Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం-1 పేజి 35


                                       వియద్వాణి
    
    అది ఫాల్గుణ నిశి
    ఆనాడు బహుళ ఏకాదశి
    గగనసుందరి అలిక ఫలకాన
    కల్యాణ తిలకంలా మెరుస్తున్నాడు శశి.
    
    అప్పుడే గడియారం మూడుగంటలు కొట్టింది
    చప్పున మనస్సుకేదో తట్టింది
    మెల్లగా గదిలోకి వెళ్ళి లైటు వేశాను
    బల్లమీది లేఖ మళ్ళీమళ్ళీ చూశాను.
    
    రచన పంపించి తీరాలి తెల్లవారితే తెలుగు ఉగాదికి
    వెళ్ళుధామా అనిపించింది ఒక్కమాటు మేడ మీదికి
    ఎక్కుతున్నాను పైపైకి ఒక్కొక్క మెట్టు
    చక్కగా వంగి చూస్తున్నది ప్రక్కనున్న గున్నమామిడిచెట్టు.
    
    ఏకాంతంగా కూర్చుని ఆకాశంలోకి వీక్షించాను
    నక్షత్ర ఖచిత నభోమండలం పరీక్షించాను
    రెక్కలు తొడుక్కొని మనస్సు ఎక్కడెక్కడికో ఎగిరిపోతున్నది
    విచిత్ర విభ్రమ విద్యుద్ఘాతంలో విలీనమౌతున్నది.
    
    నల్లని ముఖమల్ సిల్కు పరుపులపై
    చెల్లాచెదరైన ముత్యాల సరాలు
    దేదీప్యమానంగా వెలుగుతున్నవి
    తెల్ల తెల్లని నక్షత్రాలు.
    
    చందనం చివురించి నట్లున్నది - నందనం వికసించినట్లున్నది
    మందాకిని పొంగి నట్లున్నది - బృందావనం నవ్వినట్లున్నది
    అందాలు చిందుతున్నది ఆకసం
    విశాల వినీల వికస్వర విహాయసం
    
    నిశ్చల నిశ్శబ్ద సంగీతం నింగినుంచి వినబడుతున్నది
    అచ్చ స్వచ్చంద సౌందర్యం ఆకసంలో కనబడుతున్నది
    ప్రశాంత నిశాంతం పరవశత్వంతో తూగింది
    విశాలమైన ఆకాశం పలుకసాగింది
    
    "ఇన్నాళ్ళకు నీ కళ్ళకు ఇలా కనిపించాను నేను
    ఎన్నాళ్ళనుంచో నీ కోసం ఎదురు చూస్తున్నాను.
    అక్షరమైన విశ్వమహా కావ్యంలో ప్రక్షిప్తాలు పరీక్షిస్తున్నాను
    లక్ష లక్ష నక్షత్ర నయనాలతో దీక్షగా నిరీక్షిస్తున్నాను.
    
    యుగయుగాల నాటినుంచీ
    ఇలాగే వెలుగులు వెదజల్లుతున్నాను
    జగాలు జన్మింపక ముందు నుంచీ
    ధగధగా ఇలాగే మెరుస్తున్నాను.
    
    సురాసురులు పాలకడలి మథించడం చూచాను
    మహాకాళి మహిషాసురుణ్ణి వధించడం చూచాను
    స్మరుడు హరునిమీద శరం సంధించడం చూచాను
    బలిచక్రవర్తిని వామనుడు బంధించడం చూచాను.
    
    అగస్త్యుడు సముద్రాన్ని ఆపోశన పట్టడం ఎరుగుదును
    దేవేంద్రుడు కొండలరెక్కలు తెగగొట్టడం ఎరుగుదును
    జగత్తును హిరణ్యాక్షుడు చాపచుట్టడం ఎరుగుదును
    ముగ్గురు మూర్తులకు అనసూయ ఉగ్గుపెట్టడం ఎరుగుదును.
    
    బాదరాయణ మహర్షి బ్రహ్మసూత్రాలు వ్రాయకముందు
    'ఆదాం అవ్వల' దాంపత్యం చేదుకాయలు కాయకముందు
    "హరప్పా" "మొహెంజోదారో"లు ఆవిర్భవించకముందు
    హిమాలయ మహాపర్వతం సముద్రంనుంచి లేవకముందు
    
    ఆదికాలంనుంచీ - అనాదికాలంనుంచీ - నేనున్నాను
    అప్పటికీ యిప్పటికీ ఎప్పటికీ ఒకేలాగున్నాను."
    నేను విస్మయంతో వింటున్నాను
    వినీల వియత్తలం అంటున్నది.
    
    "అలెగ్జాండర్లు అశోకులు అబ్రహాంలింకన్లు
    సోక్రటీసులు ప్లేటోలు సొహరాబు రుస్తుములు
    సీజర్లు నెపోలియన్లు చంఘీజుఖానులు
    రాజులు మహారాజులు వక్తలు ప్రవక్తలు
    
    వీరులు మేధావులు విశ్వవిజేతలు జాతినేతలు
    ఎందరెందరో నాకనులముందు కదలిపోయారు
    ఏ ఒక్కరూ కాలప్రవాహానికి ఎదురీతలేకపోయారు
    కన్నులు మూసికొని కాలగర్భంలో కలిసిపోయారు.
    
    రాజులు సామ్రాజ్యాలు రత్నఖచిత సింహాసనాలు
    సౌధాలు కిరీటాలు జలతారు మేలిముసుగులు
    కరాళకాలజ్వాలల్లో కరిగి నీరైపోయాయి
    ధరాపరాగాలుగా మారి - స్వరూపాలు గోల్పోయాయి.
    
    కాలం క్షణకాలం ఆగదు - కాలం దుర్నివారం
    అది దూరం తెలియని అపార పారావారం
    కాలచక్రం నా కన్నుసన్నల్లో మెదుల్తుంది
    గ్రహానీకం నా గృహాంగణంలో కదుల్తుంది.
    
    క్షణాలు దినాలు మాసాలు సంవత్సరాలు
    యుగాలు కల్పాలు కల్పాంతాలు
    చరచరా సాగిపోతున్నవి గిరగిరా తిరిగిపోతున్నవి
    కాలం అజేయం కాలం అమేయం.
    
    నేను దిగ్భ్రాంతుడనై అలాగే కూర్చుని వింటున్నాను
    ఆకాశవాణి మళ్ళీ ఆరంభించి అంటున్నది
    కాలం పంచకల్యాణి
    కాలానికి కళ్ళెం పెడుతుంది కవివాణి.
    
    కాలాన్ని కవిత్వానికి స్వాధీనం చెయ్యి
    జీవితాన్ని పూలమాలగా కట్టి మెళ్ళో వెయ్యి
    జగతిని ప్రగతితో సమన్వయించు
    మానవత్వంలోని నవత్వాన్ని కవిత్వంతో సమర్చించు.
    
    నాలోని ప్రభాకరునిలా ప్రకాశించు
    నాలోని ధ్రువతారలా మార్గం చూపించు
    నాలోని మేఘంలా మెల్లగా వర్షించు
    నాలోని చందమామలా చల్లగా స్పర్శించు.
    
    నారాజ్యంలో సూర్యచంద్రులు వేళతప్పరు
    నాసీమలో నక్షత్రకాంతలు త్రోవతప్పరు
    విశ్వానికి వెలుగుబాటలు ప్రసాదిస్తారు
    సమరస భావంతో సమన్వయం సాధిస్తారు.
    
    నా అడుగు జాడలలో పురోగమించు
    నా వెలుగునీడలలో ప్రయాణం సాగించు
    సత్యాన్ని సౌందర్యంతో నిండించు!
    నిత్యకల్యాణాన్ని నీ పలుకుల్లో పండించు !!!

                                  సవితాదేవి కవితాలేఖ
    
    ఏమండీ కవిగారూ ! నమస్కారం -ఏమి చేస్తున్నారు !
    క్షేమంగా ఉన్నారా ! ప్రస్తుతం ఏమి కావ్యం రచిస్తున్నారు !
    ఇదిగో మీకు లేఖ వ్రాస్తున్నాను నేనండీ మీ సవితను !
    పదే పదే పత్రికల్లో చదువుతున్నాను మీ కవితను.
    
    మిమ్మల్నీ  మీకవితల్నీ మెచ్చుకునేదాన్ని
    మీకు ప్రశంసాలేఖలు కురిపించేదాన్ని
    అప్పటిలా మీకవిత్వాన్ని అభినందించలే నిప్పుడు
    అప్పటిలా నా ధన్యవాదాలు అందించలే నిప్పుడు.
    
    పుస్తకంలోని పుటలు పుంఖానుపుంఖంగా నింపుతున్నారు
    మస్తకంలోని సరిక్రొత్త సరకు మార్కెట్టులోకి దింపుతున్నారు
    కవిత్వం మానివేసి - కవిత్వంమీద కవిత్వం వ్రాస్తున్నారు
    నవత్వం మైకంలోపడి మానవత్వం మరచిపోతున్నారు.
    
    పంక్తి మీద పంక్తి "పకడ్ బందీ" గా సంధిస్తున్నారు
    బలవంతంగా భావాన్ని పదాలలో బంధిస్తున్నారు    
    వ్యర్ధమైన బరువుతో పద్యం నడుము వంగుతున్నది
    స్వార్ధం పరమార్ధాన్ని దిగమ్రింగుతున్నది.
    
    కవిత్వం అంటే ఉపదేశాలూ ఉపన్యాసాలూ కానేకావు
    సిద్దాంతాలూ హేతువాదాలూ అసలే కావు
    కల్లాకపటం తెలియని పల్లెపడుచూ ఉండవలసిన కవిత్వంచిన్నది
    కళ్ళద్దాలు ధరించి వేదిక నెక్కి ఉపన్యాసాలు దంచుతున్నది.
    
    కవీ! దివినుండి ఇప్పుడే దిగివచ్చిన ప్రవక్తవై పోతున్నావు
    సందేశాల ఆవేశంలో అందానికి దూరమౌతున్నావు
    అడ్డదిడ్డమైన రేఖల్లో అందాన్ని అన్వేషిస్తున్నావు.
    ముందు కన్పించే అందాలబొమ్మను ఎందుకో ద్వేషిస్తున్నావు.

 Previous Page Next Page