Previous Page Next Page 
ఫాలాక్షుడు పేజి 33


    తనని కొన్ని గంటలసేపు మనిషిగా... తనెవరో తెలియకపోయినా ఆదరించిన శివరాణికి కృతజ్ఞతలు చెప్పకుండా వెళ్ళడం మర్యాద కాదనుకుని ప్రిస్కిప్షన్ పేడ్ లోంచి కాగితం తీసి పెన్నుతో దానిమీద 'థాంక్స్ విత్ లవ్' అని మాత్రం రాసి... టేబుల్ మీద పెట్టి... దానిమీద పేపర్ వెయిట్ పెట్టి... గబగబా బయటికి వెళ్ళబోతూ టేబుల్ మీదున్న ఈనాడు పేపర్ మొదటి పేజీవైపు చూశాడు యధాలాపంగా.

 

    సి.ఎం. హంతకుడు... లా స్టూడెంట్ పరారీ... బాక్స్ ఐటమ్ పక్కన ఆదిత్య ఫోటో.

 

    గబుక్కున ఆ వార్త ప్రింటయిన భాగాన్ని చింపేసి జేబులో పెట్టుకుని హాస్పిటల్ నుంచి పరుగెత్తడం ప్రారంభించాడు.

 

    ఆదిత్య ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి వెళ్ళిపోయిన పది నిమిషాలకు ఉరుకులు, పరుగులు మీద అక్కడకొచ్చిన నర్స్ శివరాణి ఆదిత్య కోసం వెతికింది.

 

    ఎక్కడా కనబడలేదు.

 

    చిరిగిపోయిన ఈనాడు పేపర్ టేబుల్ మీద రెపరెపలాడుతూ కనిపించింది.

 

    దాని ప్రక్కనే ప్రిస్కిప్షన్ పేపర్ మీద...

 

    'థాంక్స్ విత్ లవ్... థాంక్స్ విత్ లవ్' ఆ అక్షరాల్ని చూడగానే ఆమె మనసెందుకో సున్నితంగా మూలిగింది.

 

    మనిషి ఆకారం గుర్తుకు రాగానే మనసు రెపరెపలాడింది.

 

    వరండా... ముందుగది... బావి దగ్గర... అంతా వెతికి... దగ్గరగా వేసున్న స్టోర్ రూం తలుపులు తోసుకుని లోనకి చూసింది.

 

    అక్కడ....

 

    కన్పించిన ఆదిత్య డ్రెస్ ని చూడగానే జరిగిందేమిటో అర్ధమైంది.

 

    ఆ ఖైదీ డ్రెస్ ని తీసి ఆ ఈనాడు పేపర్ లోనే చుట్టి తన ఇంటివైపు పరుగుతీసింది శివరాణి.

 

    ఆమె మనసు మారుమూల గదిలో...

 

    మెదులుతున్న అక్షరాల చప్పుడు....

 

    "థాంక్స్ విత్ లవ్"

 

    ఆదిత్య తను విప్పేసి పారేసిన ఖైదీ దుస్తుల్లో, ఫ్యాంటు జేబులో వున్న ధరణి యిచ్చిన వుత్తరాన్ని తీసుకోవడం మర్చిపోయాడు.

 

    ఆ సంగతి ప్రస్తుతం రెడ్డిపాలెం బస్ రూట్లో పెరుగెడుతున్న ఆదిత్యకు జ్ఞాపకం లేదు.


                                                *    *    *    *    *


    పరుగెడుతున్నాడు ఆదిత్య.

 

    బస్సు కానీ, లారీ కానీ... ఏదైనా వాహనం కానీ కనిపిస్తుందేమోనన్న ఆశ...

 

    కానీ అలాంటివి వచ్చే ఆనవాళ్ళు ఎక్కడా కనబడడం లేదు.

 

    అరగంట గడిచింది.

 

    నీరసంతో పాటు కడుపులో ఆకలి... అప్రయత్నంగా ఆదిత్య చేతిలు జేబుల్ని తడిమాయి...

 

    ఏదో కాగితం ఫాంటు జేబులో రేపరెపమని తగలడంతో గబుక్కున ఆ కాగితాన్ని తీశాడు...

 

    వంద రూపాయల నోటు! ఆదిత్య కళ్ళు ఆనందంతో మెరిశాయి.

 

    "థాంక్స్ మిస్టర్ బాలేశం" మనసులో కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

 

    మరో రెండు ఫర్లాంగులు నడిచాక-

 

    చిన్న టీ పాక కనబడటంతో అక్కడ కెళ్ళాడు.

 

    నలభై ఏళ్ళ పల్లెటూరి వ్యక్తివున్నాడు ఆ పాకలో...

 

    "ఏం కావాలి బాబూ..."

 

    "టిఫినుందా...."

 

    "ఇడ్లీ వుంది... టీ వుంది..."

 

    అరడజను ఇడ్లీలు తిని, టీ తాగి, చార్మినార్ సిగరెట్ పాకెట్లు కనబడడంతో రెండు సిగరెట్ ప్యాకెట్లు తీసుకుని, డబ్బులు చెల్లించి-

 

    ఆ దారి ఎటు వెళ్తుందో కనుక్కున్నాడు.

 

    "మీరెక్కడకు వెళ్ళాలి బాబూ?"

 

    ధరణికుమార్ చెప్పిన ఊరు పేరు జ్ఞాపకం చేసుకున్నాడు ఆదిత్య.

 

    "శివదేవుని పల్లె."

 

    "శివదేవుని పల్లా... అలాంటి గ్రామం ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు బాబూ!" చెప్పాడా వ్యక్తి.

 

    మరిచిపోయాడు తను....

 

    ముందు తను జోగిపేట వెళ్ళాలి. జోగిపేటకు వందమైళ్ళ దూరంలో వుందా ఊరు.

 

    "జోగిపేట..." తిరిగి అన్నాడు.

 

    "జోగిపేట వెళ్ళాలంటే... నేరుగా బస్సులేదు బాబూ! లారీ ఎక్కాల్సిందే."

 

    "లారీలైనా దొరుకుతాయా?"

 

    "జోగిపేటకు ఇసక లారీలు ఇటే వెళ్తాయి" అన్నాడతను.

 

    పావుగంట గడిచింది.

 

    ఏదో లారీ... ఆ టీ పాకముందు ఆగింది... లారీ నిండా కూలిజనం... టీ తాగడానికి దిగిన లారీ డ్రైవర్ తో మాట్లాడి లారీ వెనక ఎక్కి ఒక మూల కూర్చున్నాడు.

 

    లారీ కదిలింది.

 

    టీ పాక దగ్గర్నించి లారీ కదిలిన పావుగంటకు టీ పాక దగ్గరకు రెండే రెండు ఈనాడు పేపర్లు వచ్చాయి.

 

    పేపరు రాగానే తిరగెయ్యడం టీ కొట్టు ఓనర్ కి అలవాటు.

 

    తిరగేస్తూ ఫస్టు పేజీలో కనబడిన ఫోటోను చూసి అవాక్కయ్యాడు.

 

    "ఈ కుర్రాడు... ఇప్పుడే... ఇప్పుడే... ఇప్పుడే... టిఫినూ, టీ తాగిన వ్యక్తి కదూ?"

 

    నెమ్మదిగా కూడబలుక్కుని ఆ వార్తను చదువుతున్నాడా వ్యక్తి.

 

    ఆ టీ పాక వ్యక్తి పేరు బాబూమియా.


                             *    *    *    *    *


    జోగిపేట ఊరు శివార్లలో ఆదిత్యను దింపేసి లారీ వెళ్ళిపోయింది.

 

    ధరణి కుమార్ చెప్పిన ప్రకారం-

 

    జోగిపేటలో పాసింజర్ రైలెక్కాలి....

 

    రైల్వేస్టేషన్ వైపు నడిచాడు. జన సంచారం ఎక్కువగా లేని రైల్వేస్టేషన్...

 

    స్టేషన్ మాస్టర్ కునికిపాట్లు పడుతున్నాడు.

 

    "శివదేవుని పల్లె వెళ్ళాలి... పాసింజర్ ట్రైన్... ఎన్ని గంటలకు వస్తుందండి?"

 

    "శివదేవుని పల్లె వెళ్ళాలా?"

 

    "శివదేవుని పల్లెకు డైరెక్టుగా గవర్నమెంటు ట్రైన్ వేసిందనుకున్నావేమిటయ్యా... అదేమైనా బొంబాయా... ఢిల్లీయా... ట్రైన్ అరగంటలో వుంది. నువ్వు వెంకటాపురానికి టిక్కెట్ తీసుకో... వెంకటాపురంలో దిగాక ఎవర్నయినా అడుగు" చెప్పాడు స్టేషన్ మాస్టర్.

 Previous Page Next Page