బలిచక్రవర్తిని బంధించి పాతాళ
మునకు వామనుఁడు పంపినది నేఁడె!
రావణుం బరిమార్చి రాముఁ డర్దాంగితో
ననుజన్ము భరతుఁ గాంచినది నేఁడె!
క్రూరుఁడౌ నరకాసురుని సత్యభామ కృ
ష్ణుని వెంటఁజని వధించినది నేఁడె!
విక్రమార్కుఁడు శత్రువిజయంబుఁ గావించి
తనపేర శకము నిల్పినది నేఁడె !
శ్రీమహావీర జినుఁ డహింసామహస్సు
దెసలఁ బ్రసరింప సిద్ధిపొందినది నేఁడె!
వచ్చె నిదిగొ సౌవర్ణ శోభాప్రపూర్ణ
సర్వజనము!! దీపావళీ పర్వదినము !!
తోటాలు గాల్చి ముందునకు దూఁకెడి వేళ
క్రుద్ధులౌ ఫాలనేత్రుల విధాన
దివ్విటీల్ గిరగిర త్రిప్పి పర్విడు వేళ
కలియుగ భీమసేనుల విధాన
విష్ణుచక్రాలను వెలిగించు నవ్వేళ
చెలువొప్పు బాలకృష్ణుల విధాన
చివ్వున అవ్వాయిచువ్వ రువ్వెడి వేళ
విలుదాల్చు వీరార్జునుల విధాన
ఔట్లు రాకెట్లు పేల్చెడు నట్టి వేళ
ప్రళయ భీకర వీరభద్రుల విధాన
రైతుబిడ్డలు పౌరుషజ్యోతులైరి
ప్రథిత దీపావళీ మహాపర్వ వేళ.
పడుచుకోడలు సిగ్గుపడుచు ముత్యాల పూ
వత్తి కాల్చెను మొగమెత్తకుండ
దీపపంక్తులు దిద్ది తీర్చు నమ్మకు నూనె
గిన్నియ నందించె చిన్నిబిడ్డ
పొరలి పోయెడి చిచ్చుబుద్ది కాంతులలోన
చెలి క్రొత్తచీర కాంచెను మగండు
గుమ్మమ్ము గడపలోఁ గూర్చుండి తాటాకు
గుమ్మటాల్ త్రిప్పె అమ్మమ్మగారు
కారు చీకట్లు చరచర పాఱిపోవ
ఇంట బయటను దివ్వెల పంట పండె;
తళుకు లొలుకు నక్షత్ర మండలము తోడ
ఆకసము నేలపయి దిగినట్లు తోఁచె !!
అత్తవారింట క్రొత్తల్లుండు గుట్టు మ
ట్టు లెఱింగి బెట్టుబెట్టుగ చరించె
బావగారిని చెవుల్ పట్టి యాడించు చె
ల్లిని పిల్చి బుగ్గ గిల్లినది అక్క
గుడిసెపై జారిన క్రొంగొత్త సొరపిందె
పాసెమ్ము కోసమై కోసె కాపు
భయపడు వదినమ్మపై చిచింద్రీ వైచి
కిలకిల నవ్వె ముద్దుల మఱంది
కర్షకుల కార్మికుల మహా హర్షబాష్ప
వర్షబిందువులట్లు దీపములు మెఱసె;
వీథివీథుల నింటింట వెల్లివిరిసె
నవనవోన్మేష కౌతుకానందలహరి.
రావమ్మ చెల్లి! దీపావళీ! ఇవె అందు
కోవమ్మ మా స్నేహ భావనలను
లేవమ్మ తల్లి! శ్రీదేవి! మా యింటికి
తేవమ్మ నీ మేలి దీవనలను
పోవమ్మ దౌర్భాగ్య దేవతా! యిక వెళ్ళి
పోవమ్మ మయూరి పొలము దాటి
ఈవమ్మ ఫలము భూదేవి! పంటలరాణి!
క్రిమి కీటకమ్ములు సమసిపోవ
దీపముల నెత్తి దివిటీలు త్రిప్పిత్రిప్పి
త్రోవ చూపించితిమి పితృదేవతలకు;
దివ్యలోకమ్ములను ప్రసాదింపు మయ్య !
అయ్య! యమధర్మరాజ! నమోస్తు నీకు !!
సుమహిమాలయము
దివిషత్తరంగిణీ తీర సురసుందరీ
కరకంకణ క్వణ క్వణన వీణారావ
కలిత హరవిజయ మంగళగీతికా ప్రతి
ధ్వనిత కందరుఁడ హిమవద్గిరీంద్రుఁడ నేను.
బహుపుణ్య నదనదీ లహరీ ముహుర్ముహుర్
మహనీయదర్శన స్పృహణీయుఁడను నేను
భరతరాజ్ఞీ శిరోభాసమాన మనోజ్ఞ
వజ్రకోటీర హిమవద్గిరీంద్రుఁడ నేను.
హర జటాజూటాగ్రా తరుణేందు దరహాస
లీలా సముల్లాస కైలాసుఁడను నేను
రాజహంస విహార రమణీయ రాజీవ
రాజీ విరాజి నవరస మానసుఁడ నేను.
ఉపనిషత్ సుందరీ సుపవిత్ర పదకంజ
మంజు మంజీర శింజితము నిండిన దిచట
చేత ముప్పొంగ భూమాత గోమాతయై
పృథు చక్రవర్తి కోవధులు పిండిన దిచట.
విల్లుగా మేరు పృథ్వీధరంబును వంచి
ఫణివల్లభుని ధనుర్గుణముగా బంధించి
విశిఖంబుగా మహావిష్ణువును సంధించి
త్రిపురాసురుల సంహరించె హరుఁడిచ్చోట.
క్రోధించి సాధువుల బాధించి వేధించు
మహిషాది ధూర్త దుర్మద దుష్టదానవుల
సంహార మొనరింప సింహవాహన మెక్కి
దుర్గాభవాని ముందుకు సాగె నిచ్చోట.
ముల్లోకముల నల్లకల్లోల మొనరించు
ధర్మవిద్రోహి యగు తారకుని బరిమార్ప
కదలె త్రింశత్కోటి త్రిదశ యోధులఁ గూడి
సర్వసేనానియై శక్తిధరుఁ డిచ్చోట.
అర్ధాంగి పాంచాలి ప్రార్ధింప నిజభుజా
స్కంధాన గద దాల్చి కౌంతేయమధ్యముఁడు
యక్షరాక్షస చమూ విక్షోభ మొనరించి
సౌగంధికాబ్జముల సాధించె నిచ్చోట.
తొడగొట్టి యెగసి పైబడి శిరోగంగ గ్ర
క్కదల ముక్కంటి నెక్కటి కయ్యమున గెల్చి
భావిభారత రణశ్రీ విజేత కిరీటి
పాశుపతంబు సంపాదించె నిచ్చోట.
ఆడుకొన్నా రిచట ఆమ్నాయ బాలికలు
యుగవీథులందు నాలుగు స్తంభములయాట
పాడుకొన్నా రిచట బ్రహ్మర్షి సత్తములు
గంగా తరంగిణీ గతులలో శ్రుతి గలిపి.
నరుని నారాయణుని చరణ విన్యాసముల
భూదేవి నిలువెల్ల పులకించిపోయె నిట
జైమిని పైల వైశంపాయన సుమంతు
లకు చతుర్వేదాలు ప్రకటించె వ్యాసుఁడిట.
కాళిదాస కవీంద్రు కవితాకుమారి నా
శిఖరాంచలములందు స్వేచ్చగా తిరిగినది
కందికుందెడి యక్షసుందరికి చల్లగా
అందించినది "మేఘసందేశ" మిచ్చోట.
కాళిదాసకవీంద్రు కవితాకుమారి మా
గౌరి కాళ్ళకుపసుపుపారాణి తీర్చినది
తళుకు వాల్గనుల కజ్జలరేఖ గీల్కొల్పి
అలికాన కల్యాణ తిలకంబు దిద్దినది.