"హతుడు ఆనందరావు వివాహితుడు, ఇద్దరు బిడ్డల తండ్రి అన్న విషయం ముద్దాయి సుజాతకి చాలా రోజుల వరకు తెలియదు."
చాలా రోజులేమిటి! ఒక ఏడాది వరకు తను కలలో కూడా ఊహించని విషయం అది! అంత తెలివితక్కువగా ఎలా ప్రవర్తించింది. అంతలా తన కళ్ళు ఎలా మూసుకుపోయాయి! తన చదువు ఏమయిపోయింది! అసలతను వివాహితుడో కాదో అడగాలని కూడా తట్టనంత మైకంలో పడిపోయింది. అసలతని పర్సనల్ లైఫ్ గురించి అడిగే, ఆలోచించే తీరిక తనకేది! అనుక్షణం ఆనంద్ ఉత్తరాలు, ఆనంద్ తో మురిసిన క్షణాలు, ఆనంద్ తో చదువబోయే మధురక్షణాలకి ఎదురుచూడడం ఇవితప్ప మరో ఆలోచనకి చోటేది! తప్పనిసరిగా ఉద్యోగానికి వెళ్ళడం, మిగతా సమయం అలా మంచం మీద పడుకుని ఆనంద్ గురించి ఆలోచించడం. ఆనంద్ ప్రేమతో పిచ్చిదానిలా తయారయిన తనని చూసి ఇంట్లో ఆఫీసులో అంతా ప్రశ్నలు కురిపించడం ఆరంభించారు. ఏం చెప్పగలదు? చెప్పాల్సిన సమయం ఇంకా రాలేదనిపించేది! తను అలా అనుకుంటే ఇంట్లోవాళ్ళు వూరుకోరు గదా! తల్లితండ్రులకి అనుమానం. లోకుల గుసగుసలు ఆరంభమయ్యాయి! తనని ఇరకాటంలో పడేశాయి. ఇంట్లో కట్టడి, పెళ్ళి ఏర్పాట్లు మొదలయ్యాయి. తను తొందరపడాల్సిన సమయం వచ్చింది. ఆనంద్ అడగాల్సిన మాట, అడుగుతాడని ఎదురుచూసిన మాట_ ఆఖరికి తనే అడగాల్సి వచ్చింది.
"ముద్దాయి హతునికి తనకి పెళ్ళి నిర్ణయిస్తున్నారని వెంటనే తమిద్దరూ వివాహం చేసుకోవాలని రాసిన ఉత్తరానికి హతుడు అప్పటివరకు దాచిన నిజాన్ని తను వివాహితుడనని, ఇద్దరు పిల్లల తండ్రినన్న విషయం తెలిపాడు.... ఆ ఉత్తరం చదివిన ముద్దాయి...."
ఆ.... ఉత్తరం చదివి ఏమయిపోయింది ఆ రోజు? 'సుజా, నా సుజా! ఏం రాయను, ఎలా రాయను? ఇన్ని రోజులుగా నీనించి దాచిన ఈ భయంకర నిజాన్ని చదివి నీవేమయిపోతావో ఊహించలేక పోతున్నాను. నన్ను క్షమించు అని అడిగే అర్హత కూడా నాకు లేదు. సుజా నేను వివాహితుడనని, యిద్దరు పిల్లల తండ్రినని ఎలా చెప్పను? ఇది విని నీవు నన్నెంత ద్వేషిస్తావో ఊహించగలను. సుజా, నిజాన్ని నీతో చెప్పలేని నా పిరికితనాన్ని, అసహాయతని క్షమించగలవా! అసలు నీవు నాకు ఉత్తరం ఎందుకు రాయాలి! నీ ఉత్తరాలు నన్నెందుకు అలరించాలి. ముందు మర్యాదకి, తర్వాత ఆకర్షణకి లొంగి నీ కుత్తరాలు రాయడం ఆ ఉత్తరాలు ఇంతదూరం మనిద్దరిని తీసుకువస్తాయని ఆనాడు తెలిస్తే రాసేవాడినిగానేమో! నీ ఉత్తరాలకి ఆకర్షితుడనై, నిన్నుచూసి మరింత ఆకర్షణకి లొంగిపోవడంలో నా నేరం ఎంత! నిన్ను ప్రేమించకుండా వుండలేని బలహీనతకి లొంగిపోవడంలో నా నేరం ఎంత! నిన్ను చూసిన క్షణం నించి నన్ను నేను మరచిపోవడమూ నా నేరమేనా! నిజం చెపితే నీవు దూరమయిపోతావన్న భయం, నిన్ను దూరం చేసుకొని బ్రతకలేనన్న నిజం ఎప్పటికప్పుడు నా నోరు కట్టేసేవి. అమాయకంగా మనసారా ప్రేమించిన వ్యక్తిని, నమ్మి సర్వస్వం అర్పించిన నీ అమాయక ఆరాధన ముందు దోషిలా నిలవలేక గిజగిజలాడేవాడ్ని. నీతో గడిపిన ప్రతి మధురక్షణం వెనక నిన్ను మోసం చేస్తున్నానన్న బాధ నన్ను దహించేది! ప్రతిరోజూ ప్రతిక్షణం నిన్ను గురించిన ఆలోచనలతో, నీ భవిష్యత్తు పట్ల నేనే నిర్ణయం తీసుకోవాలన్న విషయం మీద చింతతో నేనెంతగా మధనపడిందీ నా వ్యధ నాబాధ నీకర్థంకాదు. సుజా నన్ను అర్థంచేసుకో! నేనేదో దారి వెతికేవరకు ఏ విషయంలోనూ తొందర పడకు_ త్వరలో నిన్ను కలుసుకొని మాట్లాడతాను_ భవిష్యత్తుని గురించి ఏదో నిర్ణయానికి వద్దాం_నీ ఆనంద్.
నీ ఆనంద్ _ నా ఆనంద్ వి కదూ నువ్వు. ఆనంద్! నన్నెందుకిలా మోసం చేశావు? ఎందుకిలా నటించావు_ నేనేం ద్రోహం చేశానని నన్నిలా శిక్షించావు? నిజం నాతో చెప్పకుండా దాచి నన్నెందుకిలా ప్రలోభంలో పడేశావు? ఉత్తరం చదివి ముందు నోటిమాటలేక కాసేపు వుండిపోయింది. ఆ తరువాత కోపం, దుఃఖం, ఆవేశం, కసి, ఆవేదన, బాధ, అవమానం అన్నీ కలిసి తన భవిష్యత్తేమిటి అనే భయంతో భోరుమంది. ఎవరితో చెప్పుకోటం? ఏం జెయ్యడం? యింక తన గతేమిటి? తన బ్రతుకేమవుతుంది! తన సంగతి తెల్సిన తల్లి తండ్రులేమవుతారు! తన సర్వస్వం అనుకున్న ఆనందే యిలా మోసంచేస్తే యింకెవరు తనని ఆదుకుంటారు! ఆనంద్.... ఆనంద్ ఆ దుఃఖం, ఆ బాధ అన్నీ ఆవేశంలో దింపి ఏదో కసి పెంచాయి. యుగ యుగాలుగా ఆడది పురుషుడి చేతిలో మోసపోవడం అన్నది క్రొత్త సంగతికాదని తెలిసి తెలిసి భ్రమరం దీపం దగ్గిరకి చేరితే అది నీ తప్పెలా అవుతుంది. ఇంత చదివి, ఇన్ని చూస్తూ ఇంత సుళువుగా నీ మాటలు నమ్మి నాశనం అయిన నా అవివేకానికి నీవెలా బాధ్యుడవు_ఆనంద్!.... గుండెలు కరిగేలా ఏడ్చింది. ఆ బాధలో ఆవేశంలో ఏదో చెయ్యాలి అన్న కసి పేరుకుంది.
"అతని ఉత్తరం చదివి ముద్దాయి తనని మోసంచేశాడన్న కసితో ఆవేశంతో ఆనందరావుని తిడ్తూ ఉత్తరం రాసింది. చాలా ఆవేశంగా, ఆ ఉత్తరంలో తనని మోసం చేసినందుకు, ఇంతకాలం ఈ నిజాన్ని దాచి తనని విలాస వస్తువుగా వాడుకున్నందుకు, తనని ఇంతగా వంచించినందుకు క్షమించననీ నిన్ను చంపి నేను చచ్చి కక్ష తీర్చుకుంటానని కసిగా రాసింది." ప్రాసిక్యూటర్ కథని అతి కుతూహలంగా వింటున్నారు అందరూ.
కక్ష-కసి- అవును, ఆ ఉద్దేశంతోనే ఉన్నపాటున ఇంట్లోవాళ్ళకి కూడా చెప్పకుండా ఆనంద్ వూరువెళ్ళింది. టెలిగ్రాం యిచ్చి, తన ఉద్దేశం ఏమిటో, ఏం చెయ్యాలనుకుందో తనకే అర్థంకాని అయోమయ ఆవేశం!
"అన్నట్టుగానే ముద్దాయి సుజాత ఆనందరావు వూరువెళ్ళింది ఆనందరావును ఆమె బసచేసిన హోటలులో కలుసుకుంది. అక్కడేం జరిగిందో వివరంగా తెలియదుగాని ముద్దాయి ఆవేశంతో ముందే అన్నప్రకారం, ముందే వేసుకున్న ప్లాను ప్రకారం ఆనందరావుని హత్యచేసి కక్ష తీర్చుకున్నట్టు స్పష్టపడుతూంది. హతుని భార్య శ్రీమతి కమల కథనం ప్రకారం-భార్యాభర్తల మధ్య గత సంవత్సరం నుంచి మనస్పర్థలు పెరిగినట్లు దానికి కారణం భర్త జీవితంలో సుజాత ప్రవేశించడమేనని చెప్పింది ఆమె. మొదట్లో ఆమెకి యీ విషయం తెలుయదు. ఆనందరావుకి రచయితగా అభిమానులనించి ఉత్తరాలు అందుకోడం అలవాటయిన విషయం గనక మొదట్లో అలాగే సుజాత ఉత్తరాలు అనుకున్నది ఆమె. వారిద్దరి పరిచయం ప్రేమగా మారిందన్న విషయం భార్యకి తెలిసిందగ్గిరనించి యిద్దరిమధ్య చాలా గొడవలు జరిగేవని ఆమె చెప్పింది. ఆమె ఏడ్చి గోల చేసినా అతను పట్టించుకోలేదు. పై పెచ్చు భార్యమీద చెయ్యి చేసుకునేవాడట. ఇంటి సంగతి పట్టించుకోక పోవడం, చీటిమాటికి భార్యని కసరడం, పరధ్యానం, రాత్రింబవళ్ళు సుజాత నామస్మరణ తప్ప మరో లోకం లేనట్లుండే భర్తని ఏవిధంగా తిరిగి తనవైపు త్రిప్పుకోవాలో తెలియక ఆ ఇల్లాలు మధనపడేది. ఆఖరికి ఆనందరావు హత్య జరిగినరోజు భార్యాభర్తల మధ్య చాలా గొడవ జరిగింది. ఆనందరావు సుజాతని తను ప్రేమించానని, ఆమెకు అన్యాయం చెయ్యలేనని, ఆమె లేనిదే తనకు బ్రతుకు లేదని, ఆమె రెండో భార్యగా వివాహం చేసుకుంటానని, అందుకు భార్య అంగీకరించకపోతే ఆమె ఇష్టం వచ్చినట్టు ఎక్కడికన్నా వెళ్ళచ్చని భార్యాబిడ్డల ఖర్చుకి డబ్బు ఇస్తానని అన్నాడట. దానికి కమలాదేవి ఎంతమాత్రము అంగీకరించనని అందట. దాంతో మాటామాటా పెరిగి సుజాత లేనిదే తనకు లోకం లేదని ఆమెకి ద్రోహం చేసేకంటే తను ప్రాణాలనే విడుస్తానని ఆవేశంగా చెప్పాడట, ఇంట్లో ఎప్పటిదో పిస్తోలు ఒకటి తీసి సుజాతని కలవడానికి బయలుదేరాడట."