Previous Page Next Page 
నయనతార పేజి 33

 

    నాలుగోరోజుతో ప్రియంవదకి గాభరా పుట్టి, మతి పోయింది. ఇంత బుద్దిమంతుడయి , తనపట్ల యింత గౌరభిమానాలు చూపించే మనిషిలో చెడ్డ గుణాలు ఎలా ఎంచిచూపడం? అవకాశమే ఈయకపోతే తన నిర్ణయాలని ఎలా ఆచరణలో పెట్టడం? ...... అదే పెద్ద సమస్య అయిపొయింది ప్రియంవదకి. ఆఖరికి ఏం చెయ్యాలో తేల్చుకోలేక సెక్రటరీ శారదాదేవికి ఫోన్ చేసింది సలహా కోసం.
    "నాన్సెన్స్! ఏమిటిది! యింత క్రితమే సులోచన లలిత, పద్మావతి , రాజేశ్వరి, వాళ్ళూ కూడా ఫోన్ చేశారు, 'కధ అడ్డం తిరిగింది. ఏం చెయ్యమంటారు?' ...... ఇంట్లో వరస చూస్తుంటే నా కసలే దిక్కు - తోచకుండా వుంది ..... ఆ పైన మీరూ యిలా అంటుంటే వున్న మతి కూడా పోతుంది! .... మావారూ అతి బుద్ది మంతులయిపోయి, నన్నే పనీ చెయ్యనియ్యకుండా, కాలు క్రింద పెట్టనీయకుండా , కార్లలో  త్రిప్పి అభిమానంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ మూడు రోజుల నుంచి. ఇలా యింత మంచిగా వున్న మొగుడి మీద మన నిర్ణయాలని ఎలా అమలులో పెట్టడం అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. మీరేదన్నా సలహా చేపుతారేమో అడుగుదామనుకుంటున్నాను నేను. మీరూ ఇలాంటి స్థితిలో ఇరుక్కోడం..... ఇదేదో విచిత్రంగా వుంది. సరే....... ఫోన్ లో విపులంగా చర్చించడం కుదరదు. రేపు మళ్ళీ అందరం సమావేశం అవుదాం! అక్కడ ఆలోచిద్దాం ఏం చెయ్యవలసిందీ!....."
    "నాన్సెన్స్ ! ........" మళ్ళీ అంది శారదాదేవి అందరి నోట సంగతి విని. తాము అనుకున్న ప్లాను ఎవరూ అమలు పరచలేక పోవడం, కధ అడ్డం తిరగడంతో చికాకు ఎత్తింది శారదాదేవికి.
    "ఒక్కసారిగా అందరి ఇళ్ళల్లో మగవాళ్ళు ఇంత బుద్ది మంతులయిపోవడం అన్నది అసంభవమైన విషయం! ఒకే రోజు నుంచీ ప్రతీ మగాడు మారిపోవడం చాలా విద్దురంగా వుంది. ఆలోచిస్తే యిందులో ఏదో మోసం వుందనిపిస్తుంది. మన నిర్ణయాలు, మన సమావేశ సారాంశం వాళ్ళకి తెలిసి పోయి వుంటుంది. ఎలాగో! మన అట కట్టించడానికి ఎత్తుకు పైఎత్తు వేసి వుంటారు వాళ్ళు! మీలో ఎవరన్నా నోరు జారి చెప్పారా మన నిర్ణయాల గురించి ....." అందరిని అడిగింది శారదాదేవి.
    "అబ్బే! ..... అసలు ఈ ఊసే ఎవరం ఎత్తలేదు ..... వాళ్ళూ మాటవరసకైనా అడగలేదు." ముక్తకంఠంతో జవాబిచ్చారు అందరూ.
    "మరి! ? .... మన సంగతి తెలియకుండానే ముందు కూడ బలుక్కున్నట్టుగా , ప్రతి యింట్లో మగాళ్ళు ఒక్కసారిగా బుద్దిమంతులయిపోయి, మన విలువలని గుర్తించేసి మనకి గౌరవ మర్యాదలు యిస్తున్నారన్నది ఎంత మాత్రమూ నమ్మశక్యం గాని సంగతి!...."
    "ఏమో! ఏమయిందో గాని .......పాపం యీ మగాళ్ళు యీ మూడు రోజుల నించి ఎన్నడూ చేసుకొని పనులు చేసుకుంటుంటే కాస్త జాలని పించింది సుమా!........" సులోచన అంది.
    "అసలు యిన్నాళ్ళూ మనచేత చాకిరి చేయించుకుంటున్నారని భాధపడ్డామా?... అదేమిటో ఈ మూడు రోజుల నుంచి చేయించుకోడం లేదని బాధ అనిపించింది. పాపం ఎన్నడూ సూది లో దారం ఎక్కించలేని అయన, స్వయంగా నానా అవస్థలు పడి బొత్తాలు కుట్టుకుంటుంటే నవ్వు బదులు జాలి అనిపించింది. కసిక్కిన సూది వేలికి గుచ్చుకుని 'అబ్బా' అనగానే యింక వూరుకోలేకపోయాను. మన నిర్ణయాల మాట మరిచి, యిటీయండి , కుట్టిస్తాను, అనేశాను. అయినా కూడా అయన వద్దనడంతో నన్నేదో దూరం చేసినట్లు, ఏ పని చెప్పక వెలేసినట్టు ఫీలయ్యాను. మనసు చివుక్కుమనిపించింది" ప్రియంవద అంది.
    "అదేనమ్మా! ఇన్నాళ్ళూ ఇంటికి త్వరగా రారని విసుకున్నానా? ఈ మూడు రోజుల నించి ఆయన క్లబ్బు మానేసి ఇంటిలో కూర్చుని నా పని కాకుండా బాతాఖానీ కొడ్తూ, నా పెత్తనాలకి అడ్డు వస్తున్నారనిపించింది ఆ క్లబ్బుకి వెడితేనే బాగుండుననిపించింది. /..... పాపం , ముందు రోజు క్లబ్బు కెళ్ళారా? ...... ఎనిమిదిన్నర కల్లా వచ్చేశారు. మన నిర్ణయం ప్రకారం అప్పుడు అన్నం పెట్టకూడదు గదా. ఏం చేస్తారో నని చూస్తూ ఊరుకున్నాను. నన్ను అన్నం పెట్టమని అడగనైనా అడగకుండా , అలా ఆఫీసు కాగితాలు చూసుకుంటూ కూర్చున్నారు. చూసి చూసి ఆఖరికి వూరుకోలేక తొమ్మిదికి భోజనానికి పిలిచాను. మీ అందరి భోజనాలు అయిపోయాయి గదా, ఆ టైముకి రాకపోవడం నాదే తప్పు. నీవేం మనిషివి కావా, ఒక్కొక్కళ్ళు ఓ టైముకి వస్తే పెడుతూ కూర్చోడానికి. ఇన్నాళ్ళూ నీ కష్ట సుఖాలు ఆలోచించకుండా అర్ధరాత్రి, అపరాత్రి వచ్చ్జి నిన్నేడిపించుకు తిన్నాను.... నీవు గాబట్టి కాపురం చేశావు. ఈ రోజు నించి నీ టైముకి వస్తేనే భోజనం చేస్తా.... లేకపోతే ఆరోజు ఉపోష్యమే నాకు శిక్ష!" అంటూ ఎంత బ్రతిమిలాడినా ఆ పూట ఎంగిలి పడ్డారు కారు. నా ప్రాణం గిలగిల లాడింది. మగాడిని పస్తు పడుకోబెట్టడానికి ఏ ఆడదాని మనస్సు వప్పుతుందమ్మా! వాళ్ళని ఇలా బాధ పెడితే మనకేం ఒరుగుతుంది! ఆ వుసురు మనకెందుకమ్మా! మీ సంగతి ఏమో గాని, ఈ నిరాకరణోద్యమాలు అవి నేనేం చెయ్యలేను తల్లీ! మగాడ్ని దుఃఖపెట్టి నా వల్ల గాదు బాబూ! ఏదో ఓ గంట కాలక్షేపానికి వస్తున్నాను గాని,....ఈ గొడవలన్నీ నాకు బోధపడవు శారదమ్మా!" సుందరమ్మ జరగిల పడిపోయింది.
    "నేనూ చెయ్యలేనండోయ్! పాపం రాత్రి పన్నెండు గంటలకి వచ్చి తలుపేనా తియ్యమనకుండా వీధి అరుగు బల్ల మీద చలికి ముడుచుకు పడుకున్న ఆయన్ని ప్రొద్దున్నే తలుపు తీసి చూసేసరికి సిగ్గుతో ప్రాణం చితికిపోయింది. రాత్రి నేను పరుపు మీద హాయిగా పవ్వళించాను. ఆయన్ని అలా బయట చలిలో పడుకోబెట్టాను. పాపిష్టిదాన్ని! నా చేతులు పడ! మొగాడ్ని అలా ఏడిపించడం మనకేం న్యాయం! ఇలాంటి పనులు నావల్ల గాదు శారదమ్మ!" పార్వతమ్మ కూడా చెప్పేసింది.

 Previous Page Next Page