లేపుతున్నా!"
    "ఎందుకు?"
    "లేచి గోళ్లతో నిన్ను చీల్చి నీ రక్తం తాగి... తర్వాత నిన్ను తినడానికి..."
    "నా యింటికొచ్చి నా మీదే మంత్రశక్తిని ప్రయోగించడానికి ఎన్ని గుండెల్రా నీకూ...? వెంటనే బయటికి పదా!..." అంటూ కోపంతో చిందులెయ్యడం మొదలు బెట్టాడు రామారావ్...
    "అబ్బ ఉండండీ... నేనే అతన్ని పిలిపించాను." అంది కమల రామారావ్ కి అడ్డుపడ్తూ.
    "ఎందుకూ?" చిరాకుగా చూస్తూ అడిగాడు రామారావ్.
    "మిమ్మల్ని కాద్రాకి అప్పగించడానికీ... మీకు చేతబడి చెయ్యడానికీ..."
    "అదే...ఎందుకనీ..." చిందులేస్తూ అడిగాడు రామారావ్.
    "అవునబ్బా... ఎందుకనీ?" ఆలోచనగా మొహంపెట్టి అంది.
    రామారావ్ కి చిర్రెత్తుకొచ్చింది!మూలనున్న దుడ్డుకర్ర తీస్కుని మంత్రగాడిని తిడుతూ వీధి చివరకంటా తరుముకుంటూ వెళ్లాడు
    కమల మైండుకి ఏదో అయ్యిందనీ... ఇక లాభం లేదనీ రామారావ్ కమలని ఒక సైక్రియాట్రిస్ట్ దగ్గరికి తీస్కెళ్లాడు. కమల వింత ప్రవర్తన గురించీ... తనని చంపాలని అనుకోవడం గురించీ చెప్పాడు.
     సైక్రియాట్రిస్ట్ కమలతో లోపలిగదిలో గంటసేపు విడిగా మాట్లాడి తర్వాత నవ్వుతూ బయటికి వచ్చాడు.
    "ప్రాబ్లెం సీరియస్సేగానీ ... మీరేం వర్రీ  కానవసరం లేదు!" అన్నాడు కులాసాగా భుజాలు ఎగరేస్తూ.
    "సీరియస్ అంటారు... మళ్లీ వర్రీ  కావొద్దంటారేంటి డాక్టర్... అసలు తను అలా ఎందుకు ప్రవర్తిస్తుంది?" నెత్తికొట్టుకుంటూ ప్రశ్నించాడు రామారావ్.
    "టీవీలో లేడీ విలన్స్ ఉండే సీరియల్స్ చూసి ఆమె బుర్రకాయ్ కాస్త ఎఫెక్ట్ ఇచ్చింది... సీరియల్స్ లో అంతేకదా... ఆడాళ్ళు మొగుడ్ని చపేయాలనుకుంటారు.. లేదా అత్తగార్నో,ఆటపడుచునో లేపెయ్యాలని అనుకుంటారు... ఇలాంటి కధలు ఉన్న సీరియల్స్ చూసి ఆమె మెదడు కాస్త అటూ ఇటూ అయ్యింది"
    "అయ్యో!... మరిప్పుడేలా డాక్టర్?" భయం భయంగా అడిగాడు రామారావ్.
    "ఏముందీ?... ఆమెని ఆ దిక్కుమాలిన సీరియల్స్ చూడనివ్వకుండా చెయ్యడమే!!..."
    రామారావ్ ఎగిరి గంతేసి ఇంటికి ఉన్న కేబుల్ టీవీ కనెక్షన్ పీకించేశాడు. అప్పటినుండీ కమల బుర్రకాయ్ సరిగా పనిచేస్తూ మొగుడితో ప్రేమగా ఉంది.
                              *   *   *
                               నాగమణి ఖర్మ

 జానకి నట్టింట్లో నేల మీద కూర్చుని భోరున ఏడవడం మొదలు బెట్టింది...
    ఆమె ఏడుపు విన్న కూతుళ్లు రాధ, లతలు పరుగున హాల్లోకి వచ్చారు.
    "అమ్మా... ఏమైందే... ఎందుకే ఉన్నట్టుండి అలా ఏడుస్తున్నావ్..." అని కంగారుగా అడిగింది పెద్ద కూతురు రాధ...
    "నా గుండెలమీది బరువును నేను ఎలా దింపుకోను తల్లో... నా కష్టాలు ఎప్పుడు తీర్తాయ్ రో నాయనో..." గుండెలు బాదుకుంటూ అంది జానకి.
    "అబ్బా!... ఇప్పుడేమైందే?!... కాస్త ఏడవడం ఆపి ఏమైందో చెప్పు..." విసుక్కుంటూ అంది చిన్న కూతురు లత.
    "అంతా నా ఖర్మే... నా ఖర్మ"నెత్తి కొట్టుకుంటూ చేతిలోని ఉత్తరం రాధకి ఇచ్చింది.
    ఆ ఉత్తరం మొన్నామధ్య రాధని పెళ్లి చూపులకి వచ్చి... చూసెళ్లిన వాళ్లు రాసిన ఉత్తరం.
    "మీ అమ్మాయ్ బానే ఉందిగానీ... మీ అమ్మాయ్ జాతకం చూపిస్తే పెళ్ళయిన మరుక్షణం పెళ్లికొడుకు మేనత్త కూతురుకి వేలు విడిచిన చిన్నాన్న బామ్మర్ది పెళ్లాం మంగళసూత్రం పుటుక్కున తెగుతుందని మా సిద్ధాంతి చెప్పాడు... కాబట్టి మీ సంబంధం మాకు అక్కర్లేదని" ఆ ఉత్తరం సారాంశం.
    "గాడిదగుడ్డు కదూ?... మనం వాళ్లు అడిగినంత కట్నం ఇచ్చుకోలేమని అన్నాంకదా... అందుకని నా జాతకం బాలేదని కుంటిసాకు చెప్తున్నారు!... వాడు కాకపోతే ఇంకోడు... ఏం?... దేశంలో పెళ్లి కొడుకులే కరువయ్యరా?..." అంది ఉత్తరం చదివిన రాధ ముక్కు పోంగిస్తూ...
    "ఆ... ఉన్నారులే... ఇప్పటికి మూడేళ్ల నుండీ సంబంధాలు చూస్తూనే ఉన్నాను.... ఒక్కటీ కుదరడం లేదు... నేను నీ పెళ్లి చూడకుండానే చస్తానేమోరా దేవుడా... వా..." అంటూ గుండెలు బాదుకోసాగింది జానకి.
    అప్పుడే ఎదురింటి వెంకుమాంబ కంగారుగా ఇంట్లోకి వచ్చింది.
    "అయ్యయ్యో... ఎంతపనైంది జానకమ్మా...? పాపం... దేవుడిలాంటి మనిషి అన్నయ్యగారు... అప్పుడే ఆయనకి నూరేళ్లు నిండిపోయాయా?... అన్నయ్యా!..." జానకికంటే ఎక్కువగా గుండెలు బాదుకుంటూ ఏడవడం మొదలుబెట్టింది వెంకుమాంబ.
    దెబ్బకి జానకి, రాధ, లతలు బిత్తరపోయి తెల్ల మొహాల్తో ఆమె వంక చూడడం మొదలబెట్టారు.
    వెంకుమాంబ ఏడుపాపి జానకివంక జాలిగా చూస్తూ ముక్కూ చీది "ఈ టైములోనే గుండెని రాయి చేస్కోవాలి!!... అన్నట్టు శవం ఏదీ?..." అంది.
    "ఏం శవం?... నాదా?... ఆయన పోయి నాలుగేళ్లయింది!!... పళ్లు కొరుకుతూ అంది జానకి.
    వెంకుమాంబ నాలుక కొరుక్కుంది...
    "హర్రే... నీ ఏడుపు లెవెల్ చూసి ఆ విషయమే మర్చిపోయాను... మరి ఈ లెవెల్ లో ఎందుకు ఏడుస్తున్నావ్?..." కిలకిలా నవ్వుతూ అడిగింది వెంకుమాంబ.
    జానకి కూతురు పెళ్లి సమస్య గురించి చెప్పింది.
    వెంకుమాంబ కళ్లు పైకి పెట్టింది.
    "అదేంటి... నా కూతురు సమస్య గురించి చెప్తే నువ్వు కళ్లు తేలేశావ్?... ఆశ్చర్యంగా అడిగింది.
    "కళ్లు తేలెయ్యడం కాదు... నీకేం సలహా ఇవ్వాలా అని ఆలోచిస్తున్నా... ఆ... తట్టింది... మీరు "నాగమణి ఖర్మ" దగ్గరికి వెళ్ళండి... ఆయన మీకేదైన మంచి సలహా ఇవ్వొచ్చు."

 

 Previous Page Next Page