"నువ్వెందుకొచ్చావిక్కడికి?"
"నీతో మాట్లాడాలని వచ్చాను."
"మనకేం మాటలుంటాయ్?" అసహనంగా అంది ఆమె.
"అలా అనకు జయా! చాలా మాట్లాడాలి. నేనింకా అదివరకటి కిషోర్ ననుకుంటున్నావేమో! ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. నన్ను నేను తెలుసుకున్నాను."
జయకు కోపం, రోషం రెండూ ముంచుకొచ్చినయ్.
"ఏం మాట్లాడాలో చెప్పు!" అంది తన సీట్లో కూర్చుని ఫైలు తెరచి కాగితాలు చూస్తూ.
"ఇక్కడా?" చుట్టూ చూస్తూ అడిగాడతను.
"అవును ఇక్కడే!"
"కొద్దిసేపు ఎక్కడయినా ఏకాంతంగా కూర్చుని మాట్లాడుకుందాం! రాలేవూ?"
"ఊహు! నేనెక్కడికీ రాను!"
"జయ! ప్లీజ్!" దీనంగా అన్నాడతను.
"కిషోర్! నువ్వు అదివరకటి కిషోర్ వి కాదు గదా. నేనూ అదివరకటి జయను కాదు! గుర్తుంచుకో! ఇప్పుడు నేనూ పూర్తిగా మారిపోయాను."
అతని ముఖం వాడిపోయింది.
"జయ! మాటలతో నన్ను బాధించకు! నేను చెప్పేది విన్న తరువాత నువ్వేమైనా అను. సహిస్తాను" ప్రాధేయపడుతూ అన్నాడతను. జయకు అతనిని చూస్తూంటే జాలి కలుగుతోంది. అతని మాటలు వింటూంటే తనను తను అదుపులో పెట్టుకోవటం సాధ్యం కావటంలేదు. మనసు వెన్నలా కరిగిపోతోంది.
అతనేమిటి మాట్లాడదల్చుకుంది?
అతని ఉద్దేశ్యమేమై ఉంటుంది?
మరోసారి తనను అనుభవించాలనా?
అదే నిజమైతే తనకి గట్టిగా బుద్ధి చెప్తుందీసారి!
మరోసారి ఇలాంటి అవివేకానికి పాల్పడకూడదు.
"జయా! ఎంతోసేపు నిన్ను వేధించను! ఒక్క అరగంట! అంతే! చాలు! ఆ తరువాత నా దారిన నేను వెళ్ళిపోతాను. మళ్ళీ ఎప్పుడూ కనిపించి ఇబ్బంది పెట్టను." దీనంగా ఉన్న అతని కళ్ళల్లోకి చూడలేకపోయింది జయ.
"ఇప్పుడు బయటకు రావడం కుదరదు. లంచ్ టైంలో వస్తాను!" అంది జాలిపడుతూ.
"అయితే నేనెన్ని గంటలకు రావాలి మళ్ళీ?"
"నువ్వు రానక్కర్లేదు! నేనే వస్తాను!"
"ఎక్కడకు?"
"ఏమో! నువ్వే చెప్పు."
"ఈ పక్క వీధిలో ఉన్న ఏ.సి.రెస్టారెంట్ దగ్గర ఎదురుచూస్తుంటాను."
"సరే..."
అతను భారంగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన తర్వాత కొద్దిసేపటివరకూ ఏ పనీ చేయలేకపోయింది జయ. ఆమె మనసంతా అదోలా అయిపోయింది.
తానిప్పుడు వివాహితురాలు. కిషోర్ తో మాట్లాడడం అవాంఛనీయమని తనకు తెలుసు. కానీ ఏదో బలహీనత అతనిని ఖచ్చితంగా ఎందుకు కాదనలేకపోయిందో తెలీటం లేదు. అయితే తనకూ అతనితో మాట్లాడాలన్న కోరిక కలుగుతోంది.
లంచ్ టైమ్ కి కొంచెం ముందుగానే బయటకు నడిచిందామె. కిషోర్ రెస్టారెంట్ దగ్గర ఆమెకోసం ఎదురుచూస్తూ నిలబడి వున్నాడు. ఇద్దరూ మాట్లాడకుండా లోపలకు నడిచి ఓ మూల కూర్చున్నారు. తీయని గతం కళ్ళముందు మెదిలి మనసుని బాధతో నింపివేయసాగింది ఇద్దరికీ.
అవి ఎంత ఆనందాన్నిచ్చిన రోజులు?
"జయా!"
"ఊ!"
"మీవారెలాంటివారు?"
"అంటే?"
"నిన్నెలా చూసుకుంటారు?"
"అందరి భర్తలూ ఎలాగో_అలాగే..."
కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారిద్దరూ.
"ఏమిటి నువ్వు మాట్లాడదల్చుకుందీ? నాకు గంటే టైముంది." అందామె వాచీ చూసుకుంటూ.
బేరర్ కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి వారిముందుంచాడు.
"ఎందుకిలా చేశావ్ జయా! నువ్వు వివాహం చేసుకోబోతున్నట్లు మాట మాత్రమైనా నాతో చెప్పలేదేం?"
"ముందు నీ సమాధానం కావాలి నాకు. ఢిల్లీ వెళ్ళగానే ప్రతిరోజూ ఉత్తరం రాస్తానన్నవాడివి ఇంతకాలానికా నన్ను గుర్తుతెచ్చుకోవటం?"
"తప్పు నాదే జయా! ఆ రోజు నువ్వు చెప్పిన మాటలు నాకు చాలా బాధ కలిగించినయ్. ప్రేమంటే అంతవరకూ నాలో ఓ విచిత్రమైన భావన ఉండేది. అనార్కలి, సలీం, లైలా మజ్నూ కథలు చదివి ప్రేమ మీద ప్రేమే జీవితమనుకున్నాను. ప్రేమ జీవితంలో ఓ చిన్న అంశం అని నువ్వు చెప్పిన మాటలు నాకు చాలా చేదుగా అనిపించినాయ్ కానీ రోజులు గడుస్తున్నకొద్దీ నాకు నీ మాటల్లోని నిజం తెలిసివచ్చింది. ఎంతో పవిత్రంగా ప్రేమించుకున్నారనుకున్న యువతీ యువకులు కేవలం ఓ చిన్న విషయం వల్ల గొడవపడి విడిపోవడం, ప్రేమించి పెళ్ళి చేసుకున్న జంటలు కొట్లాడుకుని విడాకులు తీసుకోవటం, ఒక యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి మరెంతో మంది అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకోవటం_ఇవన్నీ ఢిల్లీలో ఈ కొద్దిరోజుల్లో కళ్ళారా చూశాను.