ఇది నా తపోభూమి ఇది నా మహాభూమి
బదరీ మహాక్షేత్ర పరమపావన భూమి
సత్యధర్మముల కాశాజ్యోతి యగు భూమి
శౌర్యధైర్యముల స్వేచ్చాగీతి యగు భూమి.
విశ్వవిఖ్యాత మగు వీరభారతభూమి
వేదప్రపూత మగు విజయభారత భూమి
ఈ భూమిపైకి దండెత్తి వచ్చిన దెవరు?
ఈ నేలపైకి క్రొవ్వెక్కి వచ్చిన దెవరు?
ఎవడురా మా గోడ లెక్కివచ్చెడివాడు?
ఎవడురా దొంగ మాయిల్లు జొచ్చెడివాడు?
నలుబది నాల్గు కోటుల వీరు లేకమై
భరత పౌరుషరేఖ పరదురాలోకమై;
నరులుగా గాండీవ ధరులుగా నిలబడిన
హరులుగా త్రిపురసంహరులుగా కనబడిన
భీములై రణరంగభీములై పయిబడిన
దుర్గలై విజయసంసర్గలై వెలువడిన;
పర్వెత్తకుందురా గర్వాంధ సైంధవులు !
కుమిలిపోకుందురా కుటిల కామాంధకులు!
తొలఁగి పోకుందురా ధూర్త దుశ్శాసనులు!
పాఱిపోకుందురా క్రూర మహిషాసురులు!
వన్నెగాంచిన విశ్వ వైతాళికుఁడ నేను
వాసికెక్కిన హిమవద్గిరీంద్రుఁడ నేను
లెండు నా ప్రజలార లెండు సోదరులార
చండప్రచండ మార్తాండ కిరణములార.
రోషంబులును కులద్వేషంబులును దొంగ
వేషంబులును స్వార్ధదోషంబులును వదలి
సత్యంబుగా ఐకమత్యంబుగా జయౌ
న్నత్యంబుగా జనస్తుత్యంబుగా కదలి
ప్రళయకాల మహోగ్ర భానుకిరణమ్ములై
దిగ్దిగంతముల నవదీప్తు లొలికింపవలె,
కల్పాంత కుపిత సాగర తరంగమ్ములై
వైరిరాజన్య సైన్యముల ముంచెత్తువలె.
విలయ రుద్ర కరాళ వికట గర్జనములై
దిగ్గజమ్ముల చెవుల దిమ్మెక్కఁ జేయవలె
సంవర్త సమయ ఝంఝామారుతమ్ములై
విమత విరోధి శీర్షముల నెగజిమ్మవలె.
భావిభారత నిరభ్యంతరాభ్యుదయ సం
భావనాహ్లాద భర పారవశ్యుఁడ నేను,
ఆర్ద్ర మానస పులకితాంతరానందాశ్రు
వాహినీ భరిత హిమవద్గిరీంద్రుఁడ నేను.
జ్యోతిర్మయి
నీవొక వేణుగీతి వయి నిద్దురలేపితి వీ ప్రసుప్త బృం
దావనమున్; లతా తరు వితానము "కొమ్మకు కోటిపువ్వులై"
తావుల గ్రుమ్మరించె; సముదాత్తము ళీ మధురక్షణాలు; నే
నీవయి నీవు నేనయి గ్రహింతము విశ్వకళారహస్యముల్ !
నీవొక నాట్యలక్ష్మి వయి నృత్యమొనర్చితి వీ ప్రఫుల్ల రా
జీవ వనంబునందు, నవజీవన మబ్బె సమస్త సృష్టికిన్;
తావక లాస్య సుందర పదాంకితా కింకిణికా ధ్వనుల్ చిరం
జీవము లయ్యె; కల్గు రససిద్ధి యిఁకన్ జగదంతరాత్మకున్.
నీ వొక మేఘమాల వయి నెమ్మదిగా పయనించి వచ్చి నా
భావ విహాయసంబు నిరుప్రక్కలఁ గ్రమ్మితి వొక్కమాటె; ఈ
శ్రావణ శోభలో నిను ప్రసన్నమతిం గరగించి సృష్టికిన్
జీవముపోతునా పుడమిచేడియ గుండెలు పుల్కరింపఁగన్.
నీ వొక పాలవెల్లివయి నింపితి వీ హృదయంబులో రసా
ప్లావితముల్ సుధామధుర భావరంగము; లబ్బె నూతనో
జ్జీవన; మీ కళాకలిత జీవను భావిభవంబు సాహితీ
శ్రీవిభవంబులో పరవశించి స్పృశించు దిశాంచలంబులన్ !
నీ వొక చిట్టితల్లి వయి నీ చిఱునవ్వుల పూలసజ్జతో
దేవుని పూజకై బయలుదేఱితి నావెనువెంట; అల్లదే
కోవెలగంట 'ఖంగు' మని గుండెలలో ధ్వనియించె; శీఘ్రమే
పోవలె అందుకోవలె అపూర్వములైన ప్రభు ప్రసాదముల్ !
నీ వొక కల్పవల్లివయి నిల్చితి మాభవనాంగణమ్ము క్రొ
మ్మావి కడన్ నమస్సుమ సమంచితసంచితభాగ్యరేఖతో !
భావమయీ! త్రయీహృదయ పద్మ మరందములందు ముంచి ఈ
భావుక సంచయమ్మునకుఁబంచుదుమా రసవత్ఫలమ్ములన్.
నీ వొక జ్యోతిర్మయివై
దేవీ! వెలిగింపు నవ్యదీప్తులతో నా
జీవిత పథము, ముహుర్ముహు
రావిర్భూతములుగా జయాభ్యుదయమ్ముల్.
శాంతిదూత
లేలెమ్మోయి కవీ! జగజ్జనని పిల్చెన్; దివ్య కర్తవ్య దీ
క్షా లక్ష్మీ జయకంకణ మ్మిది కరాగ్రంబందు గీలింపు; న
వ్యాలోకంబులు నిల్పు నల్దెసల; భవ్యంబౌ భవల్లేఖినీ
కాళిందీ లహరీ ప్రపూరముల లోకా లెల్ల ముంచెత్తరా !
శత్రుచమూతతిన్ గసిమసంగుటన్ గరుణార్ధ్రనేత్రుఁడై
గాత్రము కంపిలన్ నరుఁడు గాండివమున్ దిగజార్చెరా కురు
క్షేత్రమునందు; నీ విజయగీతములన్ వినిపించి వానిలో
క్షాత్రము నింపరా! విజయసారథివై విజయమ్ము చేయరా!
చిక్కని వీరగీతులు రచింపుము! భారతపౌరుషంబు న
ల్దిక్కుల పొంగులెత్త నినదింపుము గుండెల వీరదుందుభుల్!
ఒక్కొక్క భారతీతనయుఁ డొక్కొక సింహకిశోరమూర్తియై
మ్రుక్కడి కుంభికుంభముల ముక్కలు వ్రక్కలు సేయునట్లుగన్!
కొంటె విధాత నీ యెడదకుం గుఱివెట్టిన వాడిబాణమే
గంటముగా లిఖింపు మొక కావ్యము; నీ కరుణాకుమారి క్రీ
గంటి కవోష్ణ బాష్పకళికల్ రస పూర్ణములై సువర్ణ పుం
బంటలు రాశిపోయ నవభారతమున్ సృజియింపరా కవీ!
గుండెలు పిండు బాధ నొక గుప్పిటబట్టి, హృదంతరంబులో
మండు దావాగ్నిచిర్నగవుమాటున దాచి, "పరార్ధమే భవత్
పాండితికిన్ ఫలం" బనెడి భావముతో రసభాండముల్ కళా
ఖండములన్ వెలార్చుము యుగాల మొగాలు "జిగేల్ జిగేల్" మనన్!!
క్రాంతిగీత
శ్రీమద్ భారత భాస్కరుద్యుతులు నర్తించెన్ స్వతంత్రమ్ములై
భూమీమండలమందు; నంధతమసమ్ముల్ విచ్చె; సీమాంతముల్
హేమంతంబులు పూచె; కైవసములయ్యెన్ సర్వసౌభాగ్యముల్
ఏమయ్యా చెలికాడ! నిల్వబడినావే నీవు కన్నీళ్ళతో !!
"వైషమ్యాలు శమింపలేదు; పదవీవ్యామోహముల్ చావలే
దీషణ్మాత్రముగూడ; మూతవడలేదే కైతవద్వారముల్;
భాషోన్మాదము తగ్గలేదు; నశియింపన్ లేదు మిథ్యాకుల
ద్వేషంబుల్; మఱి యెన్నినాళ్ళ కిట వర్దిల్లున్ బ్రజాభాగ్యముల్ !"ప
పదియుందొమ్మిది యేండ్లు డగ్గరెను బాబా! నీ త్రివర్ణధ్వజం
బది జాతీయ సువర్ణ కాంతుల స్రజంబై; దేశవాల్లభ్య మ
భ్యుదయం బందెడు వేళ ఘాతుక వృకంబుల్ కొన్ని పేరాసతో
కదలంజొచ్చె హిమాద్రిసానువుల ప్రక్కన్ డొక్క లల్లార్చుచున్!
దారులలో దురాక్రమణదారులు బారులు దీరి; స్వర్ణ కే
దారము లాక్రమింప సరదాపడినారటె! వీరమాత కా
శ్మీరము నాకివేయ పొలిమేరలు దాటిరటే దగా ముఠా
దారులు "ప్రక్కయింటి పరదా సరదారులు" మాయదారులై.
రవివై రంజింపుము భువి;
పవివై భంజింపు మహితపక్షంబుల; స్వ
ర్గవివై నిండింపుము సుధ;
కవివై పండింపు మఖిల కల్యాణమ్ముల్ !