Previous Page Next Page 
కొత్తనీరు పేజి 33


    "మీ పూర్ణమ్మ వచ్చింది.....చూడండమ్మా" అని వంటావిడ పార్వ్తతమ్మని తట్టిలేపింది. "నిన్నటినుంచీ యిదే వరసమ్మా.....ఆ కబురు విన్నదిమొదలు యేడ్చి యేడ్చి యిలా పడిపోయారు.....రాత్రి నుంచి ఒళ్ళెరగని జ్వరం. పచ్చి మంచి నీళ్ళయినా ముట్టలేదు" ముక్కు చీదుతూ అంది వెంకాయమ్మ.
    "అమ్మా.....నేను పూర్ణని.....ఇటు చూడమ్మా...." తల్లిని కదుపుతూ యేడుపు గొంతుతో అంది పూర్ణ. పార్వతమ్మలో కాస్త చలనం కలిగింది. కళ్ళు విప్పి ఏదో లోకంలో ఉన్నట్లు అయోమయంగా చూసింది. తడుముకుంటూ పూర్ణ చెయ్యిపట్టుకుంది. పూర్ణా......పూర్ణా.....చూశావా.....ఆ శంకర్ అన్నంతపనీ చేసేశాడు! నా కడుపులో చిచ్చు పెట్టి వెళ్ళిపోయాడు!" పిచ్చిదానిలా గొణిగింది పార్వతమ్మ. కూతుర్ని చూడగానే ఆమె దుఃఖం మళ్ళీ కట్టలు తెంచుకుంది. "ఇది చూడడానికే కాబోలు నే నింకా బతికి ఉన్నాను...... ......నలుగురూ చల్లగా ఉండగా దాటిపోయే అదృష్టం నాకు లేకపోయింది......నా మొహాన యీ గర్భశోకం రాసిపెట్టి ఉండగా ఆ అదృష్టం నాకు ఎలాపడుతుంది......బాబూ.....ఆఖరికి భయపెట్టినంతా చేసిపోయావుగదరా.... ....." కొడుకుని తలుచుకు తలుచుకు ఏడుస్తున్న తల్లిని ఎలా సముదాయించాలో తెలియక తనూ యేడుస్తూ కూర్చుంది పూర్ణ.
    "మీరు యేడిస్తే ఎలా అమ్మా? అమ్మకి కాస్త ధైర్యం చెప్పండి. ఎంత యేడిస్తే మాత్రం పోయినవాళ్ళు తిరిగివస్తారా?" వెంకాయమ్మ అంది. పూర్ణ కళ్ళు తుడుచుకుంది.....
    "అమ్మా.....లే! కాస్త కాఫీ తాగు.....నిన్నటినుంచీ ఏం తీసుకున్నావు కాదట.....శోషకొడుతోంది.....పాలో, కాఫీయో పడాలి......జ్వరం కూడా మండిపోతూంది.....వెంకమ్మగారూ! కాస్త కాఫీ పట్టుకురండి....."
    "నేనేం అయిపోనే అమ్మా.....చెట్టంతకొడుకుని మింగిన నాకు ఇంక ఆకలెక్కడినుంచి వస్తుందే అమ్మా!
    "ఊరుకో వమ్మా.....ఎంత యేడిస్తే మాత్రం వాడు తిరిగి వస్తాడా!.....రామం అన్నయ్యకూడా వచ్చాడు.....లే!"
    "రామం వచ్చాడా! కృష్ణుడూ వస్తాడు పరుగున-అంతా కనిపిస్తారు. ఇంక ఆ బైరాగే కనిపించడు. నన్ను దగాచేసిపోయాడు శంకర్. అచ్చటాముచ్చటా లేకుండా బైరాగిలాగే ఉండిపోయాడు!.....మళ్ళీ ఆరంభించింది పార్వతమ్మ యేడుపు.
    రామం తండ్రిని నడిపించుకుంటూ గదిలోకి వచ్చాడు. "అన్నయ్యా కాస్త నువ్వయినా చెప్పు అమ్మకి......ఎంత చెప్పినా వినడం లేదు" రామం వచ్చి తల్లి దగ్గిర కూర్చున్నాడు. జగన్నాథంగారు గోడకి చేరగిలబడి శూన్యంలోకి చూస్తూ కూర్చున్నారు.
    "ఏమిటమ్మా, యిది?.....ఎంత యేడిస్తే మాత్రం, వాడు తిరిగి వస్తాడా?" రామం కళ్ళు తుడుచుకుంటూ తల్లిని ఓదార్చాడు.
    "నీకు తెలియదురా నాయనా ..... ఇది గర్భశోకం. తీరేది కాడు. ఎలా ఊరుకోనురా! విజయవిషయంలోలాగ యేదోవిధంగా బతికి బాగున్నాడనుకోడానికి లేకపోయింది కదా?"
    "అది సరేనమ్మా! కాని ఏం చేస్తాం!......ధైర్యం తెచ్చుకోవాలి......గుండె రాయిచేసుకోవాలి......పోయినవాళ్ళతో పోలేంగదా! ఇలా యేడ్చి, పస్తులుండి యేం ప్రయోజనం?" అని తల్లికి బోధించాడు రామం.
    సాయంత్రం కృష్ణమూర్తి కూడా బొంబాయినుంచి వచ్చాడు. శకుంతల, సుందర్రావు ఒకే రైలులో దిగారు. మర్నాటి ప్రొద్దుటికి మీనాక్షికూడా వచ్చింది. మిగతా బంధువులు ఒక్కొక్కరే వచ్చారు. ఎవరూ వచ్చిమాత్రం యేం చెయ్యగలరు? యేం చెప్పగలరు?
    "ఇంతత్వరలో మనందరం యీవిధంగా కలుసుకోవలసివస్తుందని ఎన్నడూ అనుకోలేదు...." ఏడుస్తూ అంది శకుంతల ఒక్కొక్కరినీ చూసిన కొద్దీ పార్వతమ్మా జగన్నాథంగార్ల దుఃఖం మరింత ఎక్కువవుతూ వచ్చింది. పరామర్శకి ఒక్కొక్కరు వచ్చినప్పుడల్లా కాస్త తగ్గిన దుఃఖం తిరిగి పొంగుకు వచ్చేది. రాత్రికి పిల్లలందరూ దగ్గిర కూర్చుని బలవంతంగా యిద్దరిచేతా కాస్త మజ్జిగా అన్నం తినిపించారు. పార్వతమ్మ ఉండి ఉండి శంకర్ ని, అతని మాటల్ని తలుచుకుని యేడుస్తూ వచ్చింది. జగన్నాథంగారు మాత్రం దేనితోనూ సంబంధం లేనట్లు నిర్లిప్తంగా ఎటో చూస్తూ కూర్చుంటూ వచ్చారు. ఆయనకి అన్నింటికంటే బాధ కలిగించిన విషయం, కొడుకు శరీరాన్ని ఆఖరిసారి కళ్ళారా చూసుకోడానికి లేకపోయిందని. ఏముంది చూడ్డానికి? ఏమైనా ఆకారం మిగిలితేకదా!
    పన్నెండు రోజులూ దుఃఖోద్వేగంతో గడిచిపోయాయి. ఎంతటి దుఃఖాన్నయినా కాలగమనమే మరిపిస్తుంది! బంధువులందరు సాంత్వన వచనాలు చెప్పి వెళ్ళారు. సెలవ లేకపోవడంచేత రామం, కృష్ణమూర్తి కూడా బయలుదేరక తప్పలేదు.
    "పూర్ణా! నువ్వు నెలరోజులుండి వెళ్ళకూడదూ? అందరం ఒకసారే వెళ్ళిపోతే అమ్మకీ, నాన్నకీ మరీ బాధగా వుంటుంది. మాకు సెలవు లేదు. అక్కయ్యకి యింట్లో చిన్నపిల్లలు, వాళ్ళ చదువులున్నాయి. నువ్వొక్కర్తివే కాస్త ఫ్రీగా కనిపిస్తున్నావు.......కొన్నాళ్ళుండి వెళ్ళు!....."రామం అన్నాడు. బయలు బయలుదేరేరోజు.....
    పూర్ణ సందేహిస్తూ భర్తవైపు చూసింది. నెలలు నిండిన శకుంతల అంది: "నువ్వుండు పూర్ణా!.....పిల్లలమాట అలావుంచి, నా పరిస్థితి నేడో రేపో అన్నట్లుంది. ప్రయాణమే కూడదన్నా, ప్రాణం ఉండబట్టక వచ్చాను.....వెంటనే వెళ్ళకపోతే, మాట దక్కదు. ఈ చికాకులో అదో చికాకు! అంచేత నువ్వుండు కొన్నాళ్ళు.....అమ్మా, నాన్నా మళ్ళీ మామూలు మనుషులయాక వెడుదువుగాని!"
    "పోనీ ఉండు పూర్ణా!......నేను, సుజా ఎలాగో సర్దుకుంటాంలే!" అన్నాడు సుందర్రావు.
    పిల్లల తర్జన భర్జన వింటున్న జగన్నాథంగారు శుష్కహాసం చేసి, "ఎవరుండిమాత్రం యేం చెయ్యగలరమ్మా! అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళవలసిన వాళ్ళేగదా! మాకోసం మీ మీ పనులు మానుకుని ఎందుకు ఉండడం?.....ఇంక ఎంత ఏడ్చినా వాడు రాడుగదా! వాడికోసం మేం పోలేం.....మారోజు వచ్చేదాకా యీ బ్రతుకు ఈడ్చక తప్పదు" అన్నారు జగన్నాథంగారు వేదాంత దోరణిలో.
    "కాదులే నాన్నా.....ఓ నెలరోజులుండి వెడుతుంది పూర్ణ.....కాస్త మీకు సాయంగా వుంటుంది!" అన్నాడు రామం.
    మిగతా వారందరూ వెడుతుంటే మళ్ళీ యేడ్చింది పార్వతమ్మ.

 Previous Page Next Page